శనివారం, అక్టోబర్ 25, 2014

'మా తండ్రి శేషయ్య గారు'

నీలంరాజు వేంకట శేషయ్య.. ఈ పేరుని ఈతరం సాహిత్యాభిమానులకి పరిచయం చేయాలి అంటే, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆత్మకథ 'అనుభవాలూ-జ్ఞాపకాలూను,' బుచ్చిబాబు నవల 'చివరకి మిగిలేది' లని తెలుగు పాఠకులకి తొలిసారిగా అందించిన 'నవోదయ' పత్రిక సంపాదకుడు అని చెప్పాలి. సినీ అభిమానులకైతే తొలితరం తెలుగుసినిమా 'ఉషా పరిణయం' లో కథానాయకుడు అని చెప్పాలి. రాజకీయ రంగంవారికి చెప్పేప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు మొదలు నీలం సంజీవరెడ్డి వరకూ ఎందరో నాయకులకి ఆంతరంగికుడు అని చెప్పడం మర్చిపోకూడదు.

సంగీతాభిమానుల దగ్గర ప్రస్తావించేప్పుడు భద్రాచలంలో 'రామదాస ధ్యానమందిరం' రూపశిల్పి అనీ, 'వాగ్గేయకార వార్షికోత్సవం' ఏర్పాటు చేసిన సంగీత పిపాసి అనీ చెప్పకపోతే ఎలాగ? ఇక భక్తులకైతే, కంచి పరమాచార్యుల వారి ప్రియశిష్యుడు అనీ, 'నడిచే దేవుడు' పుస్తక రచయిత అనీ చెబితే చాలు. అంతేనా? 'స్వరాజ్య' మొదలు 'ఆంధ్రప్రభ' వరకూ తెలుగు పత్రికల్లో అనేక హోదాల్లో పనిచేసి, స్వతంత్ర పోరాటం మొదలుగా ఎన్నో విశేషాంశాలని గురించి విశ్లేషణలు అందించిన జర్నలిస్టు, సంగీత, సాహిత్య, కళా, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లో ఎందరికో ఆప్తుడు, స్నేహశీలి.. ఒక్కమాటలో చెప్పాలంటే 'బహుముఖ ప్రజ్ఞాశాలి.'

ఎందరెందరో ప్రముఖుల గురించి ఎన్నో వార్తలు రాసి, ఇంటర్యూలు చేసిన వేంకట శేషయ్య తన కథని తను రాసుకోలేదు. ఆయన మరణానంతరం, పెద్దకొడుకు నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ 'మా తండ్రి శేషయ్య గారు' పేరిట అక్షరబద్ధం చేసిన పుస్తకంలో అనేక ఉద్యమాల నడుమ సాగిన తన తండ్రి ఎనభయ్యేడేళ్ళ జీవితాన్ని రేఖామాత్రంగా స్పృశించారు. ఒంగోలు జిల్లా నూతలపాడు లో 1905 లో జన్మించిన వేంకట శేషయ్య హైస్కూలు చదువుకి వచ్చేసరికి దేశంలో జాతీయోద్యమం ఊపందుకుంది. 'ఆంధ్ర రత్న' దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్పూర్తితో హైస్కూల్ బాయ్ కాట్ చేసి ఉద్యమంలోకి దూకిన శేషయ్య, జాతీయ పాఠశాలలో తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం ఆయన జీవితంలో మొదటి మలుపు.


స్వాతంత్రపోరాటంలో తలమునకలుగా పాల్గొంటూ, 'స్వరాజ్య' పత్రికని ఒక ఉద్యమంగా నిర్వహిస్తున్న టంగుటూరి ప్రకాశం పంతులికి అదే సమయంలో తెలుగు షార్ట్ హ్యాండ్ తెలిసిన సహాయకుడు అవసరం కావడంతో ఆ అవకాశం శేషయ్యని వెతుక్కుంటూ వచ్చింది. ప్రకాశం దగ్గర పనిచేసింది కేవలం ఒక్క  సంవత్సరమే అయినా, ఆ ఒక్క ఏడాదిలోనే ఎన్నో పనులు నేర్చుకున్నారు, ఎందరినో పరిచయస్తులుగా చేసుకున్నారు. ముఖ్యంగా, ప్రకాశం పంతులు ఉపన్యాసాలని 'స్వరాజ్య' పత్రికకి రాసి పంపడం ద్వారా జర్నలిజం మీద ఆసక్తి మొదలయ్యింది. అటుపై వరుసగా 'ఆంధ్ర పత్రిక' 'ఆంధ్రప్రభ'లలో ఉద్యోగాలు, 'నవోదయ' వారపత్రిక స్థాపన, నిర్వహణ. ఐదేళ్ళ తర్వాత 'ఆంధ్రప్రభ' కి పునరాగమనం. ఈమధ్యలో సినిమాలు, సంగీతం, నాటకాలు, సాహిత్యం, ఆధ్యాత్మిక చింతన.. ఎన్నో, ఎన్నెన్నో.

ప్రభుత్వోద్యోగంలో పదవీ విరమణ చేసిన నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ పేరు దినపత్రికలు చదివే వారికి, మరీ ముఖ్యంగా ఎడిటోరియల్ పేజీల్లో ఆధ్యాత్మిక వ్యాసాలు చదివేవారికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నాటి ఆంధ్రప్రభ లో 'ఆలోకన' మొదలు నేటి సాక్షి లో 'జ్యోతిర్మయం' వరకూ ఆయన వ్యాస పరంపర కొనసాగుతూనే ఉంది. వేంకట శేషయ్య పెద్ద కొడుకుగా తండ్రిని బాగా దగ్గర నుంచి చూసే అవకాశం దొరకడంతో, ఎన్నో విషయాలని సాధికారికంగా రాయగలిగారు లక్ష్మీ ప్రసాద్. ముఖ్యంగా, 'నవోదయ' పత్రికలో ఆయనకూడా స్వయంగా పాలుపంచుకోడం వల్ల ఆ పత్రిక్కి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆయన సోదరుడు, ప్రముఖ చాయాచిత్రకారుడు, పాత్రికేయుడు నీలంరాజు మురళీధర్ ఛాయా చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.

పారితోషకం కోసం శ్రీశ్రీ అప్పటికప్పుడు పత్రికాఫీసులో కూర్చుని అడిగిన ఆర్టికల్ రాసిచ్చిన వైనం మొదలుకొని, నార్ల వెంకటేశ్వర రావు-ఎన్జీ రంగా ల మధ్య జరిగిన సైలెంట్ వార్ వరకూ, టంగుటూరి ప్రకాశం పంతులు ధృఢ చిత్తం మొదలు నేదురుమిల్లి జనార్ధనరెడ్డి సౌశీల్యం వరకూ ఆశ్చర్యం కలిగించే సంగతులెన్నో అడుగడుగునా కనిపిస్తాయీ పుస్తకంలో. కేవలం వేంకట శేషయ్య వ్యక్తిత్వం మాత్రమేకాదు, ఆయన చుట్టూ ఉన్న వారిని గురించి ఎన్నో సంగతులూ సందర్భోచితంగా ప్రస్తావించారు లక్ష్మీప్రసాద్. ఒకటిరెండు పునరుక్తులు, కాసిన్ని ముద్రారాక్షసాలు ఉన్నా,  అవేవీ ఆపకుండా చదివించడాన్ని ఆపగలిగేవి కాదు. వెనుకటి  తరం జీవితాలని గురించి ఆసక్తి ఉన్నవారు మెచ్చే రచన ఇది. (నవోదయ బుక్ హౌస్ పంపిణీ, పేజీలు 243, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

4 కామెంట్‌లు:

  1. వెనకటి తరం మెచ్చేదే కాదు, నేటితరాలకు మార్గదర్శకం గా ఉండే గొప్ప వ్యక్తి గురించిన పుస్తకాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.
    gksraja.blogspot.com

    రిప్లయితొలగించండి
  2. @జీకేఎస్ రాజా: ఈమధ్య కాలంలో బాగా నచ్చేసిన పుస్తకాల్లో ఒకటండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి