శనివారం, ఏప్రిల్ 19, 2014

శ్రీపాద కథలూ - ఎన్.బీ.టీ...

తెలుగు కథని పరిపుష్టం చేసిన తొలితరం రచయితలలో మొదట చెప్పుకోవలసిన పేరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఎనభయ్యేళ్ల క్రితమే తన కథల్లో అభ్యుదయాన్నీ, స్త్రీ వాదాన్నీ, దళిత వాదాన్నీ బలంగా వినిపించిన కథా రచయిత శ్రీపాద వారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టి, సంస్కృతం, వేద విద్యలు నేర్చుకుని, పెద్దల అభీష్టానికి విరుద్ధంగా సాహిత్యం వైపుకి మళ్ళిన శ్రీపాద, ఆధునిక తెలుగు కథకి దశనీ, దిశనీ నిర్దేశించారు అనడం అతిశయోక్తి కాదు. ఇందుకు అభ్యంతరం ఉన్న వాళ్ళు 'కలుపు మొక్కలు,' 'ఇలాంటి తవ్వాయి వస్తే..' 'మార్గదర్శి' లాంటి కథలు చదువుకోవచ్చు.

పరిశోధకుల ప్రకారం, శ్రీపాద వంద కథలు ప్రచురించారు. నాటకాలు, నవలలతో పాటు తన ఆత్మకథని 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' పేరిట అక్షరీకరించారు. 'కనక్ ప్రవాసి' గా ప్రసిద్ధులైన చామర్తి కనకయ్య 'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్నకథలు - సమగ్ర సమీక్ష' పేరిట సిద్ధాంత గ్రంధం రచించి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దురదృష్టం ఏమిటంటే, శ్రీపాద మొత్తం రచనలన్నీ  సమగ్రంగా ఒకేచోట దొరకడం లేదు. అనేక  సంపుటాలుగా దొరుకుతున్న వాటిలో కొన్ని కథలు ప్రతిచోటా కనిపిస్తూ ఉండడం వల్ల, వెలుగు చూడని కథలు చీకటిలోనే ఉండిపోతున్నాయి.

శ్రీపాద శతజయంతి సందర్భంగా విశాలాంధ్ర ప్రచురణాలయం 1992 లో మూడు కథా సంపుటాలు, 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' రెండు భాగాలనూ ప్రచురించింది. మూడు సంపుటాల్లోనూ కలిపి మొత్తం ఇరవై ఐదు కథలు ఉన్నాయి. (అవును, శ్రీపాద ఒక్కో కథా పదిహేను నుంచి నలభై-యాభై పేజీల నిడివి ఉంటుంది!) తర్వాత ఇదే సంస్థ 'నిలువు చెంబు' పేరుతో మరికొన్ని కథలు ప్రచురించింది. నవలలు, నాటకాలు రెండు సంపుటాలుగా విడుదల అయ్యాయి. కథా సంపుటాలకి 1999 లో ద్వితీయ ముద్రణ జరిగింది. తర్వాత కొంత కాలంపాటు శ్రీపాద పుస్తకాలు మార్కెట్లో దొరకలేదు.


విశాలాంధ్ర నుంచి బయటికి వచ్చి ప్రగతి పబ్లిషర్స్ సంస్థని స్థాపించిన పి. రాజేశ్వర రావు 2005 లో శ్రీపాద రచనల ముద్రణ ఆరంభించారు. 'పుల్లంపేట జరీచీర' పేరుతో 43 కథలు, 'కలుపు మొక్కలు' పేరిట ఏడు కథలు, 'మార్గదర్శి' పేరుతో తొమ్మిది కథలు. 'వడ్లగింజలు' అనే సంకలనంలో 14 కథలని  ముద్రించడంతో పాటు, 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' పుస్తకాన్ని ఒకే వాల్యూముగా విడుదల చేశారు. లెక్క చూస్తే 73 కథలు తేలుతున్నాయి కానీ, ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. కొన్ని కథల్ని శ్రీపాద ఒక్కసారి రాసేసి ఊరుకోలేదు. కొన్నింటిని పెంపు చేయగా, మరికొన్నింటిని కుదించారు.

ఉదాహరణకి 'తెనుగు రక్తం చప్పబడిపోతూ వుంది' పేరిట రాసిన కథకి తర్వాతి కాలంలో మార్పులు చేసి 'కలుపు మొక్కలు' పేరుతో ప్రచురించారు. అలాగే 'కీలెరిగిన వాత' అనే పెద్ద కథలో కొంత భాగాన్ని 'పుల్లంపేట జరీచీర' గా విడుదల చేశారు. ఇలా చూసినప్పుడు, నూటికి డెబ్భై మూడు కథలు అందుబాటులోనే ఉన్నాయి అనుకోలేం. మరి మిగిలిన కథల మాటేమిటి? నవలలు, నాటకాలు, చారిత్రిక గ్రంధం 'వీరపూజ' ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు కొత్త ప్రింట్ రాకపోయినట్టైతే, రాబోయే తరాలకి శ్రీపాద వారి సమగ్ర సాహిత్యం అందేది ఎలా?

ఈ ప్రశ్నల నేపధ్యంలో, నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఉత్తమ కథలు' సంకలనం కంటపడింది. సంపాదకుడు వేదగిరి రాంబాబు. శ్రీపాద రచనా జీవితం సాగించిన రాజమండ్రిలో ఆయన విగ్రహం ఏర్పాటుకి కృషి చేసిన అభిమాని. పుస్తకం తీయగానే ఒకింత నిరాశ. కేవలం పదమూడు కథలు మాత్రమే ఉన్నాయిందులో. వీటిలో చాలావరకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సంకలనాల్లో ప్రచురితమైన కథలే. శ్రీపాద జీవిత విశేషాలతో రాసిన తొమ్మిది పేజీల 'భూమిక' లో కథల ఎంపిక ఎలా జరిగిందో చెప్పలేదు. మరికొన్ని కథలు తేబోతున్నామన్న సూచనా ఏదీ లేదు.

నిజానికి ఎన్.బీ.టీ. లాంటి సంస్థ పూనుకుంటే శ్రీపాద మొత్తం కథలని - ఆమాటకొస్తే మొత్తం సాహిత్యాన్ని పునర్ముద్రించగలదు. వనరులు పుష్కలంగా ఉన్న ఆ సంస్థకి అదేమీ పెద్ద పని కాదు. అలాగని, నష్ట భయమూ లేదు. ఒకప్పటితో పోలిస్తే ఎన్.బీ.టీ. కూడా పుస్తకాల రేట్లని బాగానే పెంచేసింది. (256 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 140!!). ఏ కారణాల వల్లనైనా ఎన్.బీ.టీ. కి వీలు కాకపోయినా, ఈ మధ్య కాలంలో తెలుగు పాఠకులకి సమగ్ర సాహిత్యాలని అందిస్తున్న 'మనసు ఫౌండేషన్' ఇందుకు పూనుకున్నా సంతోషమే. ఎందుకంటే శ్రీపాద కథలు ఇవాళ చదివినా, సమకాలీనం అని మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా పాతబడని కథలు అనే అనిపిస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి