మంగళవారం, జనవరి 15, 2019

సంకురాత్రి కోడి

ఊళ్ళో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయ్. మనుషులెవరూ కనిపించడం లేదు. ఏమైపోయారబ్బా అనుకుంటూ మా 'హరి' కి ఫోన్ చేశాను. "పందెం బరికాడున్నాం వొచ్చెయ్యెహె" అంటూ గుర్తులు చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేశాడు. కొన్నేళ్ల  క్రితం వరకూ బరి దగ్గరికి వెళ్లడం ఇబ్బందిగా ఉండేది. మా ఊరి మర్యాదస్తులు కొందరు నన్నక్కడ చూసి సిగ్గుపడి పోయేవాళ్లు. "అయ్ బాబోయ్.. ఆడతాకి రాలేదండి" అని అడక్కపోయినా చెప్పేవాళ్ళు. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని, పండక్కి ఊళ్ళో ఉన్నా పందెం బరి వైపు వెళ్లడం మానుకున్నా. ఇప్పుడిక తప్పడం లేదు.

పొలాల మధ్య కొబ్బరి తోటలో ఎప్పుడూ కన్నా పెద్ద టెంట్ వెలిసింది. బోల్డన్ని మోటార్ సైకిళ్ళు, రెండు మూడు కార్లు బరి చుట్టూ గోడ కట్టినట్టుగా పార్క్ చేసి ఉన్నాయి. మూడొంతుల మనుషులు రెండు కాళ్ళూ భూమ్మీద నిలబెట్టలేని తన్మయావస్థలో ఉన్నారు. సీసాలు, గ్లాసులకి పక్కనే చిన్న స్టవ్ మీద చికెన్ పకోడీలు వేగుతున్నాయి. ఆ సందోహంతో మా వాడిని పట్టుకోడానికి మళ్ళీ ఫోన్ చేయాల్సి వచ్చింది. చాలా మందిమి చెదురుమదురై పోయినా, ఊరినే అంటిపెట్టుకుని ఉన్న కొద్దిమందిలో వాడూ ఒకడు. సొంత ఇల్లు, వ్యవసాయంతో పాటు, స్కూల్ మాస్టర్ ఉద్యోగం పక్కూళ్ళోనే.

"మేస్టార్లు కూడా కోడి పందేలు కాస్తే ఎలాగరా బాబా" అంటూ పలకరించాను. బాల్య స్నేహితుల్ని, మా ప్రాంతం మనుషుల్ని చూసినప్పుడు యాస తెలీకుండా తన్నుకొచ్చేస్తుంది. "ఎహె.. ఎదవ గోల.. పెద్ద స్టోరీ ఉన్నాదిలే.. టీవీలోళ్ళ ఫోన్ నెంబర్లేవన్నా నీకాడుంటే ఇస్తావా.. నాలుగు బూతుల్తిట్టి ఫోనెట్టేస్తాను.." అదేదో సినిమాలో రవితేజ గుర్తొచ్చాడు నాకు. "ఆళ్ళేంజేసేరు మజ్జలో?" అడిగేశాను. "హైదరాబాద్ నుంచి రాటాకి మా బామ్మర్ది నాకొడుక్కి లీవు దొరకలేదంట. అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేడు.." చిన్నప్పుడు బళ్ళో మేష్టారు మూత్రపిండాల గురించి అడిగితే, వీడు హృదయస్పందన గురించి వివరించేడు. పెద్దగా మార్పేమీ లేదు.


నాక్కొంచం సహనం ఉండబట్టీ, నా చేతిలో కర్ర లేకపోబట్టీ, అన్నింటికీ మించి మేస్టార్ని కొట్టకూడదనీ గమ్మునున్నా. "డబ్బులేసేనని ఫోన్ చేసి, నా పేరుమీద మాంచి పుంజుల మీద పందెం కాయ్ బా.. అంటా ఎదవ పురమాయింపు. నేనెక్కడ కాయనో అని, ఆళ్ళక్కక్కూడా చెప్పేడు.. ఇంక తప్పుద్దా?" హమ్మయ్య.  సగం విషయం అర్ధమయ్యింది. ఊరుకుంటే మిగిలిన సగం కూడా వాడే చెపుతాడు కదా. పందేల తిరునాళ్లలో జనం వస్తూ, పోతూ ఉన్నారు కానీ ఎవరికీ ఎవర్నీ పట్టించుకునే తీరుబాటు లేదు. పందేలు కాసిన వాళ్ళు ఫోన్లలో వీడియో షూట్ చేసుకుంటున్నారు. లైవ్ లు కూడా నడుస్తున్నట్టున్నాయ్.

"మొన్నమొన్నటిదాకా ఎలాగుండేయ్రా పందేలు? ఆడేవోళ్ళకి తప్ప ఇంకెవడికన్నా తెలిసేదేటి? మా నాన పందేలకాడికెల్లొత్తే మాయమ్మ కేకలెయ్టం నాగ్గుర్తున్నాది. ఇప్పుడు సూడు, మాయావిడ ఎల్తావా, సత్తావా అని పట్టట్టి పంపింది.." ఎక్కువసేపు తలాడిస్తూ ఉండిపోతే నాకూ ఓ డోసు పడే ప్రమాదం ఉంది, అందుకని "తమ్ముడు సర్దా పడితే ఆవిడమాత్రం ఏం చేద్దిరా" అన్నాను. మావాడు మాంచి కాకమీదున్నాడు. "నా దెవసం జేత్తాది" అనేశాడు. "అదేంట్రా, పండగపూటా.." నిజంగానే నొచ్చుకున్నాను. "కాపోతేట్రా? కోనసీవోళ్లంటే సంక్రాంతికి కోడిపందేలు ఆడక తప్పదు అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి.. తయారుజేస్సేరు టీవీలోళ్లు. ముందెప్పుడన్నా ఇలాగున్నాదా?"

వాడి ప్రశ్న విని నేనూ ఆలోచనలో పడ్డాను. నిజమే.. ఇదివరకటి కన్నా బర్లు పెరిగాయి. పందేలు కాసేవాళ్ళూ, చూసేవాళ్ళూ కూడా పెరిగారు. "ఒకప్పుడు తప్పు సేత్తన్నాం అని ఏమూలో ఉండేది. ఉప్పుడు కామనైపోయింది. పందెం కాసేవోడికి తప్ప అందరికీ లాబవే. ఎవడికాడు డబ్బు చేసుకుంటన్నాడు. జనాలకి పిచ్చెక్కించి పందేలు కాసేలాగా సేత్తన్నారు. పెద్ద డ్రామాకింద తయారయ్యింది ఇదంతా.." ఇంతకీ వీడి బావమరిది డబ్బులు పందేల్లో పోయాయా?వీడుగానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడా? వాడిదగ్గర మొహమాటం ఎందుకు? అడిగేశాను.

"మనకయ్యన్నీ పడవురా. పందెం పని మా షడ్డకుడికి అప్పజెప్పేను. పక్కన్నేనూ ఉండాల్సిందే అంటే పన్లు మానుకుని పొద్దున్నుంచీ ఇక్కడే పడున్నాను. బామ్మర్దిగాడైతే ఫోన్లోనే ఉన్నాళ్లే. ఈడు ఫోటోలు పంపటం, ఆడు పుంజులు సెలెక్టు చెయ్యటం.. పెద్ద పెంట కిందున్నాది.." హమ్మయ్య, మావాడి సమస్యేమిటో తెలిసిపోయింది. పరిష్కారం నా చేతిలో లేదు కదా. తక్షణ కర్తవ్యంగా, టాపిక్ మార్చి, వాడిని వేరే కబుర్లలో పెట్టానుకానీ, వాడన్న మాటలు నా బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి.

7 కామెంట్‌లు:

  1. కోడి పందేలు, బీర్లు , పేకాట .. ఇదే సంక్రాతి అయిపొయింది .

    ఒకప్పుడు, పైకి చెప్పడానికి సిగ్గు పడే విషయాలు, ఈ రోజు ఇంత బాహాటంగా జనాలు ఒప్పుకునే స్థాయి కి వచ్చ్చేశాయి .

    ఫ్రెండ్స్ ని ఎవర్నైనా కలవాలంటే , లేదా, కలిసి కాసేపు మాట్లాడాలంటే , కనీసం బీరు తాగే చోటు, పేకాట చోటు, కోడి పందేలు చోటు , ఇవే ఈ కాలపు రచ్చ్చబండలు .
    Venkat

    రిప్లయితొలగించండి
  2. అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా విషయం భలేగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. కోనసీమ యాస శ్రవణానందంగా ఉంది, మురళి గారు.
    ఇవాళ టీవీలో చూశాను ... కోడిపందాల దగ్గర ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మేం చాలా "ఎంజాయ్" చేస్తున్నాం అన్నారు టీవీకెమేరా వైపు చూస్తూ. ఆడవారు చూడకూడదని కాదు నా అభిప్రాయం. అయితే కొన్ని కొన్ని పరిసరాలకు వెళ్ళడం శ్రేయస్కరం కాదనే ఆలోచన కూడా లేనట్లుంది ఈ ఆడవీక్షకులకు. కోడి పందాలు, వాటి మీద బెట్టింగ్ చేసేవారు, సైడ్ లో ఇతర రకాల జూదాలు, వాటిని చూసేవారు "సేద తీరే"టందుకు ఏర్పాట్లు , పోగయ్యే రకరకాల జనాలు.... ఆహా, గొడవలు జరిగేటందుకు ఇంకేం కావాలి? అటువంటి చోట్లలో ఆడవారు ఇరుక్కోవడం ఎంతవరకు క్షేమకరం? పైగా పోలీసులు కూడా చేతులెత్తేసి అటువైపు తొంగి చూడడం మానేసారు (డ్యూటీలో భాగంగా).

    మీడియావారికి కొరవడిన సామాజికబాధ్యత వలన ఇటువంటివేవీ తగ్గే సూచనలు లేవు. పైగా రాజకీయనాయకులే స్వయంగా అటెండ్ అయి, ప్రోత్సహిస్తుంటే అంతా బాహాటం అయిపోయింది. "అతడు" సినిమాలో ఎమ్.ఆర్.ఓ సమక్షంలోనే ఒకతను తన పొలాన్ని ఆక్రమిస్తుంటే నాజర్ అంటాడు చూశారా ... ఎమ్.ఆర్.ఓ గారూ, ఇటువంటి అక్రమాల్ని మీరు ఆపకపోయినా ఫరవాలేదు కానీ మీరే స్వయంగా దగ్గరుండి చేయించడం మీకు గౌరవం అనిపించుకోదు ... కోడిపందాల వార్తల్లో రాజకీయనాయకుల ప్రస్తావన వింటుంటే ఆ సీన్ గుర్తొస్తుంటుంది.

    రిప్లయితొలగించండి
  4. @వెంకట్: నిజమేనండీ.. చాలా వేగంగా వచ్చేసింది మార్పు.. ధన్యవాదాలు
    @జ్యోతిర్మయి: ధన్యవాదాలండీ
    @విన్నకోట నరసింహారావు: నెమ్మదిగా అలవాటు చేసేస్తున్నారండీ.. ఇప్పటికే "మామూలై" పోయింది.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగుంది మురళీగారు. కోడి పందేల యవ్వారాలు గురించి మా బాగా చెప్పారు. ☺

    రిప్లయితొలగించండి
  6. @శేఖర్ పెద్దగోపు: ఉన్నమాటేనండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి