శుక్రవారం, నవంబర్ 21, 2014

ఇద్దరు

ఈ నెలలో ఇద్దరు ప్రముఖ రచయితలు పుట్టినరోజు జరుపుకున్నారు. ఒకరు తొంభై ఒకటో ఏటికి, మరొకరు తొంభయ్యో ఏటా అడుగు పెట్టారు. ఇద్దరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వీరిద్దరూ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలనీ, సాహితీ సేద్యాన్ని కొనసాగించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సమాజాన్ని ప్రభావితం చేసిన ఈ ఇద్దరినీ గురించీ నాలుగు మాటలు చెప్పుకోడానికి ఇది సందర్భం అనిపిస్తోంది.

డాక్టర్ ఆవంత్స సోమసుందర్.. కవిగా ప్రయాణం మొదలు పెట్టి, కవిత్వం కొనసాగిస్తూనే వచనం, అనువాదాల మీదుగా రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ 'పిఠాపురం కవిగారు' కొన్నితరాల కవులని ప్రభావితం చేశారు, చేస్తున్నారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, ఓ జమీందారీ కుటుంబంలో దత్తపుత్రుడిగా అడుగుపెట్టి, వైభవాన్నే తప్ప దరిద్రాన్ని ఏమాత్రమూ రుచిచూడని సోమసుందర్ వామపక్ష రాజకీయ భావజాలం వైపు మొగ్గు చూపడం, నమ్మిన సిద్ధాంతం కోసం జైలు జీవితం గడపడం వింతల్లో వింత.


కోస్తా ప్రాంతంలో పుట్టి పెరిగిన కవుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని తొలినుంచీ ఎలుగెత్తి చాటిన ఏకైక కవి సోమసుందర్. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం సోమసుందర్ వెలువరించిన కవితా సంకలనం 'వజ్రాయుధం' తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని నొక్కి చెబుతుంది. 'వజ్రాయుధ కవి' అన్న బిరుదుని మాత్రమే కాదు, లెక్కలేనన్ని విమర్శల్నీ తెచ్చిపెట్టిన సంకలనం అది. సోమసుందర్ కవిత్వం కన్నా ఎక్కువగా, ఆయన 'బూర్జువా' నేపధ్యం విమర్శలకి కేంద్రబిందువు అయ్యింది.

విమర్శలకి మాటలతో మాత్రమే కాక, చేతలతోనూ సమాధానం చెప్పడం సోమసుందర్ శైలి. ఈమధ్యనే జరిగిన తన తొంభై ఒకటో పుట్టినరోజు వేడుకల్లో తాజాగా రాసిన మూడు పుస్తకాలని విడుదల చేసి  తానేమిటో మరోమారు నిరూపించుకున్నారు సోమసుందర్. రాసేవాళ్ళని ప్రోత్సహించడం, నిష్కర్షగా - ఇంకా చెప్పాలంటే కటువుగా - విమర్శించడం సోమసుందర్ పధ్ధతి. సాహిత్యంలో నాణ్యతని కోరుకునే ఈ కవిగారినుంచి మరిన్ని రచనలు రావాలని కోరుకుంటున్నాను.


నాగావళి నది ఒడ్డున పుట్టిన కాళీపట్నం రామారావు మేష్టారి జీవితమూ, సాహిత్యమూ కూడా వామపక్ష ఉద్యమాలతో పెనవేసుకున్నవే. శ్రీకాకుళంలో ఓ మధ్యతరగతి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబలో జన్మించి, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఢక్కామక్కీలు తిన్న కారా మేష్టారు ప్రతి దెబ్బకీ మరింత పదునెక్కారే తప్ప ఏనాడూ రాజీపడలేదు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మేష్టారి కథలన్నీ వామపక్ష భావజాలంతో సాగేవే.

సుందరపాలెం లో జరిగిన 'యజ్ఞం' గురించి చెప్పినా, భారతదేశం మీద జరిగిన 'కుట్ర' ని విప్పి చెప్పినా, కూటికి పేదలైనా గుండెల్లో 'ఆర్తి' నింపుకున్న జనాన్ని గురించి చెప్పినా ఆ కథలన్నింటి వెనుకా ఓ కమిట్మెంట్ కనిపిస్తుంది. దిగువ మధ్యతరగతి, పేద ప్రజల జీవితాలని నిశితంగా పరిశీలించి కథలు రాసిన కారామేష్టారి మీద వచ్చిన విమర్శలకీ అంతులేదు. 'యజ్ఞం' కథ ఇవాల్టికీ చర్చనీయమే.

తను రాసిన కథల గురించి మాట్లాడడానికి ఏమాత్రమూ ఇష్టపడని కారా మేష్టారు, తెలుగు కథలన్నింటీ ఓ చోటకి చేర్చాలనే సంకల్పంతో ఆరంభించిన 'కథా నిలయం' ఎవ్వరి ఊహకీ అందని ప్రాజెక్టు. ఏ ప్రభుత్వ సంస్థో చేపట్టాల్సిన కార్యక్రమం. కేవలం తన సంకల్ప బలంతో, సాహిత్యం ద్వారా వచ్చిన ప్రతి పైసనీ ఖర్చు చేసి 'కథా నిలయా'నికి ఓ రూపు తెచ్చారు మేష్టారు. చదివే అలవాటున్న వాళ్ళు ఎవరు కనిపించినా "మీ దగ్గర ఏ కథలున్నా ఓ కాపీ కథా నిలయానికి పంపండి" అని చెప్పడం ఇవాల్టికీ మర్చిపోరు. మేష్టారు మళ్ళీ రాయడం మొదలు పెడితే బాగుండునని ఎదురు చూసే వాళ్ళలో నేనూ ఒకడిని.

పుట్టినరోజు అనేది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. జరుపుకోవాలా, వద్దా అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయం. కొందరు రచయిత(త్రు)లు పుట్టినరోజు జరుపుకోరు. అది వారిష్టం. కానీ, ఆయా రచయిత(త్రు)ల అభిమానులు కొందరికి ఈ ఇద్దరు రచయితలూ పుట్టినరోజుని వేడుకగా జరుపుకోడం నచ్చలేదు. వారి వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకుని విమర్శలు కురిపించారు. దానిగురించిన చర్చ ఇక్కడ అప్రస్తుతం. కానైతే, వీళ్ళిద్దరూ పుట్టినరోజు జరుపుకోడం వల్లనే వీళ్ళ రచనలని గురించిన కొంత చర్చ జరిగింది కదా అన్నది నాబోంట్ల సంతోషం!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి