బుధవారం, జూన్ 18, 2014

గురజాడ అడుగుజాడ

మహాకవి గురజాడ అప్పారావు నూట యాభయ్యో జయంతి (2012) సందర్భంగా రచయిత్రి ఓల్గా వెలువరించిన సాహిత్య వ్యాసాల సంకలనం 'గురజాడ అడుగుజాడ.' గురజాడ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది 'కన్యాశుల్కం' నాటకం. ఒక్కమాటలో చెప్పాలతో గురజాడ మిగిలిన సాహిత్యం అంతా ఒక ఎత్తు, 'కన్యాశుల్కం' నాటకం ఒక్కటీ ఒక ఎత్తు. అర్ధం చేసుకోగలిగిన వారికి అర్ధం చేసుకోగలిగినంత. సమకాలీనం కాదనో, మరొకటనో పక్కన పెట్టేవారితో ఎలాగో ఏ పేచీ లేనే లేదు.

అత్యంత సహజంగానే ఓల్గా తన వ్యాసాల్లో కూడా 'కన్యాశుల్కం' కి పెద్ద పీట వేశారు. మొత్తం తొమ్మిది వ్యాసాలున్న ఈ సంకలనంలో ఆరు వ్యాసాలు 'కన్యాశుల్కం' నాటకాన్ని గురించీ, అందులోని పాత్రలని గురించీ ఉన్నాయి. 'మధురవాణి' అభిమానులకి మనసు నిండిపోయే వ్యాసం 'మానవత్వం పరిమళించే మధురవాణి' ఈ సంకలనంలో మొదటి వ్యాసం. "కన్యాశుల్కం ఆచారానికి బలైపోయిన బుచ్చెమ్మనూ, బలి కాబోతున్న సుబ్బినీ, వేశ్య అయిన మధురవాణి రక్షించడమే కన్యాశుల్క నాటక సారాంశం. అణచివేతకి గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే ఆ అణచివేత నుండి బయటపడగలరనే ఆశను కల్పించింది మధురవాణి" అంటారు ఓల్గా.

'బాల్య వివాహాల చర్చ - కన్యాశుల్కం' 'కన్యాశుల్కం - కుటుంబ వ్యవస్థ' ఈ రెండూ 'కన్యాశుల్కం' నాటక రచనా కాలం నాటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులని లోతుగా చర్చించిన వ్యాసాలు. వృద్ధుడైన లుబ్దావధాన్లు పసిపిల్ల సుబ్బిని వివాహం చేసుకోవడం ద్వారా అటు సుబ్బి మీద, ఇటు తన కూతురు మీనాక్షి మీద పెత్తనం చేయాలనుకోడాన్ని విశ్లేషిస్తూ "ఇద్దరు స్త్రీలను రెండు భిన్న ప్రయోజనాలు కలవారిగా విభజించి పాలించడానికి హిందూ కుటుంబంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి" అంటారు రచయిత్రి.

ఇక, "కన్యాశుల్కం నాటకంలో కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచించటమంటే మొత్తం పితృస్వామిక వ్యవస్థను గురించి ఆలోచించటమే అవుతుంది. అప్పటికి అమలులో ఉన్న కుటుంబ వ్యవస్థనూ, రాబోయే మార్పులనూ, మధ్యలో సంధి దశనూ సమర్ధవంతంగా ప్రతిఫలించిన నాటకం కన్యాశుల్కం" అన్న విశ్లేషణతో ఏకీభవించకుండా ఉండలేం. పూటకూళ్ళమ్మ, అసిరి, బైరాగి.. ఈ మూడూ కూడా చాలా చిన్నవిగా, నాటకాన్ని మొదటిసారి చదివినప్పుడు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రల్లాగా అనిపిస్తాయి. ఒక్కో పాత్రనీ ఒక్కో వ్యాసంలో విశ్లేషించారు ఓల్గా.

నిజానికి గురజాడ వితంతువుల జీవితంలోని ఒక్కో పార్శ్వాన్ని ఒక్కో పాత్ర ద్వారా చిత్రించారు. బుచ్చెమ్మ, మీనాక్షి, పూటకూళ్ళమ్మ.. ముగ్గురూ వితంతువులే.. కానీ ముగ్గురివీ భిన్న జీవితాలు. "పూటకూళ్ళమ్మ గిరీశం తన ఇరవై రూపాయలూ అన్యాయంగా కాజేశాడని తెలియగానే అతన్ని తన్నడానికి చీపురు కట్టతో బయల్దేరింది. దెబ్బ రామప్పంతులికి తగిలింది గానీ తన్నే సమర్ధన పూటకూళ్ళమ్మ కి ఉందని నిరూపితమైంది. ఆ ధైర్యానికి కారణం ఆమె తన శ్రమను విలువకట్టి బతకడమే కావొచ్చు - అది గయ్యాళి తనం గా కనపడినా ఆమెకైతే ఒక  తెగింపు వచ్చింది" అన్నది ఓల్గా పరిశీలన.

'కన్యాశుల్కం' లోని బ్రాహ్మణ సమాజాన్ని బ్రాహ్మణేతర దృష్టి కోణం నుంచి చూపిన పాత్ర అసిరి. బహు చిన్నగా కనిపించే ఈ పాత్రని గురించి విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలు జరిగాయని విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది నాకు. ఓల్గా సైతం లోతైన పరిశీలన చేశారు అసిరిని గురించి. "కన్యాశుల్కం లో బ్రాహ్మణ భావజాలాన్ని, వారి కపటత్వాన్ని సూటిగా పదునైన మాటలతో విమర్శించింది మధురవాణి అయితే పరోక్షంగా వారి మాయలను, అవినీతిని వారికే తెలిసేలా మాడు పగలగొట్టింది అసిరి," అంటారు 'అసిరి' వ్యాసంలో. రాజ్యం, మతం, పితృస్వామ్యం, వ్యాపారాల మధ్య ఉన్న బలమైన ముడిలో బైరాగి లాంటి వారి పాత్ర ఏమిటో చెబుతుంది 'కన్యాశుల్కం లో బైరాగి పాత్ర' వ్యాసం.

ఇవి కాక, 'వందేళ్ళ కన్యక, పూర్ణమ్మలు,' 'ముత్యాల సరములు,' 'మానవ సహజీవన సౌందర్య స్వప్నం' ('లవణరాజు కల' గురించి) వ్యాసాలున్నాయి ఈ సంపుటిలో. గురజాడ అభిమానులు, మరీ ముఖ్యంగా 'కన్యాశుల్కం' అభిమానులు మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకం ఇది. (స్వేచ్చ ప్రచురణలు, పేజీలు  88, వెల రూ. 30, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి