శనివారం, నవంబర్ 21, 2020

మిడిల్ క్లాస్ మెలొడీస్

మలయాళంలో వస్తున్న నేటివిటీ సినిమాలు చూసి ఆహా ఓహో అనుకోడమే కాదు, మనవాళ్ళు అలాంటి ప్రయత్నం చేసినప్పుడు చూడాలి కూడా అనే స్ఫురణ కలిగి చూసిన సినిమా  'మిడిల్ క్లాస్ మెలొడీస్.'  భవ్య క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకి కొత్తదర్శకుడు వినోద్ అనంతోజు దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లు. కథ మొత్తం గుంటూరు (టౌన్/సిటీ), చుట్టుపక్కల ఊళ్లలో జరగడం ఈ సినిమా ప్రత్యేకత. పైగా, హీరో రాఘవకి గుంటూరులో ఓ హోటల్ పెట్టి తను బ్రహ్మాండంగా చేస్తానని అనుకుంటున్న 'బొంబాయి చెట్నీ' (శనగపిండి ఉడకపెట్టి చేస్తారు, గోదావరి జిల్లాల్లో 'చింతామణి చట్నీ' అనేవారు - సుబ్బిశెట్టి గారి 'చింతామణి' కాదు) రుచిని అక్కడివాళ్ళకి చూపించి వాళ్ళ మెప్పు పొందాలన్నది ఆశయం.

తల్లిదండ్రులు (థియేటర్ నటులు సురభి ప్రభావతి, గోపరాజు రమణ) హోటల్ వ్యాపారంలోనే ఉన్నారు కానీ, గుంటూరుకి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూరిలో.  అలా చిన్నప్పటినుంచీ హోటల్ అనేది రాఘవ జీవితంలో ఓ భాగం. పైగా గుంటూరు కొత్తేమీ కాదు. మామ వరసయ్యే నాగేశ్వరరావు ఉండేది అక్కడే. ఆ మావయ్య కూతురు సంధ్య ఇంటర్మీడియట్ నుంచీ రాఘవని మూగగానూ, మాటల్లోనూ ఆరాధిస్తూ ఉంటుంది కూడా. మామయ్యకి షాపు ఉంది కానీ, అతగాడు 'తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే' అని నమ్మిన మనిషి. రాఘవకేమో తండ్రి సాధింపు, పాతికేళ్ళొచ్చేసినా ఇంకా ప్రయోజకుడవ్వలేదని. అక్కడ ఇంటర్లో క్లాస్మేట్ సంధ్యేమో ఇంకా ఇంజినీరింగ్ చదువుతూ.... ఉంటుంది (ఆమెది బాగా కష్టమైన బ్రాంచో, హీరో ఆలీసెంగా బళ్ళో చేరేడో తెలీదు మరి). 

రాఘవ నానా రకాల కష్టాలూ పడి తండ్రి తిట్లు, తల్లి దీవెనల నేపథ్యంలో మావయ్య షాపులోనే 'రాఘవ టిఫిన్ సెంటర్' మొదలు పెడతాడు.  అదిమొదలు, అప్పటివరకూ చక్కగా పక్కింటి కుర్రాడిలా ఉన్నవాడు కాస్తా వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండకి తమ్ముడనీ, ఆ విజయ్ కి 'అర్జున్ రెడ్డి' అనే బలమైన ఇమేజి ఉందనీ దర్శకుడికి ఉన్నట్టుండి జ్ఞాపకం వచ్చిందేమో అని సినిమా చూసే ప్రేక్షకులకి  అనుమానం వచ్చేసేలా మన రాఘవ చీటికీ మాటికీ అందరితోనూ గొడవలు పెట్టేసుకుంటూ ఉంటాడు. తన హోటల్ కి కష్టమర్లు బొత్తిగా రారు. అప్పుడు హీరోయినొచ్చి, ప్రేక్షకులందరి తరపునా వకాల్తా పుచ్చుకున్నట్టుగా, "నువ్వు చేసే బొంబాయి చెట్నీ అంత గొప్పగా ఏమీ ఉండదు. దాన్నే నమ్ముకుంటే కష్టం. కాస్త నేలమీదకి దిగు" అని చెప్పి వెళ్తుంది. 

