గురువారం, నవంబర్ 01, 2012

ఓ జ్ఞాపకం... కృష్ణశాస్త్రిది...

"లిఫ్టు కావాలి సార్"
"చంద్రంపాలెం వెడుతున్నాం"
"మా ఊరేనండి.. థాంక్సండీ బాబూ.. రెండు కిలోమీటర్లు నడవాల్సొచ్చేది.."
"ఎవరింటికి మీరు?"
"ఉహు... ఎవరింటికీ కాదు.. ఊరికే...ఊరు చూద్దామని.."
"నిజం చెప్పండే.. ఊరికే మా ఊరు ఎవరొస్తారు?"


"మీ ఊళ్ళో స్కూలు ఉంది కదండీ.. అది చూద్దామని.."
"దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్కూలు..."
"ఓహ్.. ఆయన పేరు తెలుసా మీకు?"
"అయ్ బాబోయ్... ఏటా ఆయన పుట్టిన్రోజు సేత్తాం కదండీ.. ఆయాల అన్నీ ఆయన పాటలే ఏస్తాం మైకులో... 'గోరింటా పూసింది కొమ్మాలేకుండా..' ఇంకా సాలా పాటలు.."
"బాగా పాడుతున్నారు.. పాడండి.. పాడండి.."
"అంత బాగా రావండి.. 'ఆకులో ఆకునై.. కొమ్మలో పువ్వునై.."
"కొమ్మలో కొమ్మనై అండీ.. పాడండి..."
"ఆరు బేమ్మలు కామోలు.. మీరు గానీ సుట్టాలా?"
"కాదండీ.. ఆయన ఇల్లు చూద్దామని వెళ్తున్నాం"
"ఆయన ఇల్లే స్కూలికి ఇచ్చేశారండి.. అక్కడే ఇగ్రహం కూడా పెట్టావండి, ఆయంది.. ఆరి పిల్లలూ గట్రా ఒచ్చారండి అప్పుడు .."
"మీ వయసు చూస్తే, ఆయన పేరు కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు అనిపించింది"
"నిజం సెప్పాలంటే తెల్దండి.. ఇగ్రహం పెట్టాక, పుట్టినరోజులు సేత్తన్నారు కదండీ.. అప్పట్నుంచీ తెలుసు"
"మీరు...?"
"ఈరబాబంటారండి. కాకినాట్లో పెట్రోలు బంకులో సేత్తన్నానండి.. రోజూ ఎల్లొస్తా ఉంటాను..ఊళ్ళో సొంతిల్లండి.."
"పిఠాపురం రాజా వారికీ కృష్ణ శాస్త్రి గారికీ మంచి స్నేహం ఉండేదంటారు?"
"తెల్దండీ.. ఇప్పుడారి కోటా లేదక్కడ.. ఏయో గుర్తులు మాత్రం ఉన్నాయ్ లెండి..."
"భలేగా ఉందండీ మీ ఊరు.. పచ్చగా..."


"ఈ ఊరు చూసే రాసుంటారండి.. 'మేడంటే మేడా కాదూ...' భలే పాట కదండీ.."
"మీకు కృష్ణశాస్త్రి గారి పాటలన్నీ నోటికి వచ్చేసినట్టే ఉన్నాయే.."
"అంటే మరి, ప్రెతి సంవత్సరం ఆయన పుట్టిన్రోజుకి మైకులో ఈ పాటలే ఏసుకుంటాం కదండీ...కానీ, మాకు పెద్ద బాగోందండి ఊరు..రోడ్డు సరింగా లేదు.. ఆటోలు కూడా గమ్మున్రావు..కానైతే, అయన వల్ల పేరండి.. "
"బయటి నుంచి వచ్చిన వాళ్ళకే నచ్చుతుందన్న మాట అయితే..."
"అంతేనండి... ఇక్కడోసారి ఆపండి.. నే దిగుతాను.. తిన్నగా ఎల్లి, సెంటర్లో లెఫ్టు తిరగండి.. స్కూలు కనిపిత్తాది.. అక్కణ్ణుంచి మీరు తిన్నగా ఎల్లిపోవచ్చు.. ఆ రోడ్డు బాగుంటాది దీనికన్నా.."


"థాంక్స్ అండీ.."
"అయ్ బాబోయ్.. ఎంతమాటా.. నేను చెప్పాలండి.. మీరు లేకపోతే నడుచుకుంటా రావాల్సొచ్చును ఇంతదూరం.." 

(తెలుగునాట భావకవితకి పర్యాయపదంగా నిలిచిన దేవులపల్లి  వేంకట కృష్ణశాస్త్రి జయంతి నేడు)

20 కామెంట్‌లు:

  1. కృశా గురించి హృద్యమైన జ్ఞాపకం. ఆయన ఆనందం ప్రపంచానికీ ఆనందమే.

    రిప్లయితొలగించండి
  2. కృష్ణ శాస్త్రి గారి ఊరు గురించి, ఆ ఊరి వారు ఆయన విగ్రహం పెట్టి ఏటేటా జరుపుతున్న సంబరాలను గురించి చెప్పారు. చాలా సంతోషంగా వుంది. థాంక్యు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  3. నవంబర్ ఫస్ట్‌కి ఈ ప్రత్యేకతకూడా ఉందన్నమాట. కృష్ణశాస్త్రిగారి జయంతిగురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. టపా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. అవునండి కృష్ణ శాస్త్రి గారి జన్మదినం నేడు. మాక్కూడా ఆజ్ఞాపకాలు చూపినందుకు థాంక్స్. కాని ఇక్కడున్న ఆ ఇద్దరు ఎవరండి? నాకేవో కొంచెం అనుమానాలొస్తున్నాయి. నిజం చెప్పండి:)

    రిప్లయితొలగించండి
  5. కుమ్మేహారండీ ..మురళిగారిని కృష్ణశాస్త్రిగారి క్రాపులో ఊహించుకుంటూ

    రిప్లయితొలగించండి
  6. చంద్రం పాలెం తీసుకెళ్లి కృష్ణ శాస్త్రి గారిని గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు.ఆ మధ్య చదివిన బుజ్జాయిగారి పుస్తకంలోని కృష్ణ శాస్త్రిగారి విషయాలన్నీ ఓ సారి మళ్ళా గుర్తుకొచ్చేయి.

    రిప్లయితొలగించండి
  7. నా కిష్టమైన వారిలో ఒకరైన కృష్ణశాస్త్రిగారి పై చక్కగా రాసారు.

    రిప్లయితొలగించండి
  8. మాకు ఊరికి మరీ దూరం కాదన్నమాట ..

    థాంక్స్ మురళి గారు. నాకు తెలియనే లేదు అవతరణ దినోత్సవం నాడే దేవులపల్లి వారి పుట్టినరోజని

    రిప్లయితొలగించండి
  9. బాగుందండీ..
    నాకు తెలియని విషయాల గురించి చెప్పారు...

    రిప్లయితొలగించండి
  10. ఆ తోట, ఆ తోపు, ఆకుపచ్చని గూడు..

    ఎంత బావుందోనండీ చంద్రపాలెం! మనసు నిండిపోయింది ఈ టపా చదివితే. ధన్యవాదాలు మురళిగారూ!

    రిప్లయితొలగించండి
  11. గోదావరి యాసలోని ఆప్యాయతను గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు మురళి గారు..
    తేట తెలుగులో క్రిష్ణశాస్త్రి గారి భావ కవిత్వం ,పాటలు ఎన్ని సార్లు చదివినా,విన్నా ఆస్వాదిస్తాం..:)
    క్రిష్ణశాస్త్రి గారి ఇల్లు వెతుక్కుంటూ..వెళ్ళారా..మీరు గ్రేత్ అండి..
    ఫొతొస్ కూడా చాలా బాగున్నాయి..:))

    రిప్లయితొలగించండి
  12. చంద్రంపాలెం వెళ్ళొచ్చారా! కృష్ణశాస్త్రి గారి ఇల్లు మాక్కూడా చూపించారు...అలాగే ఈరబాబును మాక్కూడా పరిచయం చేశారు థాంక్సండి మురళీగారు ...ఆయ్:)

    రిప్లయితొలగించండి
  13. బావుందండి. కృష్నశాస్త్రి గారి ఊరు మాకు చూపించారు.

    రిప్లయితొలగించండి
  14. @పురాణపండ ఫణి : మంచి మాట చెప్పారు!! ధన్యవాదాలు.
    @జ్యోతిర్మయి: ధన్యవాదాలండీ...
    @దంతులూరి కిషోర్ వర్మ: అవునండీ... కృష్ణశాస్త్రి జయంతి.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  15. @జయ: ఏ ఇద్దరూ అండీ? ఇక్కడ రాసింది అయితే లిఫ్టు ఇచ్చిన వాడికీ, పుచ్చుకున్న వాడికీ మధ్య సంభాషణ :-) ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: అయ్ బాబోయ్!!! ధన్యవాదాలండీ
    @పంతుల గోపాలకృష్ణ రావు: అవునండీ... కానీ బుజ్జాయి గారికి చంద్రంపాలెం పెద్దగా తెలియదు అంటుకుంటా... కాకినాడ కబుర్లే ఎక్కువగా రాశారు పుస్తకంలో. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  16. @సృజన: ధన్యవాదాలండీ...
    @వాసు: ఐతే ఈసారి ఇండియా ట్రిప్ లో చంద్రంపాలెం కూడా ఉంటుందాండీ? :-) ధన్యవాదాలు
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  17. @శ్రీనివాస్: ధన్యవాదాలండీ..
    @రాధిక (నాని): థాంక్స్ అండీ..
    @కొత్తావకాయ: అప్పుడెప్పుడో ప్రియనేస్తం రాసిన ఉత్తరం ఒకటి గుర్తొచ్చిందండీ, మీ వ్యాఖ్య చదువుతూ ఉంటే.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  18. @ధాత్రి: అనుకోకుండా చేసిన ప్రయాణం అండీ... ముందు ప్లాన్ చేసింది కాదు... ధన్యవాదాలు
    @పరిమళం: అయ్ బాబోయ్.. ఎంతమాటా!! ధన్యవాదాలండీ...
    @చిన్ని: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి