గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా
ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ మాటకొస్తే, లోక్ సభ ఎన్నికలకి ముందూ, తర్వాతా
జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయాన్ని నమోదు చేసుకోలేదు. ప్రధాన
ప్రతిపక్షంగా ఉండడానికి చాలినంత బలం లేకపోయినప్పటికీ, లోక్ సభలో ప్రతిపక్ష
పాత్ర దక్కింది. కానైతే, ఇప్పటివరకూ ప్రతిపక్షంగా కాంగ్రెస్ సాధించింది
కూడా ఏమీ కనిపించడం లేదు. దీనితో, పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా
తోస్తోంది ప్రస్తుతానికి. మునిగిపోయే పడవలో ప్రయాణం చేయడం ఇష్టం లేని నాయకులు సైతం బయటపడే మార్గం కనిపించక రోజులు లెక్ఖ పెడుతున్నారు.
ఇదిగో,
ఈ తరహా నాయకులందరికీ ఆశాదీపమయ్యింది తమిళ తాయి జయంతి నటరాజన్. అత్యంత
నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ కి రాజీనామా చేయడమే కాక, రెండు రోజులుగా
జాతీయ స్థాయి వార్తల్లో నానుతోందీ లాయరమ్మ. మామూలుగా అయితే, కాంగ్రెస్
నుంచి ఎవరు బయటికి వెళ్ళినా అదేమంత పెద్ద వార్త కాదిప్పుడు. అందుకే కాబోలు,
ప్రత్యేక పరిస్థితులని సృష్టించుకుని మరీ పార్టీ నుంచి నిష్క్రమించడం
ద్వారా తన ఇమేజిని పెంచుకునే ప్రయత్నం చేశారీ కేంద్ర మాజీ మంత్రిణి. అమ్మగారి పాచిక పారినట్టుగానే కనిపిస్తోంది ప్రస్తుతానికి.
గత
యూపీఏ ప్రభుత్వంలో రెండున్నరేళ్ళు కీలకమైన పర్యావరణ, అటవీ శాఖలకి స్వతంత్ర
హోదా గల మంత్రిగా పని చేసి, ఎన్నికలకి సరిగ్గా పదినెలల ముందు రాజీనామా
చేసిన జయంతి, తన రాజీనామాకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారణమంటూ
కేవలం మూడు నెలల క్రితం పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఓ ఉత్తరం రాశారు.
బహుశా ఆ ఉత్తరం కోటరీని దాటి మేడమ్ దగ్గరికి వెళ్లి ఉండదు. అందుకే కాబోలు,
తమిళ రాష్ట్రం నుంచి ప్రచురితమయ్యే ఓ జాతీయాంగ్ల పత్రికకి ఆ ఉత్తరం లీక్ కాబడింది. అది కూడా కేవలం రెండు రోజుల క్రితం.
జయంతి,
సోనియాకి రాసిన ఆ కాన్ఫిడెన్షియల్ ఉత్తరం, దానితో పాటు రాహుల్ బాబు
చేసినట్టుగా చెప్పబడుతున్న పాపాల చిట్టాని ఆ పత్రిక మొదటి పేజీలో
ప్రచురించడం ఆలస్యం, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేశారు
శ్రీమతి నటరాజన్. కాంగ్రెస్ నుంచి బయటికి రావడానికి ఏకంగా రాహుల్ బాబునే
కారణంగా చూపడం, నెహ్రూ కుటుంబాన్ని దైవ సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీలో ఓ
సరికొత్త ట్రెండ్ అని చెప్పాలి. ఇంత జరిగినా, చినబాబు కి మద్దతుగా ఎవరూ
ఆత్మహత్యా ప్రయత్నాలూ అవీ చేయకపోవడం ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్
రాజకీయాల తీరు మారుతోందో ఏవిటో మరి.
కాంగ్రెస్ పార్టీ నుంచి
తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన భక్తవత్సలం మనవరాలైన జయంతి రాజీవ్ గాంధీ
పిలుపు అందుకుని కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆయన ఆశీస్సులలతో రాజ్యసభ
సభ్యురాలయ్యారు. రాజీవ్ హత్య అనంతరం, ప్రధాని పదవి చేపట్టిన పీవీ
నరసింహారావుకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టిన తమిళ కూటంలో కీలక పాత్ర
పోషించారు. అప్పుడు ఏర్పడిన తమిళ మానిల కాంగ్రెస్ ద్వారా యునైటెడ్ ఫ్రంట్
కూటమిలో చేరి, పీవీ అనంతరం ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రి
అయ్యారు. కాంగ్రెస్ పగ్గాలు సోనియా చేతికి రావడంతోనే తమిళ మానిల కాంగ్రెస్,
దానితో పాటే జయంతి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయారు.
సోనియా
ఆశీస్సులతో మరోసారి చేపట్టిన కేంద్రమంత్రి పదవిని, రాహుల్ కారణంగానే
వదులుకున్నానని తాజాగా రహస్యం విప్పారు జయంతి నటరాజన్. ఇప్పుడింక కాంగ్రెస్
పార్టీ నుంచి ఎలా బయట పడాలా అని ఎదురుచూస్తున్న నేతలకి దారి దొరికేసింది.
రాహుల్ చేసిన ద్రోహాల వివరాలతో అధినేత్రికి ఓ ఉత్తరం రాసి బయటకి నడవొచ్చు.
రాహుల్ పేరు వాడుకోవడం వల్ల రాజీనామా వార్త నలుగురి నోళ్ళలోనూ నానుతుంది.
అంతే కాదు, శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న వాడుకని అనుసరించి రాహుల్
బాధితులకి అధికార పార్టీలో సులువుగానే సీటు దొరికేయవచ్చు కూడా.
తమిళనాడు
శాసన సభ ఎన్నికలకి సరిగ్గా ఏడాది ముందుగా, ఓ జాతీయ స్థాయి తమిళ నాయకురాలు
కాంగ్రెస్ పార్టీని వీడిందంటే తెరవెనుక కారణాలు కూడా ఏవో ఉండే ఉంటాయి.
ఓపక్క ఇంకా బలం పుంజుకోని కరుణానిధి గారి డీఎంకె, మరోపక్క పురచ్చి తలైవి జైలు జీవితం కారణంగా ప్రభ కొంత మసకబారిన అన్నా డీఎంకె, ఇంకో పక్క దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తానని పదేపదే ప్రకటిస్తున్న బీజీపీ అధ్యక్షుడు అమిత్ షా.
"పరిశ్రమలపై 'జయంతి పన్ను' పడుతోందంటూ అప్పట్లో మోడీ నన్ను విమర్శించారు.
అప్పుడు నేనున్న పరిస్థితులు అలాంటివి. మోడీ అలా అనడంలో ఎలాంటి తప్పూలేదు"
అంటూ జయంతి పలుకుతున్న పలుకులు వింటుంటే తమిళ నాట ఏం జరగబోతోందో తెలుస్తున్నట్టే అనిపిస్తోంది.
(ఫోటో కర్టెసీ: ది హిందూ)
తమిళనాదులో బీజెపీ బలపడుతుంది అని మూణ్ణెళ్ళక్రితం ఇండియాటుడే జోస్యం చెప్పింది. అది నిజమయ్యేలా ఉంది.
రిప్లయితొలగించండినావరకు నేను. కాంగ్రెస్ పూర్తిగా నాశనమైపోవాలని కోరుకుంతున్నాను. దేశానికి కాంగ్రెస్ చేసిన చెరుపు బహుశా ఆంగ్లేయులుకూడా చేయలేదేమో! At the same time, BJPకి ఒక ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవలసిన అవసరం దేశప్రజలకి ఉంది. ఒక హిందూత్వకీ, ఆర్ధిక సంస్కరణలకీ (తద్వారా కలిగే సాంస్కృతిక మార్పులకీ) బొత్తిగా పడదు. అది తెలిసీ ఆరెండింటిలో ఏదికావాలో తేల్చుకోలెని confused stateలో ఉండే ప్రభుత్వం, దేశాన్ని మరొక హిందూ ఆఫ్ఘనిస్థాన్ చెయ్యాలని భావించే భావజాలం are anachronous and incongruous in current India.
Sorry that I couldn't type in telugu.
రిప్లయితొలగించండిCongress ki pradhana pratipaksha hodha kuda ivvaledani gurtu
పుష్పక విమానం లాంటి కాంగ్రెస్ నుండి వచ్చే అందరికీ బిజెపి అవకాశం ఇవ్వగలదా?
రిప్లయితొలగించండిమన దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ బతికే ఉంటుంది. పార్తీనియం మొక్కని కాంగ్రెస్ పార్టీతో పోలుస్తారు కాంగ్రెస్ గడ్డి అని. మనం ఎంత ప్రయత్నించినా ఆ మొక్కని వదిలించుకోలేము.
కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఎవరూ పెద్దగా ప్రయత్నించక్కర్లేదు కూడా. ఇతర పార్టీలు చేసే తప్పులే ఆ పార్టీని బతికిస్తాయి. ఎందుకంటే ఏ ప్రత్యామ్నాయం లేనప్పుడు మనకి కాంగ్రెసే దిక్కు.
I think you are missing some history. There were so many like this earlier, V P Singh, Arun Nehru, and Natwar Singh to name a few. Nothing changes. Few will leave either for the fear of backlash from the new govt for their wrong- doings during their tenure or for greener pastures at the earliest.
రిప్లయితొలగించండిAs a typical Telugu-ite, we always look for someone else to develop or do something good to the country and never introspect what we have done except ranting in social media.
Again, nothing changes, we will be like this only ;)
BTW, she didn't quit protesting against those interference but was sacked. What is the guarantee that it won't happen with another party in govt?. Also, how is that she or anyone else who comes from Congress and joining another party will become pure instantaneously :)
రిప్లయితొలగించండిSo many questions, right? Not pleasant ;)
సూర్యుడు : True! వుయ్యార్లైక్దట్టోన్లీ! (We are like that only):-)
రిప్లయితొలగించండి@Iconoclast: కాంగ్రెస్ పూర్తిగా నాశనం అయిపోవడం అన్నది వెనువెంటనే జరిగే పని కాదేమోనండీ.. గట్టి పునాది ఉంది కదా.. (ఆఫ్ కోర్స్, బీటలు పడుతున్నాయి).. ఇక బీజీపీ, ఏదో ఒక దారిని ఎంచుకోక తప్పని పరిస్థితులు త్వరలోనే వచ్చేలా ఉన్నాయి.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@ఫణి: 'ప్రధాన ప్రతిపక్షంగా ఉండడానికి చాలినంత బలం లేనప్పటికీ, లోక్ సభలో ప్రతిపక్ష పాత్ర దక్కింది' ఇదండీ నేను రాసింది.. ధన్యవాదాలు.
@బోనగిరి: 'కాంగ్రెస్ గడ్డి' ..నిజమండీ, అంత సులభం కాదు. ప్రత్యామ్నాయం దొరికే పరిస్థితి కూడా దరిదాపున కనిపించడం లేదు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సూర్యుడు: 'ఆయారాం..గయారాం' సంస్కృతి కాంగ్రెస్ లో కొత్త కాదండీ. కానీ, జయంతి నటరాజన్ నిష్క్రమించిన తీరు, దానిపై కాంగ్రెస్ పెద్దల స్పందల ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ అధినాయకుల మీద ఏ చిన్న విమర్శ వచ్చినా 'నెహ్రు ఇంటి కావలి కుక్కలం' అని చెప్పుకునే నాయకులు రోడ్డెక్కి వీరంగం చేసే రోజులు వెళ్లిపోయాయా? అనిపిస్తోంది. ఇకపోతే, 'రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులూ ఉండరు' అని నాయకులందరూ నమ్మే విషయం కాబట్టి, పార్టీలు శాశ్వతం కాదండీ.. పదవులు మాత్రమే శాశ్వతం.. ...ధన్యవాదాలు.