డియర్ వంశీ,
నమస్తే!!
మీ
తాజా చిత్రం 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చూసిన తర్వాత మీకీ
ఉత్తరం రాయకుండా ఉండలేక పోతున్నాను. షూటింగ్ మొదలైంది మొదలు మీ సినిమా
ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం, రాబోయే ఆ సినిమా మీరు తీసిన మంచి సినిమాల
జాబితాలో చేరాలని కోరుకోవడం, తీరా సినిమా చూశాక 'తీసింది వంశీయేనా?' అని
ఆలోచనలో పడి, బాధపడడం బాగా అలవాటైపోయినవే అయినా, ప్రతిసారీ ఓ ఎదురుచూపు, ఓ నిట్టూర్పు తప్పడం లేదు.
మనమిప్పుడు
2017 లో ఉన్నాం. గతకొన్నేళ్ళుగా ఆడపిల్లలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ
పెళ్లి సంబంధాల కోసం బెంగ పెట్టుకోవడం లేదు. నిజానికి ఇప్పుడా బెంగ
మగపిల్లల తల్లిదండ్రులది. అలాంటిది, పారిస్ నుంచి వచ్చే పెళ్ళికొడుకు కోసం
తన కూతుర్ని షోకేసులో బొమ్మలా తయారు చేయాలని తాపత్రయ పడతాడు ఓ తండ్రి.
కళ్ళతోనే కొలతలు తీసుకునే మీ ఫ్యాషన్ డిజైనర్ గోపాళం ఆమెకి వ్యాంప్ తరహా
దుస్తులు కుట్టి, నగలన్నీ దిగేసి, ఇది చాలదన్నట్టు ఓ మేలిముసుగేసి మరీ
పెళ్ళికొడుకు ముందు ప్రదర్శనకి నిలబెడతాడు... పెళ్ళికొడుకు చొంగ కార్చుకుని
సంబంధం ఒకే చేస్తాడు.. పిల్ల తండ్రి కన్నీళ్లు పెట్టుకుని గోపాళానికి
కానుకలిస్తాడు.. 'సితార' నీ 'లాయర్ సుహాసిని' నీ సృష్టించిన వంశీ
సినిమాయేనా ఇదీ? అన్న సందేహానికి ప్రారంభం ఇది.
గేదెల
రాణితో హీరో గారి ప్రేమాయణం.. ఆమె తడికల గదిలో స్నానం చేస్తుంటే టార్చ్
లైటు వేసి చూసి ఆమెని ప్రేమలో పడేస్తాడు. అటుపై ఆమెనుంచి తప్పించుకోవడం
కోసం అతగాడు ఎన్నుకున్న దారులు.. ఆమెని వెనుక వైపు నుంచి బలంగా తన్నడం,
బరువైన బస్తాని వెనుకనుంచి ఆమె మీద పడేయడం లాంటి హత్యా ప్రయత్నాలు. అయినా
కూడా ఆమె అతన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఏ పల్లెటూళ్ళో ఉన్నారండీ ఇలాంటి
అమ్మాయిలు? ఇక రెండో నాయిక అమ్ములు తొలిచూపు నుంచీ హీరో మీద విరహంతో
రగిలిపోతూ ఉంటుంది. కేవలం అతగాడు ఓ కొత్త డిజైన్ డ్రెస్సు కుట్టి
ఇచ్చినందుకే! ఇదంతా అమ్మాయిల మీద చిన్నచూపా లేక అమెజాన్ పార్సిళ్లు
పల్లెలకు కూడా వెళ్తున్నాయని తెలియకపోవడమా? ఇంకేమన్నా కారణాలు
వెతుక్కోవాలా?
ఇక మూడో హీరోయిన్ అమెరికా మహాలక్ష్మి
తింగరితనంలో మొదటి ఇద్దరు హీరోయిన్లనీ మించిపోయినట్టు అనిపించింది. మొదటి
ఇద్దరూ 'ఏదో పల్లెటూరి పిల్లల్లే' అని సినిమాటిక్ లిబర్టీ తీసేసుకుందాం
అనుకున్నా (నిజానికి ఇవాళ్టి పల్లెటూరి అమ్మాయిలు ఎవరికీ ఏ విషయంలోనూ
తీసికట్టు కాదు) అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి కూడా ఫ్యాషన్ డిజైనర్
పనితనానికి ఫ్లాట్ అయిపోవడం ఏమిటండి, హీరో పాత్ర మీద మీ అతి ప్రేమ తప్పితే?
మరో స్త్రీపాత్ర కౌసల్య.. టీవీ సీరియల్లో లేడీ విలన్లా సినిమా ఆసాంతమూ
క్లోజప్ లో గుడ్లు మిటకరించి చూడడమూ, క్లైమాక్స్ లో కథని తేల్చేయడం కోసం
విలన్ గుట్టు విప్పడమూ.. ఒకప్పటి మీ సినిమాల్లో సపోర్టింగ్ కేరక్టర్స్ ఎలా
ఉండేవండీ అసలు?
ఈ సినిమాని 'లేడీస్ టైలర్' కి సీక్వెల్
అని ప్రచారం చేశారు కానీ, నాకైతే రీమేక్ అనిపించింది. ఇంగ్లీష్ వాళ్ళు
'లూజ్ అడాప్టేషన్' అంటారు బహుశా. 'ఏప్రిల్ ఒకటి విడుదల' లో దివాకరాన్ని
తీసుకొచ్చి పాపారావు అని పేరుపెట్టి హీరోకి మేనమామని చేయడం, విలన్
వెంకటరత్నం పేరుని గవర్రాజుగా మార్చడం, మరీ ముఖ్యంగా ఆ సినిమాలో ఉన్న
నేటివిటీని పూర్తిగా నీరుగార్చి మెలోడ్రామా డోసుని విపరీతంగా పెంచడం మినహా
మార్పులేవీ కనిపించలేదు. అక్కడ జమజచ్చ అయితే ఇక్కడ మన్మధరేఖ అంతే. 2017 లో
కూడా గవర్రాజు మాట ఊళ్ళో శిలాశాసనం కావడం, ముఖంలో ఎలాంటి భావాలూ పలకని
అతగాడు నాటు తుపాకీతో జనాన్ని ఇష్టం వఛ్చినట్టు కాల్చి పారేస్తున్నా, సోషల్
మీడియా రోజుల్లో కూడా ఎవరూ అస్సలు పట్టించుకోక పోవడం మీ సినిమాలోనే సాధ్యం.
వంశీ
సినిమా అంటే ముందుగా కనిపించేది నేటివిటీ. ఆ నేలమీదే పుట్టి పెరిగిన
మనుషుల్లా అనిపించే పాత్రలు. అలాంటిది ఈ సినిమాలో నాయికా నాయకులతో సహా
ప్రతి పాత్రా ఆ వేళ పొద్దున్నే హైదరాబాద్ నుంచి ఆ ఊళ్ళో బస్సు దిగినట్టు
ఉందంతే. యాస పలికించడానికి హీరో పడ్డ అవస్థ ప్రతి సంభాషణలోనూ వినిపించింది.
హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్టులు కూడా యాస కోసం అవస్థలు పడడం ఒక
ఎత్తైతే, లిప్ సింక్ అన్నది అస్సలు కుదరకపోవడం దారుణమైన విషయం. ఒకప్పటి మీ
సినిమాల్లో సంభాషణలు ఇప్పటికీ ఇష్టంగా తల్చుకుంటాం. కానీ ఈ సినిమాలో చాలా
సంభాషణలు మొదటిసారి వినడానికే వెగటుగా అనిపించాయి. టీవీ కామెడీ షోలలో కూడా
అవుట్ డేటెడ్ అయిపోయిన సీన్లు పట్టుకొచ్చి "ఇదే కామెడీ.. చూడండి" అనేశారు.
అన్నట్టు,
ఆ జూనియర్ ఆర్టిస్టులని ఎక్కడినుంచి తీసుకొచ్చారు వంశీ గారూ? రికార్డింగ్
డాన్సర్ల నుంచి కూడా మంచి నటనని రాబట్టగలరని నిరూపించుకున్నారే..
కృష్ణభగవాన్, కొండవలస లాంటి ఎందరికో లైఫ్ ఇచ్చారే... మరి వీళ్ళేమిటండీ,
కనీసం టీవీ సీరియల్ స్థాయిలో అయినా చేయకుండా, కెమెరాకి డైలాగులు
అప్పజెప్పేశారు. ఆ ఓపెనింగ్ సీన్ చూసి గుండె జారిపోయింది నాకు. సాంకేతిక
విభాగాలు కూడా నటులకి తగ్గట్టే ఉన్నాయి. ఎడిటర్ పేరు టైటిల్స్ లో ఉండడం
వల్ల ఈ 'ఈసినిమాకు ఎడిటర్ ఉన్నారన్న మాట' అనుకోవాల్సి వచ్చింది తప్ప పనితనం
ఎక్కడా కనిపించలేదు. అయితే, వంక పెట్టలేనివి, ఈ సినిమాలో అస్సలు ఫిట్
అవ్వనివీ రెండు విభాగాలు.. సంగీతం, కెమెరా. కేవలం పాటల కోసమే చివరివరకూ
హాల్లో ఉన్నానంటే నమ్మాలి మీరు.
చివరగా, మీ నుంచి ఇలాంటి
సినిమాలు రావడం ఇదే మొదలు కాదు. కానీ, 'ఇంతకుముందు చూసిందే చివరిదేమో' అన్న
ఆశ ప్రతిసారీ మీ సినిమాని చూసేలా చేస్తోంది.. ఇంకా ఎన్నాళ్లండీ? సినిమా
చూసి వచ్చినప్పటి నుంచీ ఎందుకిలా తీశారా అని ఆలోచిస్తూ ఉంటే, ఈమధ్యనే చూసిన 'డైలాగ్ విత్ ప్రేమ' ఐడ్రీమ్స్ ఇంటర్యూ గుర్తొచ్చింది. సుదీర్ఘమైన ఆ
ఇంటర్యూలో చాలా సంగతులే చెప్పారు మీరు. కానీ, సినిమా చూసొచ్చాక పదేపదే
గుర్తొస్తున్న విషయం ఒక్కటే. "నాకు పేపర్ చదివే అలవాటు లేదు.. అసలు పేపరు
చదవను, వార్తలు చూడను.." బహుశా అందుకేనేమో, మీరు ముప్ఫయి ఏళ్ళ వెనుకే
ఉండిపోయి మమ్మల్ని కూడా మీదగ్గరికి రమ్మంటున్నారు. మేమందరం అంత వెనక్కి
రావడం అన్నది కుదరని పనండీ.. మీరు ముందుకి రాగలిగితే మనం ఒక పేస్ లో
ప్రయాణించగలుగుతాం.. రావాలన్నది నా (మా) ఆశ, కోరిక..
ఇట్లు
మీ
అభిమాని
వంశీ దెబ్బకు మురళి విరిగిపోయిందా? :(
రిప్లయితొలగించండిరెండు పిల్లనగ్రోవులనూ ఒకచోట చేర్చాలన్న దురదతో రాసింది మాత్రమే ఆ వాక్యం. ఈసారికి క్షమించేయండి.
'అన్వేషణ'తో పరిచయం నాకు వంశీ. అంతకుముందే చిన్నతనంలో చూసినా 'సితార' అర్ధమయేలా చూడడం తర్వాతే. ఆపైన 'మహర్షి' చూశాను. అదొక మిరకిల్ అనిపించింది. ఆ మూడు సినిమాలూ క్లాసిక్ స్థాయికి చెందినవి అని చాలాకాలం అనుకునేవాణ్ణి. అప్పటి నా మానసిక పరిపక్వత స్థాయి ఇప్పటికి మారి ఉంటే, వాటిని చూస్తే మళ్ళీ అంత ఫీల్ అవగలనో లేదో అనుమానమే. భానుప్రియ మ్యాజిక్‌లో అతిగా ప్రేమించేశానేమో కానీ 'సితార' ద్వితీయార్థం తర్కానికి దూరంగా ఉందని ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుందో తెలీదు.. 'ఆనాటి వానచినుకుల'ని ఎండబెట్టేసుకోవడం దేనికని ఇప్పటివరకూ చూడలేదు. వాటి తర్వాత పూర్తిగా చూసిన వంశీ సినిమా ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అది నచ్చలేదని అనను కానీ వంశీ మార్కు ఉందా అంటే అనుమానమే. కొన్ని ముక్కలు చూసిన సినిమాలు ఆలాపన, చెట్టు క్రింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, సరదాగా కాసేపు. వర్మ నిర్మాత కాబట్టి వరప్రసాద్ పెళ్ళాన్నీ, గోదారి పేరూ కమలినీ ముఖర్జీ హీరోవినూ ఉన్నాయి కదాని గోపి గోపిక గోదావరినీ చూద్దామనుకుని కూడా ఎందుకో ధైర్యం చేయలేదు. ఫ్యాషన్ డిజైనర్ పాటల ట్రయిలర్స్ చూసినప్పుడు కుంచెం ఆశ కలిగింది కానీ డైలాగ్ ట్రయిలర్స్ చూశాక సర్లే అనేసుకున్నా. రిలీజై రివ్యూలు చదివాక ఉఫ్ అనుకున్నా.
అనుభూతి ప్రధాన దర్శకుడు వంశీ హాస్య ప్రధాన దర్శకుడిగా మారిపోయాడే అని అసంతృప్తి. ఏ సినిమాలోనైనా వివాహేతర సంబంధాల ప్రస్తావన లేకుండా తీయలేడా అని ఇబ్బంది. ప్రపంచంలోని అన్నిదేశాల సినిమాలూ విమర్శాత్మక దృష్టితో చూడగల కన్నున్నవాడు ఇలా మిగిలిపోయాడే అని ఆవేదన.
మీరెవరికైతే రాశారో వారీ లేఖ చదివితే బాగుండును.
రిప్లయితొలగించండిప్రపంచకం అంతా రాకెట్టెక్కి ముందుకు దూసుకు పోతూ ఉంటే మన తెలుగు సినిమా దర్శక, నిర్మాత, నటీ నట చక్రవర్తులు మాత్రం ఎడ్లబండి వేసుకుని క్రీస్తుపూర్వానికి ప్రయణం కట్టారండీ. ఈ రోజుల్లో కూడా ఎవడో రాజకుమారుడు వస్తాడు అని పనీ పాటా మానేసి కలలుగనే అమ్మాయిలు తెలుగు చిత్రాల్లో తప్పించి ఇంకెక్కడా దొరకరండీ. మొన్నొక చిత్రరాజం చూసాము "రారండోయ్" అని. మా ఊరిలో నలుగురు మనుషులున్న కుటుంబం సినిమా కి వెళ్ళాలి అంటే హీనపక్షం యాభై డాలర్లు క్షవర కర్మ చేసుకోవల్సిందే. అమ్మాయి అప్పగింతలప్పుడు ఆ జిడ్డు డయలాగులేంటో, ఎం.బి.యే వెలగబెడుతున్న హీరోయిన్ అనబడే మొద్దావతారం ఆకాశం నుండి రెక్కల గుర్రం వేసుకుని రాజకుమారుడు వస్తాడు అంటూ కలలు కనడం ఏమిటో... రామ రామ. భ్రమకి భ్రమరానికీ తేడా తెలియని ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవడో కనిపిస్తే బాగుండు, నేల కుర్చీ వేయిస్తా అరగంట సేపు. ఇక మన వాళ్ళు మహాప్రాణాక్షరాలు మర్చిపోయినట్టున్నారు, చెవుల్లో కరింగించిన సీసం పోసినంత సమబరంగా ఉంది ఆ తెలుగు వింటుంటే. ఇంట్లో కూర్చుని కొరియన్ డ్రామాలు చూడటం ఉత్తమం, ఉత్తపుణ్యానికి ఈ తెలుగు సినిమాలకి వెళ్ళి చిలుము వదిలించుకునేకంటే అని నిర్ణయానికి వచ్చేసాము. మా తెలుగు తల్లికి మల్లెపూదండ :(
రిప్లయితొలగించండిఫణి గారు, 'ఆనాటి వానచినుకులని....' భలే అన్నారండీ. బాగుంది.
రిప్లయితొలగించండిఎంత ప్రతిభావంతుడికైనా సమయ పరిమితి ఉంటుందనుకుంటా! పెద్దవాళ్ళయ్యాకా ఇంకా పాత వాసనలు పోక అదే పద్ధతిలో సినిమాలు తీస్తే ఔట్ ఆఫ్ డేట్ అయిపోతుంది.
రిప్లయితొలగించండివిశ్వనాథ్ సినిమాలు ఇష్టంగా చూసే నేను, "శుభప్రదం" సినిమా చూసాకా ఇక ఆయన సినిమాలు తీయకపోవటమే మంచిదని అనుకున్నాను. వంశీ కూడ అంతే.
సినిమా రిలీజైనపుడు మీరేంరాస్తారా అనుకున్నాను కానీ కాస్త బిజీగా ఉండి మీ ఈ ఉత్తరం ప్లస్ రివ్యూ ఇపుడే చూశానండీ.. చాలా బాగా రాశారు.. పాటలు విని సినిమా చూద్దామనుకున్నా కానీ ట్రైలర్ రివ్యూస్ చూశాక ఇక సాహసం చేయలేక పోయాను. ఇక ఈయన సినిమాలకోసం ఎదురు చూడకపోవడమే ఉత్తమమేమో..
రిప్లయితొలగించండి@పురాణపండ ఫణి: అయ్యో.. 'క్షమించడం' అంత పెద్ద మాట ఎందుకండీ.. మురళి విరిగిపోలేదు కానీ, మరోసారి గాయపడింది :) (వేటూరి చెప్పినట్టు, ఎటూ నిలువెల్లా గాయాలే) .. 'నీకు 16 నాకు 18' అనే యూత్ సినిమాతో సహా అన్నీ చూశానండీ నేను.. ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ తో తీస్తున్నాడా అనిపిస్తుంది. మరికొన్ని సార్లు ఏమయ్యింది వంశీకి అనిపిస్తుంది.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@లలిత టీఎస్: వారికి తెలియని విషయాలు ఏవీ లేవనే అనుకుంటున్నానండీ.. ధన్యవాదాలు
@లక్ష్మి: సదరు సినిమా చూడలేదు కానీ, ఆ దర్శకుడి మొదటి సినిమా చూసి తరించానండీ మొన్నామధ్య. మా తెలుగు సినిమా తల్లికి మల్లెపూదండ అనాలేమో :) ..ధన్యవాదాలు
@బూసిరాజు లక్ష్మీదేవి దేశాయి: ధన్యవాదాలండీ
రిప్లయితొలగించండి@బోనగిరి: మధ్యలో 'ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' లేకపోతే నేనూ ఇదే కంక్లూజన్ కి వచ్చేసే వాడినండీ.. ఆ ఒక్క సినిమా నన్నింకా ఆశపడేలా చేస్తోంది.. ధన్యవాదాలు
@వేణూ శ్రీకాంత్: మీరు చూడలేదా అయితే?!! చూస్తారనుకున్నానండీ.. ...ధన్యవాదాలు..
లేదండీ ఈ మధ్య సమయాన్ని పొదుపుగా వాడుకోవాల్సి రావడంతో వదిలేయక తప్పలేదు :-)
రిప్లయితొలగించండిఈ మధ్యకాలంలో నేను గురువు గారుగా భావించే “వంశీ”గారు తీసిన సినిమా చూడడం కంటే అయన వ్రాసిన కధ చదివితేనే మనస్సు చాలా ఆనందంగా వుంటుంది.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: పోనీలెండి, రక్షింపబడ్డారు :
రిప్లయితొలగించండి@వెంకటేశ్వర రావు: నిజమేనండీ.. కొన్ని కొన్ని కథలైతే మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు.. ధన్యవాదాలు..