ఆదివారం, ఫిబ్రవరి 07, 2021

సుబ్బిశెట్టి గారి చింతామణి

గత కొద్దిరోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజీ చక్కర్లు కొడుతోంది. ఆర్య వైశ్య సంఘాల అభ్యర్ధన మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 'చింతామణి' నాటక ప్రదర్శనని నిషేధిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సాంస్కృతిక శాఖకి ఆదేశాలు వెళ్లాయన్నది ఆ మెసేజీ సారాంశం. దీంతో, వివాదాస్పద నాటకం 'చింతామణి' మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. గతంలోనూ ఈ నాటకం నిషేధాలకి గురైనా అది కొన్ని ప్రాంతాల్లో, స్థానిక పోలీసు అధికారుల నిర్ణయం మేరకు తాత్కాలికంగా జరిగింది తప్ప, ప్రభుత్వం ద్వారా శాశ్వత నిషేధం కాదు. శత వసంతాల ఉత్సవం జరుపుకోవాల్సిన సమయంలో నిషేధానికి గురవ్వడం అన్నది ఒక రచనగా చూసినప్పుడు 'చింతామణి' విషయంలో బాధ కలిగించే విషయమే. కానీ, నాటక ప్రదర్శనగా చూసినప్పుడు నిషేధాన్ని సమర్ధించకుండా ఉండలేం. అదే సమయంలో, ఇన్నేళ్ల తర్వాత నిషేధించడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నా తలెత్తుతుంది. 

తెలుగులో తొలితరం ప్రచురణ కర్త కూడా అయిన కాళ్ళకూరి నారాయణ రావు (1871-1927) సంఘ సంస్కరణని ఆశిస్తూ నాటక రచన చేశారు. హాస్యం ద్వారా ప్రజలకి చేరువ కావచ్చన్నది వీరు నమ్మిన సిద్ధాంతం. వరకట్నాలని వ్యతిరేకిస్తూ రాసిన 'వర విక్రయం' నాటకం ప్రజాదరణ పొందింది. ఈ నాటకంలో సింగరాజు లింగరాజు పాత్ర, 'అహనా పెళ్ళంట' తో సహా అనేక తెలుగు సినిమాల్లో పిసినారి పాత్రలకి ఒరవడి పెట్టింది. 'వర విక్రయం' తర్వాత నారాయణరావు రాసిన నాటకం 'చింతామణి', ఇతివృత్తం వేశ్యా వ్యసన నిర్మూలన. లీలాశుకుని కథని ఆధారం చేసుకుని రాసిన ఈ నాటకం ఆద్యంతం హాస్యభరితంగానూ, ముగింపు కరుణరస భరితంగానూ ఉంటుంది. అటు వేశ్య చింతామణిలోనూ, ఇటు విటులలోనూ పరివర్తన రావడంతో నాటకం ముగుస్తుంది. 

మూల నాటకంలో హాస్యమే తప్ప బూతు లేదు. చింతామణి ముగ్గురు విటుల్లో ఒకరైన సుబ్బిశెట్టిని హాస్య పాత్రగా మలిచారు రచయిత. ఈ పాత్ర లోభిగా కనిపించి ప్రేక్షకుల్ని నవ్విస్తుంది  ('కన్యాశుల్కం' నాటకంలో పోలిశెట్టి లాగా) తప్ప  ఆ కులంవారు అభ్యంతరం చెప్పేలా ఉండదు. ఒకసారి ప్రదర్శనల కోసం నాటక సమాజాల చేతుల్లో పడ్డాక మూల నాటకం తన రూపాన్ని కోల్పోయింది. హాస్యం స్థానంలో బూతు ప్రవేశించింది. స్త్రీలు తమంతట తామే ఆ నాటకాన్ని దూరం పెడితే, పెద్దవాళ్ళు పిల్లలని ఆ నాటకం చూడనిచ్చే వాళ్ళు కాదు. రానురానూ, మిగిలిన పాత్రలని నామమాత్రం చేసి కేవలం చింతామణి-సుబ్బిశెట్టిల సరస సంభాషణల్ని పెంపు చేసి నాటకాన్ని నిర్వహించడం, ఆ ప్రదర్శనలకు ప్రజాదరణ పెరగడం సంభవించింది. మూల నాటక రచయిత కాలధర్మం చెందడంతో అభ్యంతర పెట్టేవాళ్ళు లేకపోయారు. 

ఆశ్చర్యం ఏమిటంటే, నాటకంలోని బూతు సినిమా లోకీ చొరబడింది. కాళ్ళకూరి 'వరవిక్రయం' నాటకం ఆధారంగా అదే పేరుతో తీసిన సినిమా ద్వారా వెండి తెరకి పరిచయమైన భానుమతి, భరణీ పిక్చర్స్ సంస్థని స్థాపించి వరుసగా సినిమాలు తీస్తూ 1956లో తానే కథానాయికగా, తన భర్త రామకృష్ణ దర్శకత్వంలో  'చింతామణి' సినిమా తీసినప్పుడు, ఆ సినిమాకి సెన్సార్ ఇబ్బందులు తప్పలేదు. సుబ్బిశెట్టి పాత్ర పోషించిన రేలంగి చేత చెప్పించిన డైలాగులన్నీ సెన్సారు చేయబడ్డాయి. ప్రజలు కోరిందే (?) తీద్దాం అనుకున్న భరణీ వారికి, సెన్సార్ రూపంలో చుక్కెదురైంది. ఎన్ఠీఆర్ బిల్వమంగళుడుగా నటించినా ఆ సినిమా సరిగా ఆడలేదు. విమర్శకుల మెప్పూ దొరకలేదు. నాటక సమాజాల చేతుల్లో రూపాంతరం చెందిన సుబ్బిశెట్టి పాత్ర తాలూకు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగ పడే దృష్టాంతం ఇది. 

నిజానికి 'చింతామణి' నాటకం పట్ల ఆర్య వైశ్యుల అభ్యంతరం ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. సుమారు ముప్ఫయ్ ఏళ్ళ క్రితం, వాణీ విశ్వనాథ్ చింతామణి గానూ, తాను సుబ్బిశెట్టి గానూ స్వీయ దర్శకత్వంలో 'చింతామణి' సినిమాని నిర్మిస్తానని దాసరి నారాయణ రావు ప్రకటించినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాలన్నీ ఆ ప్రతిపాదన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. మర్నాటికే తన నిర్ణయంపై వెనక్కి తగ్గారు దాసరి (అప్పటికే ఈ సినిమా విషయంలో కొన్ని విఫల యత్నాలు చేసి ఉన్నారు). ఒకప్పటితో పోల్చినప్పుడు గత పదేళ్లుగా తెలుగు ప్రజల్లో కుల స్పృహ బాగా పెరిగిందనన్నది కంటికి కనిపిస్తున్న విషయం. అప్పటివరకూ ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ వేషాల పాత్రల్ని అవమానకరంగా చిత్రించినా పెద్దగా పట్టించుకోని ఆ వర్గం, 2012 లో విడుదలైన 'దేనికైనా రెడీ' సినిమా విషయంలో తీవ్రంగా స్పందించడం రాష్ట్రమంతా చర్చనీయమయ్యింది. వైశ్య వర్గం నుంచి ఒత్తిడి పెరగడంతో, ప్రస్తుత ప్రభుత్వం 'చింతామణి ప్రదర్శనల నిషేధం' నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. 

నాటక ప్రదర్శనలు దాదాపుగా అంతరించిపోయిన తరుణంలో ఈ నిషేధం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటన్నది ఒక ప్రశ్న. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ తో పోల్చినప్పుడు ఉన్నంతలో తెలంగాణలో నాటక ప్రదర్శనలు కాస్త జరుగుతున్నాయి. మరి ఆ రాష్ట్రంలో ఈ నాటకాన్ని నిషేధించేందుకు ఏవన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నది రెండో ప్రశ్న. రెండో ప్రశ్నని ఆర్య వైశ్య సంఘాల వారికి విడిచిపెట్టి, మొదటి ప్రశ్న గురించి మాట్లాడుకుంటే ఈ నాటకాన్ని నిషేధించడం వల్ల ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. కేవలం నాటకాలు, సినిమాలే కాదు టీవీ, ఓటీటీ మీడియం లోనూ విపరీతంగా 'కంటెంట్' ఉత్పత్తి అవుతూ, అందులో హాస్యం కోసం సదరు ఉత్పత్తి దారులు నానా పాట్లూ పడుతున్న నేపథ్యంలో, కంటెంట్ క్రియేటర్ల మీద ఈ నిషేధం తాలూకు ప్రభావం ఉండొచ్చు. మనోభావాల జోలికి వెళ్లకూడదన్న మెసేజీ వారికి అందవచ్చు. ఒకవేళ వాళ్ళు పెడ చెవిన పెట్టినా, తమని టార్గెట్ చేస్తే ఎలా స్పందించాలో అన్ని వర్గాలకీ ఓ స్పష్టత తప్పక వస్తుంది. మూల రచనలో వేలు పెట్టకుండా ఉన్నదున్నట్టు ప్రదర్శించి ఉంటే 'చింతామణి' నాటకానికి ఈ ముగింపు ఉండేది కాదు కదా..

మంగళవారం, ఫిబ్రవరి 02, 2021

కలికి చిలకల కొలికి ...

చిన్నప్పుడు నాకు ఇంట్లోనూ, బడిలోనూ కూడా నేర్పించిన పాట 'కలవారి కోడలు కలికి కామాక్షి.. కడుగుచున్నది పప్పు కడవలో పోసి.. అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న.. కాళ్లకు నీళ్లిచ్చి కన్నీళ్లు నింపె..' ఒక ద్విపదలా సాగిపోతుంది. కన్నీళ్లు పెట్టుకున్న చెల్లెలిని పుట్టింటికి ప్రయాణం చేస్తాడు పెద్దన్న. కలవారి కోడలు ఇల్లు కదలడం అంటే మాటలా? ఎందరి అనుమతి కావాలో కదా. 'కుర్చీ పీట మీద కూర్చున్న అత్తా.. మా అన్నలొచ్చారు మమ్మంపుతారా?' అని అత్తగారిని అడిగితే, 'నేనెరుగ నేనెరుగ మీ మామనడుగు' అనేస్తుంది అత్తగారు. వరసగా మామ, బావ, తోడికోడలు అయ్యాక చివర్లో భర్త అనుమతి కోరి, అతగాడు 'పెట్టుకో సొమ్ములు, కట్టుకో చీర.. పోయిరా సుఖముగా పుట్టింటికిని' అనడంతో పాట ముగుస్తుంది. 

చెవికింపుగా ఉండడం వల్లనో ఏమో కానీ చాలా త్వరగా నేర్చేసుకున్నానీ పాటని. అది మొదలు, ఎవరు పాడమన్నా ఈ పాటే అందుకునే వాడిని. తాతయ్య చేయించే విద్యా ప్రదర్శనల్లో అయితే ఈ పాటకి వన్స్ మోర్లు పడేవి. కాలక్రమంలో పాట జ్ఞాపకాల మరుగున పడిపోతూ ఉండగా, నాగేశ్వర రావు, రోహిణి హట్టంగడి, మీనా ప్రధాన పాత్రలుగా క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమాని మొదటిసారి చూస్తున్నప్పుడు వేటూరి రాసిన  'కలికి చిలకల కొలికి మాకు మేనత్త..' పాట మొదలవ్వగానే చిన్ననాటి 'కలవారి కోడలు' గుర్తొచ్చేసింది. కలవారి కోడలు తనకోసం అనుమతులు అడిగితే, సీతారామయ్య గారి మనవరాలు సీతేమో మేనత్తని పుట్టింటికి తీసుకెళ్లడం కోసం ఆమె అత్తమామలనీ, భర్తనీ అనుమతి కోరుతుంది, ఒక్కొక్కరినీ ఒక్కో చరణంలో.


"కలికి చిలకల కొలికి మాకు మేనత్త.. 
కలవారి కోడలు కనకమాలక్ష్మి.. 
అత్తమామల కొలుచు అందాల అతివ.. 
పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి.." 

అంటూ తన అత్తని గురించి చెప్పి... 

"మేనాలు తేలేని మేనకోడల్ని.. 
అడగ-వచ్చా మిమ్ము ఆడకూతుర్ని.. 
వాల్మీకినే మించు వరస తాతయ్య.. 
మా ఇంటికంపించవయ్య మావయ్య.." 

అంటూ తన అత్త మావగారి అనుమతి కోరింది మొదటగా. నిజానికి మేనా తెచ్చే స్థోమత ఉన్న పిల్లే, అంబాసిడర్ కారు తెస్తుంది కూడాను. ఆడపిల్ల అత్తవారితో మాట్లాడేప్పుడు పిల్ల తరఫువారు తమని తాము కొంత తగ్గించుకోవడం అనే సంప్రదాయం ఒకటి ఉండేది పాతరోజుల్లో. ఆ కారణానికి మాడెస్టీ చూపించి ఉంటుంది. 'వాల్మీకినే మించు వరస తాతయ్య' అనడం అతిశయోక్తే కానీ తప్పదు. ఆ తాతయ్యకి, తన తాతయ్యకి వచ్చిన మాట పట్టింపు కారణంగానే మేనత్తకి ఏళ్ళ తరబడి పుట్టింటి మొహం చూసే వీలు లేకపోయింది. రెండు కుటుంబాల మధ్యా సహృద్భావం కలుషితమయ్యింది. ఆ పెద్దాయన్ని మంచి చేసుకోవాలి కదా ముందుగా.  ఆయన తర్వాత, ఆయన భార్య అనుమతి.. అంటే మేనత్త గారి అత్తగారు, ఆమె దగ్గరికి వెళ్లి: 

"ఆ చేయి ఈ చేయి అద్దగోడలికి.. 
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి.. 
నేటి అత్తమ్మా నాటి కోడలివే.. 
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి.."

..అంటూ చురక పెడుతుంది. ఇక్కడ 'అద్దగోడలు' గురించి చెప్పుకోవాలి. కట్టె పొయ్యిల మీద వంటలు చేసుకునే పూర్వపు రోజుల్లో పొయ్యిలకి పక్కనే కుడి చేతి వైపున మరీ ఎత్తైనది కాని గోడ ఒకటి ఉండేది. బయటి నుంచి చూసేవాళ్ళకి పొయ్యి మీది వంట కనిపించదు, అదే సమయంలో వంటింటికి గాలాడుతుంది. పైగా, వంటకి ఉపయోగించే గరిటల్లాంటివి అందుబాటులో పెట్టుకోడానికి వీలుగా ఉండే గోడ అది. తరచూ వాడుతూ ఉండడం వల్ల ఆ 'అద్దగోడ' కి రాపిడి ఎక్కువ. అత్తింట్లో పెద్దకోడలి పరిస్థితి కూడా అలాంటిదే, గుట్టుగా సమర్ధించుకు రావాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. "ఇప్పుడంటే నువ్వు అత్తగారివి అయ్యావు కానీ, ఒకప్పుడు నువ్వూ కోడలివే, గుర్తు చేసుకో" అని వినయం తగ్గకుండానే జ్ఞాపకం చేసింది. (కొందరు పండితులకి ఈ అద్దగోడలు గురించి తెలియకే కాబోలు, ఈ పాట పాడినందుకు చిత్రకి 'నంది' అవార్డు రావడాన్ని తప్పు పట్టారు, 'అత్తాకోడలు అనడం రాక అద్దగోడలు అని పలికింది, అయినా బహుమతీ ఇచ్చేశారూ' అని). అంతటితో ఆగకుండా: 

"తలలోని నాలికై తల్లిగా చూసే.. 
పూలల్లో దారమై పూజలే చేసే.. 
నీ కంటిపాపలా కాపురం చేసే.. 
మా చంటిపాపను మన్నించి పంపు.."  

అంటూ తన మేనత్త గుణగణాలు వర్ణించింది. 'నీ పెద్ద కోడలు నీకు తలలో నాలికలా మసలుకుంటూ ఎన్నో బాధ్యతలు మోస్తున్నా, మాకు (పుట్టింటి వాళ్లకి) మాత్రం ఆమె చంటిపాపే..కాబట్టి ఆమెని పుట్టింటికి పంపించు' అని అడిగింది.  సినిమా కథలో బావగారు, తోడికోడలు లేకపోవడం వల్ల కాబోలు, నేరుగా మావయ్య దగ్గరికే వెళ్ళింది, తదుపరి అనుమతి కోసం: 

"మసకబడితే నీకు మల్లెపూదండ.. 
తెలవారితే నీకు తేనె నీరెండ.. 
ఏడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు.. 
ఏడు జన్మల పంట మా అత్త చాలు..
పుట్టగానే పూవు పరిమళిస్తుంది.. 
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది..
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ.. 
సయ్యోధ్యనేలేటి సాకేతరామా.."  

..ఇంత లాలనగా అడిగితే కాదంటారా? వాళ్లంతా కూడా తోడొచ్చి మరీ పుట్టింటికి తీసుకొచ్చారు అమ్మాయి మేనత్తని. తొలి చరణంలో 'వాల్మీకినే మించు వరస తాతయ్య' అని తాతయ్యని, చివరి చరణంలో 'సయ్యోధ్యనేలేటి సాకేతరామా..' అని ఆయన కొడుకునీ సంబోధించడం ద్వారా రాముడిని వాల్మీకికి కొడుకుని చేసేసిన చమత్కారి వేటూరి. "కలవారి కోడలు కలికి కామాక్షి పాట స్ఫూర్తితోనే కలికి చిలకల కొలికి పాట పుట్టింద"ని చాలా సందర్భాల్లో చెప్పారు వేటూరి. 'అమెరికాలో పుట్టి పెరిగిన సీత పాత్రకి ఇన్నిన్ని సంప్రదాయాలు, మర్యాదలూ ఎలా తెలుసునబ్బా?' అన్న ప్రశ్నని పక్కనపెట్టి వింటే పదికాలాలు గుర్తుండిపోయే పాట ఇది. సహజమైన చిత్రీకరణ చూడడానికి హాయిగా అనిపిస్తుంది. ఈ పాటకి స్వరరచన కీరవాణి. చిత్ర ఈ పాట పాడిన విధానాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక్కో చరణంలో అవతలి బంధువుకి తగ్గట్టు ఒక్కో మాడ్యులేషన్ వినిపిస్తుంది ఆమె గొంతులో. ఇది గమనించినప్పుడు ఆమెకి అవార్డు రావడాన్ని గురించి ఎలాంటి సందేహాలూ కలగవు.