ఆదివారం, అక్టోబర్ 04, 2015

'పూర్ణోదయా' నాగేశ్వర రావు

కాకినాడ సాల్ట్ ఇనస్పెక్టర్ గారబ్బాయి.. పీఆర్ కాలేజీగా పిలవబడే పిఠాపురం రాజా కాలేజీలో చదువుకునే రోజుల్లో నాటకాల సరదా మొదలయ్యింది. కాకినాడ అంటేనే కళలకి కాణాచి. ఇక నాటకరంగం సంగతి చెప్పక్కర్లేదు. ఈ కుర్రాడికి ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకతని పేరు వీరమాచనేని రాజేంద్రప్రసాద్.. మరొకతను హరనాథ రాజు. ముగ్గురూ కలిసి కాలేజీలో నాటకాలు ఆడారు. అబ్బే, కాలేజీలో ఏడాదికి ఒకటో, రెండో నాటకాలు అంతే. పైగా, ఓల్డ్ స్టూడెంట్స్ కి నాటకాలు వేసే అవకాశం లేదు. 'నాటకాలని వదిలేయాల్సిందేనా?' అన్న ప్రశ్న. జవాబు 'అవును' అయితే, తర్వాతి కథ వేరేగా ఉండేదేమో బహుశా. 

పీఆర్ కాలేజీలో చదువు పూర్తవుతూనే బళ్ళారి రాఘవని స్మరించుకుంటూ 'రాఘవ కళా సమితి' ఆరంభించారు. సాంఘిక నాటకాలకి దశ తిరిగిన కాలం. ఆచార్య ఆత్రేయ చేయితిరిగిన నాటక రచయితగా వెలుగొందుతున్న రోజులు. సినిమా పరిశ్రమకి అంజలీదేవి, ఆదినారాయణ రావు, రేలంగి, రావు గోపాలరావు లాంటి మహా మహులని అందించిన ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ ఉన్నది కాకినాడలోనే. అయినప్పటికీ, రాఘవ కళా సమితి అతి తక్కువకాలంలోనే తనకంటూ పేరు తెచ్చుకుంది. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా నిలదొక్కుకునే ప్రయత్నాలు, హరనాథ రాజు హీరో చాన్సుల కోసం మద్రాసు బయల్దేరారు. మిత్రుణ్ణి మర్చిపోలేదు.

తను తీసిన మొదటి సినిమా 'ఆరాధన' లో కాలేజీ మిత్రుడి చేత వేషం వేయించారు రాజేంద్ర ప్రసాద్. అటు పైని కూడా నటుడిగా అవకాశాలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. అయితే అవేవీ పెద్దగా గుర్తింపు రాడానికి అవకాశం ఉన్న పాత్రలు కాదు. వేషాలు వేస్తున్న కాలంలోనే అంతకు మించి ఏదన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది. 'పూర్ణోదయా మూవీ క్రియేషన్స్' పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి, పక్కూరి అమ్మాయి జయప్రద కథానాయికగా, అప్పటికే స్నేహితుడైన కె. విశ్వనాధ్ దర్శకత్వంలో 'సిరి సిరి మువ్వ' సినిమా తీసి 1978 లో సినిమా నిర్మాత అయ్యారు ఏడిద నాగేశ్వర రావు.


అటు తర్వాతి పద్నాలుగేళ్ళ కాలంలో కేవలం పది సినిమాలు (మాత్రమే) నిర్మించి, అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకోడమే కాకుండా, తనకూ, తన సంస్థకూ తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీని కేటాయింపజేసుకున్నారు నాగేశ్వర రావు. తెలుగు సినిమా నలుపు తెలుపుల నుంచి రంగుల్లోకి మారిన తర్వాత వచ్చిన మొదటి పది కళాత్మక సినిమాల జాబితా వేస్తే, అందులో 'పూర్ణోదయా' వారి సినిమా లేకపోతే ఆ జాబితా అసంపూర్ణం. ఖండాంతరాల్లో ఖ్యాతి తెచ్చిన 'శంకరాభరణం' వ్యాపార పరంగా నిర్మాతకి లాభాలు తేకపోవడం సినిమా పరిశ్రమలో మాత్రమే సాధ్యమయ్యే ఒకానొక వైచిత్రి.

కుమారుడు ఏడిద శ్రీరాంని కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'స్వరకల్పన' బాగా ఆడదు అని తెలిసీ విడుదల చేశానని మరో నిర్మాత అయితే చెప్పేవారు కాదేమో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పక్కూరు పసలపూడి కుర్రాడు పాతికేళ్ళ వంశీ కి దర్శకుడిగా అవకాశం ఇస్తూ తారల్ని కాక కథని నమ్మి 'సితార' నిర్మించడం నాగేశ్వరరావు అభిరుచికీ, ధైర్యానికీ కూడా నిదర్శనం. ఏడిద నాగేశ్వర రావు నిర్మించిన పది సినిమాల్లోనూ ఆరు సినిమాలకి - సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్భాందవుడు - దర్శకుడు కె. విశ్వనాధ్. ఈయన పేరుకి ముందు 'కళా తపస్వి' వచ్చి చేరడంలో 'పూర్ణోదయా' ది కీలకపాత్ర.

కొందరు నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమని తాము మార్చుకోడానికి కాంప్రమైజ్ అవ్వగలరు. అలా అవ్వడానికి సిద్ధ పడకుండా, సినిమా నిర్మాణానికే దూరం జరిగిన కొద్దిమంది నిర్మాతల్లో నాగేశ్వర రావు ఒకరు. 'ఆపద్భాందవుడు' తరువాత మరి సినిమాలు నిర్మించలేదు. అలాగని సినిమా పరిశ్రమకి దూరంగా జరగనూలేదు. అవార్డుల కమిటీ చైర్మన్ లాంటి ఎన్నో పదవులు నిర్వహించారు. వచ్చిపడిన మార్పుని ఆడిపోసుకోకుండా తనలాంటి వాళ్లకవి సరిపడవని ఒప్పుకుని చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నారు. అయితేనేం, తెలుగు సినిమా చరిత్రలో 'పూర్ణోదయా' నాగేశ్వరరావు స్థానం పదిలం, ప్రత్యేకం. తెలుగు సినిమాకి ఇలాంటి నిర్మాతల అవసరం ఉంది, రాడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడితే అదే ఏడిద నాగేశ్వర రావుగారికి అసలైన నివాళి అవుతుంది.

9 కామెంట్‌లు:

  1. తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు. అన్ని మంచి సినిమాలు తీసే నిర్మాతలు బహుశా ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే చూసే ప్రేక్షకులు కూడ లేరు.
    ఒకప్పుడు విశ్వనాథ్, బాపు లాంటి వాళ్ళ సినిమాలతోపాటు దాసరి, బాలచందర్, మాదాల రంగారావు, టి. కృష్ణ లాంటి దర్శకుల సినిమాలను కూడ ప్రేక్షకులు ఆదరించేవారు. ఇప్పుడు వినోదం తప్ప ఇంకేమీ అవసరం లేదు.
    అన్నట్టు ఏడిద వారి సహనిర్మాత ఆకాశం శ్రీరాములు గారి గురించి ఎవరూ ఒక్క ముక్క కూడ వ్రాయడంలేదు. ఎందుకనో?

    రిప్లయితొలగించండి
  2. ఇంకోచోట చదివానండీ ఆయనకి నివాళి,నచ్చి ఇక్కడ పోస్టుతున్నా:

    కథానాయకుడెవరంటే చెప్పలేం....కథే నాయకుడు! పోనీ హీరోయిన్నో? ఎబ్బే! అందరూ ‘అదోరకం' పాత్రలిచ్చి అవమానించిన మంజుభార్గవి! సలీం డాన్సులు, చక్రవర్తి మ్యూజిక్కూ....? అవేంలేవు. మరేమున్నాయండీ మీ సినిమాలో?

    శిశుర్వేత్తి పశుర్వేత్తి....అంటూ మొదలైంది సుత్తి. గోదాట్లో పంచె తడుపుకుని ఆరేసుకుంటున్నాడో పెద్దాయన. తరవాత..? అది చిరిగిపోయిందని చూపించారు. ఏదో ఫ్లాష్‌బాకుండే వుంటుంది. ఎక్కడా డైలాగుల్లేవేమిటి? ఎవరైనా ఏదైనా మాట్లాడితే కథేఁవిటో తెలుస్తుందని కొంతసేపు చూసా!

    ఆ కొంతసేపు ఎంతసేపైందో తెలీలేదు. పక్కనెవరున్నారో మర్చిపోయాను. పది పన్నెండేళ్ళ పిల్లాడి అభిరుచులు, అంతరంగాలు, అభిప్రాయాలు ఎలావుంటాయో అందరికీ తెలిసిన విషయమే! అయినా నేనెందుకంతలా అతుక్కుపోయాను? నాకెందుకలా ఏడుపొచ్చేస్తోంది? చక్రవర్తీ, సలీమూ గుర్తుకురాలేదేం? బొడ్డుమీద బొంగరాలూ, నుదుటిమీద జుట్టు వుంగరాలు చూడ్డానికి అలవాటుపడ్డ ప్రాణం.....ఇందులో ఏంచూసింది?
    .........శిశుర్వేత్తి పశుర్వేత్తి అనెందుకు మొదలెట్టారో అప్పుడర్ధమైంది!

    ఏధైర్యంతో విశ్వనాథుణ్ణి నమ్మారో తెలీదు. గోదారొడ్డూ, అన్నారం కొండా లొకేషన్లు. జనాలకి నోరుతిరగని పాటలు. సారిగరీ గపదాప....అంటూ వెరైటీ డాన్సులు! ఏడిదవారికి చివరికి బూడిద మిగులుస్తాడేమో ఈకాశీవిశ్వనాథుడు!?......అని అనుకున్నారందరూ!

    నిరక్షరాస్యులుకూడా నిరాటంకంగా పాడేసుకునేవారు ఆపాటలు! సంగీతం పాడితే పీక కోసేస్తామనేవాళ్ళు కూడా చెవి కోసుకునేంతలా ఎక్కేసాయందరికీ!

    ‘'మావూరివ్వలేదు ‘శంకరాభరణం.' ఆర్నెల్లాగాల్ట! అంచేత నేనూ మీపిన్నీ రేపు ఈస్టుకి మీవూరొస్తున్నాం. సినిమాచూసి ఎల్లుండి జనతాకెళిపోతాం. టిక్కెట్లు చెప్పుంచు'' అంటూ వుత్తరాల్రాసి మరీ వూళ్ళెళ్ళి చూసారు శంకరాభరణాన్ని!

    అక్కడితో అయ్యిందా? కమలహాసన్ సినిమాయే కాదు... వాల్ పోస్టర్ కూడా చూడనిచ్చేవారుకాదు మాయింట్లో! మన్మథలీల, వయసుపిలిచింది, టిక్ టిక్ టిక్....ఇలాంటివాటిల్లో వేస్తాడని కోపం. పాపం! అతనేంచేసాడు?

    కానీ...

    అతనేం చెయ్యగలడో చూపించారు విశ్వనాథుడితో కలిసి ఏడిదవారు! గమ్యం తెలీని పిల్లకాలవలా ప్రవహిస్తున్న తెలుగు సినిమాని ‘సాగరసంగమం' చేసారు. దేశం వులిక్కిపడింది. ఇప్పుడిప్పుడే శంకరాభరణంనుంచి తేరుకుంటున్న హిందీవాళ్ళకి ఇది మరో బాణం. అందరి అభిప్రాయాలూ పటాపంచలైపోయాయి.

    ‘సినిమా అనేది కళ!' అంటూ చెప్పే ‘వనం'లో కళనే సినిమాగా చూపించిన తులసిమొక్కలు..... నాగేశ్వరుడు, విశ్వనాథుడు! సంగీతసాహిత్యాలనే నాయికానాయకులనుకున్న ‘స్వాతిముత్యాలు!'

    గొంగళిపురుగులా వికారంగావున్న కథలమధ్యలో ‘సీతాకోకచిలక'ని ఎగరేసిన అజేయుడు....ఏడిద నాయుడు!

    ఏదైనా సినిమాకెళితే సిగ్గుతో తలొంచుకుని, అయిపోవాలని దేవుణ్ణి తలంచుకుని బ్రతుకుతున్న తెలుగు ప్రేక్షకుల్ని తలెత్తుకునేలా చేసిన ‘ఆపద్బాంధవుడు'......ఇంకెవరు?

    వాన్ హ్యూసన్ ఎడ్వర్టయిజ్‌మెంట్ లో క్యాప్షన్ గుర్తుందా? ‘అండర్లైన్ యువర్ ప్రజెన్స్' అని....?

    ఎందరో నిర్మాతలు. డబ్బున్నవాళ్ళు, డబ్బే వున్నవాళ్ళు...... ఇలా చాలామందిలో తప్పనిసరిగా అండర్లైన్ చెయ్యదగ్గ నిర్మాత.... ఏడిద నాగేశ్వరరావుగారు.

    అహనాపెళ్ళంటలో కోటశ్రీనివాసరావులా “నాకేంటి? అహఁ నాకేంటని?" అనుకునే మనిషయితే అన్ని కళాఖండాల్ని కలకండముక్కల్లా మనకందించేవాడే కాదు.

    విశ్వనాథుడు గణపతైతే నాగేశ్వర్రావు దంతం. దాని సాయంతోనే మన తెలుగు సినిమాకి ‘పూర్ణోదయ'మైంది!

    అన్నవరం గుర్తొచ్చినపుడల్లా సత్యనారాయణ ప్రసాదం రుచి, శంకరాభరణం తీసిన మీ అభిరుచి......గుర్తొచ్చి తీరతాయి!

    మళ్ళీ పుట్టండి. అరువు గొంతులు, దరువు సంగీతాలు, పరువుపోయే డైలాగుల్తో మంచి సినిమాకోసం కరువెత్తి వున్నాం!

    జిలిబిలి పలుకులకోసం, మిన్నేటి సూరీడుకోసం, చిన్నారి పొన్నారి కిట్టయ్యలకోసం, లాలిపాటలకోసం, ఇంకా.....వెన్నెల్లో గోదారి అందంకోసం కన్నులు కాయలుకాచిన మేమంతా ‘బ్రోచేవారెవరురా?' అంటూ ఎదురుచూస్తుంటాం!

    *************** నివాళి *************
    జగదీష్ కొచ్చెర్లకోట⁠⁠[10/6/2015, 07:18]

    రిప్లయితొలగించండి
  3. నివాళి బాగా వ్రాసారు మురళి గారూ.
    తెలుగు సినిమాలకి ఓ విభిన్న దిశ చూపించిన మహా నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారు. తర్వాత కాలంలో తెలుగు సినిమా మళ్ళీ దారి తప్పిందనుకోండి, అది వేరే సంగతి. ఏడిద వంటి ధైర్యస్ధులు rare personalities. RIP.
    ------------------
    నాకో సందేహం. మరి అంతటి మహానుభావుడు మరణిస్తే పరామర్శించడానికి వచ్చిన సినీమా జనాల్లో తెలుగు సినీపరిశ్రమకి "రెండు కళ్ళు" అని పొగడబడ్డ వారి కుటుంబాల ప్రతినిధులు కనిపించలేదే ! I could be wrong, కాని నాకయితే చూసిన (టీవీ తెరపై) / చదివిన (వార్తాపత్రికల్లో) జ్ఞాపకం రావడం లేదు.
    ------------------
    శ్రీనివాస్ పప్పు గారూ, చక్కటి నివాళిని తీసుకొచ్చి చదవడానికి అందుబాటులో పెట్టినందుకు thanks. మరి అంత అద్భుతమయిన నివాళి ఎవరు వ్రాసారు, ఎక్కడ వ్రాసారు, లింక్ ఏమిటి అన్న వివరాలు కూడా ఇస్తే బాగుంటుంది కదా.

    రిప్లయితొలగించండి
  4. మంచి వ్యాసం. ఏడిద నాగేస్వరరాఉ గారికి నివాళి.

    రిప్లయితొలగించండి
  5. విన్నకోట నరసింహారావు గారూ: ఆ రాసినాయన పేరు ఆ మేటర్ లో క్రిందనే ఉందండీ(జగదీష్ కొచ్చర్లకోట అని). ఇంక లింక్ సంగతయితే ఆ మేటర్ మా వాట్సప్ గ్రూప్ లో మెంబర్ పెడితే అది పట్టుకొచ్చి ఇక్కడ పెట్టానండీ

    రిప్లయితొలగించండి
  6. మీ నివాళి చదివేక రాయకుండా ఉండ లేకపోతున్నాను.నిజంగా నేను శంకరాభరణం తరవాత ఎక్కడా హాలుకు వెళ్లి సినిమా చూడలేదు.ఇప్పుడు టీవీ లో కూడా చూడలనిపించటం లేదు.--------------డా .సుమన్ లత

    రిప్లయితొలగించండి
  7. @బోనగిరి: మీ వ్యాఖ్య చూశాక ఆకాశం శ్రీరాములు గారిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశానండీ.. వివరాలేమీ దొరకలేదు :( ..ధన్యవాదాలు
    @శ్రీనివాస్ పప్పు: ఉన్నమాట చెప్పారండీ జగదీశ్ గారు.. అందించినందుకు ధన్యవాదాలు మీకు..
    @విన్నకోట నరసింహా రావు: 'రెండు కళ్ళ' వాళ్ళతో ఈయనేమీ సినిమాలు నిర్మించలేదుకదండీ, అందుకేమో మరి.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  8. @పొన్నాడ మూర్తి: ధన్యవాదాలండీ..
    @సుర్ సౌరభ్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి