గురువారం, డిసెంబర్ 12, 2019

గొల్లపూడి ...

నటుడు, రచయిత, పాత్రికేయుడు గొల్లపూడి మారుతి రావు ఇక లేరు. ఎనభయ్యేళ్ళ జీవితంలో తనకి కావాల్సినవన్నీ స్వయంకృషితో సాధించుకున్నారు. కష్టాలకి కుంగిపోకుండా, పొగడ్తలకి పొంగిపోకుండా జీవితం గడిపిన గొల్లపూడికి తీరకుండా మిగిలిపోయిన కోరికలు బహుకొద్ది. మొదట రచయితగానూ, ఆ తర్వాత నటుడిగానూ ఆయన పరిచయం నాకు. అయితే, ఆయనలోని రచయితే నన్నాయనకు ఏ కొద్దో దగ్గర చేసింది. గడిచిన పది-పన్నెండేళ్ల  కాలంలో జరిగిన మూడు సమావేశాల్లోనూ అనేక విషయాలు చర్చకి వచ్చినా, ఎక్కువగా మాట్లాడుకున్నది సాహిత్యాన్ని గురించే. 

గొల్లపూడిని గురించి ఆగి, ఆలోచించిన సందర్భం 'సాయంకాలమైంది' నవల చదివినప్పటిది. పదిహేనేళ్ల క్రితం ఒక రాత్రివేళ ఆ నవలని చదవడం మొదలు పెట్టి, తెల్లవారు జాముకి పూర్తి చేసి, చివరి పేజీ నుంచి మళ్ళీ మొదటి పేజీకి వచ్చి వెనువెంటనే రెండో సారి చదవడాన్ని జీవితంలో మర్చిపోలేను. అప్పుడు నేనున్న పరిస్థితుల వల్ల కావొచ్చు, నచ్చాల్సిన కన్నా ఎక్కువగా నచ్చేసిందా పుస్తకం. సమస్యల్లో ఉన్నప్పుడు పుస్తకాలని ఆలంబన చేసుకోడం నాకు కొత్త కాకపోయినప్పటికీ, ఆ పరిస్థితులు, ఆ పుస్తకం పూర్తిగా వేరు. ఆ తర్వాత నా వ్యక్తిగత  జీవితంలో వచ్చిన కొన్ని మార్పుల వెనుక కూడా ఆ పుస్తకం ప్రత్యేక పాత్ర పోషించింది, అందుకు కూడా నాకు 'సాయంకాలమైంది' ప్రత్యేకం. 

ఇంతకీ, 'సాయంకాలమైంది' నవలని కంఠతా పట్టి, చుట్టూ ఉన్న అందరిచేతా చదివిస్తున్న కాలంలో గొల్లపూడిని కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. తిరుపతిలో జరిగిన ఓ సాహిత్య సభకి ఆయన అతిధిగా వచ్చినప్పుడు, ముగ్గురు మిత్రులం హోటల్ గదిలో కలిశామాయన్ని. ఆయన, అయన భార్య శివాని (అసలు పేరు శివకామసుందరి అని జ్ఞాపకం) కూడా మేమాయన్ని ఓ సినిమా నటుడిగా కలవడానికి వచ్చామని అనుకున్నారు. మూడు నాలుగు గంటల పాటు జరిగిన మా సంభాషణలో ఒక్క సినిమా కబురూ దొర్లలేదు. అసలు 'సాయంకాలమైంది' ని దాటి మరో విషయం వైపే వెళ్ళలేదు. ఆ నవల్లో కొన్ని పాత్రలు, సన్నివేశాలు ఎలా పుట్టాయో ఆయన చెబుతుంటే నిబిడాశ్చర్యంతో విన్నాం మేం ముగ్గురం. (వాటిలో కొన్నివిషయాలు తర్వాత ఇంటర్యూలలో చెప్పారు. మరికొన్ని ప్రయివేటు సంభాషణల్లో తప్ప పంచుకునేందుకు వీల్లేనివి).  


విశాఖపట్నంలో తమ పొరిగింటాయన విదేశంలో ఉండే కూతురి ఫోన్ కోసం ఎదురు చూడడాన్ని సుభద్రాచార్యులు, రేచకుడు పాత్రల కోసం ఉపయోగించుకున్నానని, శివాని గారి మేనమామ ఆయన భార్యకి అక్షరాలు నేర్పించిన విధానాన్నే జైల్లో నవనీతం రామకోటి రాయడంగా మర్చి రాశానని చెప్పారు గొల్లపూడి. ఆ సాయంత్రం ఎక్కువ చర్చ జరిగింది మాత్రం 'ఆండాళ్ళు' పాత్రని గురించే. ఆండాళ్ళు, కూర్మయ్యని పెళ్లి చేసుకోడానికి మరికొన్ని బలమైన సన్నివేశాలు సృష్టించి ఉండాల్సింది అన్నాం మేము. శివాని గారు కూడా మాతో ఏకీభవించారు. నవల్లో అచ్చుతప్పులే కాక, కథాపరంగా కూడా కొన్ని తప్పులున్నాయని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. (అప్పుడు మేం చదివింది జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు ప్రచురణ. తర్వాత విశాలాంధ్ర ప్రచురించింది, మరిన్ని అచ్చు తప్పులతో). 

సుభద్రాచార్యుల అంతిమ సంస్కారం మొదలు జయవాణి ఉద్యోగం వరకూ వరుసగా చెప్పుకొచ్చాం మేము. అన్నీ శ్రద్ధగా విని, తన మెయిల్ ఐడీ ఇచ్చి, మేము చెప్పినవన్నీ మెయిల్ రాసి తనకి పంపితే, రీప్రింట్ లో సరిచేస్తానన్నారు. (మేము మాట నిలబెట్టుకున్నాం కానీ, ఆయన నిలబెట్టుకోలేదు). "ఎర్రసీత అని నా కొత్త నవల. సాయంకాలమైంది కన్నా బావుంటుంది. తప్పకుండా చదవండి," అని చెబుతూ మాకు వీడ్కోలిచ్చారు. రెండో మాట నన్ను బాగా పట్టుకుని, వెంటనే కొని చదివాను. నచ్చలేదు. ఆయన పెట్టిన పోలిక అంతకన్నా నచ్చలేదు. మొదటి సమావేశం జరిగిన ఐదారేళ్ళ తర్వాత రెండో సమావేశం. కొత్తగా మాట్లాడుకోడానికి ఏముంటుంది? ఆయన ఆత్మకథ 'అమ్మకడుపు చల్లగా' చదవడం మొదలు పెట్టాను కానీ పూర్తవ్వలేదు (ఇప్పటికీ పూర్తి చేయలేదు). సాహిత్యాన్ని దాటి మామూలు విషయాలు చర్చకొచ్చాయి. 

"నా పేరు మారుతి రావండీ. అందరూ కలిసి మారుతీరావు చేసేశారు" అన్నారు. సంభాషణలని 'పద్మ' అవార్డుల మీదకి తీసుకెళ్లారు ఆయనే. ఆయనకా అవార్డు మీద మనసుందని మాటల్లో అర్ధమయ్యింది. (విశాఖ రెవిన్యూ నుంచి ఆయన వివరాల ఫైలు కేంద్రానికి వెళ్లిందని రెవిన్యూ శాఖలో పనిచేసే మిత్రులొకరు చెప్పారు). కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకున్న కోపం రాతల్లో అనేకసార్లు బయట పడినా (కాలమ్స్ లో) ఆవేళ మాటల్లోనూ చెప్పారు. ఆయన అభిమానించే పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, గొల్లపూడి 'పద్మ' పురస్కారం దక్కలేదు.  మూడోసారి క్లుప్తంగా జరిగిన సమావేశంలో తన అసంతృప్తిని నేరుగా కాకపోయినా కొంచం ఘాటుగానే బయటపెట్టారు. 

పత్రికలకి, రేడియోకి, నాటకాలకి, సినిమాలకి రచనలు చేసి, అనేక సినిమాల్లో నటించి, టీవీ కార్యక్రమాల ప్రయోక్తగా వ్యవహరించి, అభిరుచి గల ప్రేక్షకుడిగా అంతర్జాతీయ సినిమాలెన్నో చూసి, విదేశీ యాత్రలు చేసిన గొల్లపూడికి జీవితంలో తగిలిన పెద్ద దెబ్బ కొడుకు శ్రీనివాస్ దుర్మరణం. అందులోనుంచి కోలుకోడానికి ఆయనకి ఊతమిచ్చింది సాహిత్యమే. ఎన్ని భూమికలు నిర్వహించినా గొల్లపూడి నాకెప్పుడూ గుర్తుండిపోయేది 'సాయంకాలమైంది' రచయితగానే. ఆయన ఆత్మకి శాంతి కలుగు గాక. 

5 కామెంట్‌లు:

  1. Mee post heading chudagane arthamayindi ayana ika lerani..RIP gollapudi Garu...

    రిప్లయితొలగించండి
  2. @Priyaragalu: శీర్షికలు మరీ ప్రిడిక్టబుల్ గా ఉంటున్నాయన్నమాట!! ..ధన్యవాదాలండీ.. 
    @కొత్తపాళీ: ధన్యవాదాలండీ.. 

    రిప్లయితొలగించండి
  3. మురళి గారూ, "ప్రిడిక్టబుల్" అని కాదేమో; నాకయితే హెడింగ్ ఎంచుకునే మీ పద్ధతికి "priyaraagalu" వారు మీకు compliment ఇచ్చారని అనిపించిందండీ :)

    రిప్లయితొలగించండి
  4. @విన్నకోట నరసింహారావు: బహుశా నేనే పొరబడ్డానేమోనండీ.. ధన్యవాదాలు. 

    రిప్లయితొలగించండి