ఇద్దరు ఆడపిల్లల మధ్యన స్నేహం కుదిరినప్పుడు వాళ్ళిద్దరూ ఒకే సంకేతనామంతో
ఒకరినొకరు పిలుచుకోవడం బెంగాలీ సంప్రదాయం. కరుణకి తన భర్త కుంజబాబు తరపు
దూరపు బంధువు మాయతో స్నేహం కుదిరింది. అప్పుడు ఆ స్నేహితురాళ్ళు ఇద్దరూ
ఎంచుకున్న సంకేతనామం 'చోఖేర్ బాలి.' తెలుగులో అయితే 'కంట్లో నలుసు.' కరుణని
పెళ్లి చేసుకోడానికి పూర్వం, మాయ సంబంధం వచ్చింది కుంజబాబుకి. అతడు ఆమెని
తిరస్కరించాడు. తదుపరి మాయకి వేరే వ్యక్తితో వివాహం జరగడం, పెళ్ళైన కొద్ది
కాలానికే అతడు మరణించడంతో వితంతువై పుట్టింటికి చేరుతుంది మాయ. కుంజ తల్లి
లక్ష్మికి మాయ అంటే చాలా అభిమానం. కొన్నాళ్ళు తన ఇంట్లో ఉంచుకుని
ఆదరించాలని అనుకుంటుంది.
మాయ వితంతువుగా మారే
సమయానికే, లక్ష్మి ఇష్టానికి విరుద్ధంగా కరుణని పెళ్లి చేసుకుంటాడు కుంజ.
లక్ష్మి ఆహ్వానం మేరకి ఆ ఇంటికి వచ్చిన మాయ అతి తక్కువ సమయంలోనే కరుణతో
స్నేహం చేసేస్తుంది. అమాయకురాలైన కరుణ తనకి సంబంధించిన ప్రతి విషయమూ
-పడకింటి సంగతులతో సహా - మాయతో పంచుకుంటుంది. కుంజ తనకి భర్త కావాల్సిన
వాడు అన్న విషయం మర్చిపోలేని మాయ కరుణ మీద ద్వేషం పెంచుకుంటుంది. పైకి
కరుణతో స్నేహం నటిస్తూనే, కుంజని ఆకర్షిస్తుందామె. కరుణ-కుంజల మధ్య మాయ,
కుంజ-మాయల మధ్య కరుణ 'కంటిలో నలుసు' గా మారే పరిస్థితులు వచ్చేస్తాయి. ఈ కథ
ఏ కంచికి చేరిందన్నదే 'విశ్వకవి' రవీంద్రనాథ్ టాగోర్ నవల 'చోఖేర్ బాలి.'
కుంజ-కరుణ-మాయలకి
సమ ఉజ్జీ అయిన పాత్ర బిహారీ. కుంజ కి ప్రాణ స్నేహితుడైన బిహారీ లక్ష్మి కి
చిన్న కొడుకుతో సమానం. నిజానికి కరుణ సంబంధం బిహారీకోసం చూసినదే. బిహారీకి
తోడుగా పెళ్లి చూపులకి వెళ్ళిన కుంజ కరుణ మీద మనసు పడడంతో స్నేహితుడి కోసం
తన పెళ్లిని త్యాగం చేస్తాడు బిహారీ. కరుణ మీద ఎలాంటి రెండో ఆలోచనా లేని
బిహారీ, ఆమెని 'వదినా' అని పిలవడం మొదలు పెడతాడు. అయితే, బిహారీకి ఎదురు
పడడం కరుణకీ, బిహారీ-కరుణ మాట్లాడుకోడం కుంజ కీ ఇష్టం లేని విషయాలు. ఆ
ఇంటికి తరచూ వస్తూ, ఓ కుటుంబ సభ్యుడిగా కలిసిపోయిన బిహారీ మాయ ప్రవర్తనని
అనుమానిస్తాడు. కుంజకి తనవైపు ఆకర్షించేందుకు ఆమె చేసే ప్రయత్నాలని
కరుణకన్నా ముందుగా పసిగడతాడు బిహారీ. విషయం చాలా సున్నితమైనది కావడంతో ఏం చేయాలో తెలియక విలవిల్లాడతాడు.
లక్ష్మి
భోళా తనం, కరుణ అమాయకత్వం, కుంజ చంచల స్వభావం మాయ పనిని సులభం చేస్తాయి.
పెళ్ళైన కొద్ది కాలానికే కుంజ దృష్టి కరుణ నుంచి మాయ వైపుకి మరలుతుంది. మాయ
కోసం పిచ్చి వాడై పోయి, కరుణని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతాడు
బిహారీ. భర్త మనసులో తనకి స్థానం లేనప్పుడు, అతని ఇంట్లో ఉండడం భావ్యం
కాదనుకున్న కరుణ కాశీకి వెళ్ళిపోతుంది. ఆ భార్యా భర్తల మధ్య దూరం పెరగగానే,
మాయ దృష్టి బిహారీ వైపుకి మళ్ళుతుంది. అయితే, బిహారీని తనకి ఆకర్షితుడిని
చేసుకోవాలని కాక, అతన్ని నిజంగానే ప్రేమిస్తుంది మాయ. అతన్ని గెలుచుకోడం
కోసం, తన చుట్టూ పిచ్చి వాడిలా తిరుగుతున్న కుంజని ఉపయోగించుకోవడం మొదలు
పెడుతుంది మాయ. కరుణనే కాదు, ఇంటినీ తన మెడిసిన్ చదువునీ కూడా నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతాడు కుంజ.
మాయ
నుంచి కరుణనీ, కుంజనీ రక్షించడాన్ని తన బాధ్యతగా భావించిన బిహారీకి
అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతాయి. కుంజకి బిహారీ పట్ల మనసు విరిగిపోతుంది.
మాయ తనని పిచ్చి వాడిని చేసి ఆడిస్తోందని తెలిసీ, ఆమె ఆకర్షణ నుంచి బయట
పడలేక పోతాడు. నూరేళ్ళ నాటి బెంగాల్ పరిస్థితులు, జమీందారీ కుటుంబపు
వాతావరణం, ఆ ఇంటి పద్ధతులు, నాటి మానవ సంబంధాలు వీటన్నింటినీ నిశితంగా
చిత్రించిన నవల 'చోఖేర్ బాలి.' యాభై ఆరేళ్ళ నాటి దండమూడి మహీధర్ తెలుగు
అనువాదాన్ని తాజాగా ప్రచురించింది సాహితి ప్రచురణలు. తెలుగు అనువాదంలో
పాత్రల పేర్లు మార్చారు, ఎందుకో? ఇదే పేరుతో ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలో
వచ్చిన సినిమా యూట్యూబ్లో అందుబాటులో ఉంది. నాటి అనువాద సాహిత్యాన్ని
ఇష్టపడే వాళ్లకి నచ్చే పుస్తకం. (పేజీలు 232, వెల రూ. 100, ఎమెస్కో పుస్తక
కేంద్రంలో లభిస్తుంది).
మంజుల,చార్మీ నటించిన కావ్యాస్ డైరీ ఇంచుమించు ఇదే స్టోరీ !
రిప్లయితొలగించండిమురళి గారు, నా దగ్గర శరత్ బాబు, రవీంద్రనాథ్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఈ బుక్ చదివాను:)
రిప్లయితొలగించండి@నీహారిక: రేఖామాత్రపు పోలికండీ.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@జయ: అవునా!! శరత్ సాహిత్యం తక్కువ చదివానండీ నేను.. రవీంద్రుడి నవలలు ఇప్పుడే మొదలు పెట్టాను.. ధన్యవాదాలు..
"Stories by Rabindranath Tagore" అని ఈ మధ్య Netflix లో విడుదల చేశారు మురళి గారు. అవి కూడా చాలా బాగా తీసారు. ప్రత్యేకంగా ఇప్పటి తరానికి కథలు పరిచయం ఈ విధంగా చెయ్యడం నాకు నచ్చింది. ఇరవై సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలు చాలామంది నాకు తెలిసినవారు ఇవి చూస్తున్నారు. ఏదో రకంగా మంచి సాహిత్యాన్ని పరిచయం చేసిన అనురాగ్ బాసుకి క్రతజ్ఞతలు చెప్పాల్సిందే! ఆ ఎపిసోడ్స్ లో మొట్టమొదటి కథ మీరు పరిచయం చేసిందే. రాధికా ఆప్టే మాయగా నటించింది.
రిప్లయితొలగించండి@జలతారు వెన్నెల: ఈ వీడియోల గురించి ఇవాళే తెలిసిందండీ.. తప్పకుండా చూస్తాను.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి