గురువారం, జనవరి 26, 2023

ఆశాకిరణం

"భరించలేని దుఃఖం ఆవహించినప్పుడు మనిషి పిచ్చివాడైనా అవుతాడు, తత్వవేత్త అయినా అవుతాడు" - గొల్లపూడి మారుతిరావు 'సాయంకాలమైంది'. అంతకు మించి కూడా కావొచ్చనునని నిరూపించిన వ్యక్తి డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి, సంఘసేవకు గాను భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' పురస్కారానికి ఎంపికయ్యారు. ఎనభయ్యేళ్ళ చంద్రశేఖర్, తన ఆత్మకథని 'ఆశాకిరణం' పేరిట ప్రచురించారు నాలుగేళ్ల క్రితం. సంకురాత్రి ఫౌండేషన్, శ్రీకిరణ్ కంటి ఆస్పత్రి, శారద విద్యాలయం ద్వారా కోస్తాంధ్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల వాళ్ళకి  చంద్రశేఖర్ పేరు చిరపరిచితం. అయితే ఏ పరిస్థితులు ఆయనని కెనడాలో సౌకర్యవంతమైన జీవితం వదులుకుని కాకినాడ శివార్లకి వచ్చి సంఘ సేవ మొదలుపెట్టేలా చేశాయో 'ఆశాకిరణం' పుస్తకం వచ్చే వరకూ చాలామందికి తెలియదు. 

రాజమండ్రిలో గోదారి ఒడ్డున పుట్టి పెరిగారు చంద్రశేఖర్. తండ్రి నాటి బ్రిటిష్ రైల్వే లో స్టేషన్ మాస్టర్. పదకొండు మంది సంతానంలో ఈయన చివరివాడు. బాల్యం వైభవంగానే గడిచినా త్వరలోనే కష్టాలు చుట్టుముట్టాయి. తల్లి మరణం, తండ్రి పదవీ విరమణ కారణంగా ఆర్ధిక సమస్యలు.. వీటన్నింటినీ చిన్ననాడే చూడాల్సి వచ్చింది. సోదరుల సహాయంతో ఎమ్మెస్సీ పూర్తి చేశాక పరిశోధన రంగానికి వెళ్లాలన్న అభిలాష పెరిగింది. అయితే, ఎమ్మెస్సీ చదివిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తనకి రావాల్సిన యూనివర్సిటీ ఫస్ట్ మరొకరికి వెళ్లిందని రూఢిగా తెలియడంతో అక్కడ మాత్రం చేరకూడదని బలంగా నిర్ణయించుకోడంతో చంద్రశేఖర్ అడుగులు కెనడా వైపు పడ్డాయి. జీవితంలో అదొక మేలు మలుపు. 

పరిశోధన పూర్తి చేసి, ఉద్యోగంలో కుదురుకున్నాక పెద్దలు కుదిర్చిన మంజరి ని వివాహం చేసుకుని కెనడా తీసుకెళ్లారు. మొదట అబ్బాయి శ్రీకిరణ్, తర్వాత అమ్మాయి శారద జన్మించారు. సాఫీ సాగిపోతున్న వాళ్ళ జీవితంలో పెద్ద కుదుపు విమాన ప్రమాదం రూపంలో వచ్చింది. ఎయిర్ ఇండియా కనిష్క విమానం పై జరిగిన ఉగ్రవాద దాడిలో మంజరి, పిల్లలు మరణించారు. "ఈ సంఘటన జరిగిన తదుపరి నెలల్లో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడిన జీవితం గురించి నేను వర్ణించలేను.  ఆ సమయంలో నా జీవిత సరళి ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుండేది. ఒకటి బాహ్య ప్రపంచం - అక్కడ మామూలుగానే మాట్లాడుతుండే వాడిని, తింటుండే వాడిని, అందరిలాగే పని చేసుకునే వాడిని. రెండవది లోపలి ప్రపంచం. కన్నీళ్లు, శూన్యం తోడు-నీడగా నిరంతరం నన్ను ఆవహించి ఉండేవి". 

