అభిమానం అనేక విధాలు. 'అనామకుడు' అనే కలం పేరుతో కథలు, నవలలు, పుస్తకాలూ రాసే ఎ. ఎస్. రామశాస్త్రికి సినిమా దర్శకుడు కె. విశ్వనాథ్ అంటే అభిమానం. ఎంత అభిమానం అంటే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాలనీ, ఆ సినిమాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషినీ విశ్లేషిస్తూ ఓ పుస్తకం రాసేంత. ఆ పుస్తకానికి విశ్వనాథే స్వయంగా రాసిన ముందుమాటలో "ఒక ఎం. ఫిల్. థీసిస్ వ్రాసినట్లుగా" రాసినందుకు కృతజ్ఞతలు చెప్పుకునేంత. ఆ పుస్తకం పేరు 'విశ్వనాథ్ విశ్వరూపం.' మూడునెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకాన్ని గురించి పత్రికల్లో వచ్చిన పరిచయాల పుణ్యమా అని ఈ మధ్యనే నాకు తెలిసింది. సొంతముద్ర కలిగిన కొద్దిమంది దర్శకుల్లో విశ్వనాథ్ ఒకరనేది నిర్వివాదం. అలాగని విశ్వనాథ్ తీసిన సినిమాలన్నీ ఆణిముత్యాలు కాదు. ఆ విషయంలో ఈ పుస్తక రచయితకి స్పష్టత ఉంది. అందువల్లే, తన పుస్తక పరిథిని విశ్వనాథ్ తీసిన కొన్ని సినిమాలకి కుదించుకుని రచనకి ఉపక్రమించారు. హిందీ సినిమాల జోలికి వెళ్లలేదు.
ఒక్క విశ్వనాథ్ కి మాత్రమే కాదు, తెలుగు సినిమా రంగానికి పేరు తెచ్చిన సినిమా 'శంకరాభరణం.' ఈ సినిమాని గురించి సమగ్రంగా విశ్లేషించిన 'అనామకుడు,' ఈ సినిమాకి ముందూ, తర్వాతా విశ్వనాథ్ తీసిన ఐదేసి సినిమాలని వివరంగా సమీక్షించారు. మిగిలిన వాటిల్లో కొన్నింటిని సందర్భోచితంగా ప్రస్తావించారు. విశ్వనాథ్ సినిమాల్లో పది ప్రత్యేకతలు, ఎంపిక చేసుకున్న పది పాటల విశ్లేషణ, పది మరపురాని సన్నివేశాల విశ్లేషణ, పదిమంది కథానాయికల ప్రత్యేకతలు.. ఇలా 'పది' ని కేంద్రంగా చేసుకుని రాసిన విశేషాలున్నాయి. ఇవే కాకుండా, కథానాయకులు, బాలనటులు, కేరక్టర్ నటులు, గీత రచయితలు, సంగీత, నృత్య దర్శకులు, సహకార దర్శకులు, సంభాషణ రచయితలు... ఇలా కేటగిరీల వారీగా విభజించి, ఆయా వ్యక్తుల్లో తాను గమనించిన ప్రత్యేకతలని ప్రస్తావించారు. 'అనుబంధం' లో విశ్వనాథ్ పనిచేసిన (నటనతో సహా వివిధ శాఖల్లో) సినిమాల జాబితా ఇచ్చారు.
ఇప్పటికే ఎంతోమంది ఎన్నోరకాలుగా చెప్పేసిన, ప్రవచనాలు కూడా చేసేసిన, 'శంకరాభరణం' సినిమా గురించి కొత్తగా చెప్పడానికి ఏం మిగిలిందా అన్న సందేహం కలిగింది, ఆ అధ్యాయం చదవబోతుంటే. కానైతే, రచయిత పరిశీలనలు ఎక్కడికక్కడ ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాయి. మంజుభార్గవి పోషించిన తులసి పాత్రకి పునాది, విశ్వనాథ్ గతచిత్రం 'నిండు హృదయాలు' లో చంద్రకళ పోషించిన పాత్రలో ఉందనీ, రెండు సినిమాల్లో తల్లిపాత్రలకీ దగ్గరిపోలికలున్నాయనీ చదువుతున్నప్పుడు, ఈ రచయిత ఆషామాషీగా పుస్తక రచనకి పూనుకోలేదని అర్ధమయ్యింది. అలాగే ఈ సినిమాకి 'బాహుబలి' తో పోలిక తెచ్చి (కీర్తి, ఆదరణ) భేదాలనీ వివరించడం ఊహాతీతం. ఈ సినిమాని పది భాగాలుగా విశ్లేషించి, 'పది' పట్ల తన మక్కువ చాటుకున్నారు. 'శంకరశాస్త్రి పాత్రకి స్ఫూర్తి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు' లాంటి బాగా నలిగిన తెరవెనుక సంగతుల జోలికి పోకుండా, కేవలం తెరమీద కనిపించిన సినిమాని మాత్రమే విశ్లేషించారు. తాను ప్రస్తావించిన సన్నివేశాల తాలూకు ఫోటోలు జతచేయడం వల్ల, రచయిత విశ్లేషణ చదువుతూ ఉంటే ఆయన దృష్టి కోణం నుంచి సినిమాని మళ్ళీ చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
'శంకరాభరణం' కి ముందు తీసిన వాటిలోంచి ఐదు సినిమాలు - చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరము శిక్ష, ఓ సీత కథ, సిరిసిరి మువ్వ, 'శంకరాభరణం' తర్వాత తీసిన వాటిలోంచి ఐదు సినిమాలు - సప్తపది, శుభలేఖ, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వాతికిరణం సినిమాలు ఒక్కోటీ ఒక్కో అధ్యాయంలో తన కళ్ళతో చూపించారు. ఈ జాబితాలో 'సాగర సంగమం' లేకపోవడం కించిత్ బాధ కలిగించినా, 'స్వాతి కిరణం' సినిమాని చేర్చడం ఊరటనిచ్చింది. వీటిలో, 'నేరము శిక్ష' కి దస్తయోవస్కీ 'క్రైం అండ్ పనిష్మెంట్' నవలకన్నా 'దో ఆంఖే బారాహ్ హాథ్' సినిమా ప్రభావమే స్వల్పంగా ఉందంటారు. తర్వాతి అధ్యాయం 'పది చిత్రాలు - పది పాటలు' కోసం ఇవే పది సినిమాల్లో ఒక్కో సినిమా నుంచీ ఒక్కో పాటను ఎంచుకుని విశ్లేషించారు. ఈ పది పాటల్ని ఇతర చిత్రాల నుంచి తీసుకుని ఉంటే ఆ వంకన మరి కొన్ని సినిమాల ప్రస్తావనను ఈ రచయిత నుంచి వినగలిగే అవకాశం ఉండేది కదా అనిపించింది.
అయితే 'మరపురాని సన్నివేశాలు' అధ్యాయం కోసం ఇవే పదిని ఎంచుకోలేదు. వీటిలో ఐదు పతాక సన్నివేశాలు, మూడు పాట సన్నివేశాలు ఉన్నాయి. విశ్వనాథ్ సినిమాలకి పనిచేసిన వారిలో, వేటూరి, సిరివెన్నెల, బాలూ ల గురించి మరికొంచం చెప్పే వీలున్నా క్లుప్తంగా ముగించేసిన భావన కలిగింది. వీరిలో వేటూరిని (ఓ సీతకథ), సిరివెన్నెలనీ సినిమా రంగానికి పరిచయం చేసింది విశ్వనాథే. పదిమంది హీరోయిన్లు ఒక్కొక్కరి గురించీ ఒక్కో పేజీ కేటాయించడమే కాకుండా, వాళ్ళు మిగిలిన సినిమాల్లో కానీ విశ్వనాథ్ సినిమాల్లో ఎలా ప్రత్యేకంగా కనిపించారో సాదోహరణంగా వివరించారు. సినిమా వాళ్ళని గురించి అభిమానులు పుస్తకాలు రాయడం కొత్త కాదు కానీ, ఇంత సమగ్రమైన రచన అరుదు. గుణదోష వివరణ జోలికి వెళ్లకుండా, కేవలం బాగున్న/తనకి బాగా నచ్చిన వాటిని గురించి మాత్రమే ప్రస్తావించడంవల్ల అక్కడక్కడా 'అసంపూర్ణ' భావన పాఠకుల్లో కలిగే అవకాశం ఉంది. కానైతే, ఇది ఓ అభిమాని తన అభిమాన దర్శకుడికోసం రాసి, అంకితం చేసిన పుస్తకం. అపరాజిత పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ 230 పేజీల పుస్తకం వెల వెయ్యి రూపాయలు. సాఫ్ట్ కాపీ రూ. 500 కి లభిస్తోంది. సినిమాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళకి విందుభోజనం.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి