మన రక్షణ శాఖ మరో సారి వార్తల్లోకి వచ్చింది. గత కొద్ది నెలలుగా ఈ శాఖకి సంబంధించి మంచి కన్నా చెడే ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఏరోజు ఏ పేపర్ చూసినా డిఫెన్స్ గురించిన సంచలన వార్తలే. సైనికులు తిరుగుబాటు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న కథనం మొదలు, ఆ శాఖ అధికారి పదవీ విరమణ వరకూ ఇవే విషయాలు పేపర్లలోనూ, టీవీ వార్తా చానళ్ళ లోనూ కూడా. తాజా సమస్య ఏమిటీ అంటే, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రక్షణ శాఖకి కేటాయించే బడ్జెట్ తగ్గ బోతోందా? అని.
అనేక ప్రపంచ దేశాల్లాగే భారత దేశానికి కూడా 2012 ఏమంత కలిసిరాని సంవత్సరమే. అంతర్జాతీయంగా వచ్చి పడిన ఆర్ధిక మాంద్యం ప్రభావం భారత దేశం లో బాగానే కనిపించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఈమధ్యనే కేంద్ర ఆర్ధిక శాఖ వచ్చే ఆర్ధిక సంవత్సరానికి తయారు చేసే బడ్జెట్ లో కనీసం పది శాతం కోత విధించుకోమని అన్ని శాఖలకీ 'సూచించింది.' ఈ అన్ని శాఖల్లోకీ రక్షణ శాఖ కూడా వస్తుంది కాబట్టి, చర్చ మొదలయ్యింది. పేపర్లలో వ్యాస పరంపరలూ, జాతీయ వార్తా చానళ్ళలో చర్చోప చర్చలు జోరుగా సాగుతున్నాయి.
గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశపు రక్షణ బడ్జెట్లో పెరుగుదల రేటు చెప్పుకోదగ్గదిగా లేదు. మిగిలిన దేశాలు, మరీ ముఖ్యంగా సరిహద్దు దేశాలు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటూ ఉంటే, మన రక్షణ దళాలు పాతకాలపు ఆయుధాలనే వాడాల్సి వస్తోంది అన్నది తరచూ వినిపిస్తున్న ఫిర్యాదు. ఇది మన సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీసే విషయమే కదా. అలాగే, పెరుతుగున్న అవసరాలకి, సైనికుల సంఖ్యకీ సామ్యం కుదరడం లేదు అన్నది మరో ఫిర్యాదు. ఎప్పటికప్పుడు యువకులని రక్షణ దళాల్లోకి తీసుకుని, వాళ్లకి శిక్షణ ఇచ్చి, తయారుగా ఉంచడంలో వెనుకంజ కుదరదు.
దేశంలో అనేక మంది అన్నం, నీళ్ళూ లేక అలమటిస్తూ ఉంటే, చాలా మంది పేవ్ మెంట్ల మీద నిద్రపోతూ ఉంటే, వాళ్ళని గాలికి వదిలేసి ఆయుధాల కొనుగోలు మీద అంతలేసి మొత్తాలు వెచ్చించడం ఏమి న్యాయం? అన్నది రక్షణ వ్యయం మీద తరచుగా వినిపించే విమర్శ.వాళ్ళనీ, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళనీ కూడా ప్రాణాలతో నిలబెట్టాలి అంటే, స్వేచ్చగా ఊపిరి పీల్చుకోనివ్వాలి అంటే ఈ ఖర్చు తప్పదు. ఓ పక్క పొరుగు దేశాలు వాళ్ళ సరిహద్దుల్ని మార్చేసుకుని, మన ప్రాంతాలని వాళ్ళ మ్యాపులలో కలిపేసుకుంటూ ఉన్నప్పుడు, రక్షణ శాఖని నీరసింప జేయడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది?
సరిగ్గా ఈ నేపధ్యంలో, ఓ ఆసక్తికరమైన వార్తా కథనం కంటపడింది. 2020 నాటికి రక్షణ వ్యయం విషయంలో భారత దేశం ప్రపంచంలో నాలుగో స్థానానికి ఎగ బాకుతుందనీ, రాబోయే రోజుల్లో యుద్ధ పరికరాల అమ్మకాల్ని బహు చక్కని మార్కెట్ కాగలదనీ అంచనా వేస్తూ రిపోర్ట్ తయారు చేసింది ఓ అంతర్జాతీయ సంస్థ. ఇన్ఫర్మేషన్ హ్యాండ్లింగ్ సర్విసెస్ (ఐహెచ్చెస్) సంస్థ ప్రకారం, ఈ దశాబ్ది చివరికి వచ్చేసరికి రక్షణ కొనుగోళ్లలో యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యాల తర్వాత నాలుగో స్థానం భారత దేశానిదే అవుతుంది. ఫ్రాన్స్, జపాన్, యూకెలు భారత్ తర్వాతి స్థానాల్లో ఉంటాయి. ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ 2015-20 మధ్యలో భారత దేశం రక్షణ మీద పెద్ద మొత్తాలని వెచ్చిస్తుంది అన్నది ఈ సంస్థ అంచనా.
రక్షణ శాఖలో జరుగుతున్న దుబారా వ్యయాన్ని గురించి కూడా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అనవసరమైన చోట ఖర్చు చేయడం, అవసరానికి మించి ఖర్చు చేయడం అన్నది ఈ సంస్థ తరచుగా ఎదుర్కొంటున్న విమర్శ. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీతో నిమిత్తం లేకుండా, ఈ ఖర్చు విషయంలో ఈ శాఖ తప్పు పట్టబడుతూనే ఉంటోంది. కొనుగోళ్ళకి వచ్చేసరికి, యుద్ధ విమానాల మొదలు, శవ పేటికల వరకూ ప్రతి ఖర్చూ వివాదాస్పదమే అవుతోంది. కేవలం బడ్జెట్ ని మాత్రమే కాదు, పారదర్శకతని పెంచడమూ అవసరమే. ఇది అన్ని శాఖలకీ వర్తించినా, రక్షణ శాఖకి మరికొంచం ఎక్కువే వర్తిస్తుంది. ఎందుకంటే, సైన్యం అనగానే మొదట గుర్తుకు వచ్చేది క్రమశిక్షణే కదా మరి.
నిజమే ! చైన్ రియాక్షన్ లా, మనం కొంటే, వెంటనే పాకిస్తాన్ వాళ్ళు కొంటారు. వాళ్ళు కొన్న వెంటనే, మనం వాళ్ళని మించింది ఇంకోటి కొంటాం. మనకి తప్పదు. మనని మించిన మార్కెట్ ఎక్కడుంది ?
రిప్లయితొలగించండిఅసలు చంపడానికి వచ్చిన అఫ్జల్ ని ఉరి తీస్తే ఉరిని నిశేదించాలని ధర్నా చేస్తున్న గొప్ప వాళ్ళు, మానవతావాదులు ఉండగా ఏ శతృదేశం మన మీద దండెత్తుతుంది?ఆ ఉగ్రవాదిని ఉరితీస్తె తప్పు అన్నవారు రేపు శతృదేశాల సైనికులని కొత్త ఆయుధాలతో చంపితె ఊరుకుంటారా?తప్పులెందుకు చేస్తున్నారని మన సైనికుల చెవి మెలి వేయరు?!!అందుకే మన ప్రభుత్వం కాస్త బడ్జెట్ తగ్గించి దాన్ని మన బీద నేతల నాల్ల అకౌంట్లలో వేసి సెవ చేస్తొంది!!!!
రిప్లయితొలగించండిఅయినా దేనికైనా ఒక హద్దు ఉంటుంది శతృవైన ఉగ్రవాది ఉరికి శిక్షా స్మృతిలొ ఉరిని నిశేదించాలి అనేదానికీ కాస్తైనా తేడా చూపించాల్సిన అవసరం ఉందనుకుంటా ఎందుకంటే ఉగ్రవాది కసి తో,అక్కసు తో కొన్ని ఏళ్ళ శిక్షణ తొ ధాడి చేస్తాడు వీరు ఉరిని నిశేదించాలి అనేది "విచక్షణ కొల్పోయి క్షణీకావేశం లో" తప్పు చేసె వారికి వర్తించాలంటె కాస్త న్యాయంగా ఉండేది.
@సుజాత: అవునండీ.. కానీ తప్పదు ఇది :( ... ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@నరసింహ: ధన్యవాదాలండీ