మంగళవారం, డిసెంబర్ 18, 2012

సుబ్బారాయుడి షష్ఠి

"హమ్మయ్య... 'పోలిస్వర్గం' అయిపొయింది కదా.. ఇంక రోజూ పొద్దున్నే లేచే పని ఉండదు..." అనుకుంటామో లేదో, సుబ్బారాయుడి షష్ఠి వచ్చేస్తుంది. ఏవిటో ఈ పండగలన్నీ ముందే చెప్పుకున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి వరసగా వచ్చేస్తాయి. షష్ఠి అంటే స్నానమూ, తీత్తమూ అన్నమాట. రెండూ కూడా పక్క ఊళ్లోనే. పొద్దు పొద్దున్నే లేచేసరికే గుమ్మంలో వెంకాయమ్మ గారి బండి ఉంటుందా... అది నిండేలా బోల్డంతమంది ఆడవాళ్ళూ, పిల్లలూ ఉంటారు. ఎద్దులకి కూడా పాపం చలే కదా. మెల్లిగా నడిచీ నడిచీ పక్క ఊళ్ళో చెరువు పక్కన ఉన్న గుడికి తీసుకెడతాయి. 

మనం బండి దిగేసరికే బోల్డంత మంది పంతులు గార్లు 'సంకల్పం చెబుతామమ్మా' అంటూ ఎదురు వచ్చేస్తారు. ముందర ఎవరు అడుగుతారో వాళ్ళతో 'అలాగేనండీ' అని చెప్పాలన్న మాట. ఈ మాట కూడా పెద్ద వాళ్ళే చెప్పాలి. పిల్లలు గప్ చుప్ గా ఉండాలి. అసలే చలి చంపేస్తూ ఉంటుందా, మన పాటికి మన్ని స్నానం చేయనీయకుండా పంతులు గారు ఏవేవో మంత్రాలు చెప్పేస్తారు. ఓపక్క వణుకు వచ్చేస్తున్నా సరే, వాటిని తప్పుల్లేకుండా పలకాలి. లేకపోతే ముందర ఆయనకీ, తర్వాత అమ్మకీ కోపాలు వచ్చేస్తాయి. స్నానం గండం గడిచిపోయిందంటే, ఇంక గుళ్ళోకి వెళ్లి ప్రసాదం తెచ్చేసుకోడమే. జనం ఉంటారు కదా.. కొంచం ఆలీసం అవుతుంది.

గుడి నుంచి బయట పడేసరికి వెలుగు వస్తూ వస్తూ ఉంటుందన్న మాట. గుడి బయట అప్పుడే సైకిళ్ళ మీదా, బళ్ళ మీదా వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద మూటలు దింపుకుంటూ ఉంటారు. ఆ మూటల్లో ఏముంటాయంటే తీత్తం లో అమ్మేవి అన్నీను. అన్నట్టు, తీత్తం అంటే ఏమిటో చెప్పలేదు కదూ. బోల్డు బోల్డు జీళ్ళు, కర్జూర పళ్ళూ, బుడగలూ, రంగు కళ్ళ జోళ్ళూ, గాలికి గిరగిరా తిరిగే రంగు కాయితం పువ్వులూ, టిక్కూ టిక్కూ చప్పుడు చేసే కప్పలూ, ఇంకానేమో రంగుల రాట్నం కలర్ సోడాలు, గుండాట (ఇది కొంచం రహస్యం) ఇవన్నీ ఉండే చోటన్న మాట. గుడి ముందు నుంచి చాలా బోల్డంత దూరం ఒకదాని తర్వాత ఒకటి కొట్లు వస్తూనే ఉంటాయి.

మనం బండిలో వెడుతూ వెడుతూ బొమ్మలో అవీ ఏమేం వచ్చాయో చూసి, ఏ కొట్లో బావున్నాయో గుర్తులు పెట్టేసుకోవచ్చు. 'ఇప్పుడే కావాలీ' అని పేచీ పెట్టకూడదు. అలా కానీ పేచీ పెట్టామంటే, బండి దింపేస్తాం అంటారు పెద్ద వాళ్ళందరూ. హమ్మో... బండి దిగిపోతే ఇంకేమన్నా ఉందా? తీత్తంలో మారిపోమూ? అదే గుర్తులు పెట్టేసుకున్నాం అనుకో, మధ్యాహ్నం మళ్ళీ వస్తాం కదా.. అప్పుడు కొనుక్కోవచ్చు. ఇంచక్కా బడి ఉండదు కాబట్టి, ఇంటికి వెళ్ళాక ఆటలు ఆడుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం బోయినం అవ్వగానే తీత్తం ప్రయాణం ఉంటుంది కదా. "తీత్తం ఏమిటీ తీత్తం? నీ మొహం... తీర్ధం అనాలి" అని బామ్మ అంటుందనుకో.. అయినా మనకి ఎలా పలికితే అలా అనొచ్చు. చిన్న పిల్లలు అన్ని మాటలూ సరిగ్గా పలకలేరని దేవుడికి మాత్రం తెలీదూ?

