నవలాదేశపు రాణి యద్దనపూడి సులోచనారాణి రాసిన 'సెక్రటరీ' నవల విడుదలై
యాభై ఏళ్ళు పూర్తయ్యాయంటూ పేపర్ల వాళ్ళు, టీవీ చానళ్ళ వాళ్ళు మొన్నామధ్య
కొంచం హడావిడి చేశారు. సాహిత్యాన్ని తల్చుకోడానికి వాళ్లకి ఏదో ఒక సందర్భం
కావాలి కాబట్టి కానీ, పుస్తకాలు చదివే వాళ్ళు ఇప్పటికీ యద్దనపూడి నవలలు
కొంటూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. తొలి నవల 'సెక్రటరీ' తర్వాత,
సులోచనారాణి రాసిన నవలల్లో మొదట చెప్పుకోవాల్సింది 'కీర్తి కిరీటాలు.' "ఆమె
రాసేది కాల్పనిక సాహిత్యం" అని చప్పరించే చాలామందికి తెలియని విషయం
ఏమిటంటే, ఈ నవల ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది.
రాజ్యలక్ష్మి అనే ఓ శాస్త్రీయ సంగీత గాయని, స్వర్ణలత అనే శాస్త్రీయ నృత్య కళాకారిణిల కథ 'కీర్తికిరీటాలు.' సులోచనారాణి చాలా నవలల్లో లాగానే సగం కథ హైదరాబాదులోనూ మరో సగం విజయవాడ పక్కనున్న ఓ పల్లెటూళ్ళోనూ జరుగుతుంది. స్వర్ణలత కథని చెబుతూ చెబుతూ ఇంటర్ కట్స్ గా ఫ్లాష్ బ్యాక్ లో రాజ్యలక్ష్మి కథని చెబుతారు రచయిత్రి. దవడ కండరం బిగుసుకునే స్పురద్రూపి తేజా కథానాయకుడు. వంకరగా నవ్వే కిషోర్ కథలో ఒకానొక విలన్. అయితే, 'విధి' ని మాత్రమే బలమైన శత్రువుగా చిత్రించారు సులోచనారాణి. అడుగడుగునా ఎదురయ్యే ఊహించని మలుపులు 364 పేజీల నవలనీ ఏకబిగిన చదివించేస్తాయి.
రాజ్యలక్ష్మి అనే ఓ శాస్త్రీయ సంగీత గాయని, స్వర్ణలత అనే శాస్త్రీయ నృత్య కళాకారిణిల కథ 'కీర్తికిరీటాలు.' సులోచనారాణి చాలా నవలల్లో లాగానే సగం కథ హైదరాబాదులోనూ మరో సగం విజయవాడ పక్కనున్న ఓ పల్లెటూళ్ళోనూ జరుగుతుంది. స్వర్ణలత కథని చెబుతూ చెబుతూ ఇంటర్ కట్స్ గా ఫ్లాష్ బ్యాక్ లో రాజ్యలక్ష్మి కథని చెబుతారు రచయిత్రి. దవడ కండరం బిగుసుకునే స్పురద్రూపి తేజా కథానాయకుడు. వంకరగా నవ్వే కిషోర్ కథలో ఒకానొక విలన్. అయితే, 'విధి' ని మాత్రమే బలమైన శత్రువుగా చిత్రించారు సులోచనారాణి. అడుగడుగునా ఎదురయ్యే ఊహించని మలుపులు 364 పేజీల నవలనీ ఏకబిగిన చదివించేస్తాయి.
అప్పుడప్పుడే నర్తకిగా
బాగా పేరు తెచ్చుకుంటున్న అమ్మాయి స్వర్ణలత. తల్లి ఇందిరాదేవికి స్వర్ణని
ప్రఖ్యాత నర్తకిగా చూసుకోవాలనే కోరికతో పాటు, తను రాజకీయాల్లో చేరి
ఎమ్మెల్యే కావాలన్నది కూడా బలమైన కోరిక. ఈ ఇందిరాదేవి, వెనుకటి తరం ప్రముఖ
గాయని రాజ్యలక్ష్మి మంచి మిత్రులు. విదేశంలో ఇరవై ఏళ్ళు ఉండి, ఎన్నో
ఒడిదుడుకుల తర్వాత పెంపుడు కొడుకు కిషోర్ ని తీసుకుని హైదరాబాద్
వచ్చేస్తుంది రాజ్యలక్ష్మి. స్వర్ణని తన కోడలిగా చేసుకోవాలన్నది
రాజ్యలక్ష్మి కోరిక. స్వర్ణ, కిషోర్ తో సన్నిహితంగా మెలగడం, వాళ్ళిద్దరూ
పెళ్లి చేసుకుంటారన్న గుసగుసలు బయల్దేరడం ఎంతగానో బాధ పెడతాయి
రాజ్యలక్ష్మిని.
