శుక్రవారం, ఫిబ్రవరి 12, 2016

అతడు అరుణ్ సాగర్ ...

మగజాతికి 'మేల్ కొలుపు' పాడిన అరుణ్ సాగర్ దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే నిద్రని పూర్తిగా వదిలించుకోక మునుపే పలకరించిన వార్త ఇది. నమ్మడానికి కొంత సమయం పట్టింది. నమ్మక తప్పదని నిర్ధారించుకున్నాక ఏదో తెలియని ఒక శూన్యం. త్వరగా..చాలా త్వరగా వెళ్ళిపోయాడు సాగర్. వెళ్లేముందు తెలుగు కవిత్వం మీద తనదైన సంతకం చేసి మరీ వెళ్ళాడు. జర్నలిజం మీదా అతనిదైన ముద్ర ఉందని చెబుతున్నారు మిత్రులు. తను నాకు బంధువూ, మిత్రుడూ కాదు. అతను కవి, నేనతని అనేకానేక పాఠకుల్లో ఒకణ్ణి. ఇంతకీ ఎవరీ అరుణ్ సాగర్?

'అతి సర్వత్ర వర్జయేత్' అన్నారు పెద్దవాళ్ళు. తెలుగునాట గత శతాబ్దపు ఎనభైలలో ఎగసిన స్త్రీవాదం, తొంభైల నాటికి అతి ధోరణుల్లో పడిపోయింది. స్త్రీవాదమంటే స్త్రీపురుష సమానత్వమన్న భావన పోయి మగవాడిని ఎంత తీవ్రంగా దుర్భాషలాడితే అంత గొప్ప ఫెమినిజమన్న భావన తెలుగు సాహిత్యంలో బలపడిపోయింది. కవిత్వం, కథలు.. ఏవైనా కావొచ్చు. స్త్రీవాదం అంటే పురుష దూషణ. ఓ తండ్రిగా, భర్తగా, కొడుకుగా, స్నేహితుడిగా ప్రతిపాత్రలోనూ మగవాడు ఎంత దుర్మార్గంగా ఉంటాడో వైనవైనాలుగా వర్ణిస్తూ కథలూ, కవిత్వాలూ లెక్కకు మిక్కిలిగా అచ్చయిన కాలం.

అవి చదివిన మగవాళ్ళలో కనీసం కొందరైనా "నేనింత వెధవనా? కాదు.. కానేకాదు. మరి నేనెందుకీ నిందలు మొయ్యాలి?" అన్న ప్రశ్నలు వేసుకుంటున్న తరుణంలో కలం పట్టాడు అరుణ్ సాగర్. అతివాద ధోరణుల స్త్రీవాదానికి కౌంటర్ గా పురుష వాదాన్ని వినిపించాడు. స్త్రీవాదం మీదే కాక, కవిత్వం మీదే ఒకలాంటి విరక్తి బయల్దేరిన ఆ కాలంలో 'ఆంధ్రజ్యోతి' లో వచ్చే అరుణ్ సాగర్ కవితలు పెద్ద రిలీఫ్ నా బోటి వాళ్లకి. "ఇన్నాళ్ళకి మనగొంతు వినిపించే వాడు ఒకడొచ్చాడు" అని సంబర పడ్డాం మిత్రులం. ఎన్నో సాయంత్రాలు ఇరానీ చాయ్, అరుణ్ కవిత్వాలతో కలగలిసి రాత్రిలోకి కరిగిపోయాయి.


మాలో ఎక్కువమందికి బాగా నచ్చిందీ, దాదాపుగా కంఠతా వచ్చేసిందీ 'మేల్ కొలుపు.' తర్వాతి కాలంలో అరుణ్ సాగర్ ఇంటిపేరుగా మారిపోయిన చిరు సంకలనం. 'గుండె జబ్బులు నాన్నలకే ఎందుకు వస్తాయి?' అన్న అరుణ్ సాగర్ సూటి ప్రశ్న ఎన్ని మగ హృదయాలని తాకిందో ప్రత్యక్షంగా చూశాను. 'ఐసీయూ లో నాన్న' లని గురించి తను రాసిన కవిత గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుంది. 'షివల్రీ' ని ప్రదర్శించి, తాము చేయాల్సిన పనిని కూడా మగ సహోద్యోగుల మీదకి నెట్టేసే మహిళా ఉద్యోగులని గురించి సాగర్ రాసిన కవిత మీద పెద్ద వివాదమే చెలరేగిందప్పట్లో. ఉన్నమాట చెప్పుకోవాలంటే, అలాంటి ఉద్యోగినులూ నాకు తెలుసు.

అరుణ్ సాగర్ చేసింది స్త్రీవాదం మీద దాడి కాదు. స్త్రీవాదం పేరు మీద మగవాళ్ళ మీద జరుగుతున్న దాడికి ఎదురుదాడి. ఈ క్రమంలో కొన్ని సార్లు అతని గొంతులో తీవ్రత ధ్వనించిన మాట నిజం. కానీ, అది అవసరం కూడా. మగవాడు మోస్తున్న బరువులని గురించీ, కన్నీళ్లు పెట్టుకోడానికి వీల్లేకుండా సమాజం అతడికి ఆపాదించిన 'ఇమేజి' గురించీ అరుణ్ రాసిన కవితలు కనీసం కొందరినైనా ఆలోచింపజేశాయి. అరుణ్ సాగర్ ఆరంభించిన పురుష వాదాన్ని ఆ తర్వాత చాలా మంది అందిపుచ్చుకున్నారు. కొందరతన్ని అనుకరించారు, మరికొందరు అనుసరించారు. పురుష వాద కవిత్వానికి దారిని నిర్మించిన వాడు మాత్రం అతడే.

'మేల్ కొలుపు' రోజుల్లో అరుణ్ సాగర్ ని కలవాలని చాలా కోరికగా ఉండేది. అప్పట్లోనే తను 'ఆంధ్రజ్యోతి' నుంచి ఓ టీవీ చానల్లో చేరాడు. నా మిత్రుడికి మంచి ఫ్రెండ్ కూడా. కనీసం నాలుగైదు సందర్భాల్లో నాలుగడుగుల దూరం నుంచి తనని చూశాను. మాటలు విన్నాను తప్ప పలకరించలేదు. 'హీ ఈజేన్ ఎక్సెంట్రిక్' మొదలు, 'చాలా బా మాట్లాడతాడబ్బా' వరకూ చాలా వ్యాఖ్యలే విన్నాను. 'ఈసారి తప్పక పలకరించి మాట్లాడాలి' అని తను గుర్తొచ్చినప్పుడల్లా అనుకునే మాట. అలా అనుకోడానికి ఇక అవకాశం లేదు. అరుణ్ సాగర్ ఆత్మకి శాంతి కలుగు గాక..

6 కామెంట్‌లు:

  1. “నాన్నంతటి అమ్మకి. అమ్మంతటి నాన్నకి

    “మనసారా ప్రేమించిన, మీ ప్రేమను పొందిన తొలిప్రేమికుడు తారపడితే దయచేసి అన్నయ్యా అని మాత్రం పిలవకండి- హైట్ ఆఫ్ హిపోక్రసీ”

    “ఎవ్వడైతేనేం మగాడొక ఒంటరి పర్వతం,ఒంటరి చెట్టు,ఒంటరి ద్వీపం,ఒంటరి గీతం,కన్నీరు నిషిద్ధం...కేవలం హృదయవిస్ఫోటం. మీరు మమ్మల్ని కొలవలేరు. కొన్ని బూతులు తిట్టడం తప్ప”

    “కనబడలేదా మగజీవుల త్యాగాల జాడలు ? యుద్ధాలలో ఒరిగిన నరకంఠాల నుంచీ స్రవించిన నెత్తుటి ధారలు... గురించుడి... కీర్తించుడి... అనుకూల ధోరణి అవలోకించుడి.”

    “మీ అనాటమీ, మీ దేహభాష అనువదించుకుని అవగాహన చేసుకోవడం, ఆస్వాదించడం మాకు చాలాచాలా ఇష్టం. ఇది బయొలాజికల్,ఇది బయోకెమికల్ హార్మోనల్... ఉయ్ లవ్ ఉమెన్.”

    ”మీరూ మేమూ భిన్నం... అదే సృష్టికి అందం... లెటజ్ సేవిట్”

    "మేల్ కొలుపు"తో రాజీకొచ్చెయ్యాలి అనుకుంటాను కానీ సాధ్యపడడం లేదు:((

    రిప్లయితొలగించండి
  2. ఏ ఇజమైనా వికృతరూపం దాల్చకూడదు. అదే జరిగితే ఎక్కడో ఒక చోట దానికి విరుగుడు ఉంటుంది. విరుగుడుదెబ్బ పడినప్పుడే వికృతరూపం దాల్చిన ఇజం సరి అయిన మార్గంలో పడుతుంది. పురుషుల ప్రత్యేకతలను ప్రస్తావించడం ద్వారా స్తివాదం పట్ల సరి కొత్త ఆలోచనలు రేకెత్తించిన వాడు అరుణ్ సాగర్..... మితృడు అరుణ్ సాగర్ ఇక లేకపోవడం బాధగానూ బెంగగానూ ఉంది....

    రిప్లయితొలగించండి
  3. ఇదే నేను వినడం ఈయన గురించి. ఇలాంటి ఒక రకమైన కవిత్వం వచ్చిందని కూడా తెలియదు :-( కాని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. స్త్రీవాదంలో అతి నాకు కూడా చిరాకు తెప్పించింది.

    రిప్లయితొలగించండి
  4. @నీహారిక: బహుశా ఆ సాధ్య పడక పోవడమే 'స్త్రీత్వం' ఏమోనండీ.. ధన్యవాదాలు..
    @పి.ఆర్. తమిరి: ధన్యవాదాలండీ
    @సుభగ: ఆ అతిని చీల్చి చెండాడిన కవి అండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  5. నాకు తెలిసినంత వరకూ కమ్యూనిష్టుల దృష్టిలో మగవాడు ఒక బూర్జువా ! కమ్యూనిష్టులు కలలు కనే యుటోపియా రాకుండా చేస్తున్న బూర్జువా ! అందుకే ఆ బూర్జువా మీదకి స్త్రీవాదాన్ని ఆయుధంగా చేసుకుని దాడులు చేస్తూ ... మగవాడు ఆడదాని "వర్గ శతృవు" అని తీర్మానించేసి ఎంత వీలైతే అంత ఒంటరివాన్ని చేయడానికి ప్రయత్నాలు కమ్యూనిష్టులు బాగానే చేశారు. ఇక్కడే కాదు పాశ్చాత్య దేశాలలో కూడా ఇదే మనం చూడొచ్చు. కమ్యూనిజం లేదా దాని అనుబంధ సిద్దాంతలైన లిబరలిజం కానీ ఈ విధానాన్నే అనుసరించాయి. అరుణ్ సాగర్ వంటి వారు వారిలో కాస్త మినహాయింపు. ఆయన పూర్తిగా వర్గ పోరాటాల మాయలో పడలేదో మరి ఆయన్లో ఉన్న పురుషుడు "ఎనఫ్ ఈజ్ ఎనఫ్" అనుకున్నాడో మరి. "మేల్కొలుపు" మగవారు తప్పక చదవదగ్గ పుస్తకం.

    రిప్లయితొలగించండి
  6. @శుక్రాచార్య: ధన్యవాదాలండీ

    రిప్లయితొలగించండి