స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతికి ఉత్తమ అనువాదకురాలిగా కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు ప్రకటించడం, వెనువెంటనే ఆమె కథలకి కాక అనువాదానికి అవార్డు ప్రకటించడం ఏమిటన్న సాహిత్యాభిమానుల ప్రశ్నల నేపథ్యంలో చదివిన పుస్తకం 'సత్యవతి కథలు.' గత నాలుగు దశాబ్దాల కాలంలో సత్యవతి రాసిన కథల నుంచి ఆవిడే ఎంపిక చేసి, ఎడిట్ చేసిన నలభై ఐదు కథల సమాహారం. గతంలో వచ్చిన 'ఇల్లలకగానే...' 'మెలకువ' సంపుటాల్లో వచ్చిన కొన్ని కథలతో పాటు, మరికొన్ని తాజా కథలనీ చేర్చారీ సంకలనంలో. స్త్రీవాదంతో పాటు, తరాల మధ్య అంతరాలు, వృద్దాప్యపు సమస్యలనీ ఈ కథల్లో విశదంగా చర్చించారు రచయిత్రి. నిశితమైన పరిశీలన, తర్కబద్ధమైన ఆలోచన, సంయమనం నిండిన గొంతు ఈ కథల్ని మిగిలిన స్త్రీవాద కథల కన్నా ప్రత్యేకంగా నిలబెడతాయి.
కథాకాలం గడిచిన నలభై సంవత్సరాలే అయినా, కథల్లో కనిపించే కాలం దాదాపుగా గడిచిన వందేళ్లు అనొచ్చు. స్వతంత్ర పోరాటంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమం లోనూ పాల్గొన్న పాత్రలు మనకీ కథల్లో కనిపిస్తాయి. తొలినాళ్ళ కథల్లో తల్లి, తండ్రి పాత్రలు, తర్వాతి కథల్లో తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఈ పోరాటాల నేపధ్యం నుంచి వచ్చిన వాళ్ళుగా కనిపిస్తారు. 'పిల్లాడొస్తాడా' కథలో అమ్మమ్మ ఎనభై ఐదేళ్లావిడ. మనవరాలు విజయకి నలభై ఐదు. ఆమె కొడుకు, కాలేజీలో చదువుకుంటున్న వాడు, ఒక వర్షపు రాత్రి ఇంటికి రాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయడు. విజయకి ఒకటే గాభరా, పిల్లాడికి ఏదన్నా అయిందేమో అని. అమ్మమ్మ నిబ్బరంగా ఉంటుంది, "ఒక్క మంచి ఆలోచన కూడా ఎందుకు చెయ్యదు? ఎవరికైనా సాయం చేయడానికి ఆగిపోవాల్సి వచ్చిందేమో అని ఎందుకు అనుకోదు?" అని మనవరాలి గురించి ఆశ్చర్యపడుతుంది. కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన భర్త చెప్పాపెట్టకుండా పదేసి రోజుల పాటు ఇంటికి రాకపోవడం ఆవిడ అనుభవం. టీవీ సీరియళ్ళలో కనిపించే హింస, ప్రతీకారాలు విజయ జీవితంలో భాగం.
స్త్రీవాదులు తరచూ మాట్లాడే 'మారిటల్ రేప్' ని చాలాకథల్లోనే ప్రస్తావించినా, ఈ ఇతివృత్తంతో రాసిన మొదటి కథ 'మాఘ సూర్య కాంతి' (1978). నాలుగు దశాబ్దాల కాలంలో మధ్యతరగతి విలువల్లో పెద్దగా మార్పేమీ లేదని నిరూపించే కథ. నిజానికి, మధ్య తరగతి ఆర్థిక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది, ముఖ్యంగా గడిచిన పాతికేళ్లలో. దాని ప్రభావం వ్యక్తుల మీదే కాదు, కుటుంబ బంధాల మీదా పడింది. ఈ మార్పుని నిశితంగా పట్టుకుని రాసిన కథల్లో మొదట ప్రస్తావించుకోవాల్సినది 'మంత్రనగరి.' సంప్రదాయం అనే బానిసత్వం నుంచి, డబ్బు అనే బానిసత్వంలోకి జరిగిన ప్రయాణం, ఇంతదూరం వచ్చాక కూడా మనసుని సమాధాన పరుచుకోడం కోసం ఆ సంప్రదాయంలోనే ఆలంబనని వెతుక్కోడాన్నీ (అమెరికాలో నోములూ, పూజలూ వైభవంగా చేసుకోడం) చిత్రించిన కథ ఇది. భర్త అయ్యప్ప మాలో, భవాని మాలో వేసుకుంటే భార్య మీద పడే కనిపించని ఒత్తిడిని చిత్రించిన కథ 'పతిభక్తి.' ఓ యజమానురాలు, ఆ ఇంటి పనిమనిషి, తమ భర్తల భక్తి కారణంగా పడిన ఇబ్బందుల్ని చిత్రించిన ఈ కథలో కనిపించే కాంట్రాస్ట్ రచయిత్రి పరిశీలననాశక్తి కి ఓ చిన్న మచ్చుతునక.
చాలామంది రచయితలు పెద్దగా పట్టించుకోని పేదింటి అమ్మాయిల కథల్ని అక్షరబద్ధం చేశారు సత్యవతి. పెద్దగా చదువు లేకపోయినా జీవితేచ్చ మెండుగా ఉండే అమ్మాయిలు, కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలనే వాళ్ళ తాపత్రయాలు, ఈ క్రమంలో వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు.. వీటన్నింటినీ వస్తువులుగా చేసుకుని విరివిగా కథలు రాశారీ రచయిత్రి. యజమాని నుంచి తనని తాను రక్షించుకునే అమ్మాయి కథ 'చీపురు' అయితే, తల్లి బరువుని తానూ మోసే అమ్మాయి కథ 'కాడి.' ఇంజనీరింగ్ లో ఫ్రీ సీట్ వచ్చినా చదువు మీద దృష్టి పెట్టలేని పేదింటి మెరిట్ స్టూడెంట్ కథ 'దొంగపిల్లి.' ఈ అమ్మాయిలందరూ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వాళ్ళని గురించి వాళ్ళకి చక్కని స్పష్టత ఉంటుంది. అలాగే భవిష్యత్తుని గురించి బోల్డన్ని ఆశలూ ఉంటాయి. మనచుట్టూ తారసపడే ఇలాంటి అమ్మాయిలని గమనించకుండా ఉండలేం, ఈ కథలు చదివిన తర్వాత.
సత్యవతి కథల్లో హాస్యం కన్నా వ్యంగ్యం పాళ్ళు ఎక్కువ. అది కూడా కనీకనిపించనిదేమీ కాదు, చురుక్కుమనేదే. 'గోధూళి వేళ' కథలో ప్రొఫెసర్ గారు తన ఇంట్లో ఆడవాళ్ళని ఉల్లిపాయలు తరగనివ్వడు, వాళ్ళ కళ్ళవెంట ఎక్కడ నీళ్లు వస్తాయో అని. ఆయన తనపేరుతో కన్నా, చెరువు తులశమ్మ గారి మనవడిగానే ఎక్కువమందికి తెలుసు. సదరు తులశమ్మగారి అసలు పేరు మహాలక్ష్మి. ఆవిడ తన కష్టాలు వినేవాళ్ళు లేక, రోజూ సాయంత్రం తులసికోట ముందు కూర్చుని కన్నీళ్లు కార్చేది. ఆ కన్నీళ్లు చెరువుగా మారి, ఆవిడ 'చెరువు తులశమ్మ' అయింది. పల్లెటూళ్ళో వెయ్యి గజాల కొంపా, లంకంత పెరడూ గనుక చెరువులొచ్చినా, వరదలొచ్చినా తట్టుకున్నాయి. సిటీల్లో అలాంటివి జరిగితే గదుల్లో పడవలేసుకుని తిరగాలి కదాని, మన ప్రొఫెసర్ గారు చిన్నప్పుడే ఈ ఉల్లిపాయల శపథం తీసుకున్నారట. ఇక ప్రొఫెసర్ గారి భార్య నాయనమ్మకైతే కన్నీళ్లు అశుభం. ఆవిడ భర్త పోయినప్పుడు కూడా, 'ఇప్పుడు ఏడవడం శుభమా, అశుభమా' అని ఓ క్షణం తటపటాయించి, ఏడవకపోవడం అశుభం అని ఎవరో చెప్పగా గబగబా ఏడ్చేసిందట!
నలభై ఐదు కథలు ఏకబిగిన చదవడం వల్ల కొన్ని విషయాలు అనుకోకుండా నా దృష్టికి వచ్చాయి. ఈ కథల్లో మంచి లక్షణాలున్న పెద్ద వయసు మగ పాత్ర ఉంటే, ఆ పాత్ర పేరు కచ్చితంగా 'వెంకట్రామయ్య' అయి ఉంటుంది. పేదింటి అమ్మాయి పేరు సాధారణంగా 'స్వర్ణ.' స్త్రీ పురుష సంబంధాల కన్నా, ఇద్దరు స్త్రీల మధ్య సంబంధాలు ఏ కథలో అయినా సరే ఓ మెట్టు పైనే ఉంటాయి. ఆ ఇద్దరు స్త్రీలు యజమాని-పనమ్మాయి, అత్త-కోడలు, సవతి తల్లి-కూతురు ఇలా ఎవరైనా కావొచ్చు. ఈ స్త్రీల మధ్య ఏవన్నా అభిప్రాయం భేదాలు వచ్చినా కథ పూర్తయ్యేలోగా అవి సమసి పోతాయి. అదే స్త్రీపురుషుల మధ్య ఇలా జరగదు. వెంకట్రామయ్య మినహా, మిగిలిన మగవాళ్ళతో అభద్రతో, ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ లాంటిదో ఉండి తీరుతుంది. అయితే, స్త్రీవాద సాహిత్యం పేరిట వెల్లువలా వచ్చిపడుతున్న కథల మధ్య ఈ కథలు కచ్చితంగా ప్రత్యేకమైనవి. అనువాదానికి కాక, సత్యవతి కథలకే అవార్డు రావాల్సింది అన్న మాటతో ఏకీభవిస్తాం, పుస్తకం పూర్తి చేశాక. (పేజీలు 385, వెల రూ. 270, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ, అన్ని పుస్తకాల షాపుల్లోనూ లభిస్తోంది).
ఇంకో మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు మీకు బోల్డన్ని ధన్యవాదాలు .
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ
తొలగించండి