తీత్తానికి రెండు రకాలుగా వెళ్ళొచ్చు. అమ్మ, అమ్మ ఫ్రెండ్సులతో అయితే నడిచి, అదే నాన్నతో అయితే సైకిలు మీద. మన ఊరి తీత్తమైతే రోజులో ఆరు సార్లో, పది సార్లో ఇట్టే వెళ్లి అట్టే వచ్చేస్తామా? ఈ తీత్తానికి మాత్రం ఒక్ఖ సారే వెళ్ళగలం. బండిలో చటుక్కున వెళ్లినట్టు అనిపిచేస్తుంది కానీ, నడిచి వెడితే యెంత దూరమో అసలు. వెళ్ళేప్పుడు, మనకి ఎదురు వస్తున్న వాళ్ళ చేతుల్లో ఉండే బూరాలూ, బొమ్మలో చూస్తూ పట్టించుకోము కానీ, ఇంటికి రాగానే మొదలవుతాయి కాళ్ళ నొప్పులు. అదే సైకిలు మీదనుకో, కాళ్ళు చక్రంలో పెట్టేయ్యకుండా జాగ్రత్తగా కూర్చోవాలి. మనం వెడుతూ వెడుతూ ఉండగా తాడుచ్చుకుని కొట్టుకునే వాడు కనిపించాడంటే తీత్తం వచ్చేసినట్టే. వాడిని చూస్తే ఎంత భయం వేస్తుందంటే, తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అమ్మైతే "కళ్ళు మూసుకుని నా చెయ్యి గట్టిగా పట్టుకో బాబూ" అంటుంది కానీ, అదే నాన్నైతే "మొగ పిల్లాడివి, ఏడుస్తావేంటీ?" అనేస్తారు.

ఎన్నేసి జీళ్ళో... ఎన్నెన్ని ఖర్జూరం పళ్ళో... వాటిని చూస్తూనే కడుపు నిండిపోతుంది అసలు.. కొట్ల వాళ్ళందరూ యెంత మర్యాదగా పిలుస్తారో అసలు.. వాళ్ళ కొట్లోనే కొనుక్కోమని. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ కొనేసుకోకూడదు. ఈగలు లేకుండా ఉన్న కొట్టు వెతుక్కోవాలా... జీళ్ళు అప్పటికప్పుడు చేస్తూ అమ్ముతారు చూడూ, అక్కడైతే బావుంటాయి. ఖర్జూరం పళ్ళ మీద బెల్లం నీళ్ళు చిలకరించి అమ్మేస్తూ ఉంటారు. అది పసికట్టుకోవాలి. మనం యెంత జాగ్రత్తగా ఎంచినా బామ్మ ఏదో ఒక పేరు పెట్టకుండా ఉండదనుకో. అయినా, అమ్మ చెప్పినట్టు డబ్బులు పోసి కొంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. తీత్తంలో కళ్ళజోళ్ళు యెంత బావుంటాయో అసలు. ఎన్ని రంగులో.. ఎరుపూ, నీలం, ఆకుపచ్చా, పసుప్పచ్చా... మనకైతే అన్నీ తలోటీ కోనేసుకోవాలి అనిపించేస్తుంది కానీ, ఒకటి కన్నా కొనుక్కోడానికి ఉండదు.

పేరుకి బోల్డన్ని కొట్లు ఉంటాయి కానీ అన్నీ చూడ్డానికి ఉండదు. పెద్దవాళ్ళు ఎక్కడికి వెడితే మనమూ అక్కడికే వెళ్ళాలి. లేకపోతే మారిపోతాం కదా. పోలీసులు ఒకళ్ళు తెగ తిరుగుతూ ఉంటారు. నేనెప్పుడూ చూడలేదు కానీ, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారుట తీత్తంలో. నాన్నైతే బరబరా తీసుకొచ్చేస్తారు, రెండో మూడో బొమ్మలు కొనిపెట్టి. అమ్మతో అయితే తిరగొచ్చు కానీ, ఊరిఖే చూడాలి అంతే. బతిమాలినా ఏమీ కొనిపెట్టదు. "ఎందుకూ.. రేపటికి విరగ్గొట్టేస్తావ్" అంటుంది పైగా. ఏవీ కొనుక్కోక పొతే ఫ్రెండ్సులకి ఏం చూపించాలీ? వాళ్ళందరూ నవ్వరూ?? ఏవిటో..ఇంత పెద్దైనా ఏమీ తెలీదు. ఆ ఏడాది తీత్తానికి నాన్నతో వెళ్లాను కదా... తిరిగొస్తూ "ఎందుకు నాన్నా సుబ్బారాయుడి తీత్తం ఇంత దూరంగా ఉంటుందీ?" అని అడిగా. "ఇదీ ఓ దూరమే? వచ్చే ఏడు నుంచీ నీ బడి ఇక్కడే.. రోజూ రావాలి. మనూళ్ళో హైస్కూలు లేదు కదా మరి" అనేశారు

15 కామెంట్‌లు:

  1. మీ తీత్తం విశేషాలు బావున్నాయండీ, నాకు బుడుగు చెప్తున్నట్టే అనిపించాయి మీ మాటలు..చాలా బావుంది.

    రిప్లయితొలగించండి
  2. వావ్ మురళి గారూ సుబ్రమణ్యేశ్వర షష్టి తీర్థం మళ్ళీ కళ్ళకి కట్టినట్టు చూపించేసారు కదా ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. నన్ను కూడా మా ఊరి తీర్ధం లో తిప్పి తీసుకు వచ్చేసారు మీరు.

    చాలా బాగుంది ఈ మీ టపా.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుంది.మా గూడలి తిరణాలు గుర్తుకు వచ్చాయి.అక్కడ మేము తిప్ప మీదకి కూడా ఎక్కుతా ము

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగుందండి.మా చిన్నప్పుడు ట్రాక్టర్ మీద మేము పక్కూరికెళ్ళి దర్శనమయ్యాక అన్నితిరిగి,కొనుక్కుని మధ్యహ్న్నానికి ఇంటికొచ్చే వాళ్ళము.అవన్నీ గుర్తుచేసేరు.

    రిప్లయితొలగించండి
  6. అబ్బ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మురళి గారు, అమ్మ వేలో నాన్న వేలో పట్టుకుని తీత్తంలో హడావిడిగా అన్ని కొట్లూ చూసేస్తూ తిరిగేస్తున్న మురళి బాబుని కళ్ళకి కట్టినట్లు చూపించారు. చాలాచాలా బాగుంది టపా, మా కోటప్పకొండ తిరునాళ్ళ గుర్తొచ్చింది.

    రిప్లయితొలగించండి
  7. అత్తిలే కదండీ...ఇన్నాళ్ళకి కనిపెట్టేసానండి మీ ఊరు....చాల బాగా రాసారండి...

    రిప్లయితొలగించండి
  8. మీరు బాల్యం గురించి రాస్తుంటే నేనూ మీ మిత్రునిలా మీతో మీ పక్కనే తిరిగినట్లుంటుందండి.

    రిప్లయితొలగించండి
  9. చాలా బాగా వ్రాసారు.

    రిప్లయితొలగించండి
  10. బుడుగు తీత్తం భలేగా ఉందండోయ్..:))
    అచ్చం నా చిన్నప్పుడు తీత్తంలాగా అన్నమాట..:)

    రిప్లయితొలగించండి
  11. డియర్ మురళి గారికి.
    నమస్తే. మీరు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన 'మిధునం' రివ్యూ చదివాను. మీదైన మార్క్ రివ్యూ చాలా బావుంది.
    మాకన్నా ముందుగా మీరు ఆ సినిమా చూసినందుకు కించిత్ అసూయగానూ, ఇంత పెద్ద సిటీ లో ఉండి కూడా
    మేమింకా ఆ సినిమా చూడనందుకు సిగ్గు గానూ ఉంది. వెంటనే చూస్తాను. హాట్స్ ఆఫ్ మీకు. అంత చక్కని
    రివ్యూ చాసారు. మీ నుండి ఇంకా ఇలాంటి రివ్యూస్ రావాలని ఎదురుచూస్తూ.....మీ, సాహితీ మిత్రుడు, భాస్కర్.

    రిప్లయితొలగించండి
  12. @చిన్ని: ధన్యవాదాలండీ..

    @శ్రీనివాస్ పప్పు: కేలండర్ చూడగానే మళ్ళీ ఓసారి గుర్తోచ్చాయండీ అన్నీను :( ...ధన్యవాదాలు

    @బులుసు సుబ్రహ్మణ్యం: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  13. @శశికళ : ఓహ్... మీ బాల్యం గుర్తోచ్చిందన్న మాట! ధన్యవాదాలండీ...

    @రాధిక (నాని): మాది ఎడ్లబండి తీర్ధం అండీ.. :-) ధన్యవాదాలు

    @వేణూ శ్రీకాంత్: హహహా... వేణూ గారూ... నిజంగానే వేలు పట్టుకునే తిరిగేవాడిని, మారిపోతానేమో అని భయం :-) ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  14. @కృష్ణ: అబ్బే... కాదండీ... మాది తూర్పు గోదావరి :) ధన్యవాదాలు

    @జేబీ: ధన్యదాదాలండీ..

    @బోనగిరి: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  15. @ధాత్రి: బుడుగు కాదండీ మురళీ :-) ధన్యవాదాలు

    @భాస్కర్: మీ వ్యాఖ్య ఈ పోస్ట్ లో పబ్లిష్ అయ్యిందండీ.. 'మిథునం' సినిమా మిమ్మల్ని నిరాశ పరచదనే అనుకుంటున్నాను.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి