ఆదివారం, జూన్ 13, 2021

స్వాతి చినుకు సందెవేళలో ...

మన సినిమాల్లో పాటలకి, అందునా వాన పాటలకి, ప్రతికించి సందర్భం అంటూ ఉండాల్సిన అవసరం లేదు. నాయికో, నాయకుడో లేక సైడు కేరెక్టర్లో కలగనేస్తే సరిపోతుంది. సినిమా ఆసాంతమూ ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించినా వాన పాట అనేసరికి నాయిక చీర కట్టక తప్పదు. తెలుగుదనమా, మజాకానా? అలాగే గీత రచయితలూనూ.. రెండో మూడో చరణాల్లో వాననీ, నాయికనీ వర్ణించేస్తే సరిపోతుంది. అనాదిగా మన వానపాటల సంప్రదాయం ఇదే. అత్యంత అరుదుగా ఈ సంప్రదాయానికి కాసిన్ని మినహాయింపులు దొరుకుతూ ఉంటాయి. 

'ఆఖరి పోరాటం' (1988) సినిమాలో 'స్వాతి చినుకు సందెవేళలో..' అనే వాన పాటని పూర్తిగా సందర్భోచితం అనలేం కానీ, అలాగని డ్రీమ్ సీక్వెన్సు కూడా కాదు. నాయికానాయకులిద్దరూ కలిసి విలన్ల దృష్టిని మళ్లించి, చిన్నపిల్లల్ని రక్షించడం కోసం చేసిన డైవర్షన్ స్కీములో భాగం. మామూలుగా అయితే ఇది వ్యాంపు గీతానికి అనువైన సందర్భం. కానీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, శ్రీదేవి-నాగార్జునల మీద ఓ వానపాటని చిత్రీకరించేశాడు. వేటూరి రచన, ఇళయరాజా స్వర రచన, జానకీ-బాలూల యుగళం. (తీరాచేసి కథ ప్రకారం నాయిక మామూలమ్మాయేమీ కాదు, పవర్ఫుల్ ఆఫీసర్. అయినప్పటికీ విలన్ల భరతం పట్టేందుకు స్కిన్ షో తప్ప వేరే దారి దొరక్కపోవడమే విషాదం!). 



"స్వాతి చినుకు సందెవేళలో... లేలేత వణుకు అందగత్తెలో... 
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే చెలే ఒదుగుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా  బలే కదా గాలి ఇచ్చటా"

...అంటూ నాయకుడు పాట అందుకుంటాడు. తగుమాత్రం గాలితో వర్షం మొదలవుతుంది తెరమీద. మబ్బు కన్ను గీటడమూ, మతి పైట దాటడమూ వేటూరి మార్కు చమక్కులు. 'బలే కదా గాలి ఇచ్చటా' అనడంలో నాయికా నాయకుల మధ్యకి వచ్చి చేరిన గాలి బలైపోతోందన్న కొంటెదనం ఉంది. శ్రద్దగా వినకపోతే 'భలే కదా గాలి ఇచ్ఛటా' గా పొరబడే అవకాశమూ ఉంది.  

"స్వాతి చినుకు సందెవేళలో... లేలేత వలపు అందగాడిలో... 
ఈడే ఉరుముతుంటే... నేడే తరుముతుంటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా.. ఇదే కదా చిలిపి ఆపదా"

...ఇది నాయిక కొనసాగింపు. సాధారణంగా పాటకి ఒకటే పల్లవి ఉంటుంది కానీ, ఈ పాటకి ఒకేలా వినిపించే రెండు పల్లవులు. వర్షానికి తగ్గ వాతావరణం - చినుకు, వణుకు, మబ్బు, చలి, గాలి, ఉరుము - మొత్తం రెండు పల్లవుల్లోనూ అమరిపోయింది. వీటికి జతగా మరో రెండు చరణాల యుగళం. 

"ఈ గాలితో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక.. నా వీణలే అల్లాడగా..
నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా
వరాలిచ్చి పోరా వరించాను లేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళా.. కురిసిన... "

సున్నితమైన శృంగారం, వానపాటకి తప్పదు కదా.  "నీ తీగకే గాలాడక.. నా వీణలే అల్లాడగా.." అన్నది పూర్తిగా వేటూరి మార్కు. "నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా" లో 'వేడి' పదాలకి సంబంధించింది, వేడిపదాలు.. పాటలో పలికిన విధానం  'వేడుకోలు' అని అర్ధం స్ఫురింపజేస్తోంది. 

"ఈ వానలా కథేమిటో.. నా ఒంటిలో సొదెందుకో
నీకంటిలో కసేమిటో.. నాకంటినీ తడెందుకో
తొలివానలా గిలిగింతలో.. పెనవేసినా కవ్వింతలో
ఎదే మాట రాకా పెదాలందు ఆడా
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళా మెరిసిన..."

లాకాయిలూకాయి కవులెవరూ "నీకంటిలో కసేమిటో.. నాకంటినీ తడెందుకో" అనలేరు. గుండె గొంతుకలో కొట్టాడడం తెలుసు కానీ, ఇక్కడ కవి ఆ ఎదని పెదాలవరకూ తీసుకొచ్చేశారు. శ్రుతిలయల్ని మాత్రం విడిచిపెట్టారా ఏంటి? 

ఇళయరాజా ఇచ్చిన హుషారైన ట్యూనుకి అంతే హుషారుగా పాడారు గాయనీగాయకులు. నాగేశ్వరరావుతో ఆడిపాడిన డ్యూయెట్లన్నింటికీ చెప్పుల్ని త్యాగం చేసిన శ్రీదేవి, వాళ్ళబ్బాయితో చేసిన ఈ పాటకీ ఒఠి కాళ్లతోనే నర్తించింది పాపం. అంతకు ముందు సంవత్సరం దేశాన్ని ఊపేసిన 'మిస్టర్ ఇండియా' వానపాట ఆమెకి బాగా ఉపయోగించి ఉండాలి, ఈపాట విషయంలో. (నాకైతే, ఆ పాట చూసే ఈ పాటని కథలో ఇరికించి ఉంటారని బలమైన సందేహం). చూడ్డానికే కాదు, వినడానికీ బాగుండే ఈ పాట నా ప్లేలిస్టులో పర్మనెంటు మెంబరు. 

6 కామెంట్‌లు:

  1. విలన్లను వెర్రి వెంగళప్ప లు చేసి ఏమార్చడానికి ఇలాంటి పాటలు పోలీసు ఆఫీసర్లు పాడటం అనే కాన్సెప్టు మన వాళ్ళకే సాధ్యం. వేటూరి సాహిత్యం లోని విచిత్ర భావాలు విని విలన్లకు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది.

    ఈ సినిమాలో తెల్ల చీరకు తకదిమి అనే పాట musical గా బాగుంటుంది. పాటల సాహిత్యం విపరీత విచిత్ర పోకడలో కామెడీ గా అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. అప్పట్లో పాట ఒక ఊపు ఊపింది
    రాఘవేంద్రరావు గారా మజాకానా

    రిప్లయితొలగించండి