"థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనే మాటని మనవాళ్లు ఓ బూతుగా మార్చేశారు. కానీ, ఈ సినిమాని మాత్రం నిజంగానే థియేటర్లోనే చూడాలి" ..అప్పటివరకూ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూసిన నేను, ఓ మిత్రుడు చెప్పిన ఈ మాటలతో 'కాంతార' సినిమాని థియేటర్లో చూశాను. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమా విషయంలో చివరి అరగంటకి మిత్రుడి మాటలు అక్షర సత్యం. అలాగని, చివరి అరగంట కోసం మొదటి రెండు గంటల్నీ భరించక్కర్లేదు. నేటివిటీని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే హాయిగా సాగిపోతుంది. ఇంతకీ 'కాంతార' అంటే మిస్టీరియస్ ఫారెస్ట్ అట. 'అనూహ్యమైన అడవి' అనుకోవచ్చా? కథా స్థలం దక్షిణ కర్ణాటకలోని తుళునాడు అటవీ ప్రాంతం. కథ అటవీ భూముల మీద హక్కులకి సంబంధించిందే.
ఇన్నాళ్లూ తుళునాడు అనగానే గుర్తొచ్చే సినిమా వాళ్ళ పేర్లు శిల్పాశెట్టి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, సుమన్ (తల్వార్), ప్రకాష్ రాజ్. ఇక మీదట వీళ్ళతో పాటు తప్పక గుర్తొచ్చే పేరు రిషబ్ శెట్టి. ఈ 'కాంతార' సినిమాకి కథని సమకూర్చి, దర్శకత్వం వహించడమే కాదు, హీరోగానూ గుర్తుండిపోయేలా నటించాడు. కథ చిన్నదే. అది 1847 వ సంవత్సరం. తుళునాడు అటవీ ప్రాంతాన్ని పాలించే రాజుకి అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి తప్ప. దానిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి, గిరిజనుల దేవుడి సమక్షంలో శాంతి లభించడంతో, ఆ దేవుడిని తనతో పంపమని వాళ్ళని కోరతాడు. మొదట ఒప్పుకోరు. అతడు రాజు కావడం, బతిమలాడ్డం, పైగా అడవి మీద హక్కులు వాళ్ళకి దత్తం చేయడంతో అంగీకరిస్తారు. దేవుడితో కలిసి ప్రాసాదానికి తిరిగి వస్తాడు రాజు.
కాలచక్రం తిరగడంతో 1970 వస్తుంది. రాజు వారసుల్లో ఒకడికి అటవీ భూమి మీద కన్ను పడుతుంది. గిరిజన గూడేనికి వస్తాడు. ఆవేళ వాళ్ళ పండుగ. 'భూత కళ' కి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. గిరిజనులు 'గురువు' గా వ్యవహరించే వ్యక్తి విష్ణువుగా అలంకరించుకుని రంగం మీదకి ప్రవేశించగానే, అతనిని విష్ణువు ఆవహిస్తాడని ప్రజల నమ్మకం. ఆ సమయంలో అతడేం చెప్పినా దేవుడి మాటలుగానే స్వీకరిస్తారు వాళ్ళు. (మా ఊళ్ళో అమ్మవారి జాతరప్పుడు ఆసాదు ఒంటిమీదకి అమ్మవారొచ్చి ఊరి పెద్దలతో మాట్లాడడం, హైదరాబాద్ బోనాల పండుగ లో జరిగే 'రంగం' గుర్తొచ్చాయి). గురువు రంగం మీదకి రావడంతోనే రాజు వారసుడు భూమిని తిరిగి ఇచ్చేయమంటాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించరాదంటాడు గురువు.
Google Image |
మాటామాటా పెరిగి, "నువ్వు దేవుడివి కాదు, కేవలం నటుడివి మాత్రమే" అంటాడు వారసుడు. అనూహ్యంగా మంటల్లో మాయమైపోతాడు గురువు. కోర్టు ద్వారా భూమిని స్వాధీనం చేసుకోవాలనుకున్న వారసుడు కొద్దిరోజులకే అంతే అనూహ్యంగా రక్తం కక్కుకుని మరణిస్తాడు. జరుగుతున్నవాటిని విస్మయంగా చూస్తూ ఉంటాడు ఏడెనిమిదేళ్ల శివ. కాలం గడిచి 1990 వస్తుంది. శివ ఇప్పుడు నవ యువకుడు. దున్నపోతుల క్రీడ 'కంబళ' జరిగిందంటే మెడల్ గెలుచుకోవల్సిందే. అతను భయపడేది రెండింటికే. ఒకటి కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని ఉండే తల్లి కమల. బరువులో శివకి ఆరోవంతు ఉండే ఆమె, కొడుకు తప్పు చేశాడనిపిస్తే పదిమందిలోనూ అతగాడి చెంపలు వాయించడానికి ఏమాత్రం వెనుకాడదు. (రిషబ్ శెట్టి తెలుగు సినిమాలు చూడడనుకుంటా, తల్లి చేత దెబ్బలు తినడం హీరో ఇమేజీకి భంగం అని అనుకోలేదు మరి).
శివని భయపెట్టే రెండో విషయం అప్పుడప్పుడూ కలలో కనిపించే భూతకళ. ఆ కల శివకి ఎంత భయం అంటే, తన పడక మీంచి లేచి వచ్చి తల్లి పక్కన ముడుచుకుని పడుకునేంత. కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ గిరిజన గూడాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా మార్చాలనుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఆఫీసర్ కి ఎదురు నిలబడతాడు శివ. రాజకీయంగా ఎదగాలనుకుంటున్న రాచ కుటుంబ వారసుడు శివకి మద్దతు ఇస్తూ ఉంటాడు. శివ పోరాటం కనిపిస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ తోనా, కనిపించని ఇంకో శత్రువుతోనా? మొదటి పావుగంట తర్వాత 1990 కి వచ్చేసే కథ సాఫీగా, సరదాగా సాగుతూ, రెండో సగం మొదలైన కాసేపటికి మలుపు తిరిగి వేగం అందుకుని ప్రేక్షకులు రెప్పవేయకుండా చూసేలా చేస్తుంది. సినిమా పూర్తయిందని రిజిస్టర్ కావడానికి కొన్ని నిముషాలు సమయం పడుతోంది అనడానికి సీట్ల లోంచి లేవని ప్రేక్షకులే సాక్ష్యం.
మనం ఇష్టంగా మర్చిపోయేదీ, మిగిలిన దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు అంతకు మించిన ఇష్టంతో గుర్తు పెట్టుకునేదీ ఒక్కటే -- గతం. ఒక ప్రాంతపు సంస్కృతిని, నమ్మకాలనీ, సమకాలీన సమస్యతో ముడిపెట్టి కథ రాసుకుని, తనని తాను హీరోగా కాక నటుడిగా మాత్రమే భావించుకుని (అలాగని హీరోయిజానికి లోటు లేదు) సినిమా తీసిన రిషబ్ శెట్టి మీద గౌరవం కలిగింది. ఒక్క డైలాగూ లేని రాజవంశీకుడి భార్య అమ్మక్క తో సహా ప్రతీ పాత్రకీ ఐడెంటిటీ ఉంది. హీరోయిన్ ఈ సినిమాకి అలంకారం కాదు, అదనపు బలం. నటీనటులే కాదు, సాంకేతిక విభాగాలన్నీ చక్కగా పనిచేసిన సినిమా ఇది. మనవైన హరికథ, బుర్రకథ, పగటివేషాలు, తోలుబొమ్మలాట లాంటి వాటిని చివరగా తెలుగు సినిమాలో ఎప్పుడు చూశాను అన్న ప్రశ్న వెంటాడుతోంది.. ఇంకొన్నాళ్ళు వెంటాడుతుంది, బహుశా.
IMDb 9.5 / 10, Times of India 5 / 5 ఇచ్చిన చిత్రం. బాగానే ఉండుంటుంది (నేనింకా చూడలేదు లెండి. సినిమా హాలుకు వెళ్ళను. OTT కోసం వేచియుంటాను 🙂).
రిప్లయితొలగించండిఇది కన్నడ భాషా చిత్రం కదా, మరి మీరు థియేటర్ లో చూస్తే అర్థం చేసుకోవడానికి ఏమిటి మార్గం (కన్నడ భాష రావి వారికి)? సబ్-టైటిల్స్ ఉండవు కదా?
(మా చిన్నతనంలో అయితే హిందీ సినిమాకు లోకల్ హిందీ పండితుడు హాలు లోపల మధ్య డోర్ వద్ద నిలబడి పెద్ద గొంతుతో తెలుగు అనువాదం చెప్పే ఏర్పాటు చేసేవారు ధియేటర్ వారు 🙂. మీకూ తెలిసే వుంటుంది. ఆ రోజులే వేరు 😁)
బహుశా మరో నెలలో ఓటీటీలో రావచ్చండీ.. తెరమీద కనిపించేది తెలుగు సంస్కృతి కాకపోయినా కథలో లీనమవుతాం. ఇప్పుడు తెలుగు సినిమాలకి కూడా ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ వేస్తున్నారు.. నేను కన్నడ వెర్షన్ చూశాను కానీ, తెలుగు డబ్బింగ్ కూడా థియేటర్లలో ఉందిప్పుడు (ఇంగ్లీష్ సబ్-టైటిళ్లతో).. కొందరు సినిమా సెలబ్రిటీలు మొదట్లో అలా థియేటర్లో ట్రూ ట్రాన్స్లేషన్స్ చేసిన వాళ్ళే అని చదివినప్పుడు ఆ ఉద్యోగం గురించి ఆలోచించా (మొదటి రోజు ఉత్సాహంగా ఉన్నా, ప్రతి షో కీ అదే కథ, అవే డైలాగులు తెనిగించడం ఎలా ఉంటుందా అని).. ధన్యవాదాలండీ..
తొలగించండిచాలా ఆసక్తికరంగా ఉంది.ఈసినీమా కథ. తెలుగు డబ్బింగ్ వెర్ఫన్ ott లో వస్తే చూడాలి
రిప్లయితొలగించండితప్పక చూడండి, ధన్యవాదాలు
తొలగించండికాంతారము అంటే అడవి అని చిన్నప్పుడు పంచతంత్ర కథలలో చదువుకున్నట్టు గుర్తు. మామూలు కన్నడంలో అడవిని కాడు అంటారు.
రిప్లయితొలగించండిఅవునండీ, ధన్యవాదాలు
తొలగించండిచిత్ర సమీక్ష బాగుంది. Kanthara movie was praised by Sai Deepak and Vijay Saxena with very good analysis in twitter. As the director himself told , such iconic movies are not made. They happen. Really appreciate the director and actor for their passion and respect to native culture. This movie will win many accolades.
రిప్లయితొలగించండి
తొలగించండినిజమండీ, ధన్యవాదాలు
ఈ సినిమా "శివ అనే పాత్ర కథ" నాకు చాలా నచ్చింది. అతని జీవితం, అతని భయాలు, అతనికి కనిపించని ఆలంబనగా నిలిచే తల్లి వీటి చుట్టూ తిరుగుతూ నడుస్తుంది కథ. ఈ సినిమా మంచినీళ్ల చెలమ లా తోడేకొద్దీ కొన్ని subtle things తెలుస్తున్నాయి. ఉదాహరణకి విలన్ క్లైమాక్స్ కి ముందు, తన జనాలందరినీ బయలుదేరతీసే సీన్ లో, అతని అవిటి కుమారుడు, పక్కన కళ్ళుమూసుకుని వాలి ఉంటాడు. డైరెక్టర్ ఆ చిన్నపిల్లాడి పాత్రని విలన్ బుద్ధి యొక్క అవిటితనానికి సూచికగా చూపించదల్చినట్టు అనిపించింది. ఇంకా విలన్ ఆ పిల్లాడికి కథ చెప్పే సీన్ కూడా, విలన్ ఆలోచనా తీరుని indirect character portrayal ద్వారా అద్భుతంగా ఆవిష్కరించినట్టనిపించింది. ఇలా చాలానే ఉన్నాయి. బిగ్ స్క్రీన్ మీద రెండు సార్లు చూసినా నాకు ఇంకా ఏదో మిస్ అయిందనిపించింది. OTT కోసం ఎదురుచూస్తున్నాను. మొత్తానికి చూసి రెండ్రోజులైనా ఈ సినిమా వెంటాడుతోంది.
రిప్లయితొలగించండిఇక్కడ మీరు గురువు అనే పదం వాడటం ఈ కథానేపథ్యానికి కొంత హెవీ అయిందనిపించింది. శివ పోరాటం, ఫారెస్ట్ ఆఫీసర్ తోనా లేక కనిపించని ఇంకో శతృవుతోనా అన్నారు. కనిపించని శత్రువు అంటే, మీ ఉద్దేశం మంచితనం నటించే విలన్ అయిండొచ్చు. శివ పోరాటం ఈ రెండు కాదు అతనితోనే దాక్కున్న అతని అంతర్గత శత్రువు తో అనిపించింది.
శివ పాత్ర చాలా లోతు కలిగి, అద్భుతంగా అనిపించింది.
భూత కళ (భూతకోల) చేసేవాళ్ళని గురువు అనే వ్యవహరించారు కదండీ.. తెలుగు నేలమీద కూడా ఆసాదులు, గురువులు అనే వాడుక ఉంది (గోదారి జిల్లాల్లో). నా ఉద్దేశంలో కనిపించని శత్రువు విలన్ మాత్రమే కాదండీ, అతను చిన్న చేప అయితే అతని వెనుక పెద్ద చేపలు ఉండే ఉంటాయని నా ఊహ.. ధన్యవాదాలు.
తొలగించండి