గురువారం, నవంబర్ 27, 2014

రౌడీ FELLOW

ఎవరన్నారు తెలుగు సినిమా తీయడానికి కథల కొరత ఉందని? తెల్లారి లేచి పేపర్ చూస్తే బోలెడన్ని వార్తలు. టీవీ పెట్టి ఏ చానల్ తిప్పినా లెక్కలేనన్ని వార్తా కథనాలు. ఏదో ఒక వార్తా కథనాన్ని ఆధారం చేసుకుని, సినిమాటిక్ లిబర్టీని పుష్కలంగా ఉపయోగించుకుని, హీరోని సర్వ శక్తిమంతుడిగా తీర్చి దిద్దుకుని, ఊపిరి బిగపట్టే స్క్రీన్ ప్లే, పదునైన సంభాషణలతో కథ రాసుకుని తెరకెక్కిస్తే తప్పకుండా అదో వైవిద్యభరితమైన సినిమా అవుతుంది. నమ్మకం కలగడం లేదా? అయితే నారా రోహిత్ కథానాయకుడిగా వచ్చిన 'రౌడీ FELLOW' సినిమా చూడండి.

పశ్చిమ గోదావరి జిల్లాలోని 'కొల్లేరు' ఓ సామాజిక సమస్య.. పర్యావరణ సమస్య.. రాజకీయ సమస్య కూడా. ఆ ప్రాంత రాజకీయ నాయకుల మధ్య విభేదాలొచ్చినప్పుడల్లా కొల్లేరు వార్తల్లోకి వస్తూ ఉంటుంది. సరస్సుని ఆక్రమించి చేపల చెరువులు పెంచడాన్ని గురించి పేపర్లలో కథనాలు వస్తూ ఉంటాయి. టీవీ ఛానళ్ళు చర్చా కార్యక్రమాలతో సహా చేయగలిగినవన్నీ చేస్తూ ఉంటాయి. ఈ అంశం చుట్టూ కథ అల్లుకుని సినిమా తీయవచ్చు అన్న ఆలోచన తెలుగు సినిమా పరిశ్రమకి ఇన్నాళ్ళకి వచ్చింది. గీత రచయిత కృష్ణ చైతన్య కథ రాసుకుని, దర్శకత్వం వహించిన సినిమా ఇది.

పేదరికం అంటే ఏమిటో తెలియని మల్టీ మిలియనీర్ రాణాప్రతాప్ జయదేవ్ (నారా రోహిత్) కథ ఇది. నిలువెల్లా డబ్బున్నప్పుడు కొన్ని కొన్ని క్వాలిటీలు వాటికవే వచ్చేస్తాయి. మరికొన్ని లక్షణాలకి డబ్బు ఉండడం, లేకపోవడంతో సంబంధం ఉండదు. పుట్టుకతో వచ్చే లక్షణాలివి. కారణం ఏదైనప్పటికీ, జయదేవ్ కి ఉన్న క్వాలిటీ 'ఇగో.' తనని ఎవరన్నా ఏమన్నా అంటే బదులు తీర్చేసుకోవలసిందే. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఈ ఉపేక్షించక పోవడం వెనుక డబ్బు ఇచ్చిన దన్ను ఉంది. కావాల్సింది క్షణాల మీద చేసి పెట్టే పరివారమూ ఉంది.

ఈ కారణంగానే, ఎస్పీ పరమహంస (ఆహుతి ప్రసాద్) తో ఇగో క్లాష్ వచ్చినప్పుడు, అతనికి జవాబు చెప్పడం కోసం యాభై లక్షలు ఖర్చు చేసి ఎస్సై పోస్టు కొనుక్కుంటాడు జయదేవ్. ఎస్పీకి పక్కలో బల్లెంగా మారాలనుకున్న వాడు కాస్తా, అనుకోకుండా ఎంపీ అసురగణ దుర్గా ప్రసాద్ (రావు రమేష్) తో కయ్యం పెట్టుకుంటాడు. దుర్గాప్రసాద్, అతని అనుచరగణం సాగిస్తున్న దమనకాండ కారణంగా కొల్లేరు ప్రాంతంలో పేదవాళ్ళకి ఎదురవుతున్న కష్ట నష్టాలు చూసి చలించిపోయిన జయదేవ్ ఉద్యోగాన్ని సీరియస్ గా తీసుకోవడం మొదలుపెడతాడు. కేంద్ర మంత్రి కావాలన్న దుర్గా ప్రసాద్ కోరిక చివరినిమిషంలో తీరకుండా పోతుంది, కేవలం జయదేవ్ కారణంగా.


ఇక అక్కడినుంచీ దుర్గాప్రసాద్-జయదేవ్ ల మధ్య మొదలైన ప్రత్యక్ష పోరు ఎలా కొనసాగింది, ఎక్కడ ముగిసింది అన్నది సినిమా ముగింపు. ఏ ఎస్పీ కారణంగా తను పోలీసు ఉద్యోగానికి వచ్చాడో, అదే ఎస్పీ కూతురు (విశాఖ సింగ్, తొలిపరిచయం) తో జయదేవ్ ప్రేమలో పడడం, డ్యూయట్లు పాడుకోవడం ఈ సీరియస్ సినిమాలో కొంత ఆటవిడుపు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటులు తాళ్ళూరి రామేశ్వరి, గొల్లపూడి మారుతిరావులతో పాటు పరుచూరి, అజయ్ లకి గుర్తుండిపోయే పాత్రలు దొరికాయి. అలాగే, హాస్య నటులు సత్య, ప్రవీణ్ లకి కూడా. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పోసాని కృష్ణమురళి పోషించిన ' సిల్క్' పాత్రని. పోసాని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రని రాసుకున్నారు అనిపించింది.

ప్రధాన పాత్రలు పోషించిన నారా రోహిత్, రావు రమేష్ పోటాపోటీగా నటించారు. 'బాణం' తర్వాత నేను చూసిన రోహిత్ సినిమా ఇదే. కనీసం ఓ పది కేజీలు బరువు తగ్గకపొతే కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రమోషన్ వచ్చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. "కుర్రాడు బొద్దుగా ఉన్నాడు" అని ఓ పాత్ర చేతి పలికించి హీరో శరీరాకృతిని జస్టిఫై చేసే ప్రయత్నం చేశారు కానీ, వారసుల మధ్యే విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో రోహిత్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రావు రమేష్ ఎంపీ పాత్రని మరికొంత అండర్ ప్లే చేయగలడనిపించింది, గత చిత్రాలని గుర్తు చేసుకున్నప్పుడు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో మరీ 'లౌడ్' గా చేసిన భావన. ఆహుతి ప్రసాద్ పాత్ర చిత్రణ నిరాశ పరిచింది. ఆ పాత్ర మరికొంత బలంగా ఉంటుందని ఆశించాను.

హీరోని ఎలివేట్ చేయడమే లక్ష్యంగా రాసుకున్న కథ కావడం వల్ల చాలాచోట్ల నేల విడిచి సాముచేసింది. లాజిక్ ని పక్కన పెట్టాల్సిన సన్నివేశాల సంఖ్య పెరిగిపోయింది. సాంకేతిక విభాగాల్లో సన్నీ సంగీతం, అరవిందన్ పీ గాంధీ ఛాయాగ్రహణం చెప్పుకోవాల్సిన అంశాలు. దర్శకుడు కృష్ణచైతన్య కథ కన్నా ఎక్కువగా సంభాషణలే నమ్ముకున్నాడనిపించింది. డైలాగులు కొటేషన్లని తలపించాయి. అయితే, వరుసగా కొటేషన్లు వినాల్సి రావడమూ ఒక్కోసారి ఇబ్బందే. 'చెట్టుకింద ప్లీడర్' లో అలెక్స్ నీ, 'గీతాంజలి' లో ఫోన్ సీన్ నీ చాలా తెలివిగా వాడుకున్నారీ సినిమాలో. హీరోగారి  'చెట్టు' పేరు మరీ అన్నిసార్లు చెప్పక్కర్లేదేమో అనిపించింది. ఎడిటర్ కి మరికాస్త పనిపెంచి కనీసం ఓ ఇరవై నిమిషాల సినిమాని ట్రిమ్ చేసి ఉంటే మరింత బావుండేది. వైవిధ్య భరితమైన సినిమాలు కోరుకునే వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా ఇది.

(ఈ సినిమాని రికమెండ్ చేసిన మిత్రులు వేణూ శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు)

బుధవారం, నవంబర్ 26, 2014

ధన్వంతరి వారసులు

వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. మహాభాగ్యమైన ఆరోగ్యం ఇబ్బంది పెట్టినప్పుడే కదా డాక్టరు గుమ్మం తొక్కాల్సి వచ్చేది. ఊరికే కూర్చుని తోచీ తోచకా లెక్కలేస్తే ఇప్పటివరకూ నాకోసం అయితేనేం, మావాళ్ళ కోసమయితేనేం సుమారు ఓ యాభై మంది డాక్టర్లని చూసినట్టుగా లెక్క తేలింది. వీళ్ళలో వైద్యుల మాట పక్కనపెట్టి, కనీసం మనుషులుగా ప్రవర్తించిన వాళ్ళు నలుగురైదుగురు కూడా కనిపించలేదు. ఇది అత్యంత దురదృష్టం.

నేను చూసిన డాక్టర్లందరూ కూడా ప్రైవేటు నర్సింగు హోములు, కార్పొరేట్ హాస్పిటళ్ళ వాళ్ళే. ఎమర్జెన్సీ మినహాయించి మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ముందుగా అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళడం జరిగింది. కనీసం ఒక్కసారి కూడా ఆస్పత్రి వారిచ్చిన టైముకి డాక్టరు మమ్మల్ని చూడడం కాదు కదా, కనీసం హాస్పిటల్ కి కూడా రాలేదు. గంట నుంచి మూడుగంటల పాటు నిరీక్షణ. ఏ ఒక్క ఆస్పత్రీ, డాక్టరూ ఇందుకు మినహాయింపు కాదు. రోగుల టైం అంటే డాక్టర్లకి ఎంత చులకన?!!

కన్సల్టెన్సీ రూములోకి వెడుతూనే డాక్టర్ని పలకరించడం ఒక అలవాటు. తిరిగి 'హలో' అన్నవాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. తుమ్మల్లో  పొద్దుగూకినట్టుగా ముఖం పెట్టుకుని కూర్చోడం, పరమ సీరియస్ గా వాచీనో, మొబైల్ ఫోనో చూసుకోడం లేదా నర్సు మీద కేకలేయడం.. ఇది సాధారణ దృశ్యం. రోగి తన సమస్యలు చెప్పుకునే కనీస వాతావరణం కల్పించాలి అన్న ఆలోచన వీళ్ళకి ఎందుకు ఉండదో అనిపిస్తూ ఉంటుంది. ఇక మాట్లాడడం కూడా ఏ గోడమీద కేలండర్నో చూస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 'ఈ డాక్టర్ నా ముఖం వైపు ఎందుకు చూడడంలేదు? నాకు కళ్ళకలక గానీ వచ్చిందా?' ఈ సందేహం నాకెన్నిసార్లు కలిగిందో లెక్కలేదు.

తొంభై శాతం మంది డాక్టర్లు పేషెంట్ ని ఎదురుగా పెట్టుకుని నర్సుతోనో, ఫోన్ లోనో, లేదా అప్పటికే టేబిల్ కి మరోవైపు కూర్చున్న తన ఫ్రెండ్ తోనో కబుర్లు చెబుతూ ఉంటారు. డాక్టర్ చెప్పింది పేషెంట్ వినాలి తప్ప ఏమీ అడక్కూడదు. పొరపాటున ఒకట్రెండు కన్నా ఎక్కువ సందేహాలు అడిగారో, పేషెంట్ల పని అయిపోయిందే.. "ఎక్కడినుంచి వస్తారో మన ప్రాణాలు తీయడానికి" అని వినీవినబడకుండా గొణుగుతారు జనాంతికంగా. ఇంజెక్షన్ అవసర పడితే, చేయాల్సిన బాధ్యత నర్సుదే. ఒకవేళ డాక్టరే చేస్తే మాత్రం, ఎటో చూస్తూ సూది జబ్బలో గుచ్చుతారు చాలా కాన్ఫిడెంట్ గా.

పేషెంట్ అనారోగ్యం మీద జోకులు వేసే డాక్టర్లూ ఉన్నారు. వీళ్ళని కనీసం మనుషులు అనుకోలేం. ఇక డైట్ గురించి డాక్టర్లు వేసే జోకులకి సిగ్గుతో చచ్చిపోవాలి. 'మనం మరీ తిండి తినడం కోసమే బతుకుతున్నామా?' అన్న అనుమానం వచ్చేస్తుంది. దానితోపాటే 'తినకపోతే చచ్చిపోతామా' అన్న వైరాగ్యం కూడా. డాక్టర్ ఏమన్నా టెస్ట్ లు రాస్తే పొరపాటున కూడా 'ఎందుకు?' అని అడగకూడదు. వాళ్ళ మనోభావాలు తీవ్రంగా గాయపడతాయి. 'ఫలానా మందు నాకు సరిపడదు, వేరేది రాయండి?' అన్నా సమస్యే.. 'డాక్టర్ నువ్వా? నేనా?' వరకూ వెళ్ళిపోతుంది విషయం. 'కానీ మందు మింగాల్సింది నేను కదా' అన్నామో, నర్సుకి పాపం తిట్లే తిట్లు.



లోకంలో మంచి డాక్టర్లు లేరని కాదు. కానీ, మంచితనంలాగే వారి శాతం కూడా బహు స్వల్పం. ఈ కారణంగానే కావొచ్చు, మంచివారు కాని డాక్టర్ల పాల పడాల్సి వస్తోంది. సాధ్యమైనంత వరకూ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి రాకుండా చూసుకోవడం ఉత్తమమే కానీ, అన్నీ మన చేతిలో ఉండవు కదా. డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన 'హౌస్ సర్జన్' నవలలో మంచి డాక్టర్ల గురించి చదివినప్పుడు ఆశ్చర్యంతో పాటు ఆనందమూ కలిగింది. ఆయన తప్పు లేకుండా, మంచివారు కాని డాక్టర్ల గురించి కూడా రాశారు కొమ్మూరి ఆ నవలలో. వ్యక్తిగత సమస్యలో మరొకటో డాక్టర్లని ఇబ్బంది పెడుతూ ఉండి ఉండొచ్చు.. కాదనలేం. కానీ, ఆ చికాకుల్ని పేషెంట్ల మీద చూపించడం ఎంతవరకూ సబబు?

పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటా.. వైద్యసేవలని వినియోగదారుల చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఓ ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన గురించి విన్న వెంటనే చాలా చాలా సంతోషం కలిగింది నాకు. కానీ, ఏం లాభం? డాక్టర్లందరూ సమ్మెలూ అవీ చేసి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ ప్రతిపాదనని విజయవంతంగా బుట్ట దాఖలు చేయించారు. ఆమధ్య ఓ సినిమాలో కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు శవానికి వైద్యం చేసి బిల్లు వేసినట్టుగా చూపిస్తే చాలామంది డాక్టర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొందరైతే ఆ సినిమాని నిషేధించాలని కూడా అన్నారు అప్పట్లో. కానీ, జనాభిప్రాయం మాత్రం సినిమాలో చూపించిన దాంట్లో అతి ఎంతమాత్రమూ లేదనీ, జరుగుతున్నదే చూపించారనీను.

ఏటా నవంబర్-డిసెంబర్ నెలలు వచ్చేసరికి 'జూడాల సమ్మె' తంతు మొదలవుతుంది. రకరకాల డిమాండ్లతో సమ్మె చేస్తూ ఉంటారు ఈ జూనియర్ వైద్యులు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ధర్మాసుపత్రుల్లో రోగులని ఎలా చూస్తారో ఊహించడం కష్టం కాదు. రోగుల సంఖ్యకీ, డాక్టర్ల సంఖ్యకీ ఎప్పుడూ సమన్వయం కుదరని ధర్మాసుపత్రుల మీద ఈ జూడాల సమ్మె ప్రభావం అంతా, ఇంతా కాదు. ప్రభుత్వం ఒక్కో జుడా మీద ప్రజల సొమ్ము లక్షలకి లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు కొన్ని షరతులు విధించడంలో తప్పు కనిపించదు.

చదువు పూర్తవ్వగానే గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పనిచేయాలి అన్న నిబంధన వాటిలో ఒకటి. కోర్సులో చేరినప్పుడు ఏమాత్రం అభ్యంతరంగా అనిపించని ఈ నిబంధన, చదువు పూర్తయ్యే సమయానికి వాళ్ళ 'హక్కులకి భంగం' గా కనిపిస్తుంది జూడా లకి. సమయం చూసుకుని సమ్మెకి దిగడం, నెలో, నెలన్నరో చదువునీ, పేషెంట్లనీ వదిలేసి రోడ్డు మీద ప్రదర్శనలు. ఒక పేషెంట్ గా డాక్టర్లతో  నాకున్న అనుభవాలవల్లో ఏమో తెలీదు కానీ, ఈ జూడాల సమ్మెని నేనేమాత్రం సమర్ధించలేను. వాళ్ళు అటు ప్రభుత్వాన్నీ, ఇటు పేద రోగులనీ కూడా 'గ్రాంటెడ్' గా తీసుకుంటున్నారని నా బలమైన నమ్మకం.

సోమవారం, నవంబర్ 24, 2014

వాళ్ళు సైతం

ఉత్తరాంధ్ర జిల్లాలని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను బాధితులకి సహాయం అందించడం కోసం తెలుగు సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున తరలి వస్తోందంటూ ప్రచారసాధనాలన్నీ హోరెత్తుతున్నాయి. 'మేము సైతం' పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించారనీ, సినీ తారలూ సాంకేతిక నిపుణులూ ప్రేక్షకులతో ఆడిపాడి, నిధులు సమకూర్చి ఆ మొత్తాన్ని ఉత్తరాంధ్ర పునర్నిర్మాణం కోసం వెచ్చించ బోతున్నారనీ ఆ వార్తల సారాంశం.

గడిచిన వందేళ్ళ కాలంలో సంభవించిన అతిపెద్ద తుపానుల్లో ఒకటైన హుద్ హుద్ కారణంగా ఉత్తరాంధ్ర కి జరిగిన నష్టం అపారం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం నిధులు సమకూర్చే పరిస్థితిలో లేదు. ఒకవేళ, ప్రభుత్వమే ముందుకు వచ్చినా ఎన్ని నిధులూ చాలని పరిస్థితి. ఈ నేపధ్యంలో ప్రభుత్వంతో పాటు, పత్రికలూ ప్రజలనుంచి విరాళాలు సేకరిస్తున్నాయి. వీరికి తోడుగా ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా సాయం అందించడానికి ముందుకు వచ్చింది.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితుల్ని ఆదుకోవడం కోసం తెలుగు సినిమా పరిశ్రమ ముందుకి రావడం ఇదే తొలిసారి కాదు. దివిసీమ ఉప్పెన అనంతరం నాటి అగ్రనటులు ఎన్టీఆర్-ఏఎన్నార్ మిగిలిన నటీనటులతో కలిసి ఊరూరా తిరిగి జోలె పట్టి మరీ విరాళాలు సేకరించారు. ఆ కార్యక్రమానికి ప్రజలనుంచి వచ్చిన స్పందన చూశాకే ఎన్టీఆర్ కి మొదటిసారిగా రాజకీయ రంగప్రవేశాన్ని గురించి ఆలోచన వచ్చిందనే వాళ్ళూ ఉన్నారు.. అది వేరే సంగతి.

తర్వాత కూడా విపత్తులు సంభవించినప్పుడూ, వృద్ధ కళాకారుల సంక్షేమానికి అనీ సినిమా వాళ్ళు వినోద కార్యక్రమాలు, క్రికెట్ మ్యాచ్లు అడపాదడపా నిర్వహిస్తూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే, టీవీ ఛానళ్ళు విస్తరించాక ఈ తరహా కార్యక్రమాలు బాగా పెరిగినట్టే కనిపిస్తోంది. టిక్కెట్లు కొనుక్కుని వచ్చే ప్రేక్షకులతో పాటు, ఛానళ్ళ ద్వారా స్పాన్సర్షిప్ ఆదాయం కూడా వస్తూ ఉండడం, టీవీల ద్వారా కార్యక్రమం ఎక్కువమంది ప్రేక్షకులకి చేరుతూ ఉండడం సినిమా వాళ్ళని ఉత్సాహ పరుస్తున్నట్టుంది.

హుద్ హుద్ బాధితులకి సహాయక చర్యలు ప్రారంభం అవుతూనే విరాళాల ప్రకటనలు మొదలయ్యాయి. కొందరు సినిమా ప్రముఖులు విరాళాలు ప్రకటించారు, రూపాయివ్వని దర్శకనిర్మాత ఒకాయన "ఇంతేనా మీ విరాళాలు?" అని ప్రశ్నించాడు కూడా. ఇప్పుడు చెయ్యబోతున్న 'మేముసైతం' ని యావత్తు సినిమా పరిశ్రమా కలిసి నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో ఈనెల ముప్ఫైన జరగబోయే కార్యక్రమంలో ఖరీదైన టిక్కెట్లు కొనుక్కున్న ప్రేక్షకులు తారలతో ఆడిపాడొచ్చు. కలిసి భోజనం చేయొచ్చు.

ఈ 'మేముసైతం' ద్వారా సుమారు ఐదు నుంచి పదికోట్ల రూపాయలు సమీకరించవచ్చని ఓ అంచనా. విడిగా చూసినప్పుడు ఇది పెద్దమొత్తమే కానీ, చుక్కలనంటే తారల పారితోషికాలు, భారీ సినిమాల బడ్జెట్లు, కలెక్షన్లతో పోల్చినప్పుడు ఇదేమంత పెద్దమొత్తం అనిపించదు. పైగా, నిత్యం ఏదో ఒక చానల్లో కనిపిస్తున్న తారలకోసం ప్రత్యేకం భారీ మొత్తం చెల్లించి టిక్కెట్లు కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నది మరో ప్రశ్న. ఆశించిన స్థాయిలో స్పందన రానట్టయితే, ఊహించిన మొత్తం వసూలవ్వడమూ కష్టమే.

తెలుగు సినిమా పరిశ్రమ యావత్తూ పాల్గొనే కార్యక్రమం కాబట్టి, ఓ చిన్న లెక్క వేయాలనిపించింది. ఒక సినిమాకి వారివారి పారితోషికాలని, సినిమా కోసం పనిచేసే రోజులతో భాగించి ఒక్కరోజు ఆదాయాన్ని అంచనా వేసి, మొత్తం అందరి ఒకరోజు సంపాదననీ కూడితే ఎంత మొత్తం వస్తుంది? నాకైతే ఈ మొత్తం కచ్చితంగా 'మేముసైతం' ద్వారా వసూలయ్యే మొత్తంకన్నా ఎక్కువే తప్ప తక్కువ ఉండదని ఓ బలమైన నమ్మకం.

ఒకరోజు మొత్తం సినిమా షూటింగులన్నీ ఆపేసి, ఇప్పటికే హుద్ హుద్ బాధితుల కోసం ఏదో ఒక రూపంలో సాయం అందించిన ప్రజలనుంచే మళ్ళీ డబ్బు వసూలు చేసే కన్నా, సినిమా వారందరూ వాళ్ళ ఒకరోజు సంపాదనని సాయంగా ప్రకటించేస్తే మంచిదేమో కదా. దీనివల్ల సినిమా పరిశ్రమ ఒక విలువైన పనిదినాన్ని నష్టపోకుండా ఉంటుంది.. పరిశ్రమకి సీడెడ్ తర్వాత అత్యధిక ఆదాయాన్నిచ్చే వైజాగ్ కి సొంతడబ్బుని సాయంగా అందించామన్న తృప్తీ సినిమా వాళ్లకి మిగులుతుంది.

శుక్రవారం, నవంబర్ 21, 2014

ఇద్దరు

ఈ నెలలో ఇద్దరు ప్రముఖ రచయితలు పుట్టినరోజు జరుపుకున్నారు. ఒకరు తొంభై ఒకటో ఏటికి, మరొకరు తొంభయ్యో ఏటా అడుగు పెట్టారు. ఇద్దరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వీరిద్దరూ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలనీ, సాహితీ సేద్యాన్ని కొనసాగించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సమాజాన్ని ప్రభావితం చేసిన ఈ ఇద్దరినీ గురించీ నాలుగు మాటలు చెప్పుకోడానికి ఇది సందర్భం అనిపిస్తోంది.

డాక్టర్ ఆవంత్స సోమసుందర్.. కవిగా ప్రయాణం మొదలు పెట్టి, కవిత్వం కొనసాగిస్తూనే వచనం, అనువాదాల మీదుగా రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ 'పిఠాపురం కవిగారు' కొన్నితరాల కవులని ప్రభావితం చేశారు, చేస్తున్నారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, ఓ జమీందారీ కుటుంబంలో దత్తపుత్రుడిగా అడుగుపెట్టి, వైభవాన్నే తప్ప దరిద్రాన్ని ఏమాత్రమూ రుచిచూడని సోమసుందర్ వామపక్ష రాజకీయ భావజాలం వైపు మొగ్గు చూపడం, నమ్మిన సిద్ధాంతం కోసం జైలు జీవితం గడపడం వింతల్లో వింత.


కోస్తా ప్రాంతంలో పుట్టి పెరిగిన కవుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని తొలినుంచీ ఎలుగెత్తి చాటిన ఏకైక కవి సోమసుందర్. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం సోమసుందర్ వెలువరించిన కవితా సంకలనం 'వజ్రాయుధం' తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని నొక్కి చెబుతుంది. 'వజ్రాయుధ కవి' అన్న బిరుదుని మాత్రమే కాదు, లెక్కలేనన్ని విమర్శల్నీ తెచ్చిపెట్టిన సంకలనం అది. సోమసుందర్ కవిత్వం కన్నా ఎక్కువగా, ఆయన 'బూర్జువా' నేపధ్యం విమర్శలకి కేంద్రబిందువు అయ్యింది.

విమర్శలకి మాటలతో మాత్రమే కాక, చేతలతోనూ సమాధానం చెప్పడం సోమసుందర్ శైలి. ఈమధ్యనే జరిగిన తన తొంభై ఒకటో పుట్టినరోజు వేడుకల్లో తాజాగా రాసిన మూడు పుస్తకాలని విడుదల చేసి  తానేమిటో మరోమారు నిరూపించుకున్నారు సోమసుందర్. రాసేవాళ్ళని ప్రోత్సహించడం, నిష్కర్షగా - ఇంకా చెప్పాలంటే కటువుగా - విమర్శించడం సోమసుందర్ పధ్ధతి. సాహిత్యంలో నాణ్యతని కోరుకునే ఈ కవిగారినుంచి మరిన్ని రచనలు రావాలని కోరుకుంటున్నాను.


నాగావళి నది ఒడ్డున పుట్టిన కాళీపట్నం రామారావు మేష్టారి జీవితమూ, సాహిత్యమూ కూడా వామపక్ష ఉద్యమాలతో పెనవేసుకున్నవే. శ్రీకాకుళంలో ఓ మధ్యతరగతి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబలో జన్మించి, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఢక్కామక్కీలు తిన్న కారా మేష్టారు ప్రతి దెబ్బకీ మరింత పదునెక్కారే తప్ప ఏనాడూ రాజీపడలేదు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మేష్టారి కథలన్నీ వామపక్ష భావజాలంతో సాగేవే.

సుందరపాలెం లో జరిగిన 'యజ్ఞం' గురించి చెప్పినా, భారతదేశం మీద జరిగిన 'కుట్ర' ని విప్పి చెప్పినా, కూటికి పేదలైనా గుండెల్లో 'ఆర్తి' నింపుకున్న జనాన్ని గురించి చెప్పినా ఆ కథలన్నింటి వెనుకా ఓ కమిట్మెంట్ కనిపిస్తుంది. దిగువ మధ్యతరగతి, పేద ప్రజల జీవితాలని నిశితంగా పరిశీలించి కథలు రాసిన కారామేష్టారి మీద వచ్చిన విమర్శలకీ అంతులేదు. 'యజ్ఞం' కథ ఇవాల్టికీ చర్చనీయమే.

తను రాసిన కథల గురించి మాట్లాడడానికి ఏమాత్రమూ ఇష్టపడని కారా మేష్టారు, తెలుగు కథలన్నింటీ ఓ చోటకి చేర్చాలనే సంకల్పంతో ఆరంభించిన 'కథా నిలయం' ఎవ్వరి ఊహకీ అందని ప్రాజెక్టు. ఏ ప్రభుత్వ సంస్థో చేపట్టాల్సిన కార్యక్రమం. కేవలం తన సంకల్ప బలంతో, సాహిత్యం ద్వారా వచ్చిన ప్రతి పైసనీ ఖర్చు చేసి 'కథా నిలయా'నికి ఓ రూపు తెచ్చారు మేష్టారు. చదివే అలవాటున్న వాళ్ళు ఎవరు కనిపించినా "మీ దగ్గర ఏ కథలున్నా ఓ కాపీ కథా నిలయానికి పంపండి" అని చెప్పడం ఇవాల్టికీ మర్చిపోరు. మేష్టారు మళ్ళీ రాయడం మొదలు పెడితే బాగుండునని ఎదురు చూసే వాళ్ళలో నేనూ ఒకడిని.

పుట్టినరోజు అనేది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. జరుపుకోవాలా, వద్దా అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయం. కొందరు రచయిత(త్రు)లు పుట్టినరోజు జరుపుకోరు. అది వారిష్టం. కానీ, ఆయా రచయిత(త్రు)ల అభిమానులు కొందరికి ఈ ఇద్దరు రచయితలూ పుట్టినరోజుని వేడుకగా జరుపుకోడం నచ్చలేదు. వారి వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకుని విమర్శలు కురిపించారు. దానిగురించిన చర్చ ఇక్కడ అప్రస్తుతం. కానైతే, వీళ్ళిద్దరూ పుట్టినరోజు జరుపుకోడం వల్లనే వీళ్ళ రచనలని గురించిన కొంత చర్చ జరిగింది కదా అన్నది నాబోంట్ల సంతోషం!!

బుధవారం, నవంబర్ 19, 2014

పూలబాట

"నువ్వు నడుచు దారుల్లో పూలు పరిచి నిలుచున్నా.. అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా..." చిత్ర పాట వింటూ ఉంటే ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగొచ్చాయి కాసేపు. పూలు పరిచిన బాటలో నడవడం, మనం నడిచే బాటలో మనకోసం మరొకరు పూలు పరిచి నిలబడడం.. రెండూ వేరువేరు కదూ. పూలబాటని ఎంచుకోవడం చాయిస్ అయితే, పూలు పరిచి నిలబడడం చాన్స్ అనుకోవాలి. మొదటిదాని కన్నా రెండోది గొప్ప విషయం, కచ్చితంగా.

పూలకీ, ముళ్ళకీ అవినాభావ సంబంధం. ముళ్ళున్న చెట్లకి అందమైన పూలు పూస్తాయి అదేమిటో. బహుశా, అందమైన పూలకి రక్షణ కోసం ఆ ముళ్ళు అనుకోవాలి మనం. ముళ్ళతో  పోరాడి గెలిచిన వాళ్లకి మాత్రమే పూలు లభిస్తాయి అనీ అనుకోవచ్చు. పూలబాట కన్నా ముందుగా కనిపిస్తూనో, పూలమాటున కనిపించకుండానో ముళ్ళు ఉంటాయన్నది ఇక్కడ గుర్తించాలి. 'ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె' అవసరం లేదేమో కానీ, పూలచెట్టుకి ముళ్ళకంచె ఇచ్చే రక్షణ అంతా ఇంతా కాదు.

'పాలకోసం నల్లరాయి మొయ్యాలి' అని సామెత. దీన్ని కాస్త మార్చుకుని, పూలకోసం  ముళ్ళని భరించాలి అనుకోవచ్చు. ఆటో రిక్షాల వెనక వైపున ఆయా డ్రైవర్ల అభిరుచుల మేరకి రకరకాల విషయాలు రాసి ఉంటాయి. ఆయా వాహనాల వెనుక వెళ్ళేప్పుడు వాటిని చదువుకోవడం ఓ అనుభవం. 'ముళ్ళకి జడిసి గులాబీని వదలకు' అన్నది ఒకానొక ఆటోడ్రైవర్ ఇచ్చిన సందేశం! 'సాహసం శాయరా డింభకా.. రాకుమారి వరించునురా' కి ఇది మరో రూపంలా అనిపించడం లేదూ?

పూలబాట కోసం మనమే పూలు పరుచుకోదానికీ, మనకోసం మరొకరు బాటని సిద్ధం చేయడానికీ సహజంగానే  చాలా తేడా ఉంది. మొదటిదాంట్లో ముళ్ళ బాధలు మనవైతే, రెండోదాంట్లో మరొకరివి. పైగా, ఈ మరొకరు మనకోసమని ఆ ముళ్ళని వాళ్ళే భరిస్తున్నారన్న మాట. గొప్ప విషయం కదూ. అలా భరిస్తున్నారంటే, వాళ్ళ దృష్టిలో మనమెంత ప్రత్యేకమో! మనమూ అంతే, అవతలి వాళ్ళు ఎంతో దగ్గరి వాళ్ళైతే తప్ప ఎలాంటి రిస్కులూ తీసుకోడానికి ఇష్టపడం. అనగా, చూస్తూ చూస్తూ ముళ్ళ జోలికి వెళ్ళం.

పూలమీద నడవాలని ఎవరికుండదు కనుక? కోరుకున్న అందరికీ పూలబాట దొరికేస్తుందా అంటే, అదంత సులువు కాదు. ఏ కొందరికో తప్పించి, రాళ్ళూ ముళ్ళూ దాటిన తర్వాతే పూలు కనిపిస్తాయి నడిచే దారిలో. అప్పటివరకూ అలసిన పాదాలకి ఒక్కసారిగా విశ్రాంతి దొరకడం వల్ల కాబోలు, ఆ పూలు మరింత మృదువుగా, పరిమళ భరితంగా అనిపిస్తాయి. వాడుక కూడా 'ముళ్ళూ-పూలూ' అనే.. ప్రస్తుతం ఉన్నది ముళ్ళ మీదే అయినా, త్వరలోనే పూలు కనిపిస్తాయన్న సూచన వినిపిస్తుంది ఈ వాడుకలో.

కొందరు కవులు జీవితాన్నీ, మరికొందరు కవులు యవ్వనాన్నీ పూలతోటతో పోలుస్తూ ఉంటారు. ఏ తోటా ఆరుగాలం విరగబూయదు కదా. అదే పూలబాట అయితే, స్థలకాలాదులతో నిమిత్తం లేకుండా పూలు పరచబడి ఉంటుంది. ప్రయాణం సుఖవంతమవుతుంది. కానైతే, బతుకు ప్రయాణంలో ఎంత దూరంపాటు ఈ బాట ఉంటుందన్నది ముందుగా తెలిసే అవకాశం లేదు. కాళ్ళకింద నలిగే వాటితో నిమిత్తం లేకుండా ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది. అవి రాళ్ళవ్వచ్చు.. ముళ్ళవ్వచ్చు.. పూలూ కావొచ్చు.