చిన్నప్పుడే తనకి దూరమైపోయిన
కన్నకొడుకు తేజాని స్వర్ణ పెళ్లి చేసుకుంటే, ఆమె ద్వారా తను తేజాని
కలుసుకోవచ్చన్నది రాజ్యలక్ష్మికి మిగిలిన ఒకే ఒక్క ఆశ. ఇందిరాదేవికి ఈ
విషయం తెలిసినా ఏమాత్రం పట్టించుకోకుండా, కూతురు కిషోర్ తో సన్నిహితంగా మెలగడాన్ని
ప్రోత్సహిస్తుంది. చదువు లేకుండా ఎక్కడో పల్లెటూళ్ళో ఉంటున్న తేజాని పెళ్లి
చేసుకోవడం స్వర్ణ భవిష్యత్తుకి అడ్డంకి అవుతుందన్నది ఆమె భయం. పైగా,
కిషోర్ స్వర్ణ నాట్య ప్రదర్శనలకి ఎంతో సాయం చేస్తూ ఉంటాడు. ఆమెని ప్రముఖ
నర్తకిగా చూడాలన్నది అతని కోరిక కూడా.
విజయవాడ పక్కనే
ఉన్న పల్లెటూళ్ళో తాతగారు వెంకటాచలంతో ఉంటున్న తేజా ఈ ప్రపంచంలో ద్వేషించే
వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తల్లి రాజ్యలక్ష్మి ఒక్కర్తే. ఆమె పేరు
వినబడడం కూడా ఇష్టం ఉండదు అతనికి. పెద్దగా చదువుకోని తేజా, ఇంటికి దగ్గరలో ఓ
చెక్క బొమ్మల పరిశ్రమ పెట్టి ఊళ్ళో వాళ్లకి ఉపాధి కల్పిస్తూ ఉంటాడు.
అనుకోకుండా స్వర్ణ నృత్య ప్రదర్శన చూసి, ఆమె ఎవరో తెలిశాక ఆమె మీద
ఇష్టాన్ని పెంచుకుని కూడా లోలోపలే దాచుకున్న తేజా స్వర్ణ-కిషోర్ ల
నిశ్చితార్ధం తర్వాత ఆమెని పూర్తిగా మర్చిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
రాజ్యలక్ష్మి
గతం, స్వర్ణ భవిష్యత్తు ఏమిటన్నవి నవల ముగింపు. ఎంతోమంది కళాకారిణుల
జీవితాలని పరిశీలించి తానీ రచన చేశానన్నారు సులోచనారాణి. "నేను ఆరాధించే
కొద్దిమంది వ్యక్తుల్లో లతా మంగేష్కర్ ఒకరు. ఆమె పెళ్లి చేసుకోకపోవడం
నాకెందుకో చాలా సంతోషంగా అనిపించేది. లలితకళల్లో గానం, నాట్యం, రచన వీటిలో
ఉన్నవాళ్ళు ఈ సంసార బంధాల చిక్కుముడుల్లో ఇరుక్కోకూడదు అని నా అభిప్రాయం"
అంటూ రాశారు 'నేను-నా రచనలు - నా పాఠకులు' అన్న ముందుమాటలో. 'తెలుగు
సినీతల్లి కీర్తికిరీటంలో కలికితురాయి అయిన శ్రీ అక్కినేని నాగేశ్వర
రావు'కి అంకితం ఇచ్చారీ నవలని. (క్వాలిటీ పబ్లిషర్స్ ప్రచురణ, వెల రూ. 120,
అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి