చూస్తుండగానే 'పుట్టినరోజు జేజేలు...' పాడుకునే రోజు 
మళ్ళీ వచ్చేసింది. ఎప్పటిలాగే రాసిన విషయాల కన్నా రాయాల్సినవే ఎక్కువ 
మిగిల్చిన ఏడాది ఇది. అవును, 'నెమలికన్ను' కి తొమ్మిదేళ్లు నిండాయి. 
ఎప్పటిలాగే గడిచిన ఏడాది కూడా చదివిన పుస్తకాలు, చూసిన సినిమాల వివరాలే 
బ్లాగు రాతల్లో సింహ భాగాన్ని ఆక్రమించాయి. మిత్రుల ఆదరణ, ప్రోత్సాహం 
యధావిధిగా కొనసాగుతున్నాయి. వాళ్ళకే కాదు, అప్పుడప్పుడూ నాకూ ఎదురవుతున్న 
ప్రశ్న 'ఎందుకు తరచుగా రాయడం లేదు?' ఆశ్చర్యం ఏమిటంటే, ఎవరికైనా 
చెప్పేందుకే కాదు, నాకు నేను చెప్పుకునేందుకూ సంతృప్తికరమైన జవాబు దొరకడం 
లేదు. 
ఇతర మాధ్యమాలలో తెలుగు వినియోగంలోకి రావడంతో, 
బ్లాగింగ్ బాగా తగ్గిపోయింది అన్నది అక్కడక్కడా వినిపిస్తున్న ఫిర్యాదు. 
కొన్ని బ్లాగుల విషయంలో ఇది నిజమే కూడా. కానీ, బ్లాగులకి కూడా సమ 
ప్రాధాన్యత ఇచ్చి గతంలో అంత విస్తృతంగా కాకపోయినా పోస్టులు రాస్తున్న, 
చదువుతున్న మిత్రులకి కొదవలేదు. ఇంకా చెప్పాలంటే బ్లాగింగ్ ని సీరియస్ గా 
తీసుకున్న వాళ్ళు ఎవరూ బ్లాగుల్ని విడిచిపెట్టలేదు. టపాల సంఖ్యనే 
ప్రాతిపదికగా తీసుకున్నా, గతేడాదిలో రాసిన యాభై నాలుగు పోస్టులని 'పూర్ 
పెర్ఫార్మన్స్'  కేటగిరీలో వేయలేను. ఇంతకన్నా తక్కువ రాసిన సందర్భాలు 
ఉన్నాయి మరి. 
రాయాల్సిన విషయాలకి కొదవ లేకపోయినా రాయడం 
అన్నది తరచూ వాయిదా పడుతూ ఉండడం కొంచం గట్టిగానే ఆలోచించాల్సిన విషయం. 
'నీచమానవుణ్ణి' కాకూడదని ('ఆరంభించరు నీచ మానవుల్..') ఎప్పటికప్పుడు 
హెచ్చరించుకుంటూనే, బ్లాగు విషయంలో ఎక్కువసార్లు అలాగే మిగిలిపోతూ ఉండడం 
నాకూ బాగాలేదు. అప్పుడప్పుడూ పాత టపాలు చదివినప్పుడు (నావీ, మిత్రులవీ) 
ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రాస్తే మరికొన్నాళ్లు తర్వాత వాటినీ 
ఇలాగే చదువుకోవచ్చు అని. బ్లాగుల నుంచి నాస్టాల్జియాని విడదీయడం మన తరమా?
గతేడాది
 బ్లాగింగ్ వరకూ చూస్తే, ఏమాత్రం ముందస్తు ప్లానింగ్ లేకుండా మొదలు పెట్టి 
ఏకబిగిన పూర్తి చేసింది 'కన్యాశుల్కం' సిరీస్. గురజాడ వారి 'కన్యాశుల్కం' 
నాటకానికి నూట పాతికేళ్ల పండుగ జరుగుతున్న సందర్భంగా ఏదన్నా ఒక పోస్టు 
రాయాలన్న ఆలోచన, నెమ్మదిగా 'ఒక్కో పాత్రని గురించీ రాస్తే' వరకూ పెరగడం, 
అకారాది క్రమంలో ముఖ్య పాత్రల పరిచయాలు రాయడం జరిగిపోయింది. ఒక్కో పాత్ర 
తాలూకు వ్యక్తిత్వాన్ని బాగా అర్ధం చేసుకోవడం కోసం ఆ పుస్తకాన్ని మళ్ళీ 
మళ్ళీ చదవడం, 'కన్యాశుల్కం' నాటకం గొప్పదనాన్ని మరికొంచం అర్ధం చేసుకోవడం 
(ఇంకా చాలా మిగిలే ఉంది) జరిగాయి. 
మనసులో పుట్టిన చాలా కథలు 
కీబోర్డు వరకూ రాకుండానే ఆగిపోయాయి. ఏళ్ళ తరబడి వాయిదా వేస్తున్న రాతలు 'మా
 సంగతి ఏమిటి?' అని కొంచం మర్యాదగానే గుర్తు చేస్తున్నాయి. చదువు విషయానికి
 వస్తే, నాన్-ఫిక్షన్ దారిలో వెళ్తోంది బండి. మధ్యలో బ్రేక్ కోసమైనా 
ఫిక్షన్ చదవాలని బలంగా అనిపిస్తోంది ఒక్కోసారి. కొన్ని మంచి సినిమాలు 
చూశాను. 'అద్భుతం' అనదగ్గవి తారస పడలేదు. మొత్తం మీద చూసినప్పుడు, 
సింహావలోకనంలో 'మరికొంచం తరచుగా రాయాలి' అన్నది నాకు బాగా అనిపించిన విషయం.
 తొమ్మిదేళ్లుగా 'నెమలికన్ను' అని అభిమానిస్తూ, ఆదరిస్తూ వస్తున్న మీ 
అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు!! 

 