కొన్నాళ్ల తర్వాత కెనడాని వదులుకుని ఇండియాకి తిరిగి వచ్చేశారు చంద్రశేఖర్. తాను పుట్టిపెరిగిన రాజమండ్రి కాకుండా, మంజరి స్వస్థలమైన కాకినాడని కార్యక్షేత్రం చేసుకున్నారు. "కూలు కెళ్తా" అని ఆడుకోడమే తప్ప, కనీసం బడిలో చేరని శారద పేరు మీద శారదా విద్యాలయం స్థాపించారు మొదట. అటుపైన శ్రీకిరణ్ పేరుతో కంటి ఆస్పత్రి. వీటి నిర్వహణ కోసం సంకురాత్రి ఫౌండేషన్ పేరుతో స్వచ్చంద సంస్థ మొదలుపెట్టారు. తొలుత కెనడా స్నేహితుల విరాళాలతో మొదలైన సేవా కార్యక్రమాలు క్రమంగా విస్తరించి, అంతర్జాతీయ ఫండింగ్ సంస్థల దృష్ణిలో పడడంతో నిధుల సమస్య తీరి సేవా కార్యక్రమాల విస్తరణ సాధ్యమైందని రాసుకున్నారు తన ఆత్మకథలో. 

అయితే ఈ ప్రయాణం సులువుగా ఏమీ సాగిపోలేదు. ఇక్కడి బ్యూరోక్రసీ తలపెట్టిన ప్రతి పనికీ మోకాలడ్డింది. ఎదురుపడ్డ కొందరు మనుషులు, "వెనక్కి కెనడా వెళ్ళిపోతే" అనే ఆలోచన వచ్చేలా చేశారు చాలాసార్లు. కానైతే, తన లక్ష్యం మీద స్పష్టత ఉంది చంద్రశేఖర్ కి. విద్య, వైద్య రంగాల్లో చేయాల్సింది చాలా ఉందన్న భావన ఆయన్ని గట్టిగా నిలబడేలా చేసింది. చెడు పక్కనే మంచినీ, స్వార్థపరుల పక్కనే సహాయం చేసే వారిని కూడా చూశారు. బంధు మిత్రుల ప్రోత్సాహంతో, దాతల సహకారంతో విద్య, ఆరోగ్య రంగాల్లో తన సేవలని క్రమంగా విస్తరించారు. ఆలస్యంగానే అయినా, ఈ సేవలని గుర్తించి ప్రభుత్వం 'పద్మశ్రీ ' అవార్డుని ప్రకటించడం హర్షణీయం. 

నిజానికి 'ఆశాకిరణం' తెలుగులో రాసిన పుస్తకం కాదు. చంద్రశేఖర్ 'రే ఆఫ్ హాప్' పేరిట ఇంగ్లిష్ లో రాసిన పుస్తకానికి తెలుగు అనువాదం. పుస్తకం క్లుప్తంగానూ, అనువాదం సరళంగానూ ఉన్నాయి. మొత్తం తొమ్మిది అధ్యాయాల్లో తొలి మూడు అధ్యాయాల్లో వ్యక్తిగత విషయాలని పంచుకున్నారు. నాలుగో అధ్యాయం విమాన ప్రమాదానికి సంబంధించింది కాగా, అటుపైన వచ్చే అధ్యాయాలన్నీ సేవా కార్యక్రమాల స్థాపన, విస్తరణని విపులంగా చెప్పినవే. స్థాపన, విస్తరణకి సంబంధించి ప్రతి దశనీ వివరంగా చెప్పారు. అదే సమయంలో తన భార్యని బిడ్డలనీ పుస్తకం ఆసాంతమూ స్మరిస్తూనే ఉన్నారు. సంకురాత్రి ఫౌండేషన్ ప్రచురించిన ఈ 148 పేజీల పుస్తకం వెల రూ. 100. ప్రతుల కోసం info@srikiran.org ని సంప్రదించవచ్చు. 

9 కామెంట్‌లు:

  1. అసాధారణమైన మనోనిబ్బరంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి 🙏.
    తన తండ్రి (లేదా తల్లి) చనిపోయారనే కబురు తను కోర్టులో వాదిస్తుండగా వచ్చినా కూడా కోర్టులో ఆనాటి తన పని ముగించాడు అని మనం విన్న ఉదంతాలలోని మహాశయులకు ఏమీ
    తీసిపోనివాడు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ గారు.

    పైన మీరు పేర్కొన్న విద్యాలయం, కంటాసుపత్రిలతో బాటు “స్పందన” అనే సంస్ధను కూడా నిర్వహిస్తున్నారు. విపత్తు బాధితులకు సహాయం అందిస్తుంటారు.

    ఐదారేళ్ళ క్రితం నేనొకసారి కాకినాడ వెళ్ళినప్పుడు వారి ఆఫీసుకు వెళ్ళి వారిని కలిసాను. చాలా చక్కగా మాట్లాడారు. వారి ఆవరణ (స్కూలు, కంటాసుపత్రి) చూపించారు. వారి మకాం కూడా అప్పట్లో ఆవరణలోనే అన్నారు.

    డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ గారికి “పద్మశ్రీ” ఏమిటండి, కనీసం “పద్మభూషణ్” ప్రకటించవలసింది. విదేశాలకు వలస వెళ్ళి పోయి, అక్కడ విదేశీ వ్యాపారసంస్ధకు అధిపతిగా పని చేస్తున్న వారి కన్నా తీసిపోయారా? సరే, ఇంత కాలానికి గుర్తించి ఇదైనా ఇచ్చారు అనుకుని సంతోషించాలేమో - బాపు గారు, అన్నవరపు రామస్వామి గార్ల లాగా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పుస్తకంలో 'స్పందన' ప్రస్తావన ఉంది కానీ, వివరాలు రాయలేదండీ..
      అవార్డులు అసలేమీ ఇవ్వకుండా కూడా ఊరుకోగలరు కదండీ మనవాళ్ళు.. ఇదైనా ఇచ్చినందుకు సంతోష పడాలేమో.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. విన్నకోట వారూ, ప్రతిభకు తగిన పురస్కారం అన్నది ఈపద్మపురస్కారాల విషయంలో నమ్మదగిన సంగతి కాదండీ. ఎందరో మహాప్రతిభావంతులకు ఏపురస్కారమూ రావటం లేదు ఎన్నడూ. కొందరికి మరీ చిన్న పద్మపురస్కారం ఇస్తున్నారే‌ అంటే అది ఒక అవమానం లాంటిదే అని నా అభిప్రాయం. అనర్హులను అందలాలెక్కిస్తున్న సందర్భాలు ఉంటే అశ్చర్యం ఏమీ లేదు. కొన్ని పద్మపురస్కారాలు కేవలం రాజకీయాల ఫలితాలు కావచ్చు. [ చినజీయర్ గారికి పద్మపురస్కారం ఇమ్మని తెలంగాణా సర్కారు వారు విజ్ఞప్తి చేసారంటారా? నమ్మకం లేదలా. కాని కేసీఆర్ గారితో స్పర్ధ ఉన్నందుకు ఈయన్ని పురస్కరించుకొని అయన్ను రెచ్చగొట్టే పని చేసారంటారా? అయ్యుండవచ్చును!] ఈపద్మపురస్కారాలను మనం పట్టించుకోవటం అనవసరం. వాటికి ప్రస్తుతం ఏమాత్రమైనా విలువ ఉందని నేనైతే అనుకోలేకుండా ఉన్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ అవార్డులకు ఎవర్ని ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్నది ఎప్పుడూ మిస్టరీయే నండీ.. కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తున్న అవార్డులు కాబట్టి వీటి గురించి చర్చ, అంతే.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  3. మురళి గారి పుస్తక పరిచయాలు ఆసక్తికరంగా ఉంటాయి. పుస్తకం కొనాలనిపించి మీరిచ్చిన ఇ-మెయిల్ అడ్రస్ కు మర్నాడే (జనవరి 27) ఇమెయిల్ పంపించాను. కానీ ఇంతవరకు వారి వద్ద.నుంచి జవాబు లేదు. చంద్రశేఖర్ గారి దృష్టికి వెళ్ళుండకపోవచ్చు. వారి ఆఫీసు సిబ్బంది అంత సమర్థత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వారి పుస్తకంలో సంప్రదించమని ఇచ్చిన మెయిల్ ఐడీ అండీ అది.. 

      తొలగించండి
    2. మిమ్మల్నేమీ అనడం లేదు మురళి గారూ. ఆ ఆఫీసు వారి నిర్వాకం అలా ఉంది అంటున్నానంతే.

      తొలగించండి
    3. అయ్యయ్యో.. అన్నారని కాదండీ, ఇవ్వడానికి అంతకన్నా సమాచారం ఏదీ పుస్తకంలో లేదే అని.. 

      తొలగించండి