మంగళవారం, మే 07, 2013

కరెంటు-బిల్లు

ఆంధ్ర ప్రదేశ వాసుల ముందు ప్రస్తుతం ఉన్న సమస్యలు రెండు.. ఒకటి కరెంటు రెండోది బిల్లు.. 'వాన రాకడా ప్రాణం పోకడా' తెలియవన్నది ఇదివరకటి సామెత.. ఇప్పుడు టెక్నాలజీ బోల్డంత అభివృద్ధి చెందేశాక ఆ రెండింటి విషయంలోనూ కొంచం ఇంచుమించుగా ఓ అంచనాకి రాగలుగుతున్నాం.. అయితే, ఇంతింత టెక్నాలజీ ఉండి కూడా బొత్తిగా తెలుసుకోలేక పోతున్న విషయాలు రెండు... కరెంటు రాకడ, బిల్లు 'పోకడ.' అనగా, విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో బొత్తిగా తెలియడం లేదు. కొన్ని చోట్ల రోజులో ఆరుగంటలు పవర్కట్ అయితే, మరికొన్ని చోట్ల అప్పుడో గంటా.. ఇప్పుడో ఘడియా.. చొప్పున మొత్తంగా ఓ ఆరేడు గంటలు కరెంట్ ఇస్తున్నారు..

ఓ పక్క సూర్యుడు భగభగలాడిపోతూ పరీక్షలు పెట్టేస్తూ ఉంటే, కరెంటు అంతకన్నా ఎక్కువగా పరీక్షలు పెట్టేస్తోంది. కరెంటు ఎప్పుడు వస్తుంది? ..ఎప్పుడైనా రావొచ్చు.. ఎప్పుడు పోతుంది? ..ఎప్పుడైనా పోవచ్చు. ఓ బంపర్ ఆఫర్ ఏమిటంటే, కరెంట్ వస్తే మళ్ళీ పోతుందన్న గ్యారంటీ ఉంది కానీ, పోయిన కరెంట్ మళ్ళీ వచ్చే విషయంలో ఏమాత్రం గ్యారంటీ లేదు. ఇది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడిన విషయం. ఇదివరకటి రోజుల్లో కరెంట్ పోయినప్పుడు, కరెంటాఫీసు వాళ్లకి ఓ ఫోన్ చేస్తే, మళ్ళీ పవర్ ఎప్పుడు రిస్టోర్ అవుతుందో టైం చెప్పేవాళ్ళు. మరీ కచ్చితంగా అదే టైం కి కాకపోయినా ఓ అరగంటో, గంటో ఆలస్యంగా అయినా పాపం పవర్ వచ్చేసేది. ఇప్పుడు వాళ్లకి ఫోన్ చేసినా దొరకడం లేదు.. ఒకవేళ దొరికినా "మాకు తెలీదు" అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.

పవర్కట్ వల్ల పరిశ్రమలు మూతపడి పోతున్నాయనీ, ఉద్యోగాలు పోతున్నాయనీ పేపర్లలో వస్తోంది... మనం మంచి అనుకున్న దానిలో చెడు ఉన్నట్టే, చెడు అనుకున్న దాంట్లో కూడా ఎక్కడో అక్కడ మంచీ ఉంటుంది కదా.. కరెంటు తను ఉండకుండా ఉండడం ద్వారా మానవ సంబంధాలని మెరుగు పరుస్తోంది. ఇది ఎలా అంటే, ఎప్పుడూ ఇల్లు కదలడానికి ఇష్టపడని మా పక్కింటాయన, పవర్కట్ లో ఉండలేక వాళ్ళబ్బాయి దగ్గరికి బెంగుళూరు వెళ్ళిపోయారు... అక్కడైతే ఇంత ఎండలూ ఉండవు, ఉన్నా పవర్కట్ ఉండదు అంటూ... ఎప్పుడూ ఎన్నిసార్లు పిలిచినా రాని తండ్రి, తనకితానుగా వచ్చేస్తా అనేసరికి వాళ్ళబ్బాయి ఆనందం వర్ణనాతీతం..


చెప్పుకోవాల్సిన మరో విషయం కరెంటు బిల్లుల 'పోకడ.' అసలు ఓ నెలలో వచ్చే బిల్లుకీ, మరోనెల బిల్లుకీ కనీసం మేనమామ పోలిక కూడా ఉండడం లేదు. ఇక, గత వేసవి బిల్లులతో పోలిస్తే 'హస్తిమశకాంతం' అంటారు చూడండి... అంత భేదం ఉంది. అవును మరి.. ఈ ఏడాది లోనూ కరెంట్ చార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి కనుక!! ఇప్పుడైతే దాదాపు నెలకి రెండుసార్లు పెరుగుతూనే ఉన్నాయి, ఏదో అడ్జస్ట్మెంట్ అని పేరు పెట్టి.. పేరు ఏదైనా కట్టాల్సినవి డబ్బులే కదా.. పైగా శ్లాబులూ అవీ కూడా బాగా మారిపోయి చాలా గందరగోళంగా తయారయ్యింది పరిస్థితి. ఓ మిత్రుడికి ఇంటద్దె కన్నా (డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్) కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందిట.. ఆ విషయం ఓనర్ కి తెలిస్తే అద్దె పెంచేస్తారేమో అని భయపడుతున్నాడు ఆ భాగ్యనగరవాసి ప్రస్తుతం..

అసలు కరెంట్ బిల్ రీడింగ్ తీసుకోడాన్ని బట్టి కూడా బిల్లు మారిపోతూ ఉంటుందిట. అంటే, రీడింగ్ తీసుకునే కుర్రాడు బద్ధకించో కుదరకో ఓ రోజో రెండు రోజులో ఆలస్యంగా వస్తే శ్లాబు మారిపోయి చాలా ఎక్కువ బిల్లు కట్టేయాల్సి వస్తుందన్న మాట. ఈ రీడింగ్ కుర్రాళ్ళు ఎప్పుడూ ఆలస్యంగా వస్తారు తప్ప, ముందుగా రారు కదా.. కాబట్టి, వాళ్ళ 'తప్పిదం' వల్ల బిల్లు తగ్గే వీలు లేదన్న మాటే.. అసలైతే ఈ అడ్జస్ట్మెంట్ల వెనుక వేరే కారణం ఉందనీ, 'వ్యవసాయానికి ఉచిత విద్యుత్' తాలూకు బకాయిలు ఈ వంకన లాగేస్తున్నారనీ ఓ రూమరు.. అదే కనుక నిజమైతే, అప్పుడెప్పుడో చేసిన 'మేళ్ళు' ఇప్పుడు తేళ్ళయి కుడుతున్నాయన్న మాటే.. తెరవెనుక సంగతులు ఏమైనా, నెల తిరిగేసరికి బిల్లు రాకా మానదు.. కట్టకా తప్పదు.

నాకైతే ఒకటి అనిపిస్తోంది.. రోజులో అరకొరగా కరెంటు ఉంటేనే ఇంతింత బిల్లులు వస్తున్నాయి కదా..ఒకవేళ రోజంతా కరెంటు కనుక ఇచ్చేస్తే నెలయ్యాక వచ్చే బిల్లు కట్టడానికి ఆయనెవరో పురాణాల్లో మహనీయుడిలాగా ఆలుబిడ్డలని వేలం వేసేయాల్సి వస్తుందేమో అనీ.. (ఆయన వేలానికి పెట్టింది కరెంట్ బిల్లు కట్టడం కోసం కాదని గమనించ ప్రార్ధన).. ఇందుమూలంగా, 'చెడు' లో ఇంకో మంచి కూడా ఉందన్న మాట.. ఇలా వేలాలూ అవీ వేసేయక్కర్లేకుండా, అందరూ కలిసి చీకట్లో హాయిగా ఉండడం కోసమే పవర్కట్ చేస్తున్నారన్న మాట.. (నిన్ననే కరెంట్ బిల్ వచ్చింది.. ఇవాళ కట్టేద్దాం కదా ని కౌంటర్ కి వెళ్తే, 'కరెంట్ వచ్చాక కౌంటర్ తెరవబడును' అన్న బోర్డు పలకరించింది!!)

8 వ్యాఖ్యలు:

DG చెప్పారు...

ఈ దరిద్రం ఆంధ్రాలోనే ఎందుకేడుస్తోంది? మన చేతగాని తనం వల్లా? దాదాపు నలభై ఏళ్ళనించీ ఇదే తంతు. నేను చదువుకునే రోజుల్నించీ ఇలాగే ఉంది. ఏమిటంటారు? ఆంధ్రాలోనే వెలికితీసే వాయువు మద్రాసుకో, గుజరాత్ కో పోతుంది, మనకి వచ్చేది సున్నా. ఆఖరికి కర్ణాటకా అల్నట్టి అనీ, నోట్లో మట్టీ అని డేం మీద డేం కట్టినా మనకేమీ ఒరగదు. కొన్నాళ్ళకి ఇది వికటించి తాగడానికి నీళ్ళు కూడా దొరకవు. ఇప్పటికే గోదావరి ఎండిపోతోంది.

ఏ పక్క రాష్ట్రం నాయుకుడొచ్చినా వెంటనే వాడి కళ్ళు మన నీళ్ళమీద, వనరుల మీదా పడతాయి. వెనక్కి వెళ్ళగానే డేం ఎత్తు పెంచుతారు. మన "చేతగానితనం' వాళ్ళకి బాగానే తెల్సు కనక. ఇందులో జోకు ఏమిటంటే ఈ చేతగానితనం మనక్కూడా తెల్సు కానీ మనం ఏమీ పట్టించుకోం.

ఇలాంటి చేతకాని నాయకులని ఎన్నుకున్నందుకూ, ఎన్నికలు అనగానే చంకలు గుద్దుకుంటూ ఓట్లు వేస్తున్నందుకూ మనకి ఇది జరగాల్సిందే. ఒక్క గోదావరి జిల్లా అంత ఉండే ఏ కంట్రీలో అయినా విప్లవం రావచ్చేమో కానీ ఆంధ్రాలో మాత్రం రాదు గాక రాదు.

Padmarpita చెప్పారు...

ప్రస్తుత పరిస్థితికి ప్రతిబింబం ఈ పోస్ట్

Vasu చెప్పారు...

పాపం గ్రామాల్లో మరీ ఇబ్బందులు పడుతున్నారు ..

మీరు మానవ సంబంధాల మీద ప్రభావం ఉంది అంటే

ఇది గుర్తొచ్చింది .

ఒక లుక్కెయ్యండి .

http://maanasasanchara.blogspot.com/2010/03/blog-post_26.html

Zilebi చెప్పారు...


'పవర్' ఫుల్ టపా !!

జిలేబి

వేణూశ్రీకాంత్ చెప్పారు...

కరెంట్ అఫైర్స్ మీదా బాగా రాశారు.
బెంగళూరులో పవర్కట్ ఉండదనేది అపొహమాత్రమేనండీ. గత రెండేళ్ళుగా వేసవిలో అక్కడా ఎండలూ, పవర్కట్, నీటి ఎద్దడి ఎక్కువైపోయాయి.

balu చెప్పారు...

murali garu ela unnaru
manchi post andi on power cuts.

మురళి చెప్పారు...

@డీజీ: ఇక్కడున్న పరిస్థితుల్లో ఈ ఆవేశం కలగడం అత్యంత సహజం అండీ... పరిస్థితి కైతే కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు ఉన్నాయి.. ... ధన్యవాదాలు
@పద్మార్పిత: ధన్యవాదాలండీ
@వాసు: అవునండీ... మీ పోస్టు.. అప్పుడే చదివినా మళ్ళీ మరోసారి చదవడం బాగుంది :) ... ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

@జిలేబి: ధన్యవాదాలండీ.. @వేణూ శ్రీకాంత్: అక్కడ పవర్కట్ ఉండదు అన్నది వాళ్ళ అభిప్రాయం అండీ... మొత్తంమీద ఇక్కడి కన్నా తక్కువే అన్నది నిజం కూడాను.. ధన్యవాదాలు
@బాలు: ధన్యవాదాలండీ...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి