విజయం సాధించేవారు నూటికొక్కరైతే, ఆ విజయంకోసం శ్రమించేవారు మిగిలిన
తొంభైతొమ్మిది మంది. ఈ మెజారిటీకి ప్రతినిధి క్రికెటర్ అర్జున్. అతని కథే
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన
'జెర్సీ' సినిమా. క్రికెట్ ని జీవితంలో ఒక భాగంగా కాక, పూర్తిజీవితంగా
చేసుకున్న అర్జున్ సాధించిన విజయాలు, ఎదుర్కొన్న పరాజయాలు, మళ్ళీ విజయం
సాధించడం కోసం చేసిన తీవ్రమైన ప్రయత్నాలే ఈ సినిమా. కేవలం క్రికెట్ ని
అభిమానించే వారికి మాత్రమే కాదు, జీవితంలో ఏదో ఒక దశలో వైఫల్యాలని
ఎదురుకొన్న వారికి, విజయం కోసం శ్రమిస్తున్న వారికీ నచ్చేసే సినిమా.
క్రికెట్ ప్లేయర్ గా రాణిస్తూ నేషనల్స్ కి సెలక్ట్ అవడాన్ని లక్ష్యంగా చేసుకున్న అర్జున్ (నాని), తన అభిమాని సారా (శ్రద్ధా శ్రీనాధ్)
ని ప్రేమ వివాహం చేసుకుంటాడు. వాళ్ళకో కొడుకు నాని (మాస్టర్ రోనిత్).
ఊహించని విధంగా సెలక్షన్ మిస్ అవ్వడంతో, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగంలో
చేరతాడు అర్జున్. ఊహించని విధంగా ఉద్యోగంలో సస్పెన్షన్ రావడంతో, ఉదయాన్నే
నానీని క్రికెట్ కోచింగ్ కి తీసుకెళ్లడం, రోజంతా టీవీలో క్రికెట్ చూడడమే
జీవితం అయిపోతుంది అర్జున్ కి. అతన్ని అమితంగా ప్రేమించే సారా, ఇల్లు
గడపడం కోసం తాను ఉద్యోగంలో చేరుతుంది.
ఎప్పుడూ
తండ్రిని ఏదీ కావాలని అడగని నానీ, తన ఏడో పుట్టినరోజున క్రికెటర్లు
ధరించే 'జెర్సీ' కొనిమ్మని కోరతాడు తండ్రిని. దాని ఖరీదు ఐదువందలు. ఆ ఐదు
వందల కోసం చేసే ప్రయత్నాలలో అర్జున్ కి ఎన్నో అవమానాలు. తనని ఎంతో
అభిమానించే కోచ్ మూర్తి (సత్యరాజ్) ద్వారా ఓ ఛారిటీ మ్యాచ్ ఆడే అవకాశం
వచ్చినప్పుడు కూడా, అర్జున్ ఆలోచన ఆ వచ్చే డబ్బులతో నానీకి ఒక జెర్సీ
కొనివ్వచ్చని మాత్రమే. పన్నెండేళ్ల విరామం తర్వాత ఆడిన ఆ మ్యాచ్ ఫలితంగా
అర్జున్ జీవితం ఏ మలుపు తిరిగింది? అంతగా ప్రేమించిన భార్య కూడా కుటుంబం
లేదా క్రికెట్లో ఏదో ఒకటే ఎంచుకోమని ఎందుకు షరతు విధించింది? ఇంతకీ అర్జున్
నానీకి జెర్సీ కొనిచ్చాడా, లేదా అన్నది మిగిలిన కథ.
సినిమా
నిడివి రెండు గంటల నలభై నిమిషాలన్నా, అందులో నలభై నిముషాలు కేవలం క్రికెట్
మ్యాచ్లు మాత్రమే ఉన్నా ఎక్కడా విసుగురాని విధంగా తీర్చిదిద్దిన
క్రెడిట్లో దర్శకుడితో పాటు ఎడిటర్ నవీన్ నూలి కి కూడా ఇవ్వాలి. నటన
విషయానికి వస్తే నాని, శ్రద్దా శ్రీనాథ్ లు పోటాపోటీగా నటించారు. సత్యరాజ్
ది పూర్తి నిడివి పాత్ర. మూర్తిగా మరొకర్ని ఊహించలేని విధంగా చేశాడు.
ప్రేమకథ, తండ్రీకొడుకుల అనుబంధం, క్రికెట్, డ్రెస్సింగ్ రూమ్ అసూయలు,
బోర్డు రాజకీయాలు.. ఇలా అనేక విషయాల చుట్టూ రాసుకున్న కథ అయినప్పటికీ, ఏం
చెప్పాలి అనే దానితో పాటు ఎలా చెప్పాలి అన్న విషయంలో దర్శకుడికి స్పష్టత
ఉండడం వల్ల ఎక్కడా అయోమయానికి అవకాశం లేకుండా సాగింది సినిమా.
తన
తొలిసినిమా 'మళ్ళీరావా' లాగానే కథని ఇంటర్కట్స్ లో చెప్పాడు దర్శకుడు
గౌతమ్ తిన్ననూరి. న్యూయార్క్ లో చదువుకుంటున్న నాని తన తండ్రి జీవితకథ
'జెర్సీ' ని పుస్తకాల షాపులో కొనడంతో మొదలయ్యే సినిమా, ఇండియాలో జరిగే ఆ
పుస్తకం ప్రమోషన్ మీట్ లో తన తండ్రిని గురించి అప్పటివరకూ తెలియని ఓ
విషయాన్ని తెలుసుకోవడంతో ముగుస్తుంది.. హీరో స్నేహితులతో సహా ప్రతి పాత్రకీ
ఒక ఐడెంటిటినీ ఇవ్వడంతో పాటు, పాత్రలన్నింటినీ కథలో భాగం చేశాడు దర్శకుడు.
అర్జున్ విజయాల్లో ఉన్నప్పుడు, వైఫల్యాలతో కూరుకుపోయినప్పుడూ అతని చుట్టూ
ఉన్న వాళ్ళ ప్రవర్తనల్లో తేడాని చిత్రించిన తీరు ముచ్చటగొలిపింది.
కొంచం
శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండును అనిపించిన ఒకే ఒక్క విషయం సంగీతం. పాటలు,
నేపధ్య సంగీతం కథకి తగినట్టుగా లేవనిపించింది. సినిమా మొదలైన గంటా ఇరవై
నిమిషాలకి ఇంటర్వల్ వస్తే, "అప్పుడే సగం సినిమా అయిపోయిందా?" అన్న
కామెంట్స్ వినిపించాయి థియేటర్లో. క్లైమాక్స్ లో అయితే కొందరు ప్రేక్షకుల
నుంచి క్లాప్స్ పడ్డాయి. విజయం సాధించడం అంటే మెట్లో, నిచ్చెనలో ఎక్కినంత
సులువు కాదనీ, నిరంతర శ్రమ, పట్టుదలతో పాటు కొన్ని త్యాగాలూ అవసరమవుతాయనీ
చెప్పిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి అభినందనలు. ఈ దర్శకుడి తర్వాతి సినిమా
ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన్నేను.
ఈ రోజే చూసాను. నానీ సినిమాలు మిస్సవ్వను. నేపధ్య సంగీతం అనిరుధ్ (కొలవరి ఫేం అనుకుంటా) చేసారు, మావాడికి నచ్చింది. అందరూ బాగా నటించారు. నాకు బాగా నచ్చింది.
రిప్లయితొలగించండిఈ సినిమా బావుందని టాక్ వచ్చినదగ్గర్నుంచీ మీ పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నాన్నేను. :) సినిమా చూసినా చూడకపోయినా మీ సమీక్షలు నాకు ఆసక్తిగా అనిపిస్తాయి.
రిప్లయితొలగించండిజెర్సీ - మేం చూడడం మిస్ అయ్యాము. మీ సమీక్ష చూస్తే బావుండునేమో అనిపించేలా వుంది.
రిప్లయితొలగించండి"నేను లోకల్","ఎంసిఏ" చూసి నానీ మాస్ హీరో ఇమేజ్‌లోకి వెళ్ళిపోతాడేమో అని కొంచెం భయపడ్డా. జెర్సీతో ఆ భయం పోగొట్టేశాడు నాని.
రిప్లయితొలగించండి@నీహారిక: బయటికి వచ్చాక ఒకట్రెండు పాటలు గుర్తుండేలా ఉంటే ఇంకా బాగుండేది కదా అనిపించిందండీ నాకు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: చూడాల్సిన సినిమా అండీ.. ధన్యవాదాలు..
@లలిత టీఎస్: తప్పక చూడండి, మిమ్మల్ని నిరాశ పరచదు. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@వైవీఆర్: ధన్యవాదాలండీ..