వైవిధ్యభరితమైన కథల్ని అందించే తెలుగు రచయిత సురేష్ పిళ్లె నుంచి వచ్చిన రెండో కథా
సంకలనం 'రాతి తయారీ'. తొలి సంకలనం 'పూర్ణమూ నిరంతరమూ' లో లాగే ఇందులోనూ పందొమ్మిది
కథలున్నాయి. ఇవన్నీ గడిచిన పాతికేళ్లలో వివిధ పత్రికల్లో అచ్చయినవి, బహుమతులు
గెల్చుకున్నవీను. ఎక్కువగా సమకాలీన అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకున్నప్పటికీ, ఈ
కథలన్నీ ఇవాళ్టి సమాజానికి రిలవెంట్ అనిపిస్తాయి. తద్వారా, గత పాతికేళ్లలో కొన్ని
కొన్ని విషయాల్లో పెద్దగా మార్పేమీ వచ్చెయ్యలేదని బోధ పడుతుంది, ఈ కథలు చదవడం
పూర్తి చేశాక. ఎక్కువ కథలకి 'వ్యంగ్యాన్ని' టోన్ గా ఎంచుకున్నారు రచయిత.
నిజానికిది కత్తిమీద సాము. కనీసం కొందరు పాఠకులైనా వ్యంగ్యాన్ని హాస్యంగా భ్రమ పడే
ప్రమాదం ఉంది. అయితే, ఈ సాముని బహు నేర్పుగా చేయడం ద్వారా తన పాఠకుల్ని ఆ
ప్రమాదంలోకి నెట్టలేదు రచయిత.
నక్సల్బరీ ఉద్యమం నేపధ్యంగా సాగే 'అలియాస్' కథతో
మొదలయ్యే ఈ సంకలనం ఆశావహ దృక్పథంతో సాగే 'సేవ-బాధ్యత' అనే చిన్న కథతో ముగుస్తుంది.
ప్రతి కథనీ ముగించగానే కాసేపు ఆగి ఆలోచించాల్సిందే. కవలలుగా పుట్టిన శివ
కేశవుల్లో ఒకడు అన్నల వెంట అడవుల దారి పడితే, రెండో వాడు దాని తాలూకు చేదు ఫలితాలు
అనుభవిస్తాడు. కొన్ని పరిణామాల అనంతరం, రెండో వాడు అడవి దారి పట్టేందుకు
సిద్ధమవుతాడు. మొదటివాడు సౌకర్యవంతమైన జీవితంలోకి ప్రవేశిస్తాడు. బతకడానికి అవసరమైన
లౌక్యం విలువని అన్యాపదేశంగా చెప్పే కథ ఈ 'అలియాస్.' రెండో కథ 'కుక్కా
నక్కల పెళ్లి' హాస్యంగా మొదలవుతుంది కానీ హాస్యకథ కాదు. తన క్లాసు పిల్లలు
గురుకులానికి సెలక్టయితే వాళ్ళ ప్రతిభకి గర్వపడాలో, క్లాసులో 'క్రీమ్' అంతా
వెళ్ళిపోతోన్నందుకు బాధ పడాలో తెలియని సందిగ్ధావస్థలో ఉన్న ఓ ప్రభుత్వ
ఉపాధ్యాయురాలి కథ ఇది.
సారా వ్యాపారంతో ప్రభుత్వాలాడే దోబూచులాటని 'చమించేయండి'
చిత్రిస్తే, పల్లె మూలాలున్న చాలామంది నగర జీవుల ఎవర్ గ్రీన్ కలకి అక్షర రూపం
'జిందగీ.' ఓ. హెన్రి తరహా మెరుపు ముగింపు కలిగిన కథ 'తడిచిన సోఫా'. రచయితలో ఆశావహ
దృక్పథానికి ఉదాహరణలుగా నిలిచే కథలు 'తోడు', 'థియరీ ఆఫ్ యాక్టివిటీ.' నిజానికి ఈ
ఆశావహ దృక్పథం అన్ని కథల్లోనూ కనిపిస్తుంది. సంసారాన్ని చక్కదిద్దుకునేందుకు ఏడాది
పాటు ఓపిక పట్టిన రాధ కథ 'దిద్దుబాట.' ఏడాది పెద్ద గడువే నిజానికి. హిరణ్యాక్ష
వరాన్ని గుర్తుచేసే కథ 'దొరకానుక.' దేవుడి చుట్టూ జరిగే వ్యాపారంలో ఒకానొక కోణాన్ని
చిత్రించారు 'నవ్వు మొలిచింది' కథలో. ఎంసెట్ ఒత్తిడికి నలిగిపోయే ఓ కుర్రాడి జీవితం
'నాన్నకి ప్రేమతో' కథలో కనిపించి భయపెడుతుంది.
అడపాదడపా వినవస్తున్న బదిలీలల కథ
'బదిలీ.' కథానాయిక పేరు 'అప్పలమ్మ' అని చూసి దీనిని హాస్య కథ అనుకోరాదు. రచయితకెంతో
పేరు తెచ్చిన కథ 'రాతి తయారీ.' నిరంతర వార్తాస్రవంతులని ఇతివృత్తంగా చేసుకుని
సూటిగా, నిస్పక్షపాతంగా రాసిన తెలుగు కథల్లో బహుశా ఇదే మొదటిది. తర్వాత కూడా వేళ్ళమీద
లెక్కపెట్టే అన్ని కథలు మాత్రమే వచ్చాయి. 'రిరంస' అనే సంస్కృత పదానికి అర్ధం
వెతుక్కోనక్కర్లేదు, ఇదే పేరుతో ఉన్న కథ చదివితే. కథతో సాఫ్ట్వేర్ దంపతులు మరీ ఏటా
ఉద్యోగాలు మానేయడాన్ని చిత్రించారు కానీ, లాంగ్ లీవ్ ఆప్షన్లు కూడా ఉంటాయనుకుంటా.
పల్లెటూరి బడిచదువులు ఇతివృత్తంగా ఓ ఉపాధ్యాయురాలి దృష్టికోణం నుంచి వచ్చిన కథ
'లచ్చిమి.' గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసపు లేమి ఎక్కడ
నుంచి మొదలవుతుందో చాలా చక్కగా పట్టుకున్నారు రచయిత.
'కర్మ ఈజ్ బూమరాంగ్' అంటూ
ఉంటారు కదా. ఈ మాటని ఓ కథలో బంధిస్తే ఆది 'వేరు పాత్రలు ఒకటే కథ.' ఈ కథని చెప్పిన
విధానం మాత్రం దామల్ చెరువు అయ్యోరు మధురాంతకం రాజారాం కథన శైలిని గుర్తు చేసింది.
అలాగే 'శివమ్' కథని పూర్తి చేశాక నాటక, సినీ, కథా రచయిత గంధం నాగరాజు కథ
'జీవితానికో పుష్కరం' గుర్తొచ్చింది. సురేష్ పిళ్లె కథల్లో రొమాంటిక్ సన్నివేశాలు
వచ్చిన ప్రతిసారీ యండమూరి నవలలు గుర్తుకొచ్చాయి. వాటి ప్రభావం రచయిత మీద ఉందో,
పాఠకుడి (నేనే) మీద ఉందో మరి. కాంట్రాక్టర్లు-ఇంజినీర్లు-రాజకీయ నాయకుల మధ్య ఉండే
ఇనుప త్రికోణాన్ని నేర్పుగా పాఠకుల ముందుంచిన కథ 'సెవెంత్ ఫ్లోర్.' ఈ కథ మూడేళ్ళ
క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింప బడిందని చూసి సంభ్రమాశ్చర్యాలకు
లోనయ్యాను.
పుస్తకం చివర్లో ఉన్న రెండు అనుబంధ వ్యాసాలూ 'రాతి తయారీ' కథకి
సంబంధించినవే. మొదటిది జాన్సన్ చోరగుడి రాసిన సమీక్ష వ్యాసం కాగా, రెండోది కథా
నేపధ్యాన్ని గురించి ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో రచయిత సురేష్ పిళ్లె చేసిన ప్రసంగ
పాఠం. 'రాతి తయారీ' కథని మొదటగా బహుమతికి తిరస్కరించిన పత్రికని మనం అభినందించకుండా
ఉండలేం. ఈ రెండు సంకలనాలతో ఆగిపోకుండా సురేష్ పిళ్లె మరిన్ని కథలు రాయాలని
కోరుకుంటున్నా. తన నవల 'సుపుత్రికా ప్రాప్తిరస్తు' చదవాల్సి ఉంది. ('రాతి తయారీ'
కథా సంకలనం, ఆదర్శిని మీడియా ప్రచురణలు, పేజీలు 176, వెల రూ. 200. ప్రముఖ పుస్తకాల
షాపులతో పాటు అమెజాన్ ద్వారానూ లభిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి