శుక్రవారం, జూన్ 10, 2016

చంద్రిక కథ

తమిళులు దైవ సమానుడిగా ఆరాధించే రచయిత సుబ్రహ్మణ్య భారతి రాసిన ఒక నవలలో ముఖ్యపాత్ర కందుకూరి వీరేశలింగం. ఓ అధ్యాయం మొత్తంలో కందుకూరి దంపతులు కనిపించడం మాత్రమే కాదు, కథలో ఒక ప్రధాన పాత్ర అయిన ఓ వితంతువుకి పునర్వివాహం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తారు కూడా. దురదృష్టం ఏమిటంటే, సుబ్రహ్మణ్య భారతి అకాల మరణం కారణంగా ఆ నవల అసంపూర్ణంగా మిగిలిపోయింది. అదృష్టం ఏమిటంటే, ఆ శేషభాగం తెలుగునాట 'రాక్షస పరిశోధకుడు' గా పేరుపొందిన నెల్లూరి వాసి బంగోరె (బండి గోపాల రెడ్డి) కంటపడింది. ఫలితంగా తెలుగులోకి అనువాదం అయ్యింది. తమిళ నవల పేరు 'చంద్రికైయిన్ కతై' కాగా తెలుగు అనువాదం 'చంద్రిక కథ.'

పొదియ కొండల సానువుల్లో ఉండే అందమైన కుగ్రామం 'వేలాంగుడి.' ఆ ఊళ్ళో ఓ నిరుపేద బహు కుటుంబీకుడు మహాలింగయ్య. నలుగురు ఆడపిల్లలని కన్న భార్య గోమతి ఐదోసారి ప్రసవానికి సిద్ధంగా ఉంది. వృద్ధులైన తల్లిదండ్రులతో పాటు, వితంతువైన చెల్లెలు విశాలాక్షికి కూడా ఆధారం మహా లింగయ్యే. 1901 వ సంవత్సరంలోని ఆ అర్ధరాత్రి ఉధృతమైన గాలివానతో కలిసి వచ్చిన భూకంపంలో వేలాంగుడి మొత్తం అతలాకుతలం అవుతుంది. తెల్లారేసరికి ఒకే గదిలో నిద్రించిన గోమతి, విశాలాక్షి మినహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ నిద్రలోనే ప్రాణాలు విడుస్తారు. తెల్లవారు జామునే ఆడపిల్లకి జన్మనిచ్చిన గోమతి, ఆ బిడ్డని విశాలాక్షికి అప్పగించి, తనూ కన్నుమూస్తుంది.

"నీవు రెండో పెళ్లి చేసుకో. విధవా వివాహం నిషేధమేమీ కాదు. స్త్రీ పురుషులిద్దరూ యముడికి లోబడ్డ వారే. స్త్రీలు పురుషులకి బానిసలు కారు. వారికి భయపడుతూ, బాధలనుభవించి, దుఃఖించి, క్షీణించి నశించిపోవాల్సిన అవసరం లేదు. పురుషులు స్వార్ధపరులుగా వ్రాసిన శాస్త్రాలని చించి పొయిలో పారెయ్. ధైర్యంగా చెన్న నగరానికిపో. అక్కడ వితంతు వివాహాలు జరిపే సభవార్ని చేరి వారి సాయంతో చక్కని వరుణ్ణి పెండ్లాడి సుఖంగా ఉండు. రెండో మాట - నీవు బ్రతికి ఈ బిడ్డని పోషించు. దానికి 'చంద్రిక' అని పేరు పెట్టు" మరణశయ్య నుంచి గోమతి విశాలాక్షికి చెప్పిన మాటలివి. వదిన మాటలని తూచా తప్పకుండా పాటించింది విశాలాక్షి.


చెన్న పట్టణంలో ప్రముఖ సంఘ సంస్కర్త, పత్రికాధిపతి సుబ్రహ్మణ్యయ్యర్ ని కలిసి, తన గోడు వినిపించి, తగిన వరుడితో వివాహం జరిపించాల్సిందిగా ప్రార్ధిస్తుంది విశాలాక్షి. వితంతు పునర్వివాహం అనగానే అయ్యర్ కి కందుకూరి వీరేశలింగం పంతులు గుర్తొస్తారు. విశాలాక్షికి వరుణ్ణి చూడవలసిందిగా కోరుతూ వీరేశలింగం పేరిట ఒక ఉత్తరంతో పాటు, ఖర్చుల నిమిత్తం ఆమెకో వందరూపాయలు ఇచ్చి పంపుతారు. చంద్రికని ఎత్తుకుని వీరేశలింగం ఇంటికి చేరిన విశాలాక్షి ఆ కుటుంబంతో కొంతకాలం గడుపుతుంది. తర్వాత ఆమెకి తగిన వరుడు అనుకోకుండా తటస్థ పడడంతో, వీరేశలింగం సమక్షంలో బ్రహ్మ సమాజ పద్ధతిలో అతన్ని వివాహం చేసుకుంటుంది విశాలాక్షి. చంద్రిక బాల్యం పూరవ్వక మునుపే నవల అర్ధంతరంగా ఆగిపోయింది!

మొత్తం యాభై ఐదు పేజీల నవల పూర్వరంగాన్ని పరిచయం చేస్తూ సవివరమైన ముందుమాటలతో 1971 తొలిసారిగా ఈ నవలని ప్రచురించారు బంగోరె. నలభయ్యేళ్ళ తర్వాత ఈ పుస్తకాన్ని పునర్ముద్రించింది కావ్య ప్రచురణలు సంస్థ. గోపాల-కృష్ణ-రాఘవన్ త్రయం ఈ తమిళ నవలని తెనిగించినది. వీరిలో గోపాల మరెవరో కాదు, బంగోరె. ఎన్నెస్ కృష్ణమూర్తి, వీఎస్ రాఘవన్ మిగిలిన ఇద్దరు అనువాదకులు. అనువాదంలో నెల్లూరు మాండలీకం వినిపించేలా ప్రత్యేక కృషి చేశానని ముందుమాటలో చెప్పుకున్నారు బంగోరె. కెవి రమణారెడ్డి, చల్లా రాధాకృష్ణ శర్మ, బంగోరెల ముందు మాటలకి తోడు, సన్నిధానం నరసింహ శర్మ, సివి సుబ్బారావుల ముందుమాటలు చేర్చారు తాజా ప్రచురణలో.

అసలు సుబ్రహ్మణ్య భారతికి, వీరేశలింగానికీ పరిచయం ఉండి ఉంటుందా మొదలు, కాల్పనిక నవలలో వాస్తవ పాత్రల్ని ప్రవేశ పెట్టడం అనే సంప్రదాయం అంతకు మునుపే ఉందా లేక సుబ్రహ్మణ్య భారతి ఆరంభించారా మీదుగా, నవలలో వీరేశలింగానికీ నిజ వీరేశలింగానికీ సామ్యాలు, భేదాల వరకూ ఏకరువు పెట్టిన తీరు చదివిన వారెవరికైనా బంగోరెని 'రాక్షస పరిశోధకుడు' అనడానికి అభ్యంతరం కనిపించదు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం కందుకూరి జీవితంపై నార్ల వెంకటేశ్వర రావు రాసిన ఇంగ్లీష్ పుస్తకం మీద 'స్వతంత్ర' పత్రికలో సమీక్ష రాస్తూ ప్రేమా నందకుమార్ ఈ నవల విషయాన్ని ప్రస్తావించారట 1968 లో. ఆ సమీక్ష చదివిన బంగోరె, ఆ అరవ పుస్తకాన్ని సంపాదించి, మిత్రుల సాయంతో అనువదించి, అప్పుడు తను పనిచేస్తున్న 'జమీన్ రైతు' పత్రికలో సీరియల్ గా ప్రచురించడమే కాక, పుస్తకంగా కూడా వేశారు.

"దీనికున్న విలువల్లా నా దృష్టిలో వొక్కటే - కందుకూరి వీరేశలింగం పంతులు గారంతటి తెలుగు మహా పురుషుణ్ణీ, ఆయన ధర్మపత్ని రాజ్యలక్ష్మమ్మనూ అచ్చం కథా పాత్రలుగా చేసి సుబ్రహ్మణ్య భారతి అంతటి తమిళ ఆధునిక మహాకవి యాభై ఏళ్ళ క్రితం ఒక నవల వ్రాసి పెట్టి పోతే దాన్ని ఇంతవరకూ మన తెలుగువాళ్ళు పట్టించుకోక పోవడం అన్యాయంగా భావించి ఇంతకాలానికి ఈ అనామకుడు ఈ రూపంగా వెలువరించ సాహసమే.." అంటారు బంగోరె. ఇంత పట్టుదల మనిషీ కేవలం నెల్లూరి నుంచి రాజమండ్రికి దారిఖర్చులు లేని కారణంగా కందుకూరికి సంబంధించి మరికొన్ని విశేషాలు సేకరించలేకపోయారట! లక్ష్మి-సరస్వతులకి చెలిమి ఉండదన్న మాట నిజమని నిరూపితమయ్యే మరో సందర్భం ఇది. సుబ్రహ్మణ్య భారతి, వీరేశలింగంతో పాటు బంగోరె కోసం కూడా చదవాల్సిన పుస్తకం ఇది. (పేజీలు  110, వెల రూ. 80, విశాలాంధ్ర, నవోదయ పుస్తకాల షాపులు).

3 కామెంట్‌లు:

  1. బంగోరె గారికి నెల్లూరు నుంచి రాజమండ్రికి దారి ఖర్చులు లేకపోయాయి అన్న విషయం చదివి బాధేసింది అండీ :(
    అనువాదాలు అంతగా ఇష్టపడని నేను ఈ పుస్తకం చదవాలని అనుకుంటున్నాను. మీ సమీక్ష చాలా బావుంది.

    ~లలిత

    రిప్లయితొలగించండి
  2. బంగోరెకి నెల్లూరి నుంచి రాజమండ్రానికి దారి ఖర్చులు లేవన్న మాట నమ్మశక్యంగా లేదు. బంగోరె ఉత్తర భారత దేశంలో (పంజాబ్?) ఏదో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు జ్ఞాపకం. ఆత్మహత్యకు అంత దూరం వెళ్ళగలిగినవాడికి తనకిష్టమైన పరిశోధనల కోసం నెల్లూరి నుంచి రాజమండ్రి వెళ్ళడం కష్టం కాదనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  3. @లలిత టి.ఎస్.: ఆయనే చెప్పుకున్నారండీ, ముందుమాటలో.. ..ధన్యవాదాలు..
    @పురాణపండ ఫణి: బంగోరె హిమాచల్ ప్రదేశ్ లోని సట్లెజ్ నదిలో ఆత్మహత్య చేసుకున్నారండీ 1982 లో. ఈ నవల ప్రచురించింది అంతకి పదకొండేళ్ళ క్రితం. రైలుకి డబ్బుల్లేక పోవడం అన్నది ప్రచురణ కాలం నాటి ఆర్ధిక పరిస్థితి కావొచ్చు. ఆయన్ని తెలిసున్న వాళ్ళంతా బంగోరె ఆర్ధిక పరిస్థితి ఎప్పుడూ అంతంత మాత్రమే అని చెప్పారు.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి