తెలుగు దర్శకురాలు సుధ కొంగర తమిళంలో తీసిన 'సూరారై పోట్రు' సినిమాకి తెలుగు డబ్బింగ్ 'ఆకాశం నీ హద్దురా.' ఎయిర్ డెక్కన్ పేరుతో చౌక విమానయానాన్ని భారతీయులకి పరిచయం చేసిన కెప్టెన్ గోపీనాథ్ ఆత్మకథ 'సింప్లి ఫ్లై' లో కొన్ని భాగాలు తీసుకుని, వాటికి సినిమాకి అవసరమైన మరికొన్ని దినుసుల్ని చేర్చి వండిన కథలో - కన్నడనాట పుట్టిన గోపీనాథ్ ని మదురై తమిళుడిగా ఒరిజినల్ లోనూ, గుంటూరు జిల్లా చుండూరు వాసి చంద్ర మహేష్ గా తెలుగులోనూ చూపించారు. చిన్నప్పటినుంచీ విమానాలని ప్రేమించిన మహా (చంద్ర మహేష్ గా తమిళ నటుడు సూర్య)కి సామాన్య ప్రజలకి విమానయానాన్ని అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం.
స్కూలు మేష్టారు, గాంధేయ వాదీ అయిన తండ్రి ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి ఊరికి కరెంటు తెప్పించడమే కాక, ఎక్స్ప్రెస్ రైలు స్థానిక స్టేషనులో ఆగేలా కృషి చేస్తాడు. అయితే రైలుకి హాల్టుని యువకుడైన మహా సాధిస్తాడు. దానితో అతనిలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. నేవీలో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాక, చౌక విమాన సర్వీసుల వ్యాపారం కోసం ఉద్యోగం వదిలిపెట్టి ఊరికి తిరిగి వచ్చేస్తాడు. బేకరీ వ్యాపారం చేసి తానేమిటో నిరూపించుకోవాలని తపన పడే బేబీగా పిలువబడే సుందరి (మలయాళ నటి అపర్ణ బాలమురళి) మహాని ఇష్టపడి అతనికి కొన్ని కండిషన్లు పెట్టిమరీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటుంది. అక్కడి నుంచీ చౌక విమాన సర్వీసు అన్నది వాళ్ళిద్దరి కలా అవుతుంది. మహా ఎయిర్ ఫోర్స్ మిత్రులతో పాటు, ఊళ్ళో వాళ్లంతా అతని వెనుక నిలబడతారు.
అయితే అతను తలపడాల్సింది ప్రభుత్వాన్నే శాసించే కార్పొరేట్ దిగ్గజం పరేష్ గోస్వామి (పరేష్ రావల్) తో. సాక్షాత్తూ టాటా గ్రూపునే ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి రానివ్వనంత మోనోపలీని ఆ సరికే సాధించేసిన పరేష్, మహాకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తాడు. వాటన్నింటినీ అంతే సమర్ధవంతంగా ఎదుర్కొంటూ, పడుతూ లేస్తూ మహా తన లక్ష్యాన్ని చేరుకోవడం ముగింపు. అన్ని బయోపిక్స్ మాదిరిగానే ఇందులోనూ కెప్టెన్ గోపీనాథ్ జీవిత విశేషాలని చివర్లో జతచేశారు. విలన్ అడ్డంకులు సృష్టిస్తాడనీ, హీరో లక్ష్యాన్ని సాధిస్తాడనీ ప్రేక్షకులు అంచనా వేసేసుకోగలిగిన కథని చివరివరకూ ఆసక్తికరంగా చెప్పడం దర్శకురాలి విజయం. బేబీ పాత్రని పాటలకీ, సెంటిమెంటుకీ పరిమితం చేసేయకుండా చాలా బలంగా రాసుకోడాన్నే తన విజయానికి దగ్గరదారిగా చేసుకుంది దర్శకురాలు.
డిఫరెంట్ షేడ్స్ ఉన్న మహా పాత్రని అనాయాసంగా చేశాడు సూర్య. అతనికి సత్యదేవ్ చేత డబ్బింగ్ చెప్పించడం ద్వారా ఈ డబ్బింగ్ సినిమాకి తెలుగుదనం అద్దే ప్రయత్నం చేశారు. బేబీగా చేసిన అపర్ణ సూర్యతో పోటీ పడడమే కాదు, కొన్ని సన్నివేశాల్లో అతన్ని డామినేట్ చేసింది కూడా. వీళ్లిద్దరి తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నది విలన్ పరేష్ రావల్ కి. విలనిజమే అయినా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకత చూపించేందుకు కృషి చేసే నటుడు కావడంతో, ఈ సినిమాలో కార్పొరేట్ విలనీని ఎక్కడా అతి లేకుండా ప్రదర్శించగలిగాడు. హీరో తల్లిగా కనిపించిన ఊర్వశికి ఇలాంటి పాత్రలు చేయడం బహు సులువు.
ఓ అతిధి పాత్ర లాంటి ప్రత్యేక పాత్రలో కనిపించి మన మోహన్ బాబు ఆశ్చర్య పరిచాడు. తన ఈడు వాళ్ళు ఇంకా హీరో వేషాలు కొనసాగిస్తూ ఉండగా, తాను కేరక్టర్లకి షిఫ్ట్ అయిపోవడమే కాక, నిడివిని కాక పాత్రని మాత్రమే చూసి సినిమాలు అంగీకరిస్తున్నాడని మరోసారి అనిపించింది. ఎయిర్ ఫోర్స్ అధికారిగా నాలుగైదు సీన్లకే పరిమితమైన పాత్రే అయినా, కథకి కీలకం. డబ్బింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తమిళ నేటివిటీ అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. బోర్డులు, వాల్ పోస్టర్ల వరకూ తెలుగు చేసినా ఇంకా చాలా విషయాలు వదిలేశారు. అయితే, సినిమాలో కథ పాకాన పడే కొద్దీ ఈ నేటివిటీ పలుకురాయిని మర్చిపోగలుగుతాం.
కొన్ని సన్నివేశాలు - మరీ ముఖ్యంగా కాసిన్ని ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు - మరియు హీరోయిన్ పాత్ర చిత్రణ చూసినప్పుడు మణిరత్నం మార్కులా అనిపించి, ఆరాతీస్తే, దర్శకురాలు సుధ మణిరత్నం శిష్యురాలని తెలిసింది. 'గీతాంజలి' సినిమాలో ఓ బిట్టు, 'సఖి' పోస్టరూ కనిపించాయి సినిమాలో. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలకన్నా నేపధ్య సంగీతం బాగా కుదిరింది. సినిమా నిడివి రెండున్నర గంటలు. కనీసం ఓ పావుగంట ట్రిమ్ చేయచ్చు. హీరో-విలన్ ల రెండో భేటీ, ఛాలెంజులు లాంటి సినీ మసాలాలని కాస్త తగ్గించి ఉంటే బాగుండేదనిపించింది. ఇలాంటి వాటిని కాస్త సరిపెట్టుకుంటే, చూడదగిన సినిమా ఇది. ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉందీ సినిమా
రివ్యూ చాలా బావుందండీ.. బాగా రాశారు. కెప్టెన్ గోపీనాథ్ గారు కూడా మెచ్చుకున్నారీ సినిమాని.. కాస్త డ్రమటైజేషన్ తగ్గించి ఉంటే బావుండేదేమో కానీ ఇప్పటికే డాక్యుమెంటరీ అంటున్నారు అపుడు ఇక పక్కాగా అలాగే మిగిలిపోయేదేమో. మీరన్నట్లు ఓ పావుగంట నిడివి తగ్గించి ఉంటే బావుండేదండీ.
రిప్లయితొలగించండి