బెంగాల్ లోని ఓ పల్లెటూరికి చెందిన కుర్రాడు
శంకర్. ఎఫ్యే పరిక్ష పాసయ్యి, ఊరిలో మిత్రులతో సరదాగా గడుపుతున్న అతనికి
ఉన్నట్టుండి ఉద్యోగం వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది, తండ్రి అనారోగ్యం
కారణంగా. ఓ చిన్న ఉద్యోగంలో చేరినా, ఆ జీవితం అతనికి ఏమాత్రం సంతృప్తి
కలిగించదు. ఎందుకంటే శంకర్ కి దేశాలు చుట్టి రావాలనీ, కనీసం కొన్నైనా
సాహసాలు చేయాలనీ కోరిక. తన కోరిక తీరని కలగా మిగిలిపోతుందేమో అని అతను
ఆందోళన చెందుతున్న తరుణంలోనే పక్కింటి వాళ్ళ అల్లుడు తనతో ఆఫ్రికా తీసుకు
వెళ్తాడు శంకర్ ని.
ఆఫ్రికా అప్పటికింకా నిర్మాణ దశలో ఉన్న
దేశం. దట్టమైన అడవులు, ఎత్తైన శిఖరాలు, వాటి నుంచి పారే సెలయేళ్ళు, చుట్టూ
తిరిగే సింహాలు, అడుగులకి అడ్డం పడే పాములు, కళ్ళ ముందే బద్దలయ్యే అగ్ని
పర్వతాలు... ఒక్క మాటలో చెప్పాలంటే అది శంకర్ కలగన్న జీవితం.. కోరుకున్న
ప్రపంచం. అక్కడ బతకడమే ఓ సాహసం. అయితే, ఆ ఒక్క సాహసంతో సరిపెట్టుకోలేదు
శంకర్. ఉద్యోగం వదిలిపెట్టి వజ్రాల వేటకి బయల్దేరాడు. అప్పటివరకూ వజ్రాల
వేటకి వెళ్ళిన వాళ్ళెవరూ బతికి బట్టకట్టిన దాఖలాలు లేవు. కానీ, అదేమీ
శంకర్ ని ఆపలేదు. దాదాపు ప్రతిరోజూ మృత్యుముఖంలో తల పెట్టి బయటికి రావడం
లాంటి ఆ ప్రయాణంనుంచి శంకర్ తిరిగి వచ్చాడా??
'పథేర్
పాంచాలి' నవలా రచయిత బిభూతి భూషణ్ బందోపాధ్యాయ గురించి తెలుగు పాఠకులకి
కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అపూ కథతో పాటు, 'వనవాసి' ని కూడా తెలుగు
వాళ్లకి పరిచయమయ్యాడు, అనువాదాల పుణ్యమా అని. బిభూతి భూషణుడి కలం నుంచి
జాలువారిన పొట్టి నవల 'చంద్రగిరి శిఖరం.' దట్టమైన ఆఫ్రికా అడవుల్లో శంకర్
చేసిన సాహస యాత్రని వర్ణిస్తూ బెంగాలీలో రాసిన 'చందేర్ పహార్' నవలని
కాత్యాయని తెనిగించగా, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. నూట మూడు
పేజీల నిడివి ఉన్న ఈ నవలని ఏకబిగిన పూర్తి చేసి పక్కన పెట్టాల్సిందే తప్ప
మధ్యలో ఆపడం వీలుకాదు.
ఆఫ్రికాలో మొదట ఓ నిర్మాణ కంపెనీలో
చేరతాడు శంకర్. రాత్రయితే చాలు పక్కన ఉన్న అడవినుంచి ఒకటో రెండో సింహాలు
గుడారాల మీద దాడి చేసి రోజుకి ఒకరిని ఎత్తుకుపోతూ ఉంటాయి. కొంచం మంచి
ఉద్యోగం దొరికింది కదా అని ఓ చిన్న రైల్వే స్టేషన్ కి స్టేషన్ మాస్టర్ గా
వెళ్తాడు శంకర్. ఆ స్టేషన్ అక్షరాలా పాముల పుట్ట. నిలువెత్తు పాములు బుసలు
కొడుతూ ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు, తాగేందుకు కూడా. ఆ ఉద్యోగం
వదిలిపెట్టేందుకు శంకర్ మానసికంగా సిద్ధ పడ్డ తరుణంలోనే అతనికి అనారోగ్యంతో
ఉన్న వృద్ధుడైన అల్వరెజ్ పరిచయమయ్యాడు. ఎన్నో ఏళ్ళ క్రితమే బంగారాన్నీ, వజ్రాలనీ వెతకడం కోసం ఆఫ్రికా చేరుకున్న వాడు అల్వరెజ్.
శంకర్
సపర్యలతో కోలుకున్న అల్వరెజ్ మళ్ళీ వజ్రాల వేటకి బయల్దేరుతూ ఆసక్తి ఉంటే
తనతో కలిసి ప్రయాణం కమ్మంటాడు శంకర్ ని. ఒకప్పుడు తను కన్న కలలు
గుర్తొస్తాయి శంకర్ కి. ప్రపంచాన్ని చూడాలని, సాహసాలు చేయాలనీ తను
తీసుకున్న నిర్ణయాలు గుర్తొస్తాయి. అవకాశం అల్వరెజ్ రూపంలో తన తలుపు
తట్టిందని భావించిన శంకర్, ఉద్యోగానికి రాజీనామా చేసి అడవిబాట పడతాడు.
ఆఫ్రికాలో అడుగుపెట్టినప్పటి నుంచీ మృత్యువు ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే
ఉన్నా, అల్వరెజ్ తో చేస్తున్న ప్రయాణంలో ప్రతి అడుగూ సాహసోపేతమే అయ్యింది
శంకర్ కి.
ఇంతకీ వాళ్లకి బంగారం, వజ్రాలు దొరికాయా? అసలు
వాళ్ళిద్దరూ ప్రాణాలతో బయట పడగలిగారా?? అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే
'చంద్రగిరి శిఖరం' నవల ఆసక్తికరంగా ముగుస్తుంది. చదువుతున్నంతసేపూ అనేక
సందర్భాల్లో శంకర్ మరెవరో కాదో రచయిత బిభూతి భూషణుడే అనిపిస్తుంది. కానీ,
ఆయన తన జీవిత కాలంలో ఏనాడూ ఆఫ్రికా చూడలేదని తెలిసి అమిత ఆశ్చర్యం
కలుగుతుంది. కేవలం తను చదివిన పుస్తకాల ఆధారంగా ఆఫ్రికా అడవులని, పర్వతాలనీ
కళ్ళకి కట్టినట్టు వర్ణించారు. అనువాదం, ప్రింటింగ్ రెండూ బాగున్నాయి,
సొంత లైబ్రరీలో చేర్చుకోవాల్సిన పుస్తకం. (వెల రూ. 50, అన్ని ప్రముఖ
పుస్తకాల షాపులు).
కినిగే లో కొనుక్కుని చదివానండీ ఈ పుస్తకం. నిజంగా చాలా బాగుంది. నిజంగా రచయిత జీవితంలో ఎప్పుడూ ఆఫ్రికా ను సందర్సించలేదంటె కొంచెం ఆశ్చర్యం వేసింది.
రిప్లయితొలగించండి@Freebookbank: నాకూ అదే ఆశ్చర్యం అండీ.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి