గురువారం, జూన్ 30, 2016

రాజాధిరాజా

గత కృష్ణా పుష్కరాలప్పుడు దర్శకుడు చేరన్ తమిళంలో 'ఆటోగ్రాఫ్' అనే సినిమాని స్వీయ దర్శకత్వంలో నిర్మించి విజయం సాధించాడు. తెలుగు వాళ్ళు ఆ సినిమా హక్కులు కొని రవితేజ హీరోగా 'నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమరీస్' పేరిట పునర్నిర్మించారు. తమిళంతో పోలిస్తే తక్కువే కానీ, తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. హీరో పాత్రలో చాలా మంది మగవాళ్ళు తమని తాము ఐడెంటిఫై చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు బాగా ఊపందుకున్నాయి కూడా. పుష్కర కాలం తర్వాత అదే చేరన్ తమిళ తెలుగు భాషల్లో తీసిన 'రాజాధిరాజా' సినిమాలో సరిగ్గా మిస్సైన పాయింట్ అదే. ఏ వర్గం ప్రేక్షకులూ కనెక్ట్ అవ్వలేని విధంగా ఉంది సినిమా.

ఇప్పటి తరంలో బాగా నటించగలిగే శర్వానంద్, నిత్యామీనన్ లని లీడ్ పెయిర్ గా ఎంచుకున్న దర్శకుడు కథ ట్రీట్మెంట్ లోనూ, స్క్రీన్ ప్లే రాసుకోవడంలోనూ విపరీతంగా తడబడడం వల్ల ప్రేక్షకులు సినిమాలో ఎక్కడా లీనం కాలేక పోగా, సెంటిమెంట్ సన్నివేశాల్లో గట్టిగా నవ్వేలా తయారైంది థియేటర్లో పరిస్థితి. అభిరుచుల పరంగా తమిళ, తెలుగు ప్రేక్షకుల మధ్య చాలా భేదం ఉంది. సహజంగానే చేరన్ కి తమిళుల నాడి తెలిసినంతగా, తెలుగు ప్రేక్షకుల అభిరుచి తెలీదు. ఫలితంగా, ఓ తమిళ సినిమాని తెలుగు సినిమాగా నమ్మించే ప్రయత్నం చేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడా నేటివిటీ కనిపించలేదు. తెలుగు కోసం చేసిన ప్రయత్నాల వల్ల, బహుశా తమిళ ప్రేక్షకులకీ ఈ నేటివిటీ సమస్య వస్తుందేమో. అదే జరిగితే ఈ సినిమా రెంటికీ చెడ్డ రేవడి అయినట్టే.

ఆఫీసు వేళలలో ఉద్యోగం, మిగిలిన సమయమంతా సోషల్ నెటవర్కింగ్ సైట్లతో బిజీగా గడుపుతూ, కుటుంబ సభ్యులని పూర్తిగా నిర్లక్ష్యం చేసే జేకే అలియాస్ జయకుమార్ (శర్వానంద్) ఉన్నట్టుండి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్ఛేసి స్నేహితులతో కలిసి వ్యాపారం ప్రారంభిస్తాడు. చిన్నప్పటి స్నేహితురాలు నిత్యా (నిత్యా మీనన్) ని కూడా ఒక భాగస్వామిగా చేసుకున్న జేకే సినిమా ప్రథమార్ధంలో ఒకటి తర్వాత ఒకటిగా మూడు వ్యాపారాల్లో అడుగుపెట్టి విజయ బావుటా ఎగరేస్తాడు. ఇంకా సంపాదించాలన్న కసి అతనిలో పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు తను నిర్లక్ష్యం చేసిన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకోడం ఆరంభిస్తాడు జేకే. ఏమాత్రం పొరపొచ్చచాలు లేకుండా ఒకే మాటగా కలిసుండే ఆ స్నేహితుల బృందానికి జేకే మాట వేదవాక్కు.


ప్రథమార్ధంలో నిత్య జేకేని ప్రేమించే ప్రయత్నాలు చేస్తుంది కానీ, దర్శకుడు అతనికి ఆమెకోసం వెచ్చించే సమయం ఇవ్వకపోవడంతో ఆమె కేవలం మూగగా ఆరాధిస్తూ గడిపేస్తుంది.అచ్చం తమిళ సినిమాల్లోలా ఆమెకున్న ప్రాణాంతకమైన జబ్బు బయట పడడం, జేకే ఆమెని రక్షించుకోడం జరిగాక, అప్పుడు వచ్ఛే ఫ్లాష్ బ్యాక్ లో తను ఉన్నట్టుండి ఎందుకు మారిపోయాడో నిత్యాకి వివరిస్తాడు జేకే. ఈ అచ్చ తమిళ ఫ్లాష్ బ్యాక్ తర్వాత జేకే తన భవిష్యత్ ప్రణాళిక వివరించడం, అందుకు నిత్య సహాయ సహకారాలు అందించడంతో సినిమా ముగుస్తుంది. సినిమా మొదలైన గంటా ఐదు నిమిషాలకి వచ్చే విశ్రాంతి కే ఒక పూర్తి సినిమా చూసేసిన భావన కలిగింది. రెండో సగం ఎంత విసిగించాలో అంతా విసిగించింది. ఫలితంగా, దర్శకుడు చెప్పాలనుకున్న మంచి పాయింట్ ఫోకస్ లో నుంచి పక్కకి తప్పుకుంది.

స్క్రీన్ ప్లే ఆర్డర్ పూర్తిగా మార్చుకుని, ప్రి-క్లైమాక్స్ పాయింట్ నుంచి సినిమాని మొదలు పెట్టి ఇంటర్ కట్స్ లేకుండా ఒకే ఫ్లాష్ బ్యాక్ లో కథ చెప్పుకుంటూ వస్తే సినిమా ఇలా క్లూ లెస్ గా కాకుండా, ఆసక్తికరంగా ఉండేదేమో అనిపించింది. మొదటి సగంలో హీరో వ్యాపార విస్తరణ అయితే అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్న అనుభూతి కలిగింది. ప్రథమార్ధంలో ఎక్కడా కామెడీ, రొమాన్స్ లాంటివి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ద్వితీయార్ధం ఆరంభంలోనే క్లైమాక్స్ కి సంబంధించిన క్లూస్ ఇవ్వడం వల్ల, నాయికా నాయకుల మధ్య కూసింత రొమాన్స్ ఉన్నా ప్రేక్షకులు ఎంజాయ్ చెయ్యలేరు. ప్రతి  సన్నివేశం అవసరానికి మించి సాగుతూ ఉంటుంది.. ఎడిటర్ లోపమో, దర్శకత్వ లోపమో  అర్ధం కాదు. తమిళ లొకేషన్లని తెలుగు ప్రాంతాలని నమ్మించే వ్యర్ధ ప్రయత్నం విసిగిస్తుంది.

ఈ  సినిమాకి మొదట పెట్టిన పేరు 'ఏమిటో ఈమాయ.' ఈ పేరుతోనే సెన్సార్ కూడా చేయించారు. రాజా పేరుతో శర్వానంద్  ఖాతాలో రెండు హిట్లు ఉన్నాయనో ఏమో 'రాజాధిరాజా' అని మార్చారు. విశేషం ఏమిటంటే రెండు పేర్లూ కూడా కథకి ఏమాత్రం సంబంధం లేనివే. తమిళ నాట ఈ సినిమాని థియేటర్లలో కాక డీవీడీల రూపంలో విడుదల చేశారట. స్పందన బాగుండడంతో ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. శర్వానంద్, నిత్యా మీనన్ ల నటనకి ఎప్పటిలాగే వంక పెట్టేందుకు వీల్లేదు. ప్రకాష్ రాజ్ పాత్ర ఎందుకో దర్శకుడికైనా తెలుసో లేదో. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలు, నేపధ్య సంగీతంకూడా ఏమాత్రం గుర్తుపెట్టుకునేలా లేవు. తక్కువ బడ్జెట్ లో తీసిన ద్విభాషా చిత్రం అవ్వడం వల్ల నిర్మాతకి నష్టం ఉండకపోవచ్చు. నష్టం అల్లా దర్శకుడి మీదా, నాయికా నాయకుల మీదా నమ్మకంతో సినిమా చూసిన ప్రేక్షకులకే..

బుధవారం, జూన్ 29, 2016

నల్లడబ్బు - తెల్లడబ్బు

విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన భారతీయ నల్లధనాన్ని వెనక్కి తెస్తామంటూ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఇఛ్చిన హామీ సామాన్యులని చాలా ఆకర్షించింది. ఆ పార్టీ నేతలు కొందరు అలా వెనక్కి తెచ్చిన నల్ల ధనాన్ని సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తామని అత్యుత్సాహంగా ప్రకటించడం వల్ల ఈ హామీకి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. ఆచరణకు వచ్చేసరికి హామీ అమలులో ఉన్న కష్టనష్టాలు ప్రభుత్వానికి అనుభవంలోకి వస్తున్నట్టున్నాయి. విదేశీ నల్లధనానికన్నా ముందు, స్వదేశీ నల్ల ధనాన్ని వెలికి తీసే కార్యక్రమం మొదలు పెట్టింది. (ఏటా ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటూ ఉంటాయి కాబట్టి, ఎన్నికల హామీలని పూర్తిగా మర్చిపోవడం అనే సౌకర్యం  కేంద్రంలో అధికారంలోకి వఛ్చిన పార్టీ(ల)కి ఉండదు).

'ఆదాయ వెల్లడి పథకము-2016' పేరిట ప్రధాని మొదలు స్థానిక అధికారుల వరకూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న పథకం నిజానికి పూర్తిగా కొత్తదేమీ కాదు. గతంలో వాజపేయి ప్రభుత్వంలో మొదటిసారి, తర్వాత కాంగ్రెస్ అధ్యక్షతన పాలించిన యూపీఏ హయాంలో రెండు సార్లూ అమలు చేసిందే. తేడా ఏమిటంటే, ఆదాయాన్ని స్వచ్చందంగా ప్రకటించి, గడువులోగా నిర్ణీత జరిమానా చెల్లించి నల్ల డబ్బుని తెలుపు చేసుకోకపోతే అనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. గతంతో పోలిస్తే ఇప్పుడు కంప్యూటరైజేషన్ పెరగడం, యూనిక్ నెంబర్ (ఆధార్) పుణ్యమా అని ప్రతి ఒక్కరి సమాచారం ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉండడంతో ఇలా హెచ్చరించడానికి అవకాశం దొరికింది ప్రభుత్వానికి.


గత పథకాల్లో వెల్లడి చేసిన నల్ల డబ్బులో ముప్ఫయి శాతాన్ని ప్రభుత్వానికి జరిమానాగా చెల్లిస్తే నలుపు తెలుపయి పోయేది. తాజా పధకంలో ఈ మొత్తాన్ని నలభై ఐదు శాతానికి పెంచారు. ఆదాయపు పన్నే ముప్ఫయ్ శాతం ఉన్నప్పుడు, జరిమానా మొత్తం అంతకన్నా ఎక్కువగా ఉండాలి కదా అన్న వాదన ఫలితమిది. ఈ ప్రకారం, కోటి రూపాయల నల్ల ధనం ఉంటే, అందులో నలభై ఐదు లక్షలు ప్రభుత్వానికి జరిమానా కట్టేస్తే మిగిలిన యాభై ఐదు లక్షలూ తెల్లదనం అయిపోతుంది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఇలా స్వచ్ఛందంగా ఆదాయం వెల్లడి చేసిన వారి మీద ఎలాంటి విచారణలూ, కేసులూ ఉండవు. మర్యాదగా చూడబడతారు. వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ స్కీములో భాగంగా బినామీ ఆస్థులని యజమాని పేరిట మార్పించుకునే సౌలభ్యం కూడా ఉంది.

జూన్ ఒకటైన ప్రారంభమైన ఈ పథకాన్ని గురించి పేపర్ల లోనూ, టీవీల్లోనూ, మన్ కీ బాత్ లోనూ వీలున్నప్పుడల్లా వివరిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ వెంటే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా. పథకం ప్రయోజనాలతో పాటు, నల్లడబ్బుని తెలుపు చేసుకోక పోతే ఎదురవ్వబోయే పరిణామాలని గురించి హెచ్చరికలు కూడా చేస్తున్నారు. దేశంలో అమలవుతున్న పన్నుల వ్యవస్థని గురించి కూడా వాళ్లిద్దరూ చాలా ఆవేదన చెందుతున్నారు. ఇంత పెద్ద దేశంలో వార్షికాదాయం యాభై లక్షలు పైబడి ఉందని పన్ను పత్రాల్లో చూపిస్తున్న వాళ్ళు కేవలం లక్షన్నర మందేనట. పాన్ కార్డు తీసుకున్న పాతిక కోట్ల మందిలోనూ కేవలం ఐదు కోట్ల మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారట. ఈ సంవత్సరం కనీసం మరో ఐదు కోట్ల మంది చేత రిటర్నులు ఫైల్ చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందిట.

ఆదాయ వెల్లడి పథకం ప్రకటించి నెల గడిచింది కానీ జనం నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. సెప్టెంబర్ నెలాఖరు లోగా దరఖాస్తు చేసేసుకోవాల్సి ఉంటుంది. ఆపై, నవంబరు చివరిలోగా జరిమానా చెల్లించేయాలి. నల్లడబ్బు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న వర్గాల మీద దండోపాయం మినహా మిగిలిన మూడు ఉపాయాలూ ప్రయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దండోపాయం మాత్రం, గడువు తేదీ ముగిసిన తర్వాతే అమలుచేస్తారుట. ఈ పథకం కింద పెద్ద మొత్తంలో సొమ్ములొస్తే సామాన్య ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండును. ఇప్పుడు వసూలు చేస్తున్న పన్నుల్ని సగానికి సగం తగ్గించేస్తాం లాంటి హామీలు అవసరం లేదు కానీ, దొడ్డి దారిన మోపిన స్వచ్ఛ భారత్ సెస్సు, కృషి కళ్యాణ్ సెస్సులని తొలగిస్తామని చెప్పినా ఎంతో కొంత పన్నుల బరువు తగ్గుతుందన్న ఆశ ప్రజల్లో కలిగేదేమో కదా..

సోమవారం, జూన్ 27, 2016

మరల సేద్యానికి

విశ్వనాథ సత్యనారాయణ 'వేయి పడగలు' మొదలు గొల్లపూడి మారుతి రావు 'సాయంకాలమైంది' వరకూ, తరాల అంతరాలని ఇతివృత్తంగా చేసుకుని తెలుగు సాహిత్యంలో అనేక నవలలు వచ్చాయి. ఇదే ధోరణి లో వచ్చిన కన్నడ నవల శివరాం కారంత్ రాసిన 'మరళి మణ్ణిగె.' డెబ్బై ఐదేళ్ల క్రితం కన్నడ పాఠకులని విశేషంగా ఆకర్షించిన ఈ నవలని 'మరల సేద్యానికి' పేరిట తెనిగించారు మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర. నదీ సాగర సంగమానికి సమీపంలో ఉండే ఓ పల్లెటూరిలో పౌరోహిత్యం, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ఓ బ్ర్రాహ్మణ కుటుంబలో మూడు తరాల కాలంలో వచ్చిన మార్పుని రికార్డు చేసిన నవల ఇది.

'కోడి' గ్రామంలో నివసించే శ్రీరామ ఐతాళుల కుటుంబం కథ 'మరల సేద్యానికి.' ఆ చుట్టుపక్కల నాలుగైదు పల్లెటూళ్ళకి ఐతాళులే పురోహితులు. ఇది కాకుండా వ్యవసాయం ఉంది. స్వతహాగా కష్టజీవి, జాగ్రత్త పరుడు. భార్య పారోతి, చెల్లెలు సరసోతి కూడా క్షణం ఖాళీగా కూర్చుందాం అనుకునే మనుషులు కాదు. ఇంటి పనులు, వ్యవసాయం పనులు, వీటితో పాటు పశు పోషణ.. ఏ కాలంలోనూ ఊపిరి సలపని పనిలో కూరుకుపోయి ఉంటుంది ఆ కుటుంబం. తినేది  మామూలు భోజనం, కట్టేవి సాదా వస్త్రాలు. ఎంత ప్రయాణమైనా కాలినడకనే. విశేషించి చిల్లర ఖర్చులేవీ లేకపోవడంతో సొమ్ము జాగ్రత్త చేస్తూ ఉంటారు ఐతాళులు. ఖర్చు వెచ్చాల గురించే కాదు, ఇంటికి సంబంధిచిన ఏ విషయాన్నీ ఆడవాళ్ళతో చర్చించే అలవాటు లేదాయనకి.

ఐతాళుల కొడుకు లక్ష్మీ నారాయణ మాటలు నేర్చే నాటికి చుట్టూ మార్పులు రావడం ఆరంభం అవుతుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ చదువుల ప్రాబల్యం బాగా పెరుగుతుంది. బ్రాహ్మణ కుర్రవాళ్ళంతా పట్నంలో గదులు తీసుకుని ఉంటూ చదువులు ఆరంభిస్తారు. కొన్ని కుటుంబాలు హోటళ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టి, ఈ చదువుకునే కుర్రాళ్ళకి భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడం మొదలుపెడతాయి. కొడుకంటే తగని ముద్దు ఐతాళులకి. అతన్ని ఏం చదివించాలో, అందుకు ఏమాత్రం ఖర్చవుతుందో పెద్దగా అంచనా లేదు కూడా. తాతగారింట ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన లక్ష్మీ నారాయణ, పెద్ద చదువు కోసం పట్నానికి బస మార్చడంతోనే వ్యసనాలకు బానిస అవుతాడు. అయితే, తన అలవాట్లేవీ ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడతాడు.


ఐతాళుల పెంపకం మీద నమ్మకం ఉన్న ఓ గొప్పింటి ప్లీడరు గారు తన కూతురు నాగవేణిని లక్ష్మీనారాయణకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అల్లుడి నిజస్వరూపం తెలియడానికి అట్టే కాలం పట్టదు. అప్పటికే భర్త కారణంగా అనారోగ్యం పాలవుతుంది నాగవేణి. ఐతాళులు ఎంతటి జాగ్రత్త పేరులో అంతటి దుబారా మనిషిగా తయారవుతాడు లక్ష్మీ నారాయణ. అతని బాధ్యత లేనితనం మామగారినే కాదు, తల్లిదండ్రులనీ బాధిస్తుంది. పుట్టింటి వారు తమతో ఉండమని బలవంతం చేస్తున్నా, అభిమానవతి అయిన నాగవేణి అత్తింటికి వచ్చేస్తుంది. ఖర్చు చేయడం తప్ప సంపాదించడం తెలియని లక్ష్మీనారాయణ నిర్వహణలో ఆ కుటుంబం దాదాపు రోడ్డున పడుతుంది. అంతలోనే నాగవేణికి కొడుకు పుడతాడు. 'రాముడు' అని మావగారి పేరు పెట్టుకుని, ఆ బిడ్డే ఆలంబనగా జీవితం సాగిస్తుంది.

లక్ష్మీ నారాయణ బాల్యం ఎంత కులాసాగా గడిచిందో అంతకు పది రెట్ల కష్టాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు రాముడు. వయసుకి మించిన పెద్దరికం, బాధ్యత ఉన్న రాముడు ఎన్నో ప్రయాసలు పడి చదువు పూర్తి చేసేనాటికి దేశంలో యుద్ధ వాతావరణం ముమ్మరమవుతుంది. ఆర్ధిక మాంద్యం ఏర్పడి నిరుద్యోగం ప్రబలుతుంది. పెరిగి ప్రయోజకుడై తల్లిని సంతోష పెట్టాలన్న లక్ష్యంతో చదువు పూర్తి చేసిన రాముడు భవిష్యత్తుని ఎలా తీర్చి దిద్దుకున్నాడు అన్నది ముగింపు. మూడు తరాల జీవితాన్ని 323 పేజీల్లో చిత్రించిన నవల ఇది. కాలమాన పరిస్థితులని, మానవ మనస్తత్వాలనీ చిత్రించిన తీరు ఈ నవలని ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పాలి. వ్యవసాయ సంబంధమైన నవల అవ్వడం వల్ల కావొచ్చు, వాసిరెడ్డి సీతాదేవి 'మట్టిమనిషి' గుర్తొచ్చింది అక్కడక్కడా.

ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది అనువాదాన్ని గురించి. తిరుమల రామచంద్ర అనువాదం మక్కీకి మక్కీగా సాగినట్టు ఎక్కడా అనిపించదు. అక్కడక్కడా రాయలసీమ నుడికారం వినిపించే భాష, కథ తాలూకు స్థల కాలాదులని కళ్ళముందు ఉంచుతుంది. కథ తాలూకు వాతావరణంలోకి ఒక్క సారి ప్రవేశించాక, నవల పూర్తి చేయకుండా పక్కన పెట్టడం అసాధ్యం. వకుళాభరణం రామకృష్ణ ముందుమాటలో చెప్పినట్టుగా 'కొత్త పాతల మేలుకలయికగా సమాజం పురోగమించాలన్నదే' ఈ నవల సందేశం. హోరు వినిపించే సముద్రతీర గ్రామంతో పాటు, పారోతి, సరసోతి, నాగవేణి అనే ముగ్గురు స్త్రీలూ చాలాకాలంపాటు వెంటాడతారు మనల్ని. (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, వెల: రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, జూన్ 24, 2016

ఒక మనసు

దర్శకుడు రామరాజు ఓ ప్రేమకావ్యం రాయాలనుకున్నారు. అందుకోసం సెల్యులాయిడ్ ని ఎంచుకున్నారు. నెమ్మదిగా సాగే కథనం, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి, పోను పోను ఉత్కంఠ, గుర్తుండిపోయే ముగింపు.. వీటితో రాయాల్సింది పుస్తకమే.. కానీ, సినిమా తీశారు. అందమైన ఫ్రేములనీ, వీనుల విందైన సంగీతాన్నీ జతచేశారు. సినిమా గ్రామర్ గా చెప్పబడే విషయాలు వేటినీ పెద్దగా పట్టించుకోలేదు.. డాన్సులు, ఫైట్లు, పంచ్ డైలాగులు, ఇంటర్వల్ బాంగ్ ఇలాంటివేవీ తన కథకి అవసరం లేదని నమ్మారు. ఫలితంగా, మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతిని ఇచ్చే సినిమాని అందించారు.

నిహారిక కొణిదెల, నాగశౌర్య మూల్పూరి ప్రధాన పాత్రలుగా రామరాజు తీసిన 'ఒక మనసు' మల్లెపువ్వంత సున్నితమైన సినిమా. డాక్టర్ గా పనిచేస్తున్న సంధ్య (నిహారిక), రాజకీయ నాయకుడు కావాలనుకునే సూర్య (నాగశౌర్య) ల మెచ్యూర్డ్ ప్రేమకథ ఇది. తనకి తెలియకుండానే సూర్యతో ప్రేమలో పడినప్పుడు, గతజన్మ వాసనలే అందుకు కారణమని నమ్ముతుంది సంధ్య. ఆ ప్రేమకి ఊహించని అడ్డంకి వచ్చినప్పుడు తన వాడికోసం వేచి చూస్తుంది. అతను వస్తాడన్న ఆమె నమ్మకం తాలూకు బలం వల్లే కావొచ్చు, సూర్య తిరిగి వస్తాడు. ఎడబాటు తర్వాత తిరిగి కలుసుకున్న ఆ జంటకి కొంత కాలానికే మరో అడ్డంకి. ఈసారి, పరిష్కారం సంధ్య చేతిలోనే ఉంది. ఆమె చూపిన పరిష్కారం - ఆమే చెప్పినట్టుగా - తప్పే కానీ, వెంటాడుతుంది చాన్నాళ్లపాటు.

రెండున్నర గంటల సినిమాలో రెండు గంటలకి పైగా తెరమీద కేవలం నాయికా నాయకులు మాత్రమే కనిపిస్తారు. వాళ్ళతో పాటు, వాళ్ళ మూడ్స్ కి అనుగుణంగా చుట్టూ ఉండే ప్రకృతి, నేపథ్యంలో వినిపించే సంగీతం. డాక్టరుగా పనిచేసే సంధ్యలో ఎంతటి భావుకత్వం, సున్నితత్వం ఉంటాయో, ఎమ్మెల్యే మేనల్లుడిగా, ఓ చోటా నాయకుడి కొడుకుగా సెటిల్మెంట్లు చేస్తూ, అవసరమైతే జనాలని తన్ని తన దారికి తెచ్చుకునే సూర్యలోనూ ప్రేమ దగ్గరికి వచ్చేసరికి అంతే భావుకత్వం కనిపిస్తుంది. అందుకేనేమో, వాళ్ళిద్దరి సంభాషణల్లోనూ ఎక్కువగా కొటేషన్లే వినిపిస్తాయి. మంచుతెరల్లోనూ, వర్షపు వేళల్లోనూ, కోటగోడలు, కొండలు, అడవులు, సముద్ర తీరాల్లో కలిసి నడుస్తూ  కబుర్లు చెప్పుకుంటూ ఉంటుందా జంట.


ప్రేమలో పడిన కొత్తల్లో, "నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా? మీ నాన్నంటేనా?" అని సంధ్య అడిగినప్పుడు, తడుముకోకుండా "మా నాన్నంటే" అని చెబుతాడు సూర్య. కొన్నాళ్ల తర్వాత ఆమె అదే ప్రశ్న అడిగితే "ఇద్దరూ సమానం" అంటాడు. మరి కొన్నాళ్ల తర్వాత, సంధ్యకి మళ్లీ ఆ ప్రశ్న అడగాల్సిన పరిస్థితి రావడం, అతన్ని అడక్కుండా తనే జవాబుని నిర్ణయించడంతో కథ ముగుస్తుంది. నాయికా నాయకుల మధ్య అనుబంధం తర్వాత, దర్శకుడు అంతగా శ్రద్ధ తీసుకున్నది సూర్య, అతని తండ్రి (రావు రమేష్) ల మధ్య ఉన్న బంధాన్ని,  సంధ్య, ఆమె తల్లి (ప్రగతి) మధ్య అనుబంధాన్ని చూపేందుకే. తండ్రి కోసం ఎంతో చేయాలనుకుని, ఏమీ చేయలేనేమో అని సంఘర్షణ పడే సన్నివేశాల్లో నాగశౌర్య మంచి నటనని ప్రదర్శించాడు. రావు రమేష్, ప్రగతిలకి వాళ్ళ పాత్రలు కొట్టిన పిండి.

నీహారిక వయసుకి మించిన పాత్ర పోషించింది. ఆ అమ్మాయి నటనకి ఎక్కడా వంక పెట్టడానికి లేదు. అయితే, సినిమా విజయానికి నీహారిక ప్లస్ అవుతుందా లేక మైనస్సా అన్నది తెలియడానికి కొంచం ఆగాలి బహుశా. ('నీహాని ఇప్పటికి పదిహేడు సార్లు హగ్ చేసుకున్నాడు వాడు' అని ఇంటర్వల్లో ఓ మెగాభిమాని ఆవేదన చెందాడు. లెక్క పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో?!). హీరో ఫ్రెండ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, ఎమ్మెల్యేగా నాగినీడు కనిపించారు. ఇప్పటి రాజకీయాల మీద తన ఆవేదనని కొన్ని సన్నివేశాల రూపంలో ప్రకటించాడు దర్శకుడు. కెమెరా (రామ్ రెడ్డి), సంగీతం (సునీల్ కశ్యప్) కథకి తగ్గట్టుగా చక్కగా అమిరాయి. అయితే, దర్శకుడు ఏమాత్రం పట్టించుకోని విషయం ఎడిటింగ్.

కథలో ఏ మలుపు లేకుండా ఇంటర్వల్ వచ్చేయడంతో సినిమా అయిపోయిందేమో అని అనుమానించారు కొందరు ప్రేక్షకులు. (కార్డు విశ్రాంతికీ, ముగింపుకీ కూడా అన్వయించుకునేందుకు వీలుగా ఉంది). రెండో సగం చివరి వరకూ కూడా స్లో నేరేషన్ సాగి సాగి ఒక్కసారిగా కథలో కుదుపు వచ్చి చివరి పావుగంటా పరుగులు తీస్తుంది. రెండు సగాల్లోనూ కలిపి ఓ పదిహేను-ఇరవై నిమిషాలు ఎడిట్ చేస్తే "ఇంకా ఎంతసేపు" అన్న అసహనం కలగదు ప్రేక్షకులకి. పాత్రల మానసిక స్థితిని, సంఘర్షణని చిత్రించడానికి సింబాలిక్ షాట్స్ ఎంచుకుని, వాటినే పదేపదే చూపించడం వల్ల సీన్లు రిపీట్ అవుతున్నాయని ప్రేక్షకులకి సందేహం కలిగే తావిచ్చారు. ఎడిటింగ్ దగ్గర  కాస్త జాగ్రత్త పడితే బాగుండేది. సెన్సిబిలిటీస్ ని ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చే సినిమా ఇది.

(రామరాజు మొదటి సినిమా 'మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' ఎక్కడన్నా దొరికితే బాగుండును, చూడాలనివుంది).

మంగళవారం, జూన్ 21, 2016

నాని జెంటిల్ మన్

కమర్షియల్  హంగులని కాక కథలని మాత్రమే నమ్ముకున్న నవతరం దర్శకులు స్క్రీన్ ప్లే ప్రాధాన్యతని బాగా అర్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది, ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలు చూస్తుంటే. కథనంతో ప్రేక్షకులని కట్టి పడేయాలన్న సూత్రాన్ని నమ్ముకున్న తాజా సినిమా 'నాని జెంటిల్ మన్.' పోస్టర్స్ లో 'జెంటిల్ మన్' అని మాత్రమే కనిపిస్తోంది కదా అనకండి. 'అతః కుంజరః' టైపులో పైన ఇంగ్లీష్ లో నాని అని ఉంటుంది చూడండి. సెన్సార్ సర్టిఫికెట్ లో మాత్రం మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంది టైటిల్. సహజ నక్షత్రం నాని కథానాయకుడిగా నటించిన డబుల్ ఫోటో సినిమా ఇది. ఇంతకీ ఇతగాడు కథా నాయకుడా లేక ప్రతి నాయకుడా అన్నది వెండితెర మీద చూడాలి.

కోటీశ్వరుల ఇంటి బిడ్డ ఐశ్వర్య (సురభి), విజువల్ గ్రాఫిక్స్ ఎక్సపర్ట్ మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి కేథరీన్ (నివేదా థామస్) ఓ ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో పక్క పక్క సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తూ, టైం కిల్ చేయడం కోసం ఒకరి కథలు ఒకరికి చెప్పుకుని అటుపై ప్రాణ స్నేహితురాళ్ళు అయిపోతారు. కేథరీన్ గౌతమ్ తో ప్రేమలో పడితే, ఐశ్వర్య పెద్దలు కుదిర్చిన వరుడు జయరాంతో కలిసి కోడై కెనాల్ వెళ్లి అప్పుడతణ్ణి ప్రేమించడం మొదలుపెడుతుంది. ఐశ్వర్య ని రిసీవ్ చేసుకోడానికి విమానాశ్రయానికి వస్తాడు జయరాం. అచ్చూ గౌతమ్ లాగే ఉన్న జయరాంని చూసి అయోమయంలో పడుతుంది కేథరీన్. ఆగలేక నేరుగా గౌతమ్ ఇంటికే వెళ్తుంది కూడా. అక్కడ గౌతమ్ గురించి ఆమెకి తెలిసిన ఓ నిజం కథని మలుపు తిప్పి ప్రేక్షకులకి విశ్రాంతినిచ్చి, రెండోసగంలో పూర్తిగా కేథరీన్ కథగా మారిపోతుంది.


ఆర్. డేవిడ్ నాథన్ కథకి విస్తరణ చేసి, సంభాషణలు రాసుకుని, దర్శకత్వం చేశారు ఇంద్రగంటి మోహనకృష్ణ. గౌతమ్ గానూ, జయరాం గానూ కనిపించిన నాని  రెండు పాత్రల్లో వేరియేషన్ ని చక్కగా చూపించాడు. పూర్తి స్థాయిలో విలన్ పాత్ర  దొరికితే పోషించి మెప్పించే సామర్ధ్యం ఉందని నిరూపించుకున్నాడు. నానితో సమంగా సినిమాని మోసిన నివేదా థామస్ చాలా ఫ్రేముల్లో ప్రియమణి-మీరా జాస్మిన్ లని జమిలిగా గుర్తు చేసింది. మరో నాయిక సురభికి, నివేదతో పోల్చినప్పుడు నటించడానికి పెద్దగా అవకాశం లేకపోయినా, ఉన్నంతలో ఎక్కడా లోపం చెయ్యలేదు. మిగిలిన వారిలో రోహిణి, శ్రీముఖి, అవసరాల శ్రీనివాస్ లకి మంచి పాత్రలు దొరికాయి. వెన్నెల కిషోర్ పాత్ర అసంపూర్తిగా అనిపించింది. ప్రగతి, రమాప్రభలవి మరీ సెట్ ప్రాపర్టీ లాంటి పాత్రలు.

సాంకేతిక విభాగాల్లో చాలా బాగా అనిపించినవి కెమెరా (పి.జి. విందా), సంగీతం (మణిశర్మ) మరియు ఎడిటింగ్ (మార్తాండ్ కె. వెంకటేష్). ఎన్నో సినిమాల్లో చూసేసిన కోడై కెనాల్ ని కూడా కొత్తగా చూపించారు విందా. చాలా రోజుల తర్వాత వినిపించిన మణిశర్మ పాటల కన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తన మేజిక్ చూపించారు. తొలిసగం ఆహ్లాదంగానూ, రెండో సగం ఉత్కంఠ భరితంగానూ సాగే సినిమా మూడ్ ని నేపధ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. ఎక్కడా విసుగు కలగక పోవడం, ఏ సన్నివేశం అనవసరం అనిపించక పోవడంలో ఎడిటర్ పాత్ర చాలానే ఉందనిపించింది. కథనంలో ఉత్కంఠ వల్ల రెండో సగంలో వచ్చే పబ్ సాంగ్ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడాల్సి వచ్చింది. (అప్పటికి ముగింపుని ఊహించినప్పటికీ, కథ ఆ ముగింపుకి ఎలా చేరుతుందో చూడాలన్న కుతూహలం పెరిగింది).

ముందుగా చెప్పుకున్నట్టుగా ఇది కథ కన్నా స్క్రీన్ ప్లే ని బాగా నమ్ముకున్న సినిమా. కథనం మీద చేసిన కృషి వృధా పోలేదు. రెండు ప్రేమకథలని నడపడం లోనూ కొత్తదనం కోసం రిస్కు చేయకుండా, నలిగిన పంథాలోనే వెళ్లారు. ఈ ప్రేమకథలో వేసిన బలమైన పునాది రెండో సగాన్ని ఎక్కడా ఆసక్తి సడలని విధంగా నడపడానికి సాయపడింది. తెరమీద మిస్టరీ మొదలవ్వగానే ప్రేక్షకులు కనిపించిన ప్రతి పాత్రనీ అనుమానించడం సహజం. అయితే, హీరోని కూడా అనుమానించేలా సాగిన కథనం ముగింపు మీద ఆసక్తిని బాగా పెంచింది. నివేద రోహిణిని రెండోసారి కలుసుకునే సన్నివేశం, మోహన కృష్ణ బెస్ట్ సీన్స్ లో ఒకటవుతుంది. మేధావుల సంగతెలా ఉన్నా, సగటు ప్రేక్షకులకి నచ్చే సినిమా 'పైసా వసూల్' సినిమా ఇది.

సోమవారం, జూన్ 20, 2016

చోఖేర్ బాలి

ఇద్దరు ఆడపిల్లల మధ్యన స్నేహం కుదిరినప్పుడు వాళ్ళిద్దరూ ఒకే సంకేతనామంతో ఒకరినొకరు పిలుచుకోవడం బెంగాలీ సంప్రదాయం. కరుణకి తన భర్త కుంజబాబు తరపు దూరపు బంధువు మాయతో స్నేహం కుదిరింది. అప్పుడు ఆ స్నేహితురాళ్ళు ఇద్దరూ ఎంచుకున్న సంకేతనామం 'చోఖేర్ బాలి.' తెలుగులో అయితే 'కంట్లో నలుసు.' కరుణని పెళ్లి చేసుకోడానికి పూర్వం, మాయ సంబంధం వచ్చింది కుంజబాబుకి. అతడు ఆమెని తిరస్కరించాడు. తదుపరి మాయకి వేరే వ్యక్తితో వివాహం జరగడం, పెళ్ళైన కొద్ది కాలానికే అతడు మరణించడంతో వితంతువై పుట్టింటికి చేరుతుంది మాయ. కుంజ తల్లి లక్ష్మికి మాయ అంటే చాలా అభిమానం. కొన్నాళ్ళు తన ఇంట్లో ఉంచుకుని ఆదరించాలని అనుకుంటుంది.

మాయ వితంతువుగా మారే సమయానికే, లక్ష్మి ఇష్టానికి విరుద్ధంగా కరుణని పెళ్లి చేసుకుంటాడు కుంజ. లక్ష్మి ఆహ్వానం మేరకి ఆ ఇంటికి వచ్చిన మాయ అతి తక్కువ సమయంలోనే కరుణతో స్నేహం చేసేస్తుంది. అమాయకురాలైన కరుణ తనకి సంబంధించిన ప్రతి విషయమూ -పడకింటి సంగతులతో సహా - మాయతో పంచుకుంటుంది. కుంజ తనకి భర్త కావాల్సిన వాడు అన్న విషయం మర్చిపోలేని మాయ కరుణ మీద ద్వేషం పెంచుకుంటుంది. పైకి కరుణతో స్నేహం నటిస్తూనే, కుంజని ఆకర్షిస్తుందామె. కరుణ-కుంజల మధ్య మాయ, కుంజ-మాయల మధ్య కరుణ 'కంటిలో నలుసు' గా మారే పరిస్థితులు వచ్చేస్తాయి. ఈ కథ ఏ కంచికి చేరిందన్నదే 'విశ్వకవి' రవీంద్రనాథ్ టాగోర్ నవల 'చోఖేర్ బాలి.'


కుంజ-కరుణ-మాయలకి సమ ఉజ్జీ అయిన పాత్ర బిహారీ. కుంజ కి ప్రాణ స్నేహితుడైన బిహారీ లక్ష్మి కి చిన్న కొడుకుతో సమానం. నిజానికి కరుణ సంబంధం బిహారీకోసం చూసినదే. బిహారీకి తోడుగా పెళ్లి చూపులకి వెళ్ళిన కుంజ కరుణ మీద మనసు పడడంతో స్నేహితుడి కోసం తన పెళ్లిని త్యాగం చేస్తాడు బిహారీ. కరుణ మీద ఎలాంటి రెండో ఆలోచనా లేని బిహారీ, ఆమెని 'వదినా' అని పిలవడం మొదలు పెడతాడు. అయితే, బిహారీకి ఎదురు పడడం కరుణకీ, బిహారీ-కరుణ మాట్లాడుకోడం కుంజ కీ ఇష్టం లేని విషయాలు. ఆ ఇంటికి తరచూ వస్తూ, ఓ కుటుంబ సభ్యుడిగా కలిసిపోయిన బిహారీ మాయ ప్రవర్తనని అనుమానిస్తాడు. కుంజకి తనవైపు ఆకర్షించేందుకు ఆమె చేసే ప్రయత్నాలని కరుణకన్నా ముందుగా పసిగడతాడు బిహారీ. విషయం చాలా సున్నితమైనది కావడంతో ఏం చేయాలో తెలియక విలవిల్లాడతాడు.

లక్ష్మి భోళా తనం, కరుణ అమాయకత్వం, కుంజ చంచల స్వభావం మాయ పనిని సులభం చేస్తాయి. పెళ్ళైన కొద్ది కాలానికే కుంజ దృష్టి కరుణ నుంచి మాయ వైపుకి మరలుతుంది. మాయ కోసం పిచ్చి వాడై పోయి, కరుణని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతాడు బిహారీ. భర్త మనసులో తనకి స్థానం లేనప్పుడు, అతని ఇంట్లో ఉండడం భావ్యం కాదనుకున్న కరుణ కాశీకి వెళ్ళిపోతుంది. ఆ భార్యా భర్తల మధ్య దూరం పెరగగానే, మాయ దృష్టి బిహారీ వైపుకి మళ్ళుతుంది. అయితే, బిహారీని తనకి ఆకర్షితుడిని చేసుకోవాలని కాక, అతన్ని నిజంగానే ప్రేమిస్తుంది మాయ. అతన్ని గెలుచుకోడం కోసం, తన చుట్టూ పిచ్చి వాడిలా తిరుగుతున్న కుంజని ఉపయోగించుకోవడం మొదలు పెడుతుంది మాయ. కరుణనే కాదు, ఇంటినీ తన మెడిసిన్ చదువునీ కూడా నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతాడు కుంజ.

మాయ నుంచి కరుణనీ, కుంజనీ రక్షించడాన్ని తన బాధ్యతగా భావించిన బిహారీకి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతాయి. కుంజకి బిహారీ పట్ల మనసు విరిగిపోతుంది. మాయ తనని పిచ్చి వాడిని చేసి ఆడిస్తోందని తెలిసీ, ఆమె ఆకర్షణ నుంచి బయట పడలేక పోతాడు. నూరేళ్ళ నాటి బెంగాల్ పరిస్థితులు, జమీందారీ కుటుంబపు వాతావరణం, ఆ ఇంటి పద్ధతులు, నాటి మానవ సంబంధాలు వీటన్నింటినీ నిశితంగా చిత్రించిన నవల 'చోఖేర్ బాలి.' యాభై ఆరేళ్ళ నాటి దండమూడి మహీధర్ తెలుగు అనువాదాన్ని తాజాగా ప్రచురించింది సాహితి ప్రచురణలు. తెలుగు అనువాదంలో పాత్రల పేర్లు మార్చారు, ఎందుకో? ఇదే పేరుతో ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా యూట్యూబ్లో అందుబాటులో ఉంది. నాటి అనువాద సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్లకి నచ్చే పుస్తకం. (పేజీలు  232, వెల రూ. 100, ఎమెస్కో పుస్తక కేంద్రంలో లభిస్తుంది).

బుధవారం, జూన్ 15, 2016

అఆ

నలభై ఐదేళ్ళ క్రితం సినీ నటి విజయనిర్మల సినిమాకి దర్శకత్వం చేయాలని సబ్జక్ట్ ల కోసం వెతుకుతున్నప్పుడు తన అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి రాసిన 'మీనా' నవల ఆమె దృష్టికి వచ్చింది.  నవలాదేశపు రాణి నుంచి ఆ నవల హక్కులు కొనడం మాత్రమే కాక, టైటిల్ కార్డు ఇచ్చి గౌరవించారు, ఏనాడూ విలువలని గురించి సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వని విజయ నిర్మల. నాలుగున్నర దశాబ్దాల తర్వాత అదే నవల మళ్ళీ సినిమాగా వచ్చింది 'అఆ' పేరుతో. త్రివిక్రమ్ కి రచయితగానూ, దర్శకుడిగా స్టార్ స్టేటస్ వచ్చేయడం వల్లేమో, హక్కులు కొనడం, టైటిల్ కార్డ్స్ లో 'కథ' అని గౌరవం ఇవ్వడం లాంటి శషభిషలేవీ పెట్టుకోకుండా కథని వాడేసుకున్నారు.

ఈ జనరేషన్లో 'మీనా' నవల చదివిన వాళ్ళూ, సినిమా చూసిన వాళ్ళూ చాలా తక్కువ మంది ఉండడం, త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్, సమంత గ్లామరు, పంచ్ డైలాగులు.. ఇవన్నీ కలిసి సినిమా బాగా నడించేందుకు దోహదం చేస్తున్నాయి. ఓ నవలని సినిమాగా తీసేప్పుడు, నవలలో ఉన్న భావోద్వేగాలన్నీ తెరమీదకి అనువదించడం కుదిరేపని కాదు. నవలకి పెద్దగా లెక్కలుండవు కానీ సినిమాకి తప్పకుండా ఉంటాయి. బహుశా అందువల్లే, అటు విజయనిర్మల, ఇటు త్రివిక్రమ్ కూడా 'మీనా' నవలకి పూర్తి న్యాయం చెయ్యలేక పోయారు. పోల్చి చూస్తే, త్రివిక్రమ్ కన్నా విజయనిర్మలే నవలకి ఎక్కువ న్యాయం చేశారు. ఆమె సినిమా చూసేప్పుడు నలభై ఐదేళ్ళ నాటి సినిమా, దర్శకురాలిగా ఆమె తొలి సినిమా అన్న విషయాలు గుర్తు పెట్టుకోవాలి.

'అఆ' కథలోకి వస్తే, పారిశ్రామికవేత్త మహాలక్ష్మి (నదియా), అడ్వొకేట్ రామలింగం (సీనియర్ నరేష్) ల ఏకైక కూతురు అనసూయ (సమంత). ఇంట్లో మనుషులు ఊపిరి పీల్చడాన్ని కూడా నియంత్రించే టైపు మనిషి మహాలక్ష్మి. సహజంగానే తండ్రికి దగ్గరవుతుంది అనసూయ. తల్లి మీద ఉన్న వ్యతిరేకత కారణంగానే ఆమె చూసిన పెళ్లి సంబంధాన్ని ఇష్ట పడదు. అనుకోకుండా తల్లి చెన్నై వెళ్ళడంతో, ఆ పదిరోజులూ తల్లి పేరు వినిపించని చోటికి వెళ్ళాలనుకుంటుంది. రామలింగం ఆమెని కలువపూడిలో ఉన్న మహాలక్ష్మి అన్న ఇంటికి పంపుతాడు. ఆ అన్నకొడుకు ఆనంద్ విహారి (నితిన్) తో అనసూయ ప్రేమలో పడడంతో కథ మలుపు తిరిగి, మహాలక్ష్మి-అనసూయల మధ్య దూరం తగ్గడంతో సినిమా ముగుస్తుంది.


'అనసూయ రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి' అన్న పూర్తి పేరుకి 'అఆ' అని షార్ట్ కట్ ఇచ్చిన దర్శకుడు, ఆనంద్ విహారిని పెద్దగా పట్టించుకోకుండా అనసూయ మీద దృష్టి కేంద్రీకరించాడు. తల్లి నీడనే ఉంటూ, బలవంతంగా తల్లి మాటలకి తల ఊపుతూ, లోలోపల నలిగిపోయే అనసూయగా సమంతకి మంచి పాత్ర దొరికింది. అయితే, గ్లామర్, కాస్ట్యూమ్స్ విషయంలో ఆ అమ్మాయి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా నాగవల్లి గా వేసిన అనుపమా పరమేశ్వరన్ తో కాంబినేషన్ సీన్లలో సమంత తేలిపోయింది. నితిన్ కూడా వడిలిపోయి కనిపించాడెందుకో. భార్య చాటు భర్తగా నరేష్ ఒప్పించాడు. కాకపొతే, ఈ పాత్రని మరీ రొటీన్ గా డిజైన్ చేశారనిపించింది. స్వార్ధ పరురాలైన చెల్లెలు, స్ట్రిక్ట్ మనిషి మహాలక్ష్మిగా నదియాని చూసినప్పుడు నగ్మా గుర్తొచ్చింది చాలాసార్లు.

పల్లం వెంకన్న అనే పల్లెటూరి మోతుబరి పాత్రలో కనిపించిన రావు రమేష్ ఎప్పుడూ లేనిది తన తండ్రిని అనుకరించే ప్రయత్నం చేశాడీ సినిమాలో. తనకంటూ ఓ సొంత మార్కుతో ముందుకు వెళ్తున్న రమేష్, రావు గోపాలరావుని అనుకరించడానికి కారణం అర్ధం కాలేదు. ఇంకొంచం సటిల్ గా చేస్తే బాగుండుననిపించింది. సమంత పనమ్మాయిగా వేసినమ్మాయి, నదియా పీయే గా చేసిన శ్రీనివాస రెడ్డి నవ్విస్తారు. పాటలు, నేపధ్య సంగీతం రెండూ కూడా మైనస్ ఈ సినిమాకి. ఒక్క పాటా గుర్తు పెట్టుకునేలా లేదు. కీలకమైన సన్నివేశాల్లో వినిపించే సంగీతం, గతకాలపు హిట్ పాటలని జ్ఞాపకం చేయడం విషాదం. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మహాలక్ష్మి బంగ్లా, ఆనంద్ విహారి ఇల్లు, కలవపూడి ఊరు విజువల్స్ కంటికి చాలా హాయిగా ఉన్నాయి. తళుక్కున మెరిసే పాత్రల్లో సీనియర్ నటి అన్నపూర్ణ, 'జబర్దస్త్' చమ్మక్ చంద్ర, 'షకలక' శంకర్ గుర్తుండిపోతారు.

చక్కగా తీయడానికి అవకాశం ఉన్న కథని త్రివిక్రమ్ లాంటి దర్శకుడు అతుకుల బొంతలా తీయడం మింగుడు పడలేదు. నవలలో, మొదటి సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర అయిన సారధిని, శేఖర్ (అవసరాల శ్రీనివాస్) అనే అతిధి పాత్రగా కుదించి నాలుగు సీన్లకి పరిమితం చేశారు. ఆ పాత్ర ఎప్పుడు ఎందుకు ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం కాదు. మంచి కుటుంబ కథా చిత్రంగా మలచడానికి అవకాశం ఉన్న కథని ఎంచుకుని, కేవలం ఓ కాలక్షేప చిత్రం తీయడం, అదికూడా బాగా పేరున్న దర్శకుడు గొప్ప తారాగణంతో, భారీ బడ్జెట్ తో తీయడం చివుక్కుమనిపించింది. విలువల్ని గురించి మాట్లాడే త్రివిక్రమ్ ని తన అభిమాన రచయిత్రి కథని కాపీ చేస్తున్నాననే గిల్ట్ వెంటాడి సినిమాని సరిగ్గా తీయనివ్వలేదా?

సోమవారం, జూన్ 13, 2016

నల్లమిరియం చెట్టు

డాక్టర్ వి. చంద్రశేఖర రావు రాసిన 'నల్లమిరియం చెట్టు' నవలని గురించి చెప్పాలంటే, ముందుగా 'మాదిగ దండోరా' ఉద్యమాన్ని గురించి రేఖామాత్రపు పరిచయం అవసరం. భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డు కులాల జాబితాలో సుమారు అరవై ఉపకులాలు ఉన్నాయి. అయితే, విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లు మొదలైన నాటినుంచీ (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ లో మాల కులస్తులు మాత్రమే రిజర్వేషన్ల ప్రయోజనాలని పొందుతుండగా, మిగిలిన ఉపకులాలకి - మరీ ముఖ్యంగా మాదిగలకి - వారి దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరగడం లేదన్న ఆందోళన ఇప్పటికి దాదాపు నలభయ్యేళ్ళ క్రితం తొలిసారిగా మొదలయ్యింది. ఇరవై రెండేళ్ళ క్రితం మొదలైన 'మాదిగ దండోరా' ఉద్యమంతో ఉధృతమయ్యింది. సూక్ష్మ స్థాయిలో రిజర్వేషన్లకోసం (కోటాలో ఉపకోటా) మాదిగల ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది.

రాష్ట్రంలో మాదిగ దండోరా ఉద్యమ ప్రారంభ కాలంలో (1994) ఓ మాదిగ కుటుంబంలో జరిగిన కథని అదే కుటుంబంలోని ఓ టీనేజ్ అమ్మాయి గొంతు నుంచి వినిపించారు డాక్టర్ చంద్రశేఖర రావు తను 2012 లో రాసిన 'నల్లమిరియం చెట్టు' నవలలో. ఇది రాజ సుందరంగా మారిన రావెల రాజయ్య కథ. ప్రకాశం జిల్లాలో ఓ మాదిగ పల్లెలో తిరపతయ్య-ఆదెమ్మల తొలి సంతానం రాజయ్య. అతనికి ఒక తమ్ముడు కరుణ కుమార్. మిషనరీ స్కూల్లో చదువుకున్న రాజయ్య ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించుకుంటాడు. క్రిష్టియన్ అయిన విజయని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత పల్లెతో అతని సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సంఘం చేత గౌరవింపబడాలంటే బాగా డబ్బు సంపాదించడం తప్ప మరో మార్గం లేదని గ్రహిస్తాడు రాజయ్య.

పాఠ్య పుస్తకాల వ్యాపారంతో ఆరంభించి, అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, రాజకీయాల్లో చేరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు 'రాజ సుందరం' అవుతాడు రాజయ్య. పార్టీ అతనికి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్టు సంకేతాలు పంపుతుంది. సరిగ్గా అదే సమయంలో మొదలైన దండోరా ఉద్యమం రాజయ్య రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్ధకం చేస్తుంది. అతను అధికార పార్టీ సభ్యుడు. ఆ పార్టీకి దండోరా ఉద్యమం మీద సానుభూతి లేదు. ఉద్యమం ఉనికిని కూడా ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి లేదు. పార్టీ సభ్యుడిగా, కాబోయే ఎమ్మెల్యేగా రాజ సుందరం ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించాలి. తను రాజయ్యని అని మర్చిపోడానికి ప్రయత్నిస్తున్న రాజ సుందరం ఎలాంటి రెండో ఆలోచనా లేకుండా ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అతని తమ్ముడు కరుణ అనూహ్యంగా దండోరా ఉద్యమం పగ్గాలు చేపడతాడు.


అన్నకి పూర్తిగా భిన్నమైనవాడు కరుణ. తల్లి కష్టం చూడలేక చదువు మానేశాడు. రోజు కూలీగా పని చేశాడు. మొదట కమ్యూనిస్టు ఉద్యమం లోనూ, తర్వాత నక్సల్బరీలోనూ పని చేశాడు. కాంతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాజయ్య జీవితం పద్దతిగా, ఒకలాంటి స్థిరత్వంతో సాగితే, కరుణ ఏటికి ఎదురీదాడు. అన్న మార్గం పూర్తిగా భిన్నమని తెలుసు. కానీ, అన్నన్నా, అతని పిల్లలన్నా కరుణకి ప్రాణం. దండోరా ఉద్యమానికి ఎంతో మంది యువత ఆకర్షితులవుతారు. దానినో ఆత్మగౌరవ పోరాటంగా స్వీకరిస్తారు. రోజురోజుకీ బలపడే పోరాటంలో టీనేజికి వచ్చిన తన పిల్లలు పాల్గొనడం తీవ్ర అశాంతికి గురిచేస్తుంది రాజ సుందరాన్ని. తమ్ముడి నాయకత్వం కన్నా, తన పిల్లల వ్యవహార శైలి  చికాకు పెడుతుంది అతన్ని. కులాన్ని నిచ్చెనగా మాత్రమే వాడుకోవాలనే రాజ సుందరానికీ, కులం కోసం మొండిగా నిలబడే కరుణకీ మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది.

దండోరా ఉద్యమం రోజురోజుకీ బలపడడంతో అందుకు అనుగుణంగా రాజకీయ సమీకరణాలూ మారతాయి. రాజయ్య పార్టీ ఉద్యమానికి మద్దతు పలుకుతుంది. అంతే కాదు, ఎమ్మెల్యే టికెట్ రాజయ్యకి కాక, కరుణకి ఇవ్వడం వల్ల రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న లెక్కలు మొదలవుతాయి. పైకి ఎదగడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న రాజయ్యకి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఇది. అయితే, అతడు అనుభవ శూన్యుడు కాదు. అప్పటికే రాజకీయాలని బాగా అర్ధం చేసుకున్నాడు. తన మనుగడ కోసం ప్రణాళికలు వేసుకున్నాడు. వాటిని అమలు పరిచే క్రమంలో రాజ సుందరం పొందింది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటన్నది 'నల్లమిరియం చెట్టు' నవల ముగింపు. కథ మొత్తాన్ని రాజసుందరం టీనేజ్ కూతురు కమలి గొంతుతో వినిపిస్తారు రచయిత. ఇందువల్ల, కొన్ని సన్నివేశాల్లో కమలి, ఆమె తమ్ముడు రూమీ పాత్రలు వయసుకి మించిన పరిణతితో కనిపిస్తాయి.

ఒక్కో పాత్ర దృష్టి కోణం నుంచీ ఒక్కోలా కనిపించే కథ ఇది. నిజానికి రాజ సుందరం పాత్రని అర్ధం చేసుకోడం అంత సులువు కాదు. 'ఆకుపచ్చని దేశం' నవలలో అలలసుందరానికీ, ఈ రాజ సుందరానికీ చాలా పోలికలు కనిపిస్తాయి. సొంత ప్రయోజనాల కోసం కులం ప్రయోజనాలని పణంగా పెట్టే పాత్రలే రెండూ. రాజ సుందరం పాత్రలో సంఘర్షణని చిత్రించిన తీరు ఈ నవలకి ప్రాణం. తర్వాత చెప్పుకోవాల్సినవి స్త్రీ పాత్రలు. ఆదెమ్మ గతం, కళ్యాణరావు రాసిన 'అంటరాని వసంతం' నవలని గుర్తు చేస్తుంది. కాంతం, విజయలతో పాటు కథ చెప్పే కమలి కూడా బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రే. తక్కువ సన్నివేశాల్లోనే అయినా రాజయ్య-విజయ, కరుణ-కాంతం దంపతుల మధ్య బంధంలో కాలంతో పాటు వచ్చిన మార్పులని పాత్రోచితంగా చిత్రించారు రచయిత. రూమీ ఓ ప్రత్యేకమైన పాత్ర. కథ, కథనం ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయనే చెప్పాలి.

నవలా రచన బాగా తగ్గిపోతున్న కాలంలో  సమకాలీన సాంఘిక, రాజకీయ అంశాలని ఇతివృత్తంగా తీసుకుని, గుర్తుండిపోయే నవలలు రాస్తున్న డాక్టర్ చంద్రశేఖర రావు తన కృషిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు 'ఆకుపచ్చని దేశం' ఇటు 'నల్లమిరియం చెట్టు' రెండూ కూడా వెంటాడే నవలలే. కె. శివారెడ్డి రాసిన సుదీర్ఘమైన ముందుమాటని నవలని మొదటిసారి చదవడం పూర్తి చేశాక, అప్పుడు చదవడం బాగుంటుంది. ('నల్లమిరియం చెట్టు,' చరిత ఇంప్రెషన్స్ ప్రచురణ, పేజీలు  244, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, జూన్ 10, 2016

చంద్రిక కథ

తమిళులు దైవ సమానుడిగా ఆరాధించే రచయిత సుబ్రహ్మణ్య భారతి రాసిన ఒక నవలలో ముఖ్యపాత్ర కందుకూరి వీరేశలింగం. ఓ అధ్యాయం మొత్తంలో కందుకూరి దంపతులు కనిపించడం మాత్రమే కాదు, కథలో ఒక ప్రధాన పాత్ర అయిన ఓ వితంతువుకి పునర్వివాహం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తారు కూడా. దురదృష్టం ఏమిటంటే, సుబ్రహ్మణ్య భారతి అకాల మరణం కారణంగా ఆ నవల అసంపూర్ణంగా మిగిలిపోయింది. అదృష్టం ఏమిటంటే, ఆ శేషభాగం తెలుగునాట 'రాక్షస పరిశోధకుడు' గా పేరుపొందిన నెల్లూరి వాసి బంగోరె (బండి గోపాల రెడ్డి) కంటపడింది. ఫలితంగా తెలుగులోకి అనువాదం అయ్యింది. తమిళ నవల పేరు 'చంద్రికైయిన్ కతై' కాగా తెలుగు అనువాదం 'చంద్రిక కథ.'

పొదియ కొండల సానువుల్లో ఉండే అందమైన కుగ్రామం 'వేలాంగుడి.' ఆ ఊళ్ళో ఓ నిరుపేద బహు కుటుంబీకుడు మహాలింగయ్య. నలుగురు ఆడపిల్లలని కన్న భార్య గోమతి ఐదోసారి ప్రసవానికి సిద్ధంగా ఉంది. వృద్ధులైన తల్లిదండ్రులతో పాటు, వితంతువైన చెల్లెలు విశాలాక్షికి కూడా ఆధారం మహా లింగయ్యే. 1901 వ సంవత్సరంలోని ఆ అర్ధరాత్రి ఉధృతమైన గాలివానతో కలిసి వచ్చిన భూకంపంలో వేలాంగుడి మొత్తం అతలాకుతలం అవుతుంది. తెల్లారేసరికి ఒకే గదిలో నిద్రించిన గోమతి, విశాలాక్షి మినహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ నిద్రలోనే ప్రాణాలు విడుస్తారు. తెల్లవారు జామునే ఆడపిల్లకి జన్మనిచ్చిన గోమతి, ఆ బిడ్డని విశాలాక్షికి అప్పగించి, తనూ కన్నుమూస్తుంది.

"నీవు రెండో పెళ్లి చేసుకో. విధవా వివాహం నిషేధమేమీ కాదు. స్త్రీ పురుషులిద్దరూ యముడికి లోబడ్డ వారే. స్త్రీలు పురుషులకి బానిసలు కారు. వారికి భయపడుతూ, బాధలనుభవించి, దుఃఖించి, క్షీణించి నశించిపోవాల్సిన అవసరం లేదు. పురుషులు స్వార్ధపరులుగా వ్రాసిన శాస్త్రాలని చించి పొయిలో పారెయ్. ధైర్యంగా చెన్న నగరానికిపో. అక్కడ వితంతు వివాహాలు జరిపే సభవార్ని చేరి వారి సాయంతో చక్కని వరుణ్ణి పెండ్లాడి సుఖంగా ఉండు. రెండో మాట - నీవు బ్రతికి ఈ బిడ్డని పోషించు. దానికి 'చంద్రిక' అని పేరు పెట్టు" మరణశయ్య నుంచి గోమతి విశాలాక్షికి చెప్పిన మాటలివి. వదిన మాటలని తూచా తప్పకుండా పాటించింది విశాలాక్షి.


చెన్న పట్టణంలో ప్రముఖ సంఘ సంస్కర్త, పత్రికాధిపతి సుబ్రహ్మణ్యయ్యర్ ని కలిసి, తన గోడు వినిపించి, తగిన వరుడితో వివాహం జరిపించాల్సిందిగా ప్రార్ధిస్తుంది విశాలాక్షి. వితంతు పునర్వివాహం అనగానే అయ్యర్ కి కందుకూరి వీరేశలింగం పంతులు గుర్తొస్తారు. విశాలాక్షికి వరుణ్ణి చూడవలసిందిగా కోరుతూ వీరేశలింగం పేరిట ఒక ఉత్తరంతో పాటు, ఖర్చుల నిమిత్తం ఆమెకో వందరూపాయలు ఇచ్చి పంపుతారు. చంద్రికని ఎత్తుకుని వీరేశలింగం ఇంటికి చేరిన విశాలాక్షి ఆ కుటుంబంతో కొంతకాలం గడుపుతుంది. తర్వాత ఆమెకి తగిన వరుడు అనుకోకుండా తటస్థ పడడంతో, వీరేశలింగం సమక్షంలో బ్రహ్మ సమాజ పద్ధతిలో అతన్ని వివాహం చేసుకుంటుంది విశాలాక్షి. చంద్రిక బాల్యం పూరవ్వక మునుపే నవల అర్ధంతరంగా ఆగిపోయింది!

మొత్తం యాభై ఐదు పేజీల నవల పూర్వరంగాన్ని పరిచయం చేస్తూ సవివరమైన ముందుమాటలతో 1971 తొలిసారిగా ఈ నవలని ప్రచురించారు బంగోరె. నలభయ్యేళ్ళ తర్వాత ఈ పుస్తకాన్ని పునర్ముద్రించింది కావ్య ప్రచురణలు సంస్థ. గోపాల-కృష్ణ-రాఘవన్ త్రయం ఈ తమిళ నవలని తెనిగించినది. వీరిలో గోపాల మరెవరో కాదు, బంగోరె. ఎన్నెస్ కృష్ణమూర్తి, వీఎస్ రాఘవన్ మిగిలిన ఇద్దరు అనువాదకులు. అనువాదంలో నెల్లూరు మాండలీకం వినిపించేలా ప్రత్యేక కృషి చేశానని ముందుమాటలో చెప్పుకున్నారు బంగోరె. కెవి రమణారెడ్డి, చల్లా రాధాకృష్ణ శర్మ, బంగోరెల ముందు మాటలకి తోడు, సన్నిధానం నరసింహ శర్మ, సివి సుబ్బారావుల ముందుమాటలు చేర్చారు తాజా ప్రచురణలో.

అసలు సుబ్రహ్మణ్య భారతికి, వీరేశలింగానికీ పరిచయం ఉండి ఉంటుందా మొదలు, కాల్పనిక నవలలో వాస్తవ పాత్రల్ని ప్రవేశ పెట్టడం అనే సంప్రదాయం అంతకు మునుపే ఉందా లేక సుబ్రహ్మణ్య భారతి ఆరంభించారా మీదుగా, నవలలో వీరేశలింగానికీ నిజ వీరేశలింగానికీ సామ్యాలు, భేదాల వరకూ ఏకరువు పెట్టిన తీరు చదివిన వారెవరికైనా బంగోరెని 'రాక్షస పరిశోధకుడు' అనడానికి అభ్యంతరం కనిపించదు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం కందుకూరి జీవితంపై నార్ల వెంకటేశ్వర రావు రాసిన ఇంగ్లీష్ పుస్తకం మీద 'స్వతంత్ర' పత్రికలో సమీక్ష రాస్తూ ప్రేమా నందకుమార్ ఈ నవల విషయాన్ని ప్రస్తావించారట 1968 లో. ఆ సమీక్ష చదివిన బంగోరె, ఆ అరవ పుస్తకాన్ని సంపాదించి, మిత్రుల సాయంతో అనువదించి, అప్పుడు తను పనిచేస్తున్న 'జమీన్ రైతు' పత్రికలో సీరియల్ గా ప్రచురించడమే కాక, పుస్తకంగా కూడా వేశారు.

"దీనికున్న విలువల్లా నా దృష్టిలో వొక్కటే - కందుకూరి వీరేశలింగం పంతులు గారంతటి తెలుగు మహా పురుషుణ్ణీ, ఆయన ధర్మపత్ని రాజ్యలక్ష్మమ్మనూ అచ్చం కథా పాత్రలుగా చేసి సుబ్రహ్మణ్య భారతి అంతటి తమిళ ఆధునిక మహాకవి యాభై ఏళ్ళ క్రితం ఒక నవల వ్రాసి పెట్టి పోతే దాన్ని ఇంతవరకూ మన తెలుగువాళ్ళు పట్టించుకోక పోవడం అన్యాయంగా భావించి ఇంతకాలానికి ఈ అనామకుడు ఈ రూపంగా వెలువరించ సాహసమే.." అంటారు బంగోరె. ఇంత పట్టుదల మనిషీ కేవలం నెల్లూరి నుంచి రాజమండ్రికి దారిఖర్చులు లేని కారణంగా కందుకూరికి సంబంధించి మరికొన్ని విశేషాలు సేకరించలేకపోయారట! లక్ష్మి-సరస్వతులకి చెలిమి ఉండదన్న మాట నిజమని నిరూపితమయ్యే మరో సందర్భం ఇది. సుబ్రహ్మణ్య భారతి, వీరేశలింగంతో పాటు బంగోరె కోసం కూడా చదవాల్సిన పుస్తకం ఇది. (పేజీలు  110, వెల రూ. 80, విశాలాంధ్ర, నవోదయ పుస్తకాల షాపులు).

బుధవారం, జూన్ 08, 2016

కాకరకాయ కూర

వర్షాలు మొదలైన కొన్నాళ్ళకి కొబ్బరితోట సరిహద్దులో ఉన్న డొంకల నిండా వత్తుగా అల్లుకుపోయేవి కాకర తీగలు. చాలా త్వరగా కాపుకి వచ్చేసేవి కూడా. చేదు తీగె కాబట్టి పశువులు తినేస్తాయనే బెడద కూడా ఉండేది కాదేమో, పాదుల నిండా కోసుకున్నన్ని కాయలు. పొద్దున్నే అలా పెత్తనానికి వెళ్లి కంటికి నదురుగా కనిపించిన కాకరకాయలు తెంపుకు వచ్చి, పాకలో నీళ్ళు కాచుకుంటూ, చలికాగుతూ, తెచ్చిన కాయలు వైనంగా కాల్చేసి (బండ పచ్చడి కోసం మెట్ట వంకాయి కాల్చినట్టన్న మాట, మరీ బొగ్గయిపోకూడదు) అమ్మకిచ్చేస్తే, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి అన్నంతో పాటు కాకరకాయ కూర సిద్ధంగా ఉండేది. వేడి చేయకుండా పక్కనే ఉల్లిపాయ పులుసు కూడా.

డొంకల్లో కాసే కాకరకాయలు చిన్నగా ఉండేది. కండ మరీ ఎక్కువగా ఉండేది కాదు. కాల్చిన కాయల మధ్యలో నిలువుగా నాటు పెట్టి, గింజలు తీసేసి, ఉల్లి కారం కూరి, నూనెలో వేయించి కూర చేసేది అమ్మ. ఒక వేళ కాయలు కొంచం పెద్దవి అయితే, కాల్చిన కాయని అడ్డంగా సగానికి కోసి రెండేసి ముక్కలుగా చేసి కూరొండేసేది. 'గ్లాసుల కూర' అని పేరు పెట్టాన్నేను. ఒక్కో ముక్కా చిన్న గ్లాసు ఆకారంలో ఉండేది మరి. అమ్మ అప్పుడప్పుడూ కాకరకాయతో బెల్లం కూర కూడా చేసేది కానీ, నా వోటు మాత్రం ఎప్పుడూ ఈ కారం కూరకే. చిన్నుల్లిపాయల్లాగే చిన్న కాకరకాయలు కూడా అంతరించిపోయినట్టున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద కాయలే కనిపిస్తున్నాయి.


కాకరకాయలతో కారం కూరని రెండు రకాలుగా చేసుకోవచ్చు, మనం ఎంత చేదు తినగలం అనేదాన్ని బట్టి. ఒక చిన్న మార్పు మినహా మిగిలిన పద్ధతంతా మామూలే. ముందుగా చేదుగా ఇష్టపడే వాళ్ళైతే ఇలా వండుకోవచ్చు. కాకరకాయలు కడిగి, అడ్డంగా ముక్కలు కోసి, గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కల్ని బట్టి అందుకు తగ్గట్టుగా ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు కోసి పక్కన పెట్టాలి. అలాగే తగుమాత్రం చింతపండుని గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టాలి. బాండీలో కొంచం నూనె వేసి అది వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరప కాయలు వేసి వేగనివ్వాలి. ఈ వేగిన మిశ్రమాన్ని, పచ్చి ఉల్లిపాయ ముక్కలని కలిపి మరీ మెత్తగా కాకుండా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒక్క తిప్పు అవ్వగానే పసుపు, ఉప్పు, చింతపండు రసం వేసి మరో తిప్పు రానిస్తే సరిపోతుంది.


ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచం ధారాళంగానే నూనె పొయ్యాలి. నూనె వేడెక్కాక, కాకర కాయ ముక్కల్లో ఉల్లి కారం కూరి, నూనెలోకి జారవిడిచి, సన్నని సెగమీద వేగనివ్వాలి. నూనె ఎక్కువ వాడడం ఇష్టం లేకపోతే, ముక్కలు వేసేశాక పైన మూత పెట్టి, ఆ మూత మీద నీళ్ళు జల్లుతూ ఉండొచ్చు. ఓ ఇరవై నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. కొంచం చల్లారాక కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది. చేదుగా, కారంగా ఉండే కూర వర్షం కురిసేప్పుడు తినే వేడన్నం లోకి మాంచి కాంబినేషన్. కాకపోతే 'వేడిచేయడం' మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, ఈ కూరైతే వేడి చేస్తుంది. అందుకు తగ్గట్టుగా మజ్జిగ ఎక్కువ తీసుకోడమో, మరేదన్నా యేర్పాటో చేసుకోవాలి.


మరీ అంత చేదు తినలేం అనుకున్న వాళ్ళు, కాకరకాయ ముక్కలు కోసి, గింజలు తీసిన తర్వాత, ఓ గిన్నెలో కొంచం నీళ్ళు మరగబెట్టి, పొంగుతున్న నీళ్ళలో తీసిపెట్టుకున్న చింతపండు రసం, చిన్న బెల్లం ముక్కా వేసి, అటుపైన కాకరకాయ ముక్కలు వేసి ముక్కలు మరీ మెత్తబడక ముందే స్టవ్ మీద నుంచి దించేసి, నీళ్ళు వార్చేసి చల్లారబెట్టుకోవాలి. మిగిలిన ప్రొసీజర్ అంతా మామూలే. ఎటొచ్చీ ఉల్లి కారంలో చింతపండు రసం కలపక్కర్లేదు. ఇలా ఉడికిన ముక్కలని ఎక్కువ నూనెలో వేయించే పనిలేదు. మూత మీద నీళ్ళు జల్లే పద్ధతిలో కూర వండేయడమే. కొత్తిమీర గార్నిష్ మామూలే. ముందు పద్ధతిలో కూరకన్నా ఈ కూర చేదు తక్కువగా ఉంటుంది.

ఎటూ ఇక్కడిదాకా వచ్చాం కాబట్టి, బెల్లం కూర గురించి కూడా ఓ మాట అనేసుకుంటే బావుంటుంది. కాకరకాయలు చక్రాల్లా తరుక్కుని గింజలు తీసేయాలి. వీటి మీద కాస్త ఉప్పు జల్లి, కాసేపాగి పిండితే చేదు దిగిపోతుంది. లేదూ, ముందు చెప్పుకున్న పద్ధతిలో చింతపండు రసంతో చేదు విరగ్గొట్టచ్చు. బాండీలో కొంచం నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ముక్కలు వేయించి, తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టాలి. అవసరమయితే మూత మీద కొంచం నీళ్ళు జల్లుకుని, మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే కాసేపటికి ముక్కలు మగ్గుతాయి.  అప్పుడు ఉప్పు, పసుపు జల్లాలి.

ఓ చిన్న గిన్నెలో రెండు చెంచాల వరి పిండి, ముక్కలకి తగినంత బెల్లపు రజను వేసి, కొంచం నీళ్ళు పోసి మరీ పల్చగా కాకుంగా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాండీలో పోసి, ముక్కలతో పాటు బాగా కలుపుతూ ఉంటే కూర దగ్గర పడుతుంది. బెల్లం పాకం మరీ గట్టి పడకముందే స్టవ్ కట్టేయాలి. చేదు లేని కాకరకాయ తినాలంటే వేపుడు ఒక్కటే మార్గం. కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని, ఉప్పుజల్లి, ముక్కలు పిండేసి, ఎన్ని ముక్కలు ఉన్నాయో అంత బరువూ సన్నగా తరిగిన ఉల్లిపాయ రజను చేర్చి డీప్ ఫ్రై చేసేసుకోడమే. కారం వేసే ముందు, అర స్పూను చక్కర, రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి చేర్చుకోవచ్చు. కారంతో పాటు ఉప్పు వేసేప్పుడు ముక్కల్ని ఉప్పులో పిండిన విషయం మర్చిపోకూడదు మరి. ఉన్నమాట చెప్పాలంటే, వర్షం కురిసేప్పుడు ఎక్కువ రుచిగా ఉండే కూర కాకరకాయ.

సోమవారం, జూన్ 06, 2016

ఘంటారావం

మధ్య యుగాల నాటి ఫ్రెంచి సమాజం ఎలా ఉండేది? విప్లవానికి పూర్వం, రాజు-చర్చి ద్వయం ఆధిపత్యంలో సామాన్య జనజీవితం ఎలా సాగేది? అధికారం అండతో ఒకవైపు రాజు, మరో వైపు చర్చి సరైన న్యాయ విచారణ లేకుండానే అనుమానితుల్ని కఠిన శిక్షలకి గురిచేసిన ఆ కాలంలో ధనవంతుల్ని మినహాయించుకుంటే మిగిలిన సమాజపు తీరుతెన్నులు ఎలా ఉండేవి? ఒక్కమాటలో చెప్పాలంటే, ఫ్రెంచి విప్లవానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఈ ప్రశ్నలకి జవాబు ఫ్రెంచి సాహిత్యంలో లభిస్తుంది. మరీ ముఖ్యంగా 1482 నాటి కథని 1830 లో 'The Hunchback of Notre Dame' పేరుతో విక్టర్ హ్యూగో రాసిన నవల నాటి సమాజాన్ని కళ్ళకి కడుతుంది. ఈ నవలకి సూరంపూడి సీతారాం చేసిన తెలుగు అనువాదమే 'ఘంటారావం.'

కథానాయకుడు క్వాసిమోడో శరీరం ఓ అవకరాల పుట్ట. దేహాన్ని మించిన తల, తలకంటే ఎత్తైన గూని, మూసుకుపోయిన కన్ను, తోసుకోచ్చిన పన్ను.. ఒక్క మాటలో చెప్పాలంటే మన పురాణ పాత్ర అష్టా వక్రుడి లాగా. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ నాటి ఫ్రెంచి సమాజంలాగా. శిశువుగా ఉన్న క్వాసిమోడో ప్యారిస్ నగరంలోని నోత్రదామ్ చర్చి ఆవరణలో అనాధగా వదిలివేయబడతాడు. దయాళువైన క్రైస్తవ మతాధికారి క్రోద్ ఫ్రాలో ఆ శిశువుని పెంచుకోడానికి ముందుకి వస్తాడు. పెరిగి పెద్దవాడైన క్వాసిమోడో కి చర్చి గంటలు మోగించే పని అప్పగిస్తాడు పెంపుడు తండ్రి ఫ్రాలో. తీవ్రమైన శబ్దం చేసే ఆ గంటల్ని మోగించే పనిలో చేరాక క్వాసిమోడో కి చెవులు పనిచేయడం మానేస్తాయి.

ధనవంతుల ఇంటి బిడ్డైన ఫ్రాలో మొదటినుంచీ చురుకైన విద్యార్ధి. సైన్సు అంటే ఎంతో ఇష్టం. క్రమంగా మతం మీద ఇష్టం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా మతాధికారిగా మారతాడు. తల్లిదండ్రుల మరణంతో తమ్ముడు జెహాన్ పెంపకం బాధ్యత ఫ్రాలో స్వీకరించాల్సి వస్తుంది. అన్న గారాబం కారణంగా వ్యసనపరుడిగా మారతాడు జెహాన్. నగరంలో ఉన్న వేలాది మంది పేద వాళ్ళలో ఎస్మరాల్డా ఒకతె. ఆమె ఒక జిప్సీ యువతి, అధ్బుత సౌందర్యవతి. పెంపుడు మేక ఒక్కటే ఆమె ప్రపంచం. ఆ మేకతో కలిసి నగర వీధుల్లో వినోద ప్రదర్శనలిచ్చి పొట్ట పోసుకుంటూ ఉంటుంది. అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో సైనికాధికారి ఫీబస్ మీద మనసుపడుతుందామె. అయితే, ఫీబస్ రసికుడు. ఆమెపై అతనికి ప్రేమ లేదు, వ్యామోహం మాత్రమే ఉంది.


ఎస్మరాల్డా మీద ఇలాంటి వ్యామోహమే మతాధికారి ఫ్రాలో కి కలుగుతుంది. మధ్య వయస్కుడు, అప్పటివరకూ పుస్తకాలు, మతం తప్ప మరొకటి తెలియని ఫ్రాలో ఎస్మరాల్డాని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం, మంత్రగత్తె అనే నెపం మీద ఆమెని ఖైదు చేయిస్తాడు. తన కోరికని ఆమె ముందుంచుతాడు. అప్పటికే ఫీబస్ ని ప్రేమిస్తున్న ఎస్మరాల్డా, ఫ్రాలోని తిరస్కరిస్తుంది. అతడు ఆగ్రహిస్తాడు. ఫలితంగా, చర్చి అజమాయిషీలో నడిచే కోర్టు ఎస్మరాల్డాకి శిక్ష విధిస్తుంది. నాలుగు రోడ్ల కూడలిలో శిక్ష అమలు జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి అక్కడికి చేరుకొని ఆమెని రక్షిస్తాడు క్వాసిమోడో. ఆమెని నేరుగా తీసుకెళ్ళి నోత్రదామ్ చర్చిలో ఆశ్రయం ఇస్తాడు. నాటి నియమాల ప్రకారం, అధికారులు చర్చిలో తలదాచుకున్న వారిజోలికి వెళ్ళే వీలు లేదు.

తనని చూసి ఎస్మరాల్డా భయపడుతోందని అర్ధం చేసుకున్న క్వాసిమోడో దూరం నుంచే ఆమెకి కావలసినవి అన్నీ అమరుస్తూ ఉంటాడు. ఎస్మరాల్డా అంటే విపరీతమైన ఆరాధన క్వాసిమోడో. దానిని ప్రకటించే శక్తి అతనికీ, అర్ధం చేసుకునే మానసిక స్థితి ఆమెకీ లేవు. ఇంతలోనే, తన పెంపుడు తండ్రి ఫ్రాలో ఎస్మరాల్డా మీద మనసు పడ్డ విషయం గ్రహిస్తాడు క్వాసిమోడో. ఆమెని రక్షించాల్సిన అవసరం నానాటికీ పెరుగుతోందని గ్రహిస్తాడు. ఎస్మరాల్డా కోసం పిచ్చివాడైపోయిన ఫ్రాలో, ఆమెని చర్చి నుంచి బయటికి రప్పించే మార్గాలు వెతుకుతూ ఉంటాడు. క్వాసిమోడో ఆశ్రయంలో ఉన్న ఎస్మరల్డాకి ఫీబస్ నిజరూపం తెలుస్తుంది. ఇంతకీ క్వాసిమోడో రాజ్యం నుంచీ, చర్చి నుంచీ ఎస్మరాల్డాని రక్షించుకో గలిగాడా? తన ప్రేమని ఆమెకి చెప్పుకోగలిగాడా? ఆమెకథ, అతని ప్రేమకథ ఏమయ్యాయన్నది హృద్యమైన ముగింపు.

విక్టర్ హ్యూగో వ్యంగ్య ప్రధానంగా రాసిన ఈ నవలని అత్యంత సరళంగా అనువదించారు సీతారాం. రాజు, చర్చిల పనితీరు మీద నేరుగా ఎక్కడా విమర్శ కనిపించదు. కానీ, ఆ వ్యవస్థల వ్యవహార శైలిని వ్యంగ్య ప్రధానంగా చెప్పడం ద్వారా నాటి పరిస్థితులని గురించి పాఠకులు ఓ అవగాహనకి వచ్చేలా చేశారు. కథా స్థలం ప్యారిస్ అయినప్పటికీ, ఇది కేవలం ఫ్రెంచికి పరిమితమైన కథ కాదు. అపరిమితమైన అధికారం కింద నలిగిన అన్ని దేశాల ప్రజలకూ 'మనదే' అనిపించే కథ. సీతారాం 1954 లో చేసిన తెలుగు అనువాదం అనేక ముద్రణల తర్వాత తాజాగా ముద్రించింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్. ఏకబిగిన చదివించే కథనం. (పేజీలు  185, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, జూన్ 02, 2016

రెండేళ్ళు.. రెండు రాష్ట్రాలు..

తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఆవిర్భావ దినోత్సవం సంబరంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న అరవయ్యేళ్ళ కల, చేసిన పోరాటాలు, తగిలిన ఎదురుదెబ్బలు, వెన్నుపోట్లు అన్నీ దాటుకుని, పట్టు వదలకుండా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుని రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. సత్రాజిత్తు దగ్గర 'శమంతకమణి' లాగా నిత్యం ఆదాయాన్నిచ్చే హైదరాబాద్ నగరం కారణంగా ఆర్ధిక ఇబ్బందులు లేవు కొత్త రాష్ట్రానికి. రెండేళ్ళక్రితం కొందరు మిత్రులు 'పాలనానుభావం లేని ముఖ్యమంత్రి' అంటూ కె. చంద్రశేఖర రావుని గురించి సందేహాలు వెలిబుచ్చారు. పాలన పగ్గాలందుకున్న రెండేళ్ళ తర్వాత కూడా ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడాన్ని పదేపదే నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు కేసీఆర్.

అసలు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలన్న డిమాండ్ ఎందుకు మొదలయ్యింది? దీనికి జవాబు వెనుకబాటు తనం. వనరులు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా అభివృద్ధి జరగకపోవడం వల్ల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోవిధంగా అభివృద్ధి జరిగే అవకాశం ఏమాత్రం లేదని గ్రామీణ తెలంగాణా బలంగా నమ్మింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలని మినహాయిస్తే, మిగిలిన జిల్లాల పరిస్థిత దారుణం. బీటలు తీసిన నేలలు, ఎక్కడా కానరాని పరిశ్రమలు, ఉపాధి కావాలంటే వలస తప్ప మరో దారి లేదు. ఇది పదిహేనేళ్ళ క్రితం నేను చూసిన తెలంగాణా గ్రామాల పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం మీద అక్కడి ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యక్షంగా చూసిందీ అప్పుడే.

కొత్త రాష్ట్రం వచ్చింది మొదలు నిత్యం అభివృద్ధి మంత్రం వినిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకి కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. పెట్టుబడులూ వస్తున్నాయి. మిగిలిన ఏడు జిల్లాల పరిస్థితి ఏమిటి? మరీ ముఖ్యంగా గ్రామీణ తెలంగాణాలో పరిస్థితులు ఏమన్నా మెరుగు పడ్డాయా? మిత్రులు చెప్పిన ప్రకారం వ్యవసాయ రంగ పరిస్థితులు ఇంకా మెరుగు పడలేదు. సాగునీటి సమస్య ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ఉపాధి చూపించాల్సిన అవసరమూ ఉంది. పించను పథకాలూ, ఉపాధి హామీ కొంత మేరకి గ్రామీణ ప్రజల్ని ఆదుకుంటున్నాయని సమాచారం. గ్రామీణ తెలంగాణా మీద దృష్టి సారించి, అభివృద్ధిని గ్రామస్థాయికి తీసుకెళ్ళాల్సిన అవసరాన్ని గురించి కేసీఆర్ కి ప్రత్యేకంగా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు.


ఇక, బలవంతంగా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రెండేళ్ళ తర్వాత కూడా 'అడ్డగోలుగా విభజించారు' అన్న ఆక్రోశాన్ని వెళ్లగక్కే దగ్గరే ఉంది. రెండేళ్లుగా పాడుతున్న ఈ పాటలో ఎలాంటి మార్పూ లేదు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. ఈ రెండు ప్రకటనలూ వచ్చి కూడా రెండేళ్ళు పూర్తయ్యింది. ఏ పని జరగడానికైనా కావాల్సిన ప్రధాన వనరు విత్తం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దగ్గర లేనిదీ అదే. కేంద్రం దగ్గర ఎన్నిసార్లు చెయ్యి చాపినా, అయితే మొండిచెయ్యి, లేదంటే కాస్తో కూస్తో విదిలింపులు. జరిగే ఖర్చులకీ, వస్తున్న ఆదాయానికీ లంగరు కుదరడం లేదు. పోనీ, ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా అంటే, అది జరిగే పని కాదు. ఇన్నాళ్ళుగా అలవాటైపోయిన సౌకర్యాలు.. వేటిని వదులుకోవడం కుదురుతుంది?

పన్నులు, చార్జీలు ఎన్నిసార్లు పెంచినా, రుణమాఫీ హామీలని మర్చిపోయినా ప్రజలు కిమ్మనకుండా సహకరిస్తున్నారు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిని వాడుకునే హక్కు ఉన్నప్పటికీ, రాజకీయ కారణాల వల్ల వీలైనంత త్వరగా సొంత కుంపటి పెట్టేసుకోవాల్సిన పరిస్థితి. అలా అని, అదేమన్నా చిన్న పనా? ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం, అది కూడా డబ్బొచ్చే దారేదీ ఇదమిద్దంగా తెలియకుండా, జరిగిపోవాలంటే మాటలతో అయ్యే పని కాదు. అన్నిటికన్నా ముందు, తప్పొప్పులు అడిగేవాళ్ళు లేకుండా చేసుకోవాలి కదా. ఆ పని మాత్రం ఆఘమేఘాల మీద జరిగిపోతోంది. మిగిలినవి వరుసలో జరుగుతాయి. బోల్డంత అనుభవం, కష్టపడే స్వభావం ఉన్న నేతలు ఉన్నారు కాబట్టి ఏమీ పర్వాలేదు. పరిశ్రమల అభివృద్ధికి వేలకోట్ల రూపాయల పెట్టుబడులు కాగితాల మీద వచ్చేసి ఉన్నాయి.

తెలంగాణా రాష్ట్ర ప్రజలు అవతరణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సమయంలోనే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకి నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో క్రమశిక్షణతో కష్టపడి పనిచేసి 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా అభివృద్ధి చేసుకుంటామని ప్రజలచేత ప్రమాణం చేయించింది ప్రభుత్వం. ఈ మధ్యలో 2022 నాటికి దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగానూ, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగానూ మార్చవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం, లంచగొండితనం లాంటి చిన్న చిన్న సమస్యలని మర్చిపోయి ఈ పెద్ద లక్ష్యాలని సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకం కావాల్సి ఉంది. 'అడ్డగోలు విభజన' కి గురయిన వాళ్ళకీ, రాజకీయ కుట్ర'లకి బలయిన వాళ్ళకీ అంతకన్నా ప్రత్యామ్నాయం ఏముంటుంది మరి?