సోమవారం, జనవరి 31, 2022

మా అమ్మ కనకమ్మ

'ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుంది..' ..ఏళ్ళ తరబడి వినీ వినీ ఈ మాట బాగా క్లిషేడ్ గా వినిపిస్తోంది కానీ, కొన్ని కొన్ని చరిత్రలు చదివినప్పుడు తప్పక గుర్తొస్తోంది. తాజాగా చరిత్రలో ఆ మగవాడు 'సరస్వతీ పుత్ర' పుట్టపర్తి నారాయణాచార్యులు - శివతాండవ కవి. ఆ మహిళ అయన భార్య కనకమ్మగా అందరికీ తెలిసిన కనకవల్లి. చదివిన ఆ చరిత్ర పేరు 'మా అమ్మ కనకమ్మ'. అక్షరబద్ధం చేసింది ఆ దంపతుల కుమార్తె పుట్టపర్తి నాగ పద్మిని. 'ఓ విదుషీమణి జీవిత గాధ' ఆంటూ వీవీఐటీ ప్రచురణలు ప్రచురించిన ఈ పుస్తకం పుట్టపర్తి నారాయణాచార్యులు కుటుంబాన్ని గురించి, మరీ ముఖ్యంగా అయన ఇల్లాలు కనకమ్మ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది. ఆసాంతమూ ఆపకుండా చదివిస్తుంది. 

"మీరేమైనా చెప్పండి. అయ్య వల్ల, వారి నిర్ణయాల వల్ల, ఆమ్మ, మీరు, కుటుంబం ఎంత కష్టపడ్డారు అన్నది చరిత్రలో నిలవదు. నిలిచేదల్లా అయ్య చేసిన సాహిత్యోపాసన మాత్రమే.." తన తల్లిని, తోబుట్టువులని ఉద్దేశించి 1982లో ఓ వేసవి మధ్యాహ్నపు వేళ నాగపద్మిని అన్న ఈ మాటలతో పుస్తకం మొదలవుతుంది. "ఆ మాటలకి ఆందరూ నన్ను చేష్టలుడిగి చూస్తున్నారు. వాళ్ళ కళ్ళలో నాపట్ల ఒక ఏవగింపు భావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.." అన్న కొనసాగింపు పాఠకుల వేళ్ళకి పుస్తకాన్ని ఆంటుకుపోయేలా చేస్తుంది.  అక్కడినుంచి కుటుంబ సభ్యులని, తండ్రి ప్రియ శిష్యులని, తల్లి చేసే విశేష పూజలనీ పరిచయం చేస్తూ, తల్లి మరణంతో తొలి అధ్యాయాన్ని ముగించారు రచయిత్రి. తల్లిదండ్రుల బాల్య విశేషాలతో మొదలయ్యే రెండో అధ్యాయం నుంచి అసలు కథ మొదలవుతుంది. 

కాశీ పండితులు శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యులు కుమార్తె కనకమ్మ చిన్ననాడే తండ్రి ఒడిలో కూర్చుని సంస్కృతాంధ్ర పంచకావ్యాలని పఠించారు. పద్నాలుగో ఏట అత్తవారింట అడుగుపెట్టే నాటికే ఆమెకి సంస్కృతాంధ్రాల్లో పాండిత్యం ఉంది. వరుడు నారాయణాచార్యులు అప్పటికే 'పెనుగొండ లక్ష్మి' 'షాజీ' కావ్యాలని ప్రకటించి ఉన్నారు. తొలిగురువు తండ్రి కాగా, భర్త రెండో గురువు అయ్యి మిగిలిన చదువు చెప్పారామెకి. భర్త శిష్యులచేత సంస్కృత పాఠాలు పునశ్చరణ చేయించడం మొదలు, నారాయణాచార్యులు ఆశువుగా చెప్పుకుపోయే కావ్యాలని అదే వేగాన్ని అందుకుంటూ రాసి పెట్టడం వరకూ ఆమె చేసిన విద్యా, సాహిత్య సంబంధ కృత్యాలెన్నో. ఇవన్నీ, గృహిణిగా ఆమె నిర్వర్తించిన బాధ్యతలకు అదనంగా నెత్తికెత్తుకున్నవి (మోపబడినవి) మాత్రమే. 

కాపురానికి వచ్చిన తొలిరోజుల్లో తనకి ఊహలు తోచి, తీరిక చిక్కినప్పుడల్లా కవిత్వం రాసుకున్న కనకమ్మ ఆ రాతల్ని భర్తకి కూడా చూపకుండా తన ట్రంకు పెట్టెలో దాచిపెట్టడం, తర్వాతి కాలంలో వాటిని  చూసిన నారాయణాచార్యులు తానే పూనుకుని తన కవిత్వంతో పాటు ప్రచురింపజేయడంతో ఆమె కవయిత్రిగా లోకానికి తెలిశారు. ఒకే వేదిక పైనుంచి ఈ దంపతుల్లో ఒకరు నన్నయ శైలిని గురించీ, మరొకరు తిక్కన కవితా రీతుల గురించి ప్రసంగించిన సందర్భాలూ ఉన్నాయి. పుట్టపర్తి, విశ్వనాథల మధ్య ఎడతెగకుండా సాగిన సాహితీ వాదోపవాదాలని ఆమె మధ్యవర్తిగా ఉండి పరిష్కరించిన అరుదైన సందర్భమూ ఉంది. రేడియోకి, పత్రికలకి రచనలు చేశారు, పురస్కారాలనీ అందుకున్నారు. 

ఇవన్నీ చదువుతుంటే ఒక సాహితీవేత్తగా ఆమెకి రావాల్సినంత పేరు రాలేదని మనకి అనిపించడం సహజం. రచయిత్రి నాగ పద్మిని అభిప్రాయమూ అదే. ఇందుకు గల కారణాలని తన తల్లితండ్రుల జీవితాల నుంచి అన్వేషించారు ఆమె. పుట్టపర్తి నారాయణచార్యులు స్థిరంగా ఒక చోట ఉండి ఉద్యోగం చేసింది తక్కువ. అయన ఊళ్లు తిరుగుతూ ఉంటే, బాహుకుటుంబాన్ని నిర్వచించాల్సిన బాధ్యత ఆమెది. అంతేకాదు, ఆయన రాసిన గ్రంధాలన్నీ ఆవిడ తొలుత డిక్టేషన్ తీసుకుని, ఆపైన ఫెయిర్ కాపీ చేసినవే. సంసారం బాధ్యతల్లో సాహిత్య సృజనకు సమయం దొరక్క పోవడం, దొరికిన సమయంలో ఎక్కువ భాగాన్ని ఆయన రచనలకోసమే వెచ్చించాల్సి రావడంతో పాటు మరి కొన్ని కారణాలనీ చెప్పుకొచ్చారీ పుస్తకంలో. ఆశ్చర్యం కలిగించేవి, ఓ పట్టాన నమ్మలేనివీ అయిన విశేషాలని పొందుపరిచారు. 

"అదేమిటో, ఆడబిడ్డకు అమ్మ ఎంత ప్రియమైనా, అయ్య మీద ప్రేమ ఒకింత ఎక్కువగానే ఉండడం జగత్సత్యం. అందునా ఇక్కడ అయ్య ఎవరు? సాక్షాత్తూ సరస్వతీ దేవి ముద్దుల పట్టి. యావత్భారత కీర్తి గన్న పుట్టపర్తి. అలాటప్పుడు ఇంటి చిన్నబిడ్డకు అమిత వీరారాధన ఏర్పడడంలో ఆశ్చర్యమేముంది? ఆమ్మకథ అయినా, అయ్యమీద ఆరాధనే ఇందులో ఒక్క పిసరు ఎక్కువ కథనమయ్యిందంటే ఆశ్చర్యం లేదు. లేకుంటే కనకమ్మ గారి సాహిత్య వివేచనకు మరికొద్ది  ఎక్కువచోటు దక్కి ఉండేది.." అన్న గంగిశెట్టి లక్ష్మీ నారాయణ ముందు మాటతో మనమూ ఏకీభవిస్తాం, పుస్తకం పూర్తిచేశాక. నూట యాభై పేజీల ఈ పుస్తకం వెల రూ. 100. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ ద్వారానూ లభిస్తోంది. 

శుక్రవారం, జనవరి 28, 2022

స్వర్ణసీమకు స్వాగతం

ఎండిన బీళ్లు, వర్షం కోసం ఆశగా ఎదురు చూసే రైతులూ ఉన్న సీమ 'స్వర్ణసీమ' ఎలా అయ్యింది? ఆ సీమకి స్వాగతం పలుకుతున్నది ఎవరు? ఆ సీమ పేరు 'పెద్దపర్తిగుంట.' ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ లోనే, పైగా సరిహద్దునే కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. ఆ ఊరికి కుప్పం నుంచి బస్సు ఉంది. కుప్పం అంటే ఇవాళ్టి 'హైటెక్' కుప్పం కాదు. నలభయ్యేళ్ళ నాటి చిన్నపాటి టౌను. పెద్దపర్తిగుంటకి వెళ్లాల్సిన అనేకులు, వస్తుందో రాదో తెలియని ఆ బస్సు కోసం ఓ వేసవి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ కుప్పం బస్టాండులో ఎదురు చూడడమూ, తీరా బస్సు వచ్చాక అందులోకి ఎక్కేందుకు, సీటు సంపాదించేందుకు అనంతమైన యుద్ధాలు చేయడమూ, లెక్కలేనన్ని విఘ్నాలు దాటుకుని ఆ బస్సు ఊరి బాట పట్టడమూ జరిగి, ఇంతకీ ఆ బస్సు సదరు సీమకి చేరిందా? అక్కడ దొరికే స్వర్ణం సంగతేమిటి? అన్న ప్రశ్నలకి జవాబిస్తూ ముగిసే నవల 'స్వర్ణసీమకి స్వాగతం'.

తెలుగు కథ మీద తనదైన సంతకం చేసిన దామల్ చెరువు అయ్యోరు మధురాంతకం రాజారామ్ గారి చిన్నబ్బాయి మహేంద్ర. 1959 లో పుట్టి, చిన్ననాటి నుంచే రాయడం మొదలు పెట్టి, చాలా హడావిడి పనులున్నట్టుగా తన 39వ ఏటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మహేంద్ర రాసిన ఏకైక నవల 'స్వర్ణసీమకి స్వాగతం'. నిడివిలో పట్టుమని వంద పేజీలుండదు కానీ, వందల జీవితాలని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. మొత్తం కథంతా బస్సుప్రయాణమే. ఎదురు చూడ్డంతో మొదలు పెడితే, ప్రయాణం పూర్తయ్యే వరకూ పట్టే కాలం ఐదారు గంటలు. ఈ వ్యవధి లోనే రచయిత పరిచయం చేయని జీవితం లేదు, విప్పి చెప్పని తాత్వికతా లేదు. అలాగని ఇదేమీ సీరియస్ నవల కాదు. చాలామంది 'హాస్యం' అని భ్రమ పడే వ్యంగ్యంతో నడుస్తుంది ఆసాంతమూ. ప్రారంభించిన ప్రతిసారీ చివరివరకూ ఊపిరి బిగపట్టి చదివిస్తుంది కూడా.

తిమ్మరాయప్ప అనే వృద్ధ రైతు మధ్యాహ్నం వేళ కుప్పం బస్టాండుకి వచ్చి పెద్దపర్తిగుంట వెళ్లే బస్సు ఎప్పుడొస్తుందని ఎంక్వయిరీ చెయ్యడంతో కథ మొదలవుతుంది. బస్టాండు వర్ణన, అక్కడి వాతావరణ చిత్రణ పాఠకుల్ని ఒక్కసారిగా కథలోకి లాక్కుపోతాయి. పెద్దపర్తిగుంట వెళ్ళాల్సిన ఒక్కో పాత్రా బస్టాండుకి చేరడం, వారి కథలు, వాళ్ళ మధ్య సంభాషణల ద్వారా ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఉండే రకరకాల మనుషులు, వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటీ ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. తిమ్మరాయప్ప లాంటి వాళ్ళు ప్రతి పైసా లెక్క చూసుకుని, కనీసం టీ కూడా తాగకుండా కడుపులో కాళ్ళు పెట్టుకుని కూర్చుని సమయం గడిపేస్తే, 'లీడరు' లాంటి వాళ్ళు చుట్టూ చేరిన జనాల ఖర్చులతో బీడీలు, సిగరెట్లు నిరంతరాయంగా సేవిస్తూ ఉంటారు. చంటిబిడ్డని ఆస్పత్రిలో చూపించి, తిరుగు ప్రయాణంలో ఉన్న సుభద్రకి అప్పటికప్పుడు మగతోడుగా అవతరిస్తాడు వేంకటపతి. భాగ్యం కోసం భార్యని వదిలేసిన అప్పోజి, ఆమె కంటపడకపోవడంతో ఆ చుట్టుపక్కలే వెతుకుతూ ఉంటాడు.

కంగుంది జమీందార్లకి దూరపు బంధువు వసంతనాయనీం వారిది ఇంకో కథ. జమీ మొత్తం పోయి, చిరిగిన పూసల కోటు, 'మంత్రి' రంగయ్య మాత్రమే మిగిలిన వసంతుల వారు, మంత్రి చేతికికూడా ఇవ్వకుండా తానే మోసుకు తిరిగిన సంచీలో ఉన్నదేవిటో చివరివరకూ తెలియదు. తెలిశాక, మహేంద్రని ఓ. హెన్రీ ఆవహించి ఉంటాడని అనిపించక మానదు. ఈ బస్సులో మరో ముఖ్య ప్రయాణికుడు రమణమూర్తి. ఆ ప్రాంతం వాడు కాదు. బహుదూరం నుంచి అక్కడికి మొదటిసారి వచ్చిన వాడు. అతనో పత్రికలో పని చేస్తూ ఉంటాడు. అతను రాయాల్సిన వార్తొకటి పెద్దపర్తిగుంటలో ఉంది. ఆ వార్త కోసమే సుదీర్ఘ ప్రయాణం చేసి, చివరి మజిలీ కోసం ఆ బస్సు ఎక్కాడు. బస్సెక్కినా కూడా, చుట్టూ ఉన్న అందరినీ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. తాను వెతుకుతున్న కథనం నిజంగానే ఆ ఊళ్ళో దొరుకుతుందా అనే సందేహం పీడిస్తోంది అతన్ని. మరీ ముఖ్యంగా, ఆ ప్రాంతం తన రాష్ట్రంలో భాగమేనా అన్న సందేహం కూడా వచ్చేసింది.

గతుకుల రోడ్డులో, కిక్కిరిసిన జనంతో ఉన్న డొక్కు బస్సులో ప్రయాణం ఏమాత్రం సుఖంగా ఉండదు. కానీ, ఆ బస్సు కదలిక మాత్రం అందరికీ హాయిగా ఉంటుంది. ప్రయాణం సాగుతోంది కాబట్టి గమ్యం చేరుకుంటామన్న భరోసా ప్రయాణికులందరినీ అష్టకష్టాలనీ భరించేలా చేస్తుంది. కేవలం ప్రయాణికులకు మాత్రమే కాదు, డ్రైవరుకి, కండక్టరుకీ కూడా ఆ ప్రయాణం ఏమాత్రం హాయైనది కాదు. పురాతనమైన బస్సు, చెప్పినట్టు వినని స్టీరింగు, బ్రేకూ, ట్రాఫిక్ రూల్స్ పాటించని ఇతర వాహనదారులూ డ్రైవర్ సమస్యలైతే, పద్మవ్యూహం లాంటి జనవ్యూహం లోకి చొచ్చుకుని వెళ్లి, అందరికీ టిక్కెట్లు ఇవ్వడం కండక్టరుకి అగ్ని పరీక్ష. ప్రయాణికులకు చిల్లర ఇవ్వని విషయంలో కండక్టర్ మీద మనకి కోపం వస్తుంది కానీ, మిగిలిన అన్ని సందార్భాల్లోనూ ప్రయాణికులతో పాటు డ్రైవరు, కండక్టర్ల మీద కూడా అయ్యో పాపం అనే అనిపిస్తుంది.

మహేంద్ర 1985లో ఈ నవల రాసిన నాటి కన్నా ఇవాళ బస్సు ప్రయాణాల్లో కించిత్తు మార్పులు వచ్చాయి. సర్వీస్ ఆటోల్లాంటివి పల్లెటూరి ప్రజల ప్రయాణ అవసరాలు తీరుస్తున్నాయి. అయినప్పటికీ 'స్వర్ణసీమకి స్వాగతం' నవల ఇవాళ్టికీ సమకాలీనం. ఎందుకంటే ఈ కథ కేవలం బస్సు ప్రయాణాన్ని గురించి మాత్రమే కాదు. పాత్రలు కేవలం ఆ కాలానికి, ప్రాంతానికి సంబంధించినవి మాత్రమే అస్సలు కాదు. చదువుతున్నంత సేపూ నవ్వించే వర్ణనలు, ఉపమానాలు వెనువెంటనే ఆలోచనల్లోకి నెట్టేస్తాయి. వెరసి నవలని మరోమారు చదివేలా చేస్తాయి. మొన్నటివరకూ ఈ పుస్తకం ప్రింట్ అందుబాటులో ఉండేది కాదు. ఈ మధ్యనే 'అమరావతి పబ్లికేషన్స్' వాళ్ళు కొత్త ప్రింట్ వేసి, విశాలాంధ్ర, నవచేతన ద్వారా అందుబాటులోకి తెచ్చారు. నవోదయా ద్వారా ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. తొంభయ్యారు పేజీల ఈ పుస్తకం వెల రూ. 100. ఓ మంచి నవలని చదివిన అనుభూతిని ఇచ్చే రచన ఇది. నవల చదివాక మహేంద్రని మర్చిపోవడం అసాధ్యం. 

గురువారం, జనవరి 27, 2022

మనసే అందాల బృందావనం

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో తెలుగునాట పుట్టిపెరిగిన బహుభాషా నటి (టేకుమళ్ళ/శంకరమంచి) 'షావుకారు' జానకి కి 'పద్మశ్రీ' పురస్కారం లభించిందన్న వార్త చూడగానే నాకు మొదటగా గుర్తొచ్చిన పుస్తకం 'మనసే అందాల బృందావనం'. అప్పుడెప్పుడో చదవడం మొదలుపెట్టి, కొన్ని అధ్యాయాల తర్వాత పక్కన పెట్టిన ఆ పుస్తకం 'షావుకారు' జానకి విలక్షణంగా పోషించిన పాత్రల తాలూకు విశ్లేషణ. రాసిందేమో 'జ్ఞాపకాలు' లాంటి పుస్తకాలతో పేరు తెచ్చుకున్న సినిమా పరిశోధకుడు డాక్టర్ కంపల్లె రవిచంద్రన్. అటు పేజీల పరంగానూ ఇటు కంటెంట్ పరంగానూ పెద్దగా బరువనిపించని ఈ పుస్తకాన్ని చదవడం పూర్తి చేయడానికి ఇదే మంచి తరుణం అనిపించింది.

'షావుకారు' జానకి సీనియర్ నటీమణి. తొంభయ్యేళ్లు దాటిన వయసులో కూడా అవకాశం దొరికిందే తడవుగా నటించి, ఆయా సినిమాల మీద తనదైన ముద్ర వేస్తున్నారు. గడిచిన డెబ్భయ్యేళ్లకు పైగా రంగస్థలం, రేడియో, సినిమా మాధ్యమాల్లో నటిస్తున్న ఈ నటి ప్రాయంలో ఉండగా కూడా కేవలం నాయిక పాత్రలు మాత్రమే నటిస్తానని గిరిగీసుకోలేదు. వచ్చింది ఎంత చిన్న పాత్రయినా తనదైన శైలిలో నటించి, తనదైన మార్కుని నిలుపుకున్నారు. 'కన్యాశుల్కం' సినిమాలో తళుకు బెళుకుల మధురవాణిగా సావిత్రి మెప్పిస్తే, వెలిసిన తెల్లచీరలో బుచ్చమ్మగా కనిపించడానికి అభ్యంతర పెట్టలేదు. మధురవాణికి వచ్చినంత పేరునీ బుచ్చమ్మకీ సంపాదించారు. నటించిన నాలుగొందల పైచిలుకు సినిమాల్లో ఆమె అంగీకరించిన ఇలాంటి ఛాలెంజీలు తక్కువేమీ కాదు.

ప్రవృత్తి రీత్యా సినిమా పరిశోధకుడైన రవిచంద్రన్ మొదటగా 'షావుకారు' జానకి కి వీరాభిమానై ఉండొచ్చనిపించింది, పుస్తకం చదవడం పూర్తి చేశాక. ఐదు తమిళ సినిమాలతో సహా మొత్తం ముప్పై సినిమాల్లో జానకి చేపట్టిన పాత్రలని ఎంచుకున్నారు ఈ పుస్తకం కోసం. పాత్రల ఎంపికకు 'క్రైటీరియా' ఏమిటన్నది ముందుమాటలో కూడా చెప్పలేదు కాబట్టి, ఒక అభిమానిగా తనకి నచ్చిన పాత్రల్ని ఎంచుకున్నారన్న అభిప్రాయం కలిగింది. ఎందుకంటే, కేవలం పూర్తి స్థాయి కథానాయిక పాత్రలకి మాత్రమే కాలేదు, ప్రత్యేక అతిధి పాత్రలకీ, హాస్య పాత్రలకీ కూడా చోటిచ్చారు ఈ ఎంపికలో. 'షావుకారు' లో సుబ్బులు మొదలు 'సంసారం ఒక చదరంగం' లో చిలకమ్మ వరకూ ఎంచుకున్న పాతిక తెలుగు పాత్రలూ వేటికవే ప్రత్యేకమైనవి. వీటిలో జానకికి పెద్దగా నటించేందుకు అవకాశం లేని 'జయం మనదే' మొదలు, ఒకటి రెండు సీన్లకే పరిమితమైన పాండురంగ మహాత్మ్యం' లాంటి సినిమాలకీ చోటిచ్చారు.

పుస్తకం రాసేందుకు రచయిత తీసుకున్న శ్రమ ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తుంది. ఎంచుకున్న పాత్రలున్న సినిమాలని ఒకటికి నాలుగు సార్లు చూసి - మరీ ముఖ్యంగా ఆయా చిత్రాల్లో జానకి నటన, ఆహార్యం, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ లాంటి విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలీలించి - సినిమా కథలో జానకి పాత్ర, నటనలో మిగిలిన పాత్రధారులనుంచి జానకి ఎలా ప్రత్యేకం అనే దృక్కోణంలో వ్యాసాలను రాసుకుంటూ వెళ్లారు. పాత్ర వయసు, పాత్ర పోషించేనాటికి జానకి వయసు లాంటి విషయాలనీ గమనంలో ఉంచుకున్నారు. "శ్రీమంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన జానకి డబ్బుతో లభించే సమస్త సుఖ భోగాలనూ అనుభవించింది. కానీ, అదే జానకి కన్నతల్లిగా మారిన కాలంలో పట్టెడన్నం లభించక, పస్తులు పడుకునే దుర్బల పరిస్థితులనూ చూసింది. ఇలా జీవితంలో ఎత్తు పల్లాలను చూసిన జానకి, మానసాదేవి ('నాగుల చవితి' సినిమాలో పాత్ర) జీవితంలో చోటు చేసుకున్న ఉత్తానపతనాలను తన నటనా ప్రతిభ ద్వారా చాలా బాగా చూపించింది" అంటూ సందర్భానుసారంగా జానకి వ్యక్తిగత విశేషాలని కథనాల్లో జోడించారు.

'షావుకారు' జానకి మీద అభిమానం లేకపోతే ఇంతటి పుస్తకం రాయడం కష్టం. అయితే, అదే అభిమానం రచయిత చేత కొన్ని ఆశ్చర్యకరమైన ప్రతిపాదనలు చేయించింది. "నిర్మల స్థాయిని దిగజార్చేలా సినిమాలో బృందగీతాన్ని (నిజం చెప్పవే పిల్లా/డాక్టర్ చక్రవర్తి) పెట్టినా, ఆ లోపాన్ని పూరించే విధంగా జానకి ఆ గీతంలో హుషారుగా డేన్స్ చేసింది". "జానకి చాలా బాగా చేసినా, పంపిణీదారులైన నవయుగ వాళ్ళు భానుమతికి మరీ బాకా ఊది పబ్లిసిటీ ఇవ్వడం వల్ల, తెలుగులో జానకి పాత్ర, భానుమతి క్రీనీడలో ఉండిపోయింది (అన్నై/పెంచిన ప్రేమ)". "నిజజీవితంలో పాశ్చాత్య సంస్కృతికి ఆలవాలమైన కుటుంబంలో, నవనాగరకతకు మారుపేరైన తండ్రి పెంపకంలో, గ్రామీణ వాతావరణానికి బహు దూరంగా పెరిగిన జానకికి, తెలుగింటి ఆడపడుచైన సుబ్బులు పాత్ర నిజంగా ఒక అగ్ని పరీక్షే! అయితే, ఆమె తన నటనా వైదుష్యంతో ఆ పాత్రను అసమానరీతిలో పోషించి, అగ్నిపునీత అయిన సీతలా ప్రజలందరి మన్ననలను పొందింది (షావుకారు)".

కంటెంట్ తో పాటుగా పుస్తకం గెటప్ మీదా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కవర్ పేజీ మొదలు, చివరి పేజీ వరకూ ప్రతి పేజీని శ్రద్ధగా చూడాలనిపిస్తుంది. అరుదైనవి కాకపోయినా ఛాయా చిత్రాల ముద్రణ ప్రత్యేకంగా ఉంది. బాగా నాణ్యమైన పేపరు వాడడం ఇందుకు కారణం. ఈ ఫలితం ప్రింటు మీద కూడా కనిపించింది, అక్షరాలు హాయిగా చదవగలిగేలా ఉన్నాయి. అచ్చుతప్పులు కనిపించలేదు. రచయితతో మనం అంగీకరించినప్పుడు, విభేదించినప్పుడూ కూడా ఒకే వేగంతో చదువుతాం ఈ పుస్తకాన్ని. "కొందరు నర్తకీమణులు పొదుపైన ఉడుపులు ధరించి అంగాంగ ప్రదర్శనలతో ఆకర్షిస్తారు. అయితే జానకి, యీ ప్రదర్శనంతా హావభావాలతో చేస్తుంది. కళ్ళతో కిలికించితాలు, వీడీవీడని పెదవులతో ఆహ్వానపత్రికలూ, కవ్వింపులు. ఇది అసాధారణమైన ప్రజ్ఞే కాదా?" అంటూ తన ముందుమాటలో ('సముఖములో రాయబారము') ఈ పుస్తకం ఎందుకు చదవాలో చెప్పకనే చెప్పారు వీ.ఎ.కె. రంగారావు. (మోహనవంశీ ప్రచురణలు, పేజీలు 162, వెల రూ. 200). 

బుధవారం, జనవరి 26, 2022

క్రౌంచ పక్షులు

పేరు చూడగానే రామాయణం గుర్తొస్తుంది, అప్రయత్నంగా. అయితే ఇది కావ్యమో, నవలో కాదు, కథల సంపుటి. అవి కూడా కన్నడ నుంచి తెలుగులోకి అనువదింపబడిన కథలు. కొని చదివేంత ప్రత్యేకత ఏమిటీ అంటే, ఈ సంకనానికి మూలమైన 'క్రౌంచ పక్షిగళు' కి 2018 సంవత్సరానికి గాను ఉత్తమ కథా సంకలనంగా కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. ఒక్కొక్కటీ ఆరు నుంచి పన్నెండు పేజీల నిడివి ఉన్న పది కథల సమాహారం. మూల కథల్ని రాసింది దక్షిణ కన్నడ ప్రముఖ రచయిత్రులలో ఒకరైన వైదేహి కాగా, తెనిగించింది ఇప్పటికే 'మాస్తి చిన్న కథలు' లాంటి ప్రముఖ కన్నడ పుస్తకాలని అలవోకగా అనువదించిన జి.ఎస్. మోహన్. అనువదింపజేసి, ప్రచురించింది కేంద్ర సాహిత్య అకాడెమీ. 

పాత్రల పేర్లు, అక్కడక్కడా వినిపించే నుడికారాలు, కనిపించే భోజన పదార్ధాలు కన్నడ సీమకి చెందినవి కాబట్టి వీటిని కన్నడ కథలు అనుకోవాలి కానీ, నిజానికీ పది కథల్లోని వస్తువులూ సార్వజనీనాలు. ఏ ప్రాంతంలోనైనా జరగడానికి అవకాశం ఉన్నవి. ఒకట్రెండు మినహా మిగిలిన కథలు ఏ కాలంలో అయినా జరగగలిగేవి కూడా. మొదటి కథ 'దాడి' నే తీసుకుంటే బస్సులున్న ప్రతి చోటా జరుగుతుంది. బస్టాపులో ఆగేప్పటికే బస్సు రద్దీగా ఉంది. నిలబడే ఓపిక లేని ఆమె మరో బస్సు కోసం చూద్దామనుకుంది. కండక్టరు చొరవగా మాట కలిపి సీటిస్తాను బస్సెక్కమన్నాడు. తీరా ఆమె టిక్కెట్టు కొన్నాక ఆ మాటే మర్చిపోయాడు (మర్చిపోయినట్టు నటించాడు). ఆమె గుర్తు చేసింది. అతని మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ప్రేక్షకులుగా జరిగిన రసవత్తర నాటకమే ఈ కథ. 'ఇది కేవలం బస్సు ప్రయాణాన్ని గురించిన కథ మాత్రమేనా?' అన్న ప్రశ్న వస్తుంది, కథ ముగింపులో. 

నలుగురు బంధువులు కూడే ప్రతిచోటా జరిగేందుకు అవకాశం ఉన్న కథ 'నటి'. ఎవ్వరినైనా చులాగ్గా అనుకరించగలగడం రత్నకి ఉన్న ప్రత్యేకత. బంధు సమూహాల్లో అక్కడ లేని వారిని అనుకరించి ఉన్న వారిని ఆనందింపజేస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రదర్శన జరుగుతూ ఉండగా సదరు పాత్ర ఏ రిక్షానో దిగితే, రత్న పోషించే పాత్ర హఠాత్తుగా మారిపోతుంది. మేకప్పు, కాస్ట్యూమ్సు లాంటి హంగులేవీ అవసరం లేదు రత్నకి. కేవలం తన హావభావాలతో ఆయా పాత్రలకి మూలమైన వ్యక్తులని జ్ఞాపకం చేసేస్తుంది. ఆబాలగోపాలన్నీ ఏకకాలంలో అలరిస్తుంది. వేషాలన్నీ తీసేసిన తర్వాత, కేవలం రత్నగా మాత్రమే మిగిలిన తర్వాత ఆమె ఏమిటి అన్నది హృద్యమైన ముగింపు. రత్న మనల్ని వెంటాడుతుంది. 

మూడో కథ 'సబిత' లో కథానాయికకి డబ్బున్న పొరుగువాళ్ళంటే విపరీతమైన ఆసక్తి. ముఖ్యంగా, ఆ ఇంట్లో 'ఆమె' అంటే. ఆమెని గమనించడం సబిత జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఆమె గుణదోషాలన్నీ సబితకి కొట్టిన పిండి. ఆమె భర్త పట్ల విపరీతమైన సానుభూతి కూడా. 'ఆమె' కథకి ముగింపునిచ్చిన రచయిత్రి, సబిత కథకి ముగింపుని మాత్రం పాఠకులకు వదిలేశారు. 'మాటరాని క్షణం' కథ మృత్యువు ఇతివృత్తంగా సాగుతుంది. ఓ వృద్ధురాలు మరణించింది. ఆమె భర్తని పలకరించేందుకు ఓ పండు ముదుసలి వ్యక్తి కారు దిగాడు. ఆయన ఎంత వృద్ధుడంటే కనీసం మాట్లాడేందుకు నోరు తెరవలేనంత. "పాతకాలపు మంచం, యజమానురాలు చనిపోయిందని బాధ పడుతూ తినడం మానేసిన శునకం లాగ - మౌనంగా ఉంది" లాంటి వర్ణనలు ఈ కథని ప్రత్యేకంగా నిలుపుతాయి. 

ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటికి రోడ్డు లేదు. అందువల్ల ఇంటి ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు తప్పిపోయినా కూడా ఎవరూ స్పందించలేదు. రోడ్డు లేకపోవడం అంగీకారం అయిన వాళ్ళే సంబంధాలు కలుపుకున్నారు. ఉన్నట్టుండి ఎన్లో ఏళ్ళ తర్వాత యువతరం నడుం బిగించి రోడ్డు నిర్మించింది. ఆ ఇంటి వాళ్ళ జీవితాల్లో ఒక్కసారిగా వచ్చిన పడిన మార్పుని చిత్రించిన కథే 'ఇంటిదాకా ఉన్నదారి'. ఈ కథలో రోడ్డుని ఓ ప్రతీకగా ఉపయోగించుకున్నారనిపిస్తుంది. తానెంతో ధైర్యస్తురాలిని అనుకున్న ఓ అమ్మాయికి ఆ ధైర్యం విలోలంబైన సందర్భం చాలా యాదృచ్చికంగా ఎదురు కావడం 'ప్రశ్న' కథలో కనిపిస్తే, పజిల్ లా అనిపించే శుభాంటీని మర్చిపోనివ్వని కథ 'ప్రహేళిక'. 

'దేవుడి గది' అనే ఏర్పాటు సొంతింట్లో అయితే సరే, కానీ అద్దెకిచ్చే వాటాలో అవసరమా? దైవభక్తి గల ఓ జంట, మరీ ఖర్చు పెట్టకుండానే చిన్న ఏర్పాటు చేసింది వాళ్ళ పై వాటాలో. అద్దెకొచ్చిన ఒక్కో కుటుంబమూ ఆ ఏర్పాటుని ఒక్కో విధంగా వాడుకుంది. ఆ వైనమంతా చదవొచ్చు 'ఎవరికి తోచినట్టు వారికి' కథలో. అందరికీ బాగా తెలిసినట్టు అనిపించే రాజత్త జీవితంలో ఎవరికీ తెలియని విషయాలుంటాయని చెప్పే కథ 'తెరవని పుటలు'. పుస్తకంలో చివరి కథ 'క్రౌంచ పక్షులు' రామాయణంతో పాటు దేశ విభజననీ గుర్తుచేస్తుంది. అంతకు మించి, ఎప్పటికీ గుర్తుండిపోయే కొందరు మనుషుల్ని, కొన్ని సంఘటనల్నీ పరిచయం చేస్తుంది. మొత్తం 108 పేజీల ఈ పుస్తకం వెల రూ. 120. హైదరాబాద్ నవోదయ ద్వారా (ఆన్లైన్ లో కూడా) లభిస్తోంది. 

సోమవారం, జనవరి 24, 2022

టీనేజీ

మనుషులకైతే చాలా అయోమయాన్ని కలిగించే సందర్భం. ఏవేవో చేసేయాలనే ఉత్సాహం, ముందు వెనకలు తెలియని ఆవేశం, కొంచం అమాయకత్వం, మరికాస్త మూర్ఖత్వం, అన్ని విషయాల గురించీ బోల్డంత స్పష్టత ఉందనుకునే అస్పష్టత, అన్నింటినీ మించి ఎదుటి వాళ్ళకి ఏమీ తెలీదేమో అనిపించే అజ్ఞానం.. ప్రత్యేకంగా చెప్పాలా, ఇవన్నీ టీనేజీ లక్షణాలని? పదమూడో పుట్టినరోజనేసరికి వస్త్రధారణ మొదలు, సెలెబ్రేషన్స్ వరకూ అప్పటివరకూ లేని ఎన్నో మార్పులు చోటు చేసేసుకుంటాయి. ముందే చెప్పినట్టుగా ఇవన్నీ మనుషుల విషయంలో. మరి బ్లాగుకి? టీనేజీలో అడుగు పెట్టింది 'నెమలికన్ను' బ్లాగే తప్ప, రాసే నేను కాదు కాబట్టి తేడాలేవీ ఉండవన్నమాట!! 

కొన్నేళ్లుగా బ్లాగు రాతలు పెద్దగా లేకపోయినా, ఏడాదికోసారి ఇదిగో ఇలా చేసుకునే సింహావలోకనం మాత్రం భలేగా అనిపిస్తోంది. మొదట్లో అయితే రాయలేకపోతున్నామే అని సిగ్గూ, మొహమాటం లాంటివి అడ్డం పడి, ఈ ఏడాది అలా జరక్కూడదు లాంటి నిర్ణయాలు బలంగా తీసేసుకునేలా చేసేవి. అయితే, రానురానూ ఈ రాయకపోవడం కూడా అలవాటైపోయింది. కాబట్టి, చట్టంలాగే మనం కూడా మన పని మనం చేసుకుంటూ పోవడమే. తలంటు స్నానాలూ , కొత్త బట్టలూ లాంటివి పక్కన పెట్టి కాస్త డిఫరెంట్ గా ఆలోచిద్దామని కూర్చుంటే, అప్పట్లో ఉన్న బ్లాగుల్లో ఇప్పటికీ నడుస్తున్నవెన్ని? అనే ప్రశ్న వచ్చింది. రాశి తక్కువే కానీ, వాసిలో మంచి టపాలే అప్పుడప్పుడన్నా పలకరిస్తూ ఉండడం సంతోషాన్నిచ్చే సంగతి. 

గతకొన్నేళ్ళుగా అప్పుడప్పుడూనూ, గతేడాదిగా కొంచం తరచుగానూ నాకెదురైన ఓ సమస్యని మీతో పంచుకోవాలనిపిస్తోంది. ఈ బ్లాగులో వచ్చే పుస్తక పరిచయాలు చదివిన వారిలో కొందరు, ఆయా పుస్తకాల పీడీఎఫ్ కాపీలు తమకి షేర్ చేయమని అభ్యర్థిస్తూ మెయిల్స్ రాస్తున్నారు. ఈమధ్య కాలంలో ఇది కొంచం పెరిగి పెద్దదై, తమకోసం నా దగ్గర ఉన్న పుస్తకాలని స్కాన్ చేసి పంపాల్సిందిగా డిమాండు కూడా చేస్తున్నారు. బ్లాగు పాఠకులుగా తమకా అధికారం ఉందని కొందరు అనుకుంటూ ఉండడం నన్నిప్పుడు ఆశ్చర్య పరచడం కూడా మానేసింది. నేను కాస్త ఓపికగా ఆయా పుస్తకాలు వెతికి, కాపీలు దొరికే చోటు వివరాలన్నీ మెయిల్ పంపినా అడిగిన వారు తృప్తి చెందడం లేదు. "వీటి బదులు, పుస్తకం స్కాన్ చేసి పంపేయండి" అని సలహా ఇస్తున్నారు నాకు. "పరిచయం రాస్తున్నందుకు మీకు కాంప్లిమెంటరీ కాపీలు వస్తాయి కదా?" తరహా ప్రశ్నలూ పలకరిస్తున్నాయి. 

నాకు పుస్తకాలు కొని చదవడమే అలవాటు. ఎవరికైనా బహుమతి ఇవ్వాలన్నా ఫిజికల్ కాపీలనే కొని ఇస్తాను. ఉచితంగా పుస్తకాలంటే - నా స్నేహితుల దగ్గర నుంచి బహుమతిగా వచ్చినవే తప్ప ఇంకెక్కడినుంచీ కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, స్కానింగ్, పీడీఎఫ్ కాపీల సర్క్యులేషన్ కి నేను బద్ధ వ్యతిరేకిని. రచయితలు, పబ్లిషర్ల మీద నాకున్న గౌరవం ఇందుకు ఒక కారణం. మిగిలిన కారణాలు ఇక్కడ అప్రస్తుతం. పుస్తకాలు ప్రచురించుకున్న కొందరు రచయితలు నాకు కాంప్లిమెంటరీ కాపీ పంపుతానని మెయిల్ రాసిన సందర్భాలున్నాయి. ఆ మెయిల్స్ ని నేను నా బ్లాగుకి దక్కిన గౌరవంగా భావించి, ఆయా పుస్తకాలని కూడా కొనే చదివాను. కాబట్టి, నాదగ్గర ఒక్కో పుస్తకమూ ఒకటికి మించి కాపీలు పోగుపడి ఉంటాయని అనుకోవద్దు. 

అచ్చయిన కొంత కాలానికి పుస్తకాలు ప్రింట్ లో దొరక్కపోవడం అనే సమస్య ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఎప్పటినుంచో ఉన్నదే. దీనికి పరిష్కారం స్కానింగ్ కాపీల సర్క్యులేషన్ ఎంతమాత్రమూ కాదు. పైగా, రచయిత జీవించి ఉండగానే, మరో ప్రింట్ తెచ్చే ఏర్పాట్లు చేసుకుంటూండగానే, ఓరిమి పట్టలేకపోవడం మెచ్చే సంగతి కాదు. కొన్ని క్లాసిక్స్ ఎలాగో ఆన్లైన్ ఆర్కీవ్స్లో భద్రపరచబడి ఉన్నాయి. అందరికీ ఉచితంగా దొరుకుతున్నాయి.  పబ్లిక్ లైబ్రరీలు, పాత పుస్తకాల షాపులు లాంటి చోట్లు ఉండనే ఉన్నాయి. రచయితో, పబ్లిషరో వ్యయ ప్రయాసలకోర్చి వేసుకున్న పుస్తకాన్ని, నేను ఓ కాపీ కొన్నాననే హక్కుతో స్కాన్ చేసి సర్క్యులేట్ చేయలేను. ఆ పుస్తకం మీకెంత ప్రియమైనదైనా కావొచ్చు, ఎంతో అవసరమైనదైనా కావొచ్చు. దానిని పొందే మార్గం 'నేను' కాదు. 

సరే, గడిచిన ఏడాది తాలూకు రాతకోతల లెక్కలోసారి చూస్తే, రాసినవి ముచ్చంగా ముప్ఫయి పోస్టులు. చదివిందీ, చూసిందీ (సినిమాలు) కూడా తక్కువే. 'కరోనా ఎత్తుకుపోయిన ఇంకో సంవత్సరం' అనిపిస్తోంది వెనక్కి తిరిగి చూసుకుంటే. సగం చదివినవి, మొదలు పెట్టాల్సినవి ఇంకా అలా ఉండగానే, బెజోస్ గారి మనిషి కొత్త పార్సిల్ తెస్తున్నాడంటూ సందేశం వచ్చింది. ముందుగా సగంలో ఉన్నవాటిని పూర్తి చేయాలా? వాటినలా ఉంచి కొత్తవి అందుకోవాలా? అన్నది శ్రీశ్రీ కి తెలియని సంధ్యా సమస్య. ఇక, ఈ టీనేజర్ ప్రయాణం ఎలాఉండబోతోందన్న ప్రశ్నకి కాలమే జవాబు చెప్పాలి.. 

గురువారం, జనవరి 13, 2022

ముక్కుపుల్ల

అడ్డబాస చూడడం నాకు భలే ఇష్టం. ఐతే అది అందరికీ సూటవ్వదు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, వయసైపోయిన భానుమతి.. వీళ్ళని అడ్డబాస లేకుండా ఊహించలేం. చిన్నప్పుడు కజిన్స్ ఎవరైనా ముక్కు కుట్టించుకుంటుంటే అడ్డబాసకి కూడా ఓ కుట్టు వేయించుకోమని ఉచిత సలహా ఇస్తూ ఉండేవాడిని. "రేపు మీ ఆవిడకి/పిల్లలకి కుట్టిద్దువుగానిలే" అంటూ విరుచుకుపడే వాళ్ళు తప్ప ఒక్కరూ నా సలహా పాటించలేదు. 'ఓ కుట్టు ఎలాగో కుట్టించుకుంటున్నప్పుడు ఇంకో కుట్టుకి ఏమవుతుందో' అని అయోమయ పడేవాడిని. అటు శాస్త్రానికి, ఇటు ఫ్యాషన్ కీ కూడా కుట్లేవీ వేయించుకోకుండానే రోజులు గడిచిపోయాయి. ఇంకొకరిని ఇన్స్పైర్ చేసి, కుట్లు వేయించుకునేలా చేసే శక్తి లేదని కూడా తెలిసొచ్చేసింది. 

ఇదిలా ఉండగా, అసలు ఆ 'ముక్కు కుట్టుట' అనే ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా అనుభవంలోకొచ్చింది, కరోనా పుణ్యమా అని. అది కూడా ఒకసారి కాదు, ముచ్చంగా మూడుసార్లు. అది యెట్లన్నన్.. అనగనగా కరోనా ఫస్ట్ వేవ్ కాలంలో అనుకోకుండా పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. 'కరోనా టెస్ట్' అంటే బ్లడ్ టెస్ట్ కాబోలనుకున్న అమాయకపు రోజులవి. కుర్చీలో కూర్చుని, ఎడమచేయి పిడికిలి బిగించి, సర్వససన్నద్దుడినై, టెక్నీషియన్ వైపు 'స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ ' అన్న లుక్ ఇచ్చాక బదులుగా సిరంజి కాకుండా ఓ చిరునవ్వు వచ్చింది అతన్నుంచి. నే చేసిన నేరమదేమో తెలియక ప్రశ్నార్థకంగా చూసిన పిమ్మట, "కోవిడ్ టెస్టుకు రావడం మొదటిసారా?" అని ప్రశ్నించి, నా అమాయకత్వాన్ని మన్నించి, తల పైకెత్తమన్నాడు. ఓ పొడుగాటి పుల్లని వైనంగా నా ముక్కులో చొప్పించినప్పుడు ముందు కళ్ళ నీళ్లు తిరిగాయి. వెంటనే తుమ్ము రాబోయి, మర్యాదకి ఆగిపోయింది. 

నా అదృష్టానికి, ఆ పుల్ల టెస్టు మొదటిసారి ఫెయిలయింది. మరో పుల్ల, అదే ముక్కు. నేనేమో సర్వశక్తుల్నీ ముక్కు మీద కేంద్రీకరించి టెక్నీషియన్ కి సహకరించా, 'ఇంకోసారి' అంటాడేమో అని భయపడి. మరో పుల్లని గొంతు వరకూ జొనిపి, బయటికి తీసి, శాంపిల్ తీసుకోవడం పూర్తయింది లెమ్మన్నాడు. అప్పుడు పేరూ, ఫోన్ నెంబరూ ఇస్తే చాలన్నారు కానీ, రెండో వేవ్ లో రెండో సారి టెస్టుకి వెళ్ళినప్పుడు ఆధార్ తో సహా సవాలక్ష ఆధారాలు అడిగారు రిజిస్ట్రేషన్ కోసం. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, క్రితం రోజు ఆఫీసులో కలిసి లంచి చేసిన ఓ సహోద్యోగికి పాజిటివ్ వచ్చిందని, తెల్లారుతూనే ఫోనొచ్చింది. అలా టెస్టుకు వెళ్లి, నేను నేనేననే రుజువులన్నీ చూపించాక,  'బ్యాంకు స్టేట్మెంట్ సబ్మిట్ చేయమంటారా?' అని బాధ్యతగా అడిగాను. 

"ఇప్పుడు అవసరం లేదు, ఒకవేళ పాజిటివ్ వస్తే అప్పుడు చూస్తాం" అంది కౌంటర్ అమ్మాయి. బ్యాలన్సు కొద్దీ వైద్యం కాబోలనుకున్నాను. సరే, లేబ్ లోకి వెళ్తే పుల్లలధారియై టెక్నీషియను. భూగర్భ జలాలు పైకి తెచ్చేందుకు బోర్ వేసే కార్మికుడిలా అతి శ్రద్ధగా ఆ పుల్లతో నా నాసికను చిలికాడు. గతానుభవాన్ని గుర్తు తెచ్చుకుని నేను పూర్తి స్థాయిలో సహకరించా. 'వన్స్ మోర్' అనకుండా రక్షించాడు నన్ను. వాక్సిన్ రావడమూ, పొడిపించుకోవడమూ, ఇక కరోనా కథ కంచికే అని ఆనందించడమూ జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి మూడో వేవ్ మొదలైంది. ఈసారి ఇంటి చుట్టుపక్కల కేసులు పెరిగాయి. దాంతో సామూహికంగా కోవిడ్ టెస్టులు జరిపే ఏర్పాటు మా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. పైగా, టెస్టు చేయించుకోడం తప్పనిసరి. 

ఈసారేం డాక్యుమెంట్లు అడగబోతారో అనుకుని, ఎందుకైనా మంచిదని ఓ డాక్యుమెంట్ల బొత్తి చంకన పెట్టుకుని బయల్దేరానా, వాళ్లేమో ఫోన్ నెంబరు ఒక్కటీ చాలనేశారు. ఏవిటో, క్షణక్షణముల్ టెస్టుల వాళ్ళ చిత్తముల్ అనుకుంటూ, దూరం పాటిస్తూ క్యూలో నిలబడ్డా. ఈసారి లేబ్ కాకుండా ఓపెన్ ప్లేస్ అవడం వల్ల, అందరి టెస్టులు అందరికీ కనిపిస్తున్నాయి. ఎవరి ముక్కులోకి పుల్ల వెళ్తున్నా, నా ముక్కు దురదేస్తూ ఉండడం. నేనేమో, ప్రిన్సులాగా మాస్కు మీంచి నా ముక్కు తుడుచుకుంటూ ఉండడం. ఓ అరగంట పాటు ఈ హింస కొనసాగింది. ఆ తర్వాత అసలు హింస. ఇదేదో రెండు టెస్టుల కాంబో అట. ముక్కు పుల్లలు రెండు, ఒక వేళ శాంపిల్ రాకపోతే మరొహటో రెండో పుల్లలు అదనం. వినగానే గుండె ఝల్లుమంది. సర్వశక్తులూ ఒడ్డి శాంపిల్ ఇచ్చేశా, అది మొదలు రోజంతా తుమ్ములే తుమ్ములు. 

ముక్కు కుట్టించుకొనుట అనే ప్రక్రియలో ఇమిడి ఉన్న కష్టమేంటో దెబ్బకి అనుభవానికి వచ్చింది. పాపం వాళ్ళేదో ముక్కు పుడక సరదా కోసం తెగించి ఓ కుట్టుకి సిద్ధ పడితే, నేను 'అడ్డబాస' అని సలహా చెప్పడం విని వాళ్లకెంత ఇరిటేషన్ వచ్చి ఉంటుందో బాఘా అర్ధమయ్యింది. ఆఫ్ కోర్స్, ఇప్పుడు ముక్కుకి, చెవులకి కూడా కుట్లు అవసరం లేని జ్యుయలరీ అందుబాటులోకి వచ్చేసింది. అయినప్పటికీ, వాటికి పెద్దగా ఆదరణ ఉన్నట్టు లేదు. చెవులవరకూ ఓకే కానీ (అబ్బాయిలూ ఎక్కువగానే కుట్టించుకుంటున్నారు) ఇప్పుడు ముక్కు కుట్టించుకుంటున్న వాళ్ళు పెద్దగా కనిపించడం లేదు. ఇంతకీ మూడు టెస్టుల రిజల్టు సంగతి చెప్పలేదు కదా.. మూడూ నెగిటివ్ రిజల్టు ఇచ్చి నన్నానంద పరిచాయి. మీ అందరికీ కూడా నెగిటివే రావాలని కోరుకుంటున్నా.. పదండి, ఈ మూడో వేవుని దాటేద్దాం.. 

బుధవారం, జనవరి 05, 2022

విశ్వనాథ్ విశ్వరూపం

అభిమానం అనేక విధాలు. 'అనామకుడు' అనే కలం పేరుతో కథలు, నవలలు, పుస్తకాలూ రాసే ఎ. ఎస్. రామశాస్త్రికి సినిమా దర్శకుడు కె. విశ్వనాథ్ అంటే అభిమానం. ఎంత అభిమానం అంటే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాలనీ, ఆ సినిమాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషినీ విశ్లేషిస్తూ ఓ పుస్తకం రాసేంత. ఆ పుస్తకానికి విశ్వనాథే స్వయంగా రాసిన ముందుమాటలో "ఒక ఎం. ఫిల్. థీసిస్ వ్రాసినట్లుగా" రాసినందుకు కృతజ్ఞతలు చెప్పుకునేంత. ఆ పుస్తకం పేరు 'విశ్వనాథ్ విశ్వరూపం.' మూడునెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకాన్ని గురించి పత్రికల్లో వచ్చిన పరిచయాల పుణ్యమా అని ఈ మధ్యనే నాకు తెలిసింది. సొంతముద్ర కలిగిన కొద్దిమంది దర్శకుల్లో విశ్వనాథ్ ఒకరనేది నిర్వివాదం. అలాగని విశ్వనాథ్ తీసిన సినిమాలన్నీ ఆణిముత్యాలు కాదు. ఆ విషయంలో ఈ పుస్తక రచయితకి స్పష్టత ఉంది. అందువల్లే, తన పుస్తక పరిథిని విశ్వనాథ్ తీసిన కొన్ని సినిమాలకి కుదించుకుని రచనకి ఉపక్రమించారు. హిందీ సినిమాల జోలికి వెళ్లలేదు. 

ఒక్క విశ్వనాథ్ కి మాత్రమే కాదు, తెలుగు సినిమా రంగానికి పేరు తెచ్చిన సినిమా 'శంకరాభరణం.' ఈ సినిమాని గురించి సమగ్రంగా విశ్లేషించిన 'అనామకుడు,' ఈ సినిమాకి ముందూ, తర్వాతా విశ్వనాథ్ తీసిన ఐదేసి సినిమాలని వివరంగా సమీక్షించారు. మిగిలిన వాటిల్లో కొన్నింటిని సందర్భోచితంగా ప్రస్తావించారు. విశ్వనాథ్ సినిమాల్లో పది ప్రత్యేకతలు, ఎంపిక చేసుకున్న పది పాటల విశ్లేషణ, పది మరపురాని సన్నివేశాల విశ్లేషణ, పదిమంది కథానాయికల ప్రత్యేకతలు.. ఇలా 'పది' ని కేంద్రంగా చేసుకుని రాసిన విశేషాలున్నాయి. ఇవే కాకుండా, కథానాయకులు, బాలనటులు, కేరక్టర్ నటులు, గీత రచయితలు, సంగీత, నృత్య దర్శకులు, సహకార దర్శకులు, సంభాషణ రచయితలు... ఇలా కేటగిరీల వారీగా విభజించి, ఆయా వ్యక్తుల్లో తాను గమనించిన ప్రత్యేకతలని ప్రస్తావించారు. 'అనుబంధం' లో విశ్వనాథ్ పనిచేసిన (నటనతో సహా వివిధ శాఖల్లో) సినిమాల జాబితా ఇచ్చారు. 

ఇప్పటికే ఎంతోమంది ఎన్నోరకాలుగా చెప్పేసిన, ప్రవచనాలు కూడా చేసేసిన, 'శంకరాభరణం' సినిమా గురించి కొత్తగా చెప్పడానికి ఏం మిగిలిందా అన్న సందేహం కలిగింది, ఆ అధ్యాయం చదవబోతుంటే. కానైతే, రచయిత పరిశీలనలు ఎక్కడికక్కడ ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాయి. మంజుభార్గవి పోషించిన తులసి పాత్రకి పునాది, విశ్వనాథ్ గతచిత్రం 'నిండు హృదయాలు' లో చంద్రకళ పోషించిన పాత్రలో ఉందనీ, రెండు సినిమాల్లో తల్లిపాత్రలకీ దగ్గరిపోలికలున్నాయనీ చదువుతున్నప్పుడు, ఈ రచయిత ఆషామాషీగా పుస్తక రచనకి పూనుకోలేదని అర్ధమయ్యింది. అలాగే ఈ సినిమాకి 'బాహుబలి' తో పోలిక తెచ్చి (కీర్తి, ఆదరణ) భేదాలనీ వివరించడం ఊహాతీతం. ఈ సినిమాని  పది భాగాలుగా విశ్లేషించి, 'పది' పట్ల తన మక్కువ చాటుకున్నారు.  'శంకరశాస్త్రి పాత్రకి స్ఫూర్తి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు' లాంటి బాగా నలిగిన తెరవెనుక సంగతుల జోలికి పోకుండా, కేవలం తెరమీద కనిపించిన సినిమాని మాత్రమే విశ్లేషించారు. తాను ప్రస్తావించిన సన్నివేశాల తాలూకు ఫోటోలు జతచేయడం వల్ల, రచయిత విశ్లేషణ చదువుతూ ఉంటే ఆయన దృష్టి కోణం నుంచి సినిమాని మళ్ళీ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. 

'శంకరాభరణం' కి ముందు తీసిన వాటిలోంచి ఐదు సినిమాలు - చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరము శిక్ష, ఓ సీత కథ, సిరిసిరి మువ్వ, 'శంకరాభరణం' తర్వాత తీసిన వాటిలోంచి ఐదు సినిమాలు - సప్తపది, శుభలేఖ, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వాతికిరణం సినిమాలు ఒక్కోటీ ఒక్కో అధ్యాయంలో తన కళ్ళతో చూపించారు. ఈ జాబితాలో 'సాగర సంగమం' లేకపోవడం కించిత్ బాధ కలిగించినా, 'స్వాతి కిరణం' సినిమాని చేర్చడం ఊరటనిచ్చింది. వీటిలో, 'నేరము శిక్ష' కి దస్తయోవస్కీ 'క్రైం అండ్ పనిష్మెంట్' నవలకన్నా 'దో ఆంఖే బారాహ్ హాథ్' సినిమా ప్రభావమే స్వల్పంగా ఉందంటారు. తర్వాతి అధ్యాయం 'పది చిత్రాలు - పది పాటలు' కోసం ఇవే పది సినిమాల్లో ఒక్కో సినిమా నుంచీ ఒక్కో పాటను ఎంచుకుని విశ్లేషించారు. ఈ పది పాటల్ని ఇతర చిత్రాల నుంచి తీసుకుని ఉంటే ఆ వంకన మరి కొన్ని సినిమాల ప్రస్తావనను ఈ రచయిత నుంచి వినగలిగే అవకాశం ఉండేది కదా అనిపించింది. 

అయితే 'మరపురాని సన్నివేశాలు' అధ్యాయం కోసం ఇవే పదిని ఎంచుకోలేదు. వీటిలో ఐదు పతాక సన్నివేశాలు, మూడు పాట సన్నివేశాలు ఉన్నాయి. విశ్వనాథ్ సినిమాలకి పనిచేసిన వారిలో, వేటూరి, సిరివెన్నెల, బాలూ ల గురించి మరికొంచం చెప్పే వీలున్నా క్లుప్తంగా ముగించేసిన భావన కలిగింది. వీరిలో వేటూరిని (ఓ సీతకథ), సిరివెన్నెలనీ సినిమా రంగానికి పరిచయం చేసింది విశ్వనాథే. పదిమంది హీరోయిన్లు ఒక్కొక్కరి గురించీ ఒక్కో పేజీ కేటాయించడమే కాకుండా, వాళ్ళు మిగిలిన సినిమాల్లో కానీ విశ్వనాథ్ సినిమాల్లో ఎలా ప్రత్యేకంగా కనిపించారో సాదోహరణంగా వివరించారు. సినిమా వాళ్ళని గురించి అభిమానులు పుస్తకాలు రాయడం కొత్త కాదు కానీ, ఇంత సమగ్రమైన రచన అరుదు. గుణదోష వివరణ జోలికి వెళ్లకుండా, కేవలం బాగున్న/తనకి బాగా నచ్చిన వాటిని గురించి మాత్రమే ప్రస్తావించడంవల్ల అక్కడక్కడా 'అసంపూర్ణ' భావన పాఠకుల్లో కలిగే అవకాశం ఉంది. కానైతే, ఇది ఓ అభిమాని తన అభిమాన దర్శకుడికోసం రాసి, అంకితం చేసిన పుస్తకం. అపరాజిత పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ 230 పేజీల పుస్తకం వెల వెయ్యి రూపాయలు. సాఫ్ట్ కాపీ రూ. 500 కి లభిస్తోంది. సినిమాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళకి విందుభోజనం. 

ఆదివారం, జనవరి 02, 2022

శ్రీ సీతారాముల కళ్యాణం ...

 "చూసింది చూసింది సీతమ్మ కన్ను 
చూపులే నమ్మని మన్నులో మిన్ను..." 

సినిమా పాటలకి సంబంధించి, లేదా కేవలం వేటూరి పాటలకి సంబంధించి చూసినా ఇది విశేషం కాకపోవచ్చు. ఇలాంటి పాటలు ఇంకా ఉండే ఉండొచ్చు. మరి, ప్రత్యేకంగా ఈపాటనే ప్రస్తావించడం ఎందుకూ అంటే ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి, ఇవాళ్టి వరకూ ఈ పాటకి ఉన్న యూట్యూబ్ హిట్లతో దాదాపు సగం నా నుంచి వెళ్ళినవే కాబట్టీను. కూచిపూడి భాగవతుల డేన్స్ డ్రామాగా మొదలయ్యే ఈ పాటలో రెండో చరణం మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది. అలాగని మరీ అర్ధం కానీ సంక్లిష్ట సమాసాలుండవు. భావం బోధ పడుతుంది, వినడానికి బాగుంటుంది. ప్రత్యేకించి ట్యూన్ మనసుకి పట్టేస్తుంది. 

పాట గురించి చెప్పుకోడానికి ముందు, సినిమా గురించి కొన్ని సంగతులు. 'జేగంటలు' సినిమా 1981 లో విడుదలయ్యింది. 'యువచిత్ర' కాట్రగడ్డ మురారి, విజయ బాపినీడు కలిసి నిర్మించిన ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. పాటల్ని (మాత్రమే) నమ్ముకుని, వాటిచుట్టూ అల్లుకున్న కథతో, నూతన తారలతో  తీసిన ఈ సినిమా ఆడలేదు కానీ, పాటలు మాత్రం నిరాశ పరచలేదు. 'ఈ సినిమా ఇంత పేలవంగా ఎందుకుంది?' 'సింగీతం ఎప్పుడూ ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడలేదు?' అనే ప్రశ్నలు చాన్నాళ్లుగా పీడించేవి. వాటికి జవాబులు మురారి ఆత్మకథ 'నవ్విపోదురుగాక' లో దొరికాయి. కథ మీద దృష్టి పెట్టకుండా, పాటల చుట్టూ కథ అల్లేసుకున్నామనీ, 'స్టార్ట్' చెప్పిన సింగీతం తన వైపు చూస్తూ తాను చెప్పాకే 'కట్' చెప్పేవేరనీ రాసుకున్నారు మురారి. 

వేటూరి సింగిల్ కార్డు సినిమా ఇది. 'వందనాలు వందనాలు' 'ఎవరమ్మా ఈ కొమ్మ' 'తెలుసులే తెలుసులే' 'ఇది ఆమని సాగే చైత్ర రథం' లాంటి పాటల మెరుపుల మధ్య, ఈ సీతారాముల కళ్యాణం పాట పెద్దగా జనంలోకి వెళ్ళలేదు. ఆకాశవాణి కూడా ఎందుకో తెలీదు కానీ ఈ పాట మీద శీత కన్నేసింది అప్పట్లో. 



"శ్రీ సీతారాముల కళ్యాణం.. శ్రీ సీతారాముల కళ్యాణం 
శివ ధనువు విరిచి నవ వధువు జానకిని 
వరుడు రఘువరుడు పరిణయమాడిన 
శ్రీ సీతారాముల కళ్యాణం... " 

బృందగానంతో పాట మొదలవుతుంది. సీతారామకళ్యాణ మహోత్సవంలో భాగంగా కూచిపూడి భాగవతులు ప్రదర్శన ఇవ్వడం సందర్భం. 

"అంతట సీతా స్వయంవరంబునకు నీలమేఘ శ్యాముడు, రవికులాంబుధి సోముడు శ్రీరాముడు వేంచేయు సమయంబున ప్రియసఖులు జానకిని అలంకరించు విధంబెట్టిదనిన..."  

...అన్న సూత్రధారుడి వ్యాఖ్యానం తర్వాత మొదటి చరణం మొదలవుతుంది. సినిమా గ్రామర్ ని అనుసరించి, నాయికా నాయకుల పరిచయానికి వాడుకున్నారీ చరణాన్ని. 

"వేగుచుక్కే తెల్లవారంగ దిగివచ్చి 
చెలియ చెక్కిట తాను చుక్కాయెనే  
తన ఇంటి కోడలౌ తరుణీ లలామకు  
ఉదయభారవి నుదుట బొట్టాయెనే 
ఇరులన్నితెలవారి  కురులైన వేళ 
విరులన్ని సీతమ్మ సిరులాయెనే.." 

సీతమ్మకి వేగుచుక్క బుగ్గన చుక్క అయ్యింది. శ్రీరాముడు ఇనకుల తిలకుడు, అంటే సూర్యవంశంలో ఉద్భవించిన వాడు. ఆ వంశపు మూల పురుషుడు సాక్షాతూ సూర్యుడే. ఆ లెక్కన సూర్యుడికి సీత కాబోయే కోడలి వరస. తన ఇంటి కోడలు కాబోతున్న సీతకి సాక్షాత్తూ ఉదయభానుడే నుదుట బొట్టుగా మారాడు. తెల్లవారుతూనే అప్పటివరకూ దట్టంగా ఉన్న చీకట్లన్నీ సీతకి కురులుగా మారిపోగా, పువ్వులన్నీ సీత జడలో సిరులుగా అమరిపోయాయి.  

"హంసనడిగే నడక ఒక ఇంత నడచి 
హృదయపు గవాక్షమ్ము చెలి కొంత తెరచి 
చూపులోపల మరుని తూపులే పరచి 
చూసింది చూసింది సీతమ్మ కన్ను 
చూపులే నమ్మని మన్నులో మిన్ను.."

హంసని అడిగి పుచ్చుకున్న నడకతో స్వయంవర మండపానికి వచ్చిన సీత, గుండె తలుపుని కొంచం తెరిచి, తన చూపుల్లో మన్మధుడి బాణాలు గుప్పించి, నమ్మశక్యం కాని విధంగా కనిపించిన ఆకాశాన్ని (నీలమేఘ శ్యాముడు) చూసింది. 

ఇక రెండో చరణం నాయికానాయకుల డ్రీమ్ సీక్వెన్సు. పల్లవి, తొలి చరణానికి  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాంలతో పాటు ఎస్పీ శైలజ, జి. ఆనంద్ గొంతు కలపగా, రెండో చరణం కేవలం బాలూ, వాణీ జయరాం మాత్రమే పాడారు. భావం సీతా రాముల పరస్పర పరిచయాలు, గ్రీటింగ్సు చెప్పుకోవడమే కానీ, పదాల పోహళింపు, ట్యూను, సంగీతం కలిపి మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేశాయి. 

"ధన్యోస్మి ప్రభు శ్రీరామా 
ధరణిజ గగన ఘనశ్యామా 

ధన్యోస్మి ప్రియే  శ్రీరామే 
ధరణిజ చంద్ర కళోద్ధామే 

ధీర సమీర దృగంచల కంపిత గుంఫిత ముగ్ధ తనూలతికే 
అవనత ముఖ కమలే అమలే దర్శిత దరహసితే సీతే 
ధన్యోస్మి ప్రియే  శ్రీరామే 

కౌశిక ధర్మ విచారణ చారణ చరణా రవికుల నవ కిరణా 
అవనిజ నిజ శిరసా మనసా వందిత గుణధామా రామా..
ధన్యోస్మి ప్రభు శ్రీరామా

'దృగంచల'  దగ్గర బాలూ కాస్త తడబడినా 'మామ' మహాహేవన్ టేక్ ఒకే చేసేశారు. 

"సీతారాముల కళ్యాణం ఇలలో ప్రణయానికి ప్రాణం 
సిరికీ హరికీ కళ్యాణం ధరలో జేగంటల నాదం.."  

...అన్న బృందగానంతో ముగుస్తుంది పాట. సినిమా టైటిల్ 'జేగంటలు' ని జాగ్రత్తగా అమర్చారు సాహిత్యంలో. నటీనటుల విషయానికి వస్తే కథానాయిక ముచ్చెర్ల అరుణకిది మొదటి సినిమా, నాయకుడు రాంజీ కి రెండో సినిమా.  ఈ పాటలోనే కాదు, సినిమా మొత్తం ఇద్దరూ కెమెరాని భయం భయంగా చూస్తూనే నటించేశారు. దర్శకత్వం తదితరాల గురించి ముందే చెప్పేసుకున్నాం కదా.  వేటూరి సాహిత్యం, వాణీ జయరాం గొంతు మాత్రం అలా గుర్తుండిపోతాయీ పాటలో.