సాహిత్య అకాడమీ చేస్తున్న మంచిపనుల్లో ఒకటి 'భారతీయ సాహిత్య
నిర్మాతలు' అనే సిరీస్ లో ప్రముఖ రచయితలు, రచయిత్రుల మోనోగ్రాఫ్స్
వెలువరించడం. ఈ క్రమంలో వచ్చిన పుస్తకం విఖ్యాత రచయిత కె.యెన్.వై. పతంజలి
ని గురించి కథా, నవలా రచయిత చింతకింది శ్రీనివాసరావు చేత రాయించిన
మోనోగ్రాఫ్. పతంజలి పుట్టి పెరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాడే
కాక, పతంజలి వీరాభిమానీ మరియు ఆ పరంపరకి చెందిన రచయితగా పేరుతెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న చింతకింది అత్యంత భక్తిశ్రద్ధలతో చేసిన రచన ఇది. పతంజలి రచనలు, ఇంటర్యూలు,
ఇతరులు వెలిబుచ్చిన అభిప్రాయాలు సవివరంగా చదివిన వాళ్లకి కూడా కొత్త
విషయాలు చెప్పే విధంగా ఈ రచన సాగడం విశేషం.
పతంజలి
రచనల్ని తలచుకోగానే మొదట గుర్తుకొచ్చేది వ్యంగ్యం. 'రాజుగోరు' మొదలు
'రాజుల లోగిళ్ళు' వరకు, 'ఖాకీవనం' మొదలు 'గెలుపు సరే, బతకడం ఎలా' వరకూ
పతంజలి ఏ ప్రక్రియలో రచన చేసినా ఆయన వాక్యాల మధ్య వ్యంగ్యం తొంగిచూస్తూ
ఉంటుంది. చేదునిజాలకి చక్కెరపూతగా ఉపయోగపడింది. ఆ వ్యంగ్యమే లేకపోతే
'గోపాత్రుడు' నవ్వించడానికి ముందే ఏడిపించేసి ఉండేవాడు. 'వీరబొబ్బిలి'
వెలుగు చూసేదే కాదు. తెలుగు సాహిత్యానికి చాలా చాలా నష్టం జరిగిపోయి
ఉండేది. మరి, ఆ వ్యంగ్యం పతంజలి ఎలా అబ్బింది? తెచ్చిపెట్టుకున్నదిగా కాక,
సహజాతంగా ఎలా అమిరింది? ఈ ప్రశ్నలకి జవాబిచ్చారు చింతకింది శ్రీనివాసరావు.
పతంజలి
భూస్వామ్య నేపధ్యం మొదలు, ఉత్తరాంధ్ర సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల
వరకూ ఆ వ్యంగ్యం తాలూకు చరిత్రలో భాగాలే అని బల్లగుద్ది చెబుతారు రచయిత.
రాచరికాలు, జమీందారీలు కోల్పోయిన క్షత్రియ కుటుంబంలో పుట్టిన కుర్రాడికి
తండ్రిగారి సాహిత్యాభిలాష కారణంగా చిన్ననాడే పుస్తకాలతో పరిచయం ఏర్పడడం,
పాఠకుడి నుంచి రచయితగా పరిణమించడానికి అట్టే సమయం తీసుకోకపోవడం లాంటి
విశేషాలు, ఈ మోనోగ్రాఫ్ చదవకపోతే ఎలా తెలుస్తాయి? బంధువులు, మరీ ముఖ్యంగా
మేనమామ ప్రభావం లాంటి వివరాలని విశదంగా అక్షరీకరించారు ఈ పుస్తకంలో.
కేవలం
కుటుంబ నేపధ్యం, చదివిన పుస్తకాలు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వాతావరణం,
మరీ ముఖ్యంగా సామాజిక పరిస్థితులు రచయిత మీద ప్రభావం చూపిస్తాయి. పతంజలి
కలం పట్టిన నాటి సాహితీ, సామాజిక వాతావరణాలని రేఖామాత్రంగా స్పృశిస్తూనే
'కన్యాశుల్కం' నాటకం, చాగంటి సోమయాజులు (చాసో) పతంజలి పై వేసిన ముద్రని
ప్రస్తావించడం మర్చిపోలేదు. కాలక్షేప సాహిత్యం పుష్కలంగానూ, ఉద్యమ సాహిత్యం
తగుమాత్రంగానూ వెలుగుచూస్తున్న ఆ కాలంలో కలం పట్టి, ఈ రెండూ కాకుండా తనదైన
కొత్త మార్గాన్ని నిర్మించుకున్న రచయిత పతంజలి. రచయితగా పతంజలి పరిణామ
క్రమాన్ని కూడా ఆయా రచనలు వెలువరించిన కాలంనాటి పరిస్థితులతో బేరీజు వేసి
చెప్పడం ద్వారా, పతంజలి రచనల ప్రత్యేకతని అరటిపండు ఒలిచినట్టుగా
వివరించారు.
కాలేజీ మేగజైన్ కి రాసిన కథల
మొదలు, నవలలు, నవలికల వరకూ పతంజలి ప్రతి రచన తాలూకు నేపద్యాన్నీ సేకరించిన
రచయిత కృషిని మెచ్చుకోవాలి. నిజానికి పతంజలికి కథల వల్ల కన్నా నవలల వల్లే
ఎక్కువ పేరొచ్చింది. రాసిన కథలు కూడా తక్కువే. 'చూపున్న పాట' కథ
ఎక్కువమందికి చేరింది. 'ఖాకీవనం' 'పెంపుడు జంతువులు' నవలల మీద రావిశాస్త్రి ప్రభావం మొదలు, 'రాజుగోరు' నుంచీ పతంజలి సొంత శైలి నిర్మించుకోవడం వరకూ
జరిగిన పరిణామ క్రమాన్ని బాగా పట్టుకున్నారు చింతకింది. అయితే,
'కన్యాశుల్కం' స్పూర్తితో పతంజలి రాసిన వాక్యాలు అనేకం ఉన్నా, స్థలాభావం
వల్ల కావొచ్చు, కొన్నింటిని మాత్రమే ప్రస్తావించారు.
పత్రికా రచయితగా పతంజలి రాసిన సంపాదకీయాలు, చేసిన ఇతర రచనల్ని గురించి చెప్పారు కానీ
'వీరబొబ్బిలి' ని 'డాగీష్ డాబ్లర్' పేరుతో ఇంగ్లీష్ చేయడాన్ని గురించిన (తన రచనే కాబట్టి అనువాదం అనకూడదు కదా) వివరాలు మోనోగ్రాఫ్ లో లేకపోవడం
చిన్నలోటే. పతంజలి రాసిన కవితకి, ఇచ్చిన ఇంటర్యూలకి చోటిచ్చారు చివర్లో.
అలాగే, పతంజలిని గురించి కొందరు ప్రముఖులు రాసిన ఆత్మీయ వ్యాసాలు గతంలో
చదివినవే అయినా మళ్ళీ చదువుకోవడం బాగుంది. మొత్తం మీద చూసినప్పుడు, శిఖర
సమానమైన పతంజలి సాహిత్య సర్వస్వాన్ని 127 పేజీల చిన్న పుస్తకంలో అద్దంలో
చూపించే ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తిచేసిన చింతకింది శ్రీనివాసరావుని,
చేయించిన సాహిత్య అకాడెమీని అభినందించాల్సిందే. (వెల రూ. 50, సాహిత్య
అకాడెమీ స్టాల్స్ లో లభ్యం).