ఆదివారం, సెప్టెంబర్ 11, 2022

కృష్ణంరాజు ...

"జానకీ.. కత్తందుకో జానకీ..." కృష్ణంరాజుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా మొదట గుర్తొచ్చే డైలాగు ఇదే. ఈ డైలాగు ఎంతగా ట్యూన్ అయిపోయిందంటే, ఈ ఉదయం కృష్ణంరాజు మరణ వార్త చూడగానే మొదటగా గుర్తొచ్చింది ఈ డైలాగే. తన పరిధి మేరకు వైవిద్యభరితమైన పాత్రలు పోషించినా, ఒక్క 'రెబల్ స్టార్' ఇమేజీ చిరకాలం కొనసాగింది. కృష్ణంరాజు శరీరాకృతి, కళ్ళు, గంభీరమైన గొంతు..  ఇవన్నీ ఇందుకు దోహదం చేసి ఉంటాయి బహుశా. ఈ తరంలో చాలామందికి 'బాహుబలికి పెడ్నాంగారు' గా మాత్రమే తెలిసిన కృష్ణంరాజు, వెనుకటి తరం ప్రేక్షకులకి విలన్ గా, కేరక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, కథలో కీలక పాత్రగా ఇలా బహురూపాల్లో తెలుసు. గోదారి జిల్లాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకైతే కేవలం సినిమా మనిషిగా మాత్రమే కాదు, ఆయుర్వేద వైద్యం చేసే రాజుగారుగా కూడా కృష్ణంరాజు జ్ఞాపకమే. 

చాలామంది వెండితెర కథానాయికలు డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన కాలంలోనే వెండితెరకి సహాయక పాత్రల్లో పరిచయం అయ్యారు కృష్ణంరాజు. తన మొదటి లవ్ నటన కాదు, కెమెరా. సినిమాల్లోకి రాక మునుపు ఓ ఫోటోస్టూడియో నడిపారు కూడా. సినిమాల్లోకి వచ్చాక ఫలానా పాత్రలు మాత్రమే చెయ్యాలి అనే శషభిషలేవీ పెట్టుకోకుండా వచ్చిన పాత్రని వచ్చినట్టు చేసుకుపోయారు. నటుడిగా కృష్ణంరాజుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన పాత్ర బాపూ-రమణల  'భక్త కన్నప్ప' అని చెప్పొచ్చు. ముళ్ళపూడి రమణకి కృష్ణంరాజుకి మధ్య ఏవో ఆర్ధిక లావాదేవీలు నడిచాయన్న సంగతి రమణ ఆత్మకథ 'కోతికొమ్మచ్చి' లో చూచాయగా చెప్పారు. పూర్తి వివరాలు తెలియదు. 'కన్నప్ప గారు' అంటూ రమణ ఆడిపోసుకున్నా, ఎందుచేతనో కృష్ణంరాజు ఎక్కడా స్పందించలేదు. 

నటుడిగా పేరొచ్చాక స్వంత నిర్మాణ సంస్థ 'గోపీకృష్ణా మూవీస్' స్థాపించి అభిరుచిగల సినిమాలు నిర్మించారు. అవేవీ హీరో ఎలివేషన్ సినిమాలు కాదు, నాయికలకి పేరు తెచ్చిన 'కృష్ణవేణి' లాంటి సినిమాలే. నటుడిగా తనకి పేరొస్తున్న తరుణంలో పారితోషికం ఎలా నిర్ణయించుకోవాలి లాంటి విషయాల్లో గోపీకృష్ణ సంస్థ, కృష్ణంరాజు అందించిన సాయం మరువలేనిదని ఆమధ్య తన ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు నటుడు కోట శ్రీనివాసరావు. పిలకా గణపతి శాస్త్రి నవల 'విశాల నేత్రాలు' ని సినిమాగా మలచడం మాత్రం డ్రీం ప్రాజెక్టుగానే మిగిలిపోయింది. రంగనాయకులుగా కృష్ణంరాజు, హేమసుందరిగా జయప్రద.. అసలా కాంబినేషన్ ఊహించుకోడానికే ఎంతో బాగుంది. ఎందుకనో సినిమాగా రాలేదు. ప్రభాస్ హీరోగా తీయాలని కూడా ఓ దశలో అనుకున్నా, పని జరగలేదు. 

Google Image

హీరోలు మెచ్యూర్డ్ రోల్స్ ని అంగీకరించడం అంటే తమకి వయసైపోతోందని అంగీకరించడమే. ఈ అంగీకారం చాలా కొద్దిమందిలో కనిపిస్తుంది. వారిలో కృష్ణంరాజు ఒకరు. తన ఈడు వాళ్ళు హీరోలుగా మాత్రమే చేస్తున్న సమయంలో కేరక్టర్లకి షిఫ్ట్ అయిపోయారు. అలా అయ్యాక చేసిన సినిమాల్లో బాగా గుర్తుండిపోయేవి 'బావ-బావమరిది' 'పల్నాటి పౌరుషం'. ఈ రెండు సినిమాల్లోనూ కృష్ణంరాజుకి రకరకాల షేడ్స్ ప్రదర్శించే అవకాశం దొరికింది. రెండు సినిమాల్లోనూ కాస్త అరవ్వాసనలు కనిపించినా, 'పల్నాటి పౌరుషం' లో ఆ వాసనలు బాగా ఎక్కువ. 'రుద్రమదేవి' లో పాత్ర నిడివి తక్కువే అయినా, కృష్ణంరాజు వయసు, విగ్రహం, వృద్ధుడైన గణపతి దేవ చక్రవర్తి పాత్రకి సరిగ్గా సరిపోడంతో ఆ పాత్ర రక్తి కట్టింది. ప్రభాస్ 'బిల్లా' లోనూ చెప్పుకోదగ్గ పాత్రే. 'రాధేశ్యామ్' స్టిల్స్ లో మాత్రం కళతప్పి కనిపించారు. 

సినిమాలు, రాజకీయాలు -- ఈ రెండు రంగాల్లోనూ కృషి ఎంత ఉన్నా అంతకు మించి పనిచేయాల్సింది లక్ ఫాక్టర్ గా పిలుచుకునే అదృష్టరేఖ. ఈ రేఖ కృష్ణంరాజు కి సినిమాల్లో ఏమాత్రం సహాయపడిందో తెలియదు కానీ, రాజకీయాల్లో మాత్రం చక్కగా పనిచేసింది. ఆజీవన పర్యంతం రాజకీయాల్లోనే గడిపిన వాళ్ళు సైతం అందుకోలేని పదవుల్ని ఆయన చులాగ్గా అందేసుకోగలిగారు. అయినప్పటికీ, 'గవర్నర్ గిరీ' కోరిక బలంగా ఉందన్న వార్త అప్పుడప్పుడూ వినిపించింది. బీజేపీ నుంచి మధ్యలో 'ప్రజారాజ్యం' పార్టీలోకి వెళ్లి వెనక్కి రావడం అన్న మజిలీ లేకపోయినట్టైతే ఆ కోరికా తీరి ఉండేదేమో బహుశా. ఆ మైనస్ ని చెరుపుకోడానికి చేసిన కృషి, పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. 

ఇప్పుడు డాక్టర్లు 'లివర్ ఇస్యూ' గా చెబుతున్న సమస్యని పామర భాషలో కామెర్లు అంటారు. ఇవి రకరకాలు. వీటిలో పచ్చ కామెర్లు బాగా ప్రమాదకరం. ఆయుర్వేదంలో వైద్యం ఉంది కానీ, ప్రారంభ దశలో గుర్తించిన రోగులకు మాత్రమే వైద్యం చేస్తారు. కామెర్లు ముదిరితే మందివ్వడానికి ఏ కొద్దిమందో తప్ప ఎవరూ అంగీకరించరు. అదిగో, ఆ కొద్దిమందిలో కృష్ణంరాజు ఒకరు. కృష్ణంరాజు మొగల్తూరులో ఉన్నట్టు తెలియడం ఆలస్యం, కామెర్ల రోగుల బంధువులు దివాణం ముందు క్యూ కట్టేవారు. లేదనకుండా మందివ్వడంతో పాటు 'హస్తవాసి' మీద జనానికున్న నమ్మకం కూడా ఇందుకు కారణం. కృష్ణంరాజు ఇచ్చిన మందుతో నిలబడ్డ ప్రాణాల సంఖ్య వందలు దాటి వేలలో ఉన్నా ఆశ్చర్యం లేదు. నిండు జీవితాన్ని గడిపి నిష్క్రమించిన కృష్ణంరాజుకి శ్రద్ధాంజలి.  

1 కామెంట్‌: