బుధవారం, నవంబర్ 19, 2014

పూలబాట

"నువ్వు నడుచు దారుల్లో పూలు పరిచి నిలుచున్నా.. అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా..." చిత్ర పాట వింటూ ఉంటే ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగొచ్చాయి కాసేపు. పూలు పరిచిన బాటలో నడవడం, మనం నడిచే బాటలో మనకోసం మరొకరు పూలు పరిచి నిలబడడం.. రెండూ వేరువేరు కదూ. పూలబాటని ఎంచుకోవడం చాయిస్ అయితే, పూలు పరిచి నిలబడడం చాన్స్ అనుకోవాలి. మొదటిదాని కన్నా రెండోది గొప్ప విషయం, కచ్చితంగా.

పూలకీ, ముళ్ళకీ అవినాభావ సంబంధం. ముళ్ళున్న చెట్లకి అందమైన పూలు పూస్తాయి అదేమిటో. బహుశా, అందమైన పూలకి రక్షణ కోసం ఆ ముళ్ళు అనుకోవాలి మనం. ముళ్ళతో  పోరాడి గెలిచిన వాళ్లకి మాత్రమే పూలు లభిస్తాయి అనీ అనుకోవచ్చు. పూలబాట కన్నా ముందుగా కనిపిస్తూనో, పూలమాటున కనిపించకుండానో ముళ్ళు ఉంటాయన్నది ఇక్కడ గుర్తించాలి. 'ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె' అవసరం లేదేమో కానీ, పూలచెట్టుకి ముళ్ళకంచె ఇచ్చే రక్షణ అంతా ఇంతా కాదు.

'పాలకోసం నల్లరాయి మొయ్యాలి' అని సామెత. దీన్ని కాస్త మార్చుకుని, పూలకోసం  ముళ్ళని భరించాలి అనుకోవచ్చు. ఆటో రిక్షాల వెనక వైపున ఆయా డ్రైవర్ల అభిరుచుల మేరకి రకరకాల విషయాలు రాసి ఉంటాయి. ఆయా వాహనాల వెనుక వెళ్ళేప్పుడు వాటిని చదువుకోవడం ఓ అనుభవం. 'ముళ్ళకి జడిసి గులాబీని వదలకు' అన్నది ఒకానొక ఆటోడ్రైవర్ ఇచ్చిన సందేశం! 'సాహసం శాయరా డింభకా.. రాకుమారి వరించునురా' కి ఇది మరో రూపంలా అనిపించడం లేదూ?

పూలబాట కోసం మనమే పూలు పరుచుకోదానికీ, మనకోసం మరొకరు బాటని సిద్ధం చేయడానికీ సహజంగానే  చాలా తేడా ఉంది. మొదటిదాంట్లో ముళ్ళ బాధలు మనవైతే, రెండోదాంట్లో మరొకరివి. పైగా, ఈ మరొకరు మనకోసమని ఆ ముళ్ళని వాళ్ళే భరిస్తున్నారన్న మాట. గొప్ప విషయం కదూ. అలా భరిస్తున్నారంటే, వాళ్ళ దృష్టిలో మనమెంత ప్రత్యేకమో! మనమూ అంతే, అవతలి వాళ్ళు ఎంతో దగ్గరి వాళ్ళైతే తప్ప ఎలాంటి రిస్కులూ తీసుకోడానికి ఇష్టపడం. అనగా, చూస్తూ చూస్తూ ముళ్ళ జోలికి వెళ్ళం.

పూలమీద నడవాలని ఎవరికుండదు కనుక? కోరుకున్న అందరికీ పూలబాట దొరికేస్తుందా అంటే, అదంత సులువు కాదు. ఏ కొందరికో తప్పించి, రాళ్ళూ ముళ్ళూ దాటిన తర్వాతే పూలు కనిపిస్తాయి నడిచే దారిలో. అప్పటివరకూ అలసిన పాదాలకి ఒక్కసారిగా విశ్రాంతి దొరకడం వల్ల కాబోలు, ఆ పూలు మరింత మృదువుగా, పరిమళ భరితంగా అనిపిస్తాయి. వాడుక కూడా 'ముళ్ళూ-పూలూ' అనే.. ప్రస్తుతం ఉన్నది ముళ్ళ మీదే అయినా, త్వరలోనే పూలు కనిపిస్తాయన్న సూచన వినిపిస్తుంది ఈ వాడుకలో.

కొందరు కవులు జీవితాన్నీ, మరికొందరు కవులు యవ్వనాన్నీ పూలతోటతో పోలుస్తూ ఉంటారు. ఏ తోటా ఆరుగాలం విరగబూయదు కదా. అదే పూలబాట అయితే, స్థలకాలాదులతో నిమిత్తం లేకుండా పూలు పరచబడి ఉంటుంది. ప్రయాణం సుఖవంతమవుతుంది. కానైతే, బతుకు ప్రయాణంలో ఎంత దూరంపాటు ఈ బాట ఉంటుందన్నది ముందుగా తెలిసే అవకాశం లేదు. కాళ్ళకింద నలిగే వాటితో నిమిత్తం లేకుండా ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది. అవి రాళ్ళవ్వచ్చు.. ముళ్ళవ్వచ్చు.. పూలూ కావొచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి