'దిశ' సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించారు. నేరం ఎలా చేశారో నటించి చూపించమని నిందితుల్ని సంఘటన స్థలానికి తీసుకెళ్తే, అక్కడినుంచి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారని, వాళ్ళని నిలువరించేందుకు కాల్పులు జరపగా నలుగురు నిందితులూ అక్కడికక్కడే మరిణించారనీ పోలీసులు ప్రకటించారు. సందర్భం ఏదైనప్పటికీ, ఎన్ కౌంటర్ అనంతరం పోలీసులు చేసే ప్రకటనలన్నీ దాదాపు ఇలాగే ఉంటాయన్నది నిజం. అలవాటైన ఈ ప్రకటనకన్నా, ఎన్ కౌంటర్ పట్ల ప్రజలు స్పందిస్తున్న తీరు ఆలోచింపజేస్తోంది, బాగా.
జరిగిన నేరం సాధారణమైనది కాదు. నేర తీవ్రతా సామాన్యమైనది కాదు. కాబట్టి, శిక్ష కూడా అసాధారణంగా ఉండాలని సమాజంలో భిన్న వర్గాల ప్రజలు ఎలుగెత్తి చాటారు. సెలబ్రిటీలు సోషల్ మీడియాకే పరిమితమైనప్పటికీ, సామాన్య ప్రజలు రోడ్డెక్కి నినదించారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. నిందితుల్ని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్తున్న వ్యాన్ మీద ప్రజలు చేసిన రాళ్ళ దాడి, సంఘటన పట్ల జనం స్పందననీ, నిందితులకి పడాల్సిన శిక్ష పట్ల వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది. ఓ పక్క ప్రభుత్వం నుంచి సత్వర నేర విచారణ, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ప్రకటనలు వస్తుండగానే ఎన్ కౌంటర్ జరగడం గమనార్హం.
ముందుగానే చెప్పినట్టు, ఎన్ కౌంటర్ లు గతంలోనూ జరిగాయి. అప్పటికన్నా ఇప్పుడు వచ్చిన స్పష్టమైన మార్పు ప్రజల స్పందన. పోలీసు అధికారులని కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు, మహిళలు, యువతులు వాళ్లకి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లకి వెళ్లి పోలీసు అధికారులకి రాఖీలు కట్టడం వరకూ అనేక రూపాల్లో ఎన్ కౌంటర్ పట్ల హర్షాన్ని, పోలీసుల పట్ల కృతజ్ఞతని ప్రకటిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులని అభినందిస్తూ ప్రదర్శనలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం నేర విచారణకి మాత్రమే పరిమితం కావాల్సిన పోలీసులు, చట్టాన్ని చేతిలోకి తీసుకుని శిక్ష వేయడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్న మెజారిటీకి తట్టడం లేదు సరికదా, ఈ ప్రశ్నని లేవనెత్తాలనుకునే వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు.
మన వ్యవస్థలో ఒక నేరం జరిగినప్పుడు, విచారణ జరిపి నిందితుల్ని అదుపులోకి తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులది, విచారణ జరిపి శిక్ష విధించాల్సిన బాధ్యత న్యాయస్థానానిది. ఎన్ కౌంటర్ జరిగిందీ అంటే, న్యాయవస్థ చేయాల్సిన పనిని పోలీసు వ్యవస్థ తన చేతుల్లోకి తీసుకుంది అని అర్ధం. దీనిని ప్రజలంతా స్వాగతించారు. స్థూలంగా ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది జరిగిన నేరం (అత్యాచారం, హత్య) తాలూకు తీవ్రత. రెండోది, వ్యవస్థల పనితీరులో లోపాలు. మొదటి కారణాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. పెల్లుబికిన జనాగ్రహాన్ని దేశం మొత్తం చూసిన తర్వాత ఇక కొత్తగా చర్చించాల్సింది ఏదీ లేదు.
ఇక మిగిలింది రెండో కారణం. నిజానికి ఇప్పుడు చర్చ జరగాల్సింది దీనిని గురించే. సత్వర నేర విచారణ, శిక్ష విధింపు, అమలు అన్నవి జరుగుతూ ఉన్నట్టయితే ఈ చర్చకి ఆస్కారం లేకపోయేది. అనేక కారణాల వల్ల మన దేశంలో సత్వర విచారణ, సత్వర న్యాయం అన్నవి అందుబాటులోలేవు. సాక్షాత్తూ దేశ ప్రధానిని హత్య చేసిన నిందితులపై నేర నిరూపణ జరిగి, శిక్ష పడేందుకే సుదీర్ఘ కాలం పట్టిందిక్కడ. 'చట్టం ముందు అందరూ సమానులే' అని ఎంతగా చెప్పుకున్నప్పటికీ, వీవీఐపీ కేసుల విచారణకి, మామూలు కేసుల విచారణకి హస్తిమశకాంతరం భేదం ఉంటున్నది బహిరంగ రహస్యమే. ఏళ్ళ తరబడి కేసుల విచారణ జరగడం, అంచెలంచెల న్యాయ వ్యవస్థలో పై కోర్టుకు అప్పీలు చేసుకునే వీలుండడంతో అనేక కేసుల్లో నిందితులకి వాళ్ళ జీవిత కాలంలో శిక్షలు పడడం లేదు. పడినా, అమలు జరగడం లేదు.
'వందమంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు' అన్నది మన న్యాయ వ్యవస్థ నమ్మిన సూత్రం. దీనితో న్యాయ స్థానం ప్రతి నేరస్తుడికీ 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' ఇస్తుంది. పెరుగుతున్న జనాభాకి తగ్గ నిష్పత్తిలో నేరాలు జరుగుతున్నాయి. అయితే, అదే నిష్పత్తిలో న్యాయస్థానాల ఏర్పాటు జరగకపోవడం, ఇప్పుడు ఉన్న కోర్టుల్లో కూడా తగినంత సిబ్బంది లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఈ సమస్యని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల్ని ఇప్పుడు ప్రజలు అభినందిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితి రావొచ్చు. అది అనేక అరాచకాలకు దారితీయొచ్చు. అక్కడివరకూ రాకుండా ఉండాలంటే, వ్యవస్థలో లోపాలని సరిదిద్దడం తక్షణావసరం.
'దిశ' అమానుషం. నిందితులకు శిక్ష పడడం అభినందనీయం. కానీ, ఆ 'శిక్ష' నిర్ణయింపబడిన తీరు, అమలు జరిగిన తీరూ ఆమోదయోగ్యమేనా? అన్నదే ఇప్పటి ప్రశ్న.
మీతో 100% ఏకీభవిస్తున్నాను..!!
రిప్లయితొలగించండిIt appears to be premeditated. The arguments put forward by police seems unsupported. First why they were taken there. Are the accused left free so that they take sticks and snatch revolvers. As no one has an inkling of what happened, one(police) can tell any story. It is not difficult to put a gun in the hand of a dead body. Extra judicial killing should be condemned. However, there is a culture in which they happen and if it is favourable to there Lowe's, they go unpunished.
రిప్లయితొలగించండిThough the crime is heinous, the act of police raises questions. But who will listen to same voices in this frenzy?
Ippudu janalaki bhayam ledu. Neram siksha ani. Maha ante jail lo pedatharu moodu pootla thindi pedatharu.Jail lo dorakani vasthuvu ledu drugs nunchi madhyam daka anni dorukuthayi. Rich ki poor ki yevariki bhayam ledu. May be middle class people mathrame paruvu alantivi aalochisthunnaru.
రిప్లయితొలగించండిమీరు రాసిన అంశం చూసి నిజంగా నిరాశ చెందాను. ఓ అమ్మాయిని అతి కిరాతకంగా చంపిన ఘటన ని ఖండిస్తూ మీరు రాసి ఉంటే బాగుండేది. చాలా మందిలా తమ చాప కిందకి నీరు వస్తేనే ప్రతిస్పందించే వారి జాబితా లో మీరు చేరినందుకు కంట తడి చేరింది. బహుశ అత్యాచారం లాంటి అశ్లీలం నుంచి మీ బ్లాగ్ ని దూరంగా ఉంచాలనుకున్నరేమో.
రిప్లయితొలగించండిఈ కాలం అమ్మాయిల బట్టల మీద చలోక్తులు, వారికొచ్చిన కొత్త వంటింటి సదుపాయాల మీద వ్యంగ్యోక్తులు, ఈనాటి వారి శరీర బరువు మీద కూడా హాస్యోక్తులు వేసినంత సులువుగా వారి రోజువారీ యుధ్ధం, మారుతున్న కాలం మోపిన వివిధ పాత్రల భారాన్ని కూడా సమర్థవంతంగా లాగుతున్న ఈనాటి ఆడవారి సమరం ఎవ్వరికీ గుర్తు రాదు. ఎందుకంటే అమ్మని వంటింటికీ మాత్రమే ప్రేమ అనే అందమైన అల్లిక లో కట్టేసి, భార్య డబ్బు, పిల్లలు వగైరా సమయానికి సమకూర్చే ఒక యంత్రం గా మాత్రమే చూడగల్గే పురుష సమాజం మనది.
యేది యేమైనా ప్రజల ప్రతిస్పందన మన వ్యవస్థ లోని లోపాలకి, నేటి సమాజానికీ హెచ్చరిక అనక తప్పదు. వ్యవస్థ ని తిరగబడి ప్రజలు ప్రశ్నించారు, వారు కోరుకున్నది వక్రమార్గం లోనైన జరిగినందుకు అభినందించారు. కర్మ ఫలాన్ని ఈశ్వరుడు కూడా తప్పించలేడు. చట్టాన్ని ప్రజలు చేతిలోకి తీసుకుంటె ముందు కదిలేవి అవినీతి పునాదులు. అందుకైన మనం దీన్ని ఒక మంచి పరిణామం గా భావించక తప్పదు.
@రాధేశ్యామ్ రుద్రావఝల: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@శ్రీనివాస్: నిజమండీ.. ధన్యవాదాలు..
@Unknown: జైల్లో దొరికే సౌకర్యాలకి కండిషన్స్ అప్లై అండీ.. అక్కడ కూడా ఆర్ధిక స్థాయి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇక మీరన్న 'పరువు' కి అర్ధం కాలంతో పాటు మారుతూ వస్తోంది. గత ఐదారేళ్లుగా మరింత వేగంగా మారుతోంది. ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ప్రసూన: ఎన్ కౌంటర్ ని వ్యతిరేకించడం అంటే ఆ అమ్మాయికి జరిగిన దారుణాన్ని సమర్ధించడమే అని మీరు తీసేసుకున్న కంక్లూజన్ నన్నేమీ షాక్ కి గురి చేయలేదండి. అలాగే 'అశ్లీలం' గురించిన మీ వ్యాఖ్య కూడా. పోస్టు రాసినప్పుడే వీటికి సిద్ధ పడ్డాను. నా అభిప్రాయాన్ని అపార్ధాలకి తావులేని విధంగా స్పష్టంగానే చెప్పినా, ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు ఇంటర్‌ప్రిట్ చేసుకునే వీలు (అన్ని రాతలకీ ఉన్నట్టే) నా రాతలకీ ఉందని మరోమారు అనుభవమయ్యింది. పురుష సమాజాన్ని గురించి, ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే జరిగే పరిణామాల గురించీ మీ అభిప్రాయాలని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ఒక మగాడు భార్యను జూదంలో ఓడాడు. ఇంకో మగాడు ఆమె చీర గుంజాడు. మూడో మగాడు
రిప్లయితొలగించండితన మహిమలతో ఆవిడకు చీరప్రధానం చేసి "తాత్కాలిక ఉపశమనం" కలుగజేసాడు. ఇంకొందరు మగాళ్లు కలిసి సంధి మాట్లాడుకున్నారు. సంధి కాలం ముగిసి యుద్ధం మొదలయ్యాక ఇంకెవరో మగాడు ఆవిడ తరఫున "ప్రతీకారం" తీర్చాడు.
పై విషయాలపై ధర్మసందేహాలు, రాజస్వామ్య మీమాంసలు వగైరాలుగా తండోపతండ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పాచికల రహస్యం ఏమిటి? తన్నోడి నన్నోడెనా? తొడపై దెబ్బ తీయడం యుద్ధధర్మమేనా? ఎవరికి తోచింది లేదా ప్రయోజనాలకు అనుకూలమైంది వారు చెప్తూనే ఉన్నారు.
స్త్రీని పణంగా పెట్టేందుకు వాడెవ్వడు? ఫండమెంటల్ ప్రశ్న ఎవరూ అడగలేదు!
మహిళల బదులు నల్లవాళ్ళు, దళితులు, నిరుపేదలు లేదా ఇతర వర్గాలు తీసుకున్నా కథ మారలేదు. ఉ. దగ్గుబాటి చెంచురామయ్యకు "సత్వర న్యాయం" చేయాలని నిర్ణయించిన అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్న అప్పటి నక్సలైట్ నాయకత్వం.
"Sitting at the table doesn't make you a diner. You must be eating some of what's on that plate": Malcolm X
మహాభారతం లొనే చెప్పినట్లు లోకులు పలు కాకులు. ఎవరికి నచ్చినట్లు వారు అన్వయించేసుకుంటున్నారు. ఏమి ఫ్రీడమ్ ఏమి ఫ్రీడమ్!!
తొలగించండిఫ్రీడం అన్నది వేదమో మహాభారతమో ఇస్తుందాండీ?
తొలగించండిమీకు అలా ఎందుకు అనిపించింది?
తొలగించండి<<<ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితి రావొచ్చు. అది అనేక అరాచకాలకు దారితీయొచ్చు. అక్కడివరకూ రాకుండా ఉండాలంటే, వ్యవస్థలో లోపాలని సరిదిద్దడం తక్షణావసరం. <<<<
రిప్లయితొలగించండివ్యవస్థలో లోపాలున్నాయన్నది అందరికీ తెలిసినదే కాబట్టి మొన్న వీ ఆర్ వో చనిపోయినపుడు ఆడవాళ్ళెవరికీ ఇంత ఆవేశం రాలేదు. శిక్ష అమలు గురించి ప్రశ్నలు కాదండీ పరిష్కారాలు కావాలి.
అత్యాచారాల నివారణకి వర్మగారు ఒక గొప్ప సొల్యూషన్ ఇచ్చారు. నాకైతే అదే నచ్చింది.
https://youtu.be/VdxswwzItnY
ఇది సొల్యూషనా? నా కామన్ సెన్సు కేంటి హాట్ గా కనిపిస్తోంది? కొంపదీసి హాట్ సొల్యూషనా ఏంటి. మీ లింకు చూసాక URL కాపీ పేస్టులో తప్పు కొట్టానేమో అని ఒకటికి రెండు సార్లు సరిచూసుకున్నా.
తొలగించండిరోజా ఆన్న మాటలకే దడుచుకుని పారిపోయారు ఆంధ్రాజనం.
తొలగించండిపూజా అలా ఎగిరెగిరి తంతుంటే మీకు హాట్ గా కనిపించిందా ?
మీరు దేవుడు సావీ _/\_
https://youtu.be/-t3Vg-k1ddY
ఆవిడ మాట ఆవిడ చెప్పుకుంది.
తొలగించండిఈమాత్రానికే దడుసుకోవటం ఏంటో?
జరిగిన నేరం - సమాజానికి పట్టిన కనబడని కేన్సర్‌లా వుంది.
రిప్లయితొలగించండిపడిన శిక్ష - కేన్సర్‌కి విరుగుడుగా వేజలైన్ పూసినట్టుంది.
ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్
ఈ కేసులో మరణ శిక్ష ఒప్పుకోదగినదే గానీ, అమలుచేసిన విధానం స్వాగతించదగ్గది కాదు.
రిప్లయితొలగించండిచాలా సంవత్సరాలక్రితం విజయవాడలో అయేష హత్యాచారం జరిగినప్పుడు, ఒక బలహీనుడైన చిల్లరదొంగను ఇందులో ఇరికించారు.
అతనితో బలవంతంగా ఒప్పుకునేలా చేశారు. అప్పట్లో నాలాంటివాళ్ళు చాలామంది అతనిని చంపెయ్యాలి అని బలంగా కోరుకున్నారు.
కానీ చాలా సంవత్సరాల తరువాత, అతనిపాత్ర ఏమిటో అందరికీ తెలిసింది. అప్పటికే అతను జీవితంలో చాలాకోల్పోయాడు.
కోర్టు అతనికి ఒక లక్ష పరిహారం ఇచ్చింది(కేవలం ఒక లక్ష ఇవ్వడం ఏవిధంగా కరక్టో నాకు అర్ధంకాలేదు).
కానీ అప్పట్లోనే అతనిని ఎంకౌంటర్ చేసి ఉంటే ఇప్పుడు తీరిగ్గా బాధపడడం మినహా చెయ్యగలిగేది ఏమీ ఉండేది కాదు.
ఇప్పుడు జరిగిన దారుణంలో నిదితుల పాత్ర స్పష్టం గా తెలుసున్నా, మరొక కేసులో ఎవరినైనా కాపాడడానికి అమాయకుల్ని ఎంకౌంటర్ చేసే అవకాశం ఉంది. కనుక పోలీసు తీర్పు ఈ కేసు విషయంలో సంతోషం కలిగించిన మరొక కేసులో అమాయకులు బలయ్యే అవకాశం ఉంది.
దానికి బదులు రేప్ కేసులలో ఖచ్చితంగా ఇన్ని నెలలలో అంతిమ తీర్పు వచ్చేవిధంగా చట్టాలను మారిస్తే మంచిదేమో