హోటల్ వ్యాపారంతో పాటు, రియలెస్టేటు, రాజకీయాలు, కాంట్రాక్టులు, చిట్ ఫండ్లు, జాతకాలు, సోషల్ రెస్పాన్సిబిలిటీ.. ఇలా అనేక విషయాలని కథలో భాగం చేసే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు. గుంటూర్లో హోటల్ పెట్టాలని కలలు కనే హీరో, తన ఊళ్ళో హోటల్ కి వచ్చిన కష్టమర్లని తక్కువ చేసి మాట్లాడ్డం ఏవిటో అర్ధం కాదు.  కష్టమర్లని  అవమానించి ఏ వ్యాపారస్తుడూ మనజాలడు కదా. సదరు గ్రామస్తులు కూడా, ఓ కాకా హోటల్ వాడు మనల్ని ఇన్నేసి మాటలు అనడం ఏమిటన్న ధ్యాస లేకుండా అతగాడు హీరో, మనం జూనియర్ ఆర్టిస్టులం అన్నట్టుగా ఊరుకుండి పోతారు. హీరో తండ్రిదీ పెద్దనోరే కానీ అతనెప్పుడూ కష్టమర్ల మీద అరిచినట్టుగా చూపించలేదు. అగ్రెసివ్ తండ్రి పాత్రని గోపరాజు రమణ బాగా చేశాడు. మన తెలుగు సినిమా హీరోహీరోయిన్లకి ఓ 'తెలుగు తండ్రి' దొరికినట్టే. 

రాఘవ ఫ్రెండ్ గోపాల్ (చైతన్య గరికిపాటి) కేరక్టర్ డిజైన్ బాగుంది. హీరో లవ్ ట్రాక్ కన్నా ఇతని లవ్ ట్రాకే ఆసక్తికరంగా అనిపించింది. ఈ కుర్రాడు, ఇతనికి జతగా నటించిన అమ్మాయి (దివ్య శ్రీపాద) చాలా సహజంగా చేశారు. పౌరాణిక, జానపద నాయికగా రంగస్థలాన్ని ఏలిన సురభి జమునా రాయలుని సినిమాలో చూడడం భలేగా అనిపించింది. ఓపెనింగ్ సీన్ లో కుర్చీతో మేడెక్కే బామ్మగా కనిపించిందీమె. హీరో తల్లిగా వేసిన సురభి ప్రభావతి కేఆర్ విజయని జ్ఞాపకం చేసింది. డిఫరెంట్ సినిమా తీద్దామని మొదలెట్టిన దర్శకుడు మధ్యమధ్యలో రొటీన్ తెలుగు సినిమా ఫార్ములాలోకి జారిపోతూ, పడుతూ లేస్తూ తాపత్రయ పడడం స్పష్టంగా తెలుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో డ్యూయెట్లు, 'ప్రత్యేక' గీతాలు, ఫైట్లని ఇరికించక పోవడం పెద్ద రిలీఫ్. 

కొన్ని సీన్లు అవసరానికి మించి సా..గడం, మరికొన్ని అర్ధాంతరంగా ఆగిపోయినట్టు అనిపించడం ఎడిటర్ జాగ్రత్తపడవలసినవి. పాటలు, నేపధ్య సంగీతం బాగున్నాయి. గుంటూరుని పూర్తి స్థాయిలో తెరమీద చూపించలేదన్న లోటుని క్లైమాక్స్ తీర్చేస్తుంది. ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించిన 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లైమాక్స్ లో ప్రత్యేక ఆకర్షణ. ఇతగాడు ప్రయాణించే కారూ, ఆటో గుంటూరులో ముఖ్య ప్రాంతాలని చుట్టేశాయి.  'రొటీన్ సినిమా'  చట్రాన్ని పూర్తిగా బద్దలుకొట్టగలిగి ఉంటే మరింత మంచి సినిమా అయ్యే అవకాశం ఉన్న ఈ 'మిడిల్ క్లాస్ మెలొడీస్' ని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.

8 కామెంట్‌లు:

  1. సినిమా బాగానే ఉందండి. down to earth కథ మూలాన మరీ నచ్చింది 👌. హీరోతో సహా బవిరిగడ్డాలతో దర్శనమిచ్చే నటులు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాను (what a relief).

    మీరు ఎత్తిచూపించిన వాటితో బాటు నాకు కూడా ఒక పంటికింద రాయి వచ్చిందండి. అదే ఆ హీరో పాత్ర నటుడు. నటన గురించి కాదు గానీ అతని యాస గురించి. ఫక్తు కోస్తాంధ్రా ఊళ్ళు గుంటూరులోను, పక్కనున్న పల్లెటూరులోనూ జరిగే కథలో తెలంగాణా యాసతో మాట్లాడే నటుడేమిటండీ? ఎలాగూ కనీసం సినిమా కోసం అయినా కోస్తా ఉచ్చారణ నేర్చుకోరు. ఇక ఇది చిన్న బడ్జెట్ సినిమా అతడి లాంటి వారే దొరుకుతారు మరి అనుకుంటే ... కనీసం డబ్బింగ్ పెట్టెయ్యవలసింది. అసలు కోస్తా ఉచ్చారణతో మాట్లాడగలిగే నటుడినే తీసుకోవడం ఉత్తమమైన పని (నాకు వెంటనే తడుతున్న పేరు సత్యదేవ్). కళామతల్లికి సేవ చెయ్యడానికి ఇటువంటి సరిహద్దులు లేవు వగైరా పలుకులు ఉపన్యాసాల వరకే బాగుంటాయి. ఇటువంటి సినిమాలో అటువంటి ఉచ్చారణ గలిగిన
    నటులు out of place అనిపిస్తారు ("మహానటి" సినిమాలో విజయ్ దేవరకొండ విషయంలో కూడా నాది ఇదే వాదన).

    మీరన్నట్లు ఈ సినిమాలో ఉత్తమమైన నటన కొండలరావు పాత్రధారి గోపరాజు రమణదే అని నా అభిప్రాయం కూడా. తర్వాత మొదటి హీరోయిన్ వర్ష బొల్లమ్మ. చక్కటి హావభావాలు. అంత చక్కగానూ నటించినది రెండో హీరోయిన్ .. తెలుగమ్మాయి .. దివ్య శ్రీపాద. పాలుపోసే ఆసామీ నటన, హీరోయిన్ వర్ష తండ్రి నాగేశ్వరరావు పాత్రధారి నటన కూడా బాగుంది - అసలు ఆ మాటకొస్తే కారక్టర్ నటులందరూ కూడా చాలా ఈజ్ తో (ease) నటించారు అనిపించింది. ఈ నటులు తెలుగు సినిమాల్లో ఎక్కువ కనిపించరేమిటో 🤔? అవకాశాలు దొరకడం లేదా 🤔?

    మొత్తానికి మంచి సినిమా చూశామనే తృప్తిని కలిగించింది. సినిమా వాళ్ళ ఊతపదం వాడాలంటే "డిఫరెంట్" గానూ, "వెరైటీ" గానూ ఉంది 🙂.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎప్పటి లాగే విలన్/కమేడియన్ మాత్రమే తెలంగాణా (లేదా సీమ) యాసలో మాట్లాడుండుంటే బాగుండేదేమో!

      తొలగించండి
    2. @విన్నకోట నరసింహారావు: నేను నటవారసుల నుంచి ఏమీ ఎక్స్ పెక్ట్ చేయకూడదని నిశ్చయం చేసుకున్నానండీ..  అతని చేత కావాలనే అలా సంభాషణలు పలికించారేమో అనిపించింది (వాళ్ళ అన్నని గుర్తు చేయడానికి).. వంశం డైలాగులు ఇరికించలేరు కదా.. సపోర్టింగ్ కాస్ట్ లో చాలామంది థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళేనండీ.. మన నాటికలు. నాటకాల స్థాయి పెద్దగా పెరక్కపోయినా ఇప్పటికీ మన రంగస్థలం మంచి నటుల్ని తయారు చేస్తోందని మరోమారు ప్రూవ్ అయ్యింది. బ్రేక్ వచ్చినా అవకాశాలు రావడంలేదెందుకో.. 'కేరాఫ్ కంచరపాలెం' లో చేసిన చాలామంది మళ్ళీ కనిపించలేదు. ఒకరిద్దరు  మాత్రం అడపాదడదపా చిన్న వేషాల్లో కనిపిస్తున్నారు.  'ఎందుకు?' అన్నది కోటి రూపాయల ప్రశ్న!! ..ధన్యవాదాలండీ. 
      @జై గొట్టిముక్కల: సాధారణంగా తెలుగు సినిమాల్లో స్థల కాలాదులు ఉండవండీ.. ఈ సినిమాలో మాత్రం 'గుంటూరు' అని స్థలం స్పష్టంగా చెప్పడం, మిగిలిన పాత్రలన్నీ ఆ ప్రాంతపు మాండలీకం పలకడంతో సహజంగానే హీరోనుంచీ ఆశిస్తున్నారు. ఇక మీరన్న విలన్/కమెడియన్ తెలంగాణ/సీమ రోజులు దాదాపుగా పోయినట్టే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక మన దర్శకులు హీరోల చేత ఆ మాండలీకం పలికిస్తున్నారు. సీమ విషయంలోనూ మునుపటి దూకుడు తగ్గింది కానీ, పూర్తిగా కాదు. కలెక్షన్లలో మరికాస్త తేడా వస్తే పూర్తిగా తగ్గుతుందనుకోండి.. ధన్యవాదాలు 

      తొలగించండి
    3. మురళి గారూ,

      భారత సినిమాలో నేటివిటీ తక్కువ, తెలుగులో ఇంకా మరీనూ. అసలు ఇది ముఖ్యమని కూడా ఎవరు అనుకుంటున్నారో తెలియదు.

      సైరా నరసింహా రెడ్డి సినిమాలో "తమిళ ప్రతినిధి" తోటి కష్టపడి (నిజమయిన తమిళులు ఎవరూ వాడని స్టీరియోటిపికల్) హెవీ యాక్సెంట్ చెప్పించ నమ్మబలికారు తప్ప మెగాస్టార్ కనీస ప్రయత్నం చేయలేదు. అంతెందుకు నాగార్జున రాజన్న సినిమాలో "తేట తెలుగు జాణ, కోటి రతనాల వీణ" అంటూ వక్రభాష్యాలు పోయారు.

      కంచరపాలెం (నేను చూడలేదు) విశాఖ భాషలో తీసారా? ఈ ప్రశ్నకు జవాబు "కాదు" అయితే, ఇందు గురించి ఎవరూ అభ్యంతరపెట్టినట్టు లేదు.

      Perhaps the point is about Guntur, not nativity?

      తొలగించండి
    4. సినిమాలో నేటివిటీ కనిపిస్తే దాన్నో గొప్ప విషయంగా చెప్పుకుంటున్నామంటేనే తెలుస్తోంది కదండీ పరిస్థితి. మీరుదహరించిన రెండు సినిమాలూ నేను చూడలేదు. 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాలో కథా స్థలం కంచరపాలెమే. ఆ ప్రాంతపు నటులతో (తారలు కాదు) అక్కడి భాష మాట్లాడిస్తూ తీసిన సినిమా. ఈ 'మిడిల్ క్లాస్ మెలొడీస్' ని గుంటూరు కథ అని చెప్పారు. హీరో మినహా, మిగిలిన అందరూ గుంటూరు మాండలీకం మాట్లాడారు.. 

      తొలగించండి
    5. Thanks for the clarification Sir.

      నేను సినిమాలు తక్కువ చూస్తాను. నేటివిటీ బొత్తిగా ఉండదనేది కూడా ఒక కారణం. జార్జి రెడ్డి చూడాలని ఉబలాటంగా ఉన్నప్పటికీ మరీ కృత్రిమంగా ఉందన్న టాక్ వచ్చేసరికి మానేసా.

      మీ సమాచారం పిదప కంచరపాలెం సినిమా మస్ట్ వాచ్ లిస్టులో చేర్చేసా, తప్పక చూస్తాను.

      తొలగించండి

  2. సినిమా వెరైటీ డిఫరెంట్ గా వుందంటున్నారు :)
    కొంపదీసి ఇది కూడా మళయాళం‌లో నుండి దిగుబడియా :)



    జిలేబి

    రిప్లయితొలగించండి