"ఓ గాలీ, నువ్వు వెదురు సందుల్లో సంగీతం పాడడమేమిటి?
శరదృతువులో వేణుగానానికి నెమలి పురివిప్పి ఆడడమేమిటి? మేఘం వెళ్ళే దారిలో
మనసు తేలిపోతుంది ఎందుకని? బంధించబడి ఉన్న పుష్పం, గాలిసోకగానే రేకులు
విచ్చుకుంటుంది ఎందుకని?" ...మలయాళ సినీ గేయరచయిత రఫీక్ అహ్మద్ రచించిన
ఒకానొక పాట మూలార్ధానికి కొంచం దగ్గరగా ఉండే అనువాదం ఇది. అర్ధం నిన్న
మొన్ననే తెలిసినా, దాదాపు పదిరోజులై ఆ పాట చెవుల్లో మారుమోగుతోంది.
"కాథే
కాథే నీ పుక్కామరథిల్ పాట్టుం మూళి వణ్నో..." ఎలా ప్రవేశించిందో కానీ ఓ పది
రోజుల క్రితం ఈ పాట మా ఇంట్లో ప్రవేశించింది, చాలా మామూలుగా. అలనాటి
'లవకుశ'లో సీతమ్మ వేషంలో ఉన్న అంజలీదేవి అడవులకి ప్రయాణమైనప్పుడు వినిపించే
నేపధ్యసంగీతాన్ని జ్ఞప్తికి తెచ్చే ఆరంభం.. అటుపై రెండు చిత్రమైన
గొంతుల్లో ఏమాత్రం అర్ధం కాని పదాలు.. భాష తెలియకపోతేనేం, ఆ గొంతుల్లో
వినిపించిన ఏదో తెలియని ఆర్ద్రత కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా ఆ స్త్రీ
గొంతు. అదిమొదలు, ఆ పాట మరుమోగడం మొదలైంది.
"నిన్న అనేది
వట్టి కల.. నేడు అనేది కొత్త జ్ఞాపకం.. శోకాన్ని మోసిన భుజాలపై వాలడానికి
వస్తోంది కొత్త వెన్నెల.. కుడిచి కుడిచి పాలు తాగే ముద్దుల దూడలు, చిన్ని చిన్ని పువ్వుల్లో ఉయ్యాలలూగే చిరుగాలులు, తేనె పలుకులెన్నింటినో చెబుతున్నాయి.. " ...దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఏమాత్రం తోచని ఈ
భావానికి అర్ధాన్ని వెతుక్కోడం కన్నా ముందే, పాట పూర్వాపరాల గురించిన
వెతుకులాట మొదలయ్యింది. 'సెల్యులాయిడ్' పేరుతో గత సంవత్సరం మలయాళంలో
విడుదలైన సినిమా, 'జేసీ డేనియల్' పేరిట తమిళంలోకీ అనువాదం అయ్యింది. మలయాళ
సినిమా పరిశ్రమకి మూలపురుషుడైన జేసీ డేనియల్ జీవిత కథ ఆధారంగా కమల్
దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పృధ్వీరాజ్, మమత మోహన్ దాస్, చాందిని
ముఖ్యపాత్రలు పోషించారు. తమిళ వీడియోల్లో "కాత్రే కాత్రే..." దొరికింది.
"అందాల
ఆకాశంలో వేయి చిలుకలు ఎగురుతున్నాయి.. పరిచయమైన చిలుకలు తూరుపు దిక్కున
ఇంద్ర ధనుస్సుని చిత్రిస్తున్నాయి.." ...తమిళ వీడియోలో గాయని రికార్డింగ్
లో పాడుతోంది. ఆమె పేరు 'వైకోమ్' విజయలక్ష్మి. విలక్షణమైన గాత్రం. నాటి
మేటి గాయని పి. లీల గొంతుని లీలగా గుర్తుచేసే గమకాలు. ఎంత అలవోకగా
పాడేసిందసలు! గాయని వివరాలు వెతకడం మొదలయ్యింది. కేరళ లోని వైకోమ్ లో
పుట్టిపెరిగిన విజయలక్ష్మికి ఎవరిదగ్గరా అభ్యసించకుండానే సంగీతం
పట్టుపడింది, అదికూడా చిన్ననాడే. అంతేకాదు, 'గాయత్రివీణ' గా పిలవబడే ఏక
తంత్రి వీణ మీద ఎలాంటి పాటనైనా సరే ఒకసారి వింటే చాలు అలవోకగా
పలికించేయగలదు!! యూట్యూబ్ లో ఎన్ని వీడియోలో..
"మిణుగురు కళ్ళలో నక్షత్రాలు పూస్తున్నాయి.. మువ్వల
సవ్వడిలో కీర్తనలు వినిపిస్తున్నాయి.. సమయం వచ్చింది, పూయడానికి.."
...పట్టలేనంత ఆనందం కలిగినప్పుడు దాన్ని ఎవరితోనన్నా పంచుకోవాలి అనిపించడం
అత్యంత సహజం. తమిళ వీడియో కనిపించగానే, తమిళం-తెలుగు బాగా తెలిసి,
సంగీతాన్ని బాగా ఇష్టపడే ఓ మిత్రుడికి షేర్ చేశాను. తన గురించి ఒక్కమాటలో
చెప్పాలంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్. నేనడిగిందే
తడవుగా తమిళ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి ఇచ్చారు. "ఇది ట్యూన్ కి
రాసినట్టుగా అనిపిస్తోంది, మలయాళీ మిత్రులెవరికన్నా ఒరిజినల్ పాట వినిపించి
అర్ధం తెలుసుకోవాలి," రాత్రి తను పంపిన మెయిల్ సారాంశం ఇది.
"కాథే
కాథే నీ పుక్కామరథిల్ పాట్టుం మూళి వణ్నో..." ...అవార్డులందుకున్న ఈ పాట ఏ
పని చేస్తున్నా వెంటాడుతోంది. చివరికి నిద్రలో కూడా వదిలిపెట్టడం లేదు.
అవును మరి.. జోలపాట, మేలుకొలుపు కూడా ఈ పాటే అవుతోంది కదూ. ఉదయం నిద్ర
లేచేసరికి ఫోన్ లో టెక్స్ట్. మిత్రుడి నుంచి.. అర్ధరాత్రి దాటాక పంపిన
సందేశం. "ఇప్పటివరకూ ఇరవైతొమ్మిది సార్లు విన్నానీ పాట.. సింప్లీ ఆసం.."
...ఇంకా ఏదో చెప్పాలనిపించి, చెప్పలేకపోవడం అర్ధమయ్యింది. అది నాకూ
అనుభవమే. అనుభూతిని అక్షరాల్లో పెట్టడం అన్నది ఎల్లవేళలా సాధ్యం కాదు.. మరీ
ముఖ్యంగా ఓ జేసుదాసునీ, ఓ 'వైకోమ్' విజయలక్ష్మినీ విన్నప్పుడు కలిగే
అనుభూతిని. అది, ఎవరికివాళ్ళు పొందాల్సిందే.. మరో దారిలేదు.
అత్యత్భుతమైన పాటని వినిపించారండీ.... నేను కూడా ఇప్పటికి పది సార్లు విన్నాను.. భాష అర్థం కాకపోయినా.. ఆ గొంతులో ఏదో మహత్యం ఉంది.. నాకు చాలా నచ్చింది... మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు... :)
రిప్లయితొలగించండిఅనుభూతిని అక్షరాల్లో పెట్టడం అన్నది ఎల్లవేళలా సాధ్యం కాదు.. మరీ ముఖ్యంగా మనకి ప్రియమైన గీతమో, సాహిత్యమో మరొకరికి అంతగానూ/ అంతకంటే ఎక్కువగానో నచ్చిందని తెలిస్తే కలిగే అనుభూతిని. అది, ఎవరికివాళ్ళు పొందాల్సిందే.. మరో దారిలేదు. :) Thanks for the beautiful post and the lyric.
రిప్లయితొలగించండిచాలా బాగుందండీ పాట. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిబాగుందండీ
రిప్లయితొలగించండిమీరు ఇంత ప్రత్యేకంగా వ్రాశారంటే ఉరుకులు పరుగుల మధ్య కాక కాస్త ప్రశాంతంగా వినాలని ఆగితే ఇవ్వాళ్టికి కుదిరిందండీ... పాట చాలా బాగుంది. విజయలక్ష్మి గారి స్వరం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది.
రిప్లయితొలగించండిసెల్యులాయిడ్ సినిమా గురించి కూడా చాలా విన్నానండీ.. నా వాచ్ లిస్ట్ లో దదాపు ఆర్నెల్లుగా ఎదురుచూస్తోంది. ఈ పాట చూశాక వీలైనంత త్వరగా చూడాలనిపిస్తుంది. థాంక్స్ ఫర్ షేరింగ్.
పాటల గురించి రాయడంలో మీకు మీరే సాటి
రిప్లయితొలగించండిExcellent song. Thanks murali garu
రిప్లయితొలగించండి@వాసు కామరాజు: నిజమండీ.. ఏదో మహత్యం ఉందనే అనిపిస్తుంది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: హహహా.. రెండోసారి చదువుకోవాల్సి వచ్చింది మీ వ్యాఖ్య! ధన్యవాదాలు..
@మురారి: చాన్నాళ్ళ తర్వాత.. రాయడం బొత్తిగా తగ్గించేశారు మీరు.. ధన్యవాదాలండీ..
@హిమబిందు: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: పాట చూసి, వివరాలు చదివాక సినిమా మీద నాక్కూడా ఆసక్తి పెరిగిందండీ.. వీలుచూసుకుని చూడాలి.. ధన్యవాదాలు..
@నారాయణస్వామి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@చక్రవర్తి: ధన్యవాదాలండీ..
చాలా ధన్యవాదాలండీ మురఌ గారు.. మీరు ఇచ్చిన ఈ పాట నాకు చాలా ఆనందాన్నిచ్చింది.. ఇప్పటికి కొన్ని డజన్ల సార్లు విన్నాను రెండు రోజుల్లో..
రిప్లయితొలగించండి