మనకి ప్రియమైన వ్యక్తిని మరొకరికి అప్పగించడం అన్నది ఎంతో వేదనతో కూడుకున్న విషయం. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడూ, ఆపై అప్పగింతలప్పుడూ తల్లి మాత్రమే బాధ పడదు. తండ్రి కూడా బాధ పడతాడు. నిజానికి తల్లి కన్నా ఎక్కువే బాధ పడతాడు కానీ, బయట పడడు. మన సమాజం మగవాడికి విధించిన కనిపించని కట్టుబాట్ల ఫలితం ఇది. తాళి కట్టిన భార్యనో, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న ప్రియురాలినో మరొకరికి శాశ్వతంగా అప్పగించాల్సిన పరిస్థితే వస్తే, ఆ మగవాడి పరిస్థితి వర్ణనాతీతమే.
వెండితెర సాక్షిగా రెండు సన్నివేశాలు. రెంటినీ రూపు దిద్దిన దర్శకుడు ఒక్కరే. కళాతపస్వి కే. విశ్వనాథ్. రెండు సినిమాలూ ఏడాదిన్నర తేడాతో విడుదలై, ప్రేక్షకుల మీద తమవైన ముద్ర వేసినవే. వీటిలో మొదటిది 'సప్తపది.' వర్ణ వ్యవస్థని ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఓ సద్బ్రాహ్మణ నాట్యాచార్యుడి కూతురు హేమ ఓ నర్తకి. తన బృందంలోని వేణు గాన కళాకారుడు హరిబాబుతో ప్రేమలో పడుతుంది ఆమె. తన ప్రేమని వ్యక్త పరిచాక, హరిబాబు ఓ హరిజనుడనీ, తన ప్రేమకోసం కులాన్ని దాచిపెట్టాడనీ తెలుస్తుంది హేమకి. అయినా ఆమె ప్రేమలో ఏ మార్పూలేదు.
హేమ మాతామహుడు యాజులు గారికి కులం పట్టింపు ఎక్కువ. స్వకులం వాడే అయినా అల్లుడు నాట్యాచార్యుడు కావడంతో కూతురి పెళ్లి అభ్యంతరం ఆయనకి. కూతురు మరణించినా రెండు కుటుంబాల మధ్యనా దూరం అలాగే ఉంటుంది. హేమ నాట్య ప్రదర్శన చూసిన యాజులు గారి ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. స్నేహితుడు రాజు గారు కూడా ఇందుకు కొంత కారణం. హేమని తన మనవడు (కొడుకు కొడుకు) గౌరీనాధానికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. కూతురి ప్రేమ విషయం తెలియని హేమ తండ్రి, ఆమెతో సంప్రదించకుండానే పెళ్ళికి అంగీకరిస్తారు.
పరంపరాగతంగా వచ్చిన అర్చక వృత్తిలో స్థిరపడ్డ గౌరీనాధుడు, తాతగారి మాటప్రకారం హేమని పెళ్లి చేసుకుంటాడు. కానీ కాపురం చేయలేకపోతాడు. ఆమె భార్యగా కాక తను పూజించే పర దేవతగా కనిపిస్తుంది అతనికి. కారణాలు అన్వేషిస్తుండగా, హేమ ప్రేమ విషయం తెలుస్తుంది అతనికి. హరిబాబుని తీసుకు వచ్చి అతనికి హేమని అప్పగిస్తాడు. ఊరివారిని ఎదిరించి మరీ, మనవడి నిర్ణయాన్ని సమర్ధిస్తారు యాజులు గారు. సినిమా ముగింపు సన్నివేశంలో, హరిబాబుని పడవలో తీసుకు వచ్చిన గౌరీనాధం, తను మాత్రం ఒడ్డునే నిలబడి ఉంటాడు. మంగళ వాయిద్యాలు, చీర సారెలతో తాతయ్య వెంట రేవుకి వస్తుంది హేమ.
తాతయ్య కాళ్ళకి నమస్కరించి సెలవు తీసుకుని, పడవలో ఉన్న తను ప్రేమించిన వాడిని చేరుకోవాలి ఆమె. రేవు ఒడ్డున తనకి తాళి కట్టినవాడు. అగ్నిసాక్షిగా పెళ్ళాడినా భర్త కాలేక పోయినవాడు. అయినప్పటికీ, తన మనసు తెలుసుకున్న వాడు. అతని నుంచి వీడుకోలు తీసుకోడం ఎలా? అప్పటికే కొంగు భుజం చుట్టూ కప్పుకున్న హేమ తల వంచుకునే నమస్కరిస్తుంది గౌరీనాధానికి. ఒక్కసారి కళ్లెత్తి, రెండు చేతులూ పైకెత్తి నవ్వుతూ తనని ఆశీర్వదిస్తున్న గౌరీనాధాన్ని చూస్తుంది. హేమకే కాదు సినిమా చూస్తున్న ప్రేక్షకులకి కూడా ఆ క్షణంలో గౌరీనాధుడు గాలిగోపురం అంత ఉన్నతంగా కనిపిస్తాడు.
'సప్తపది' విడుదలైన రెండేళ్ళ లోపుగానే కళాతపస్వి నుంచి వచ్చిన మరో కళాత్మక చిత్రం 'సాగర సంగమం.' కథా నాయకుడు బాలూ, నాట్యాన్ని ప్రేమించిన వాడు. నాట్యాన్ని తప్ప మరి దేనినీ ప్రేమించని వాడూను. అంతటి వాడూ మాధవి ప్రేమలో పడతాడు. ఆమె తన పక్కన ఉంటే చాలు అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఆమెకి తన ప్రేమని ప్రతిపాదిస్తాడు. మాధవి వివాహిత. తాళి కట్టిన భర్త గోపాలరావు ఆమెని ఏలుకోలేదు. పెళ్లి పీటల మీదే వదిలేసి వెళ్లి పోయాడు. ఆమె ఆ గాయాన్ని మాన్పుకునే ప్రయత్నంలో ఉండగానే బాలూ పరిచయమయ్యాడు.
బాలూ ప్రతిపాదనని మాధవి అంగీకరించ బోతున్నతరుణంలో ఆమె జీవితంలో తిరిగి ప్రవేశిస్తాడు గోపాలరావు. బాలూ-మాధవిల ప్రేమని గ్రహిస్తాడు అతడు. నిండు మనసుతో వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనీ అనుకుంటాడు కూడా. వాళ్ళని ఒకటి చేసి తను కెనడా వెళ్లిపోవాలి అన్నది అతని ఆలోచన. కానీ, బాలూ ఆలోచన వేరు. ప్రేమ కన్నా తాళికి విలువ ఇవ్వాలి అనుకుంటాడు. మాధవి, గోపాలరావుకి చెందడమే న్యాయం అనుకుంటాడు. అందుకు ఆమెని ఒప్పిస్తాడు. మాధవి, కాపురానికి కెనడా వస్తోందని గోపాలరావుకి చెబుతాడు.
ఆవేళ మాధవి ప్రయాణం. రైల్లో లగేజీ సద్దుకుంటూ ఆమె, టికెట్ కలెక్టర్ తో మాట్లాడుతూ ఆమె భర్త. అప్పుడు స్టేషన్ కి వస్తాడు బాలూ. చేతిలో ఓ కెమెరా. తనకి మాధవిని పరిచయం చేసిన కెమెరా. గోపాలరావుని అనుమతి కోరతాడు, ఫోటో కోసం. బాలూ, మాధవితో ఫోటో దిగుతాడనుకుని అందుకు సమ్మతిస్తాడు గోపాలరావు. కానీ, బాలూకి కావాల్సింది మాధవి-గోపాలరావుల ఫోటో. అతను ఫోటో తీసుకున్నాక రైలు కదలడానికి సిద్ధ పడుతున్న వేళ, బోగీ గుమ్మంలో భర్త పక్కన నిలబడి బాలూకి నమస్కరిస్తుంది మాధవి. ఆమె కళ్ళలో కనిపించేది కృతజ్ఞత మాత్రమేనా?
మరి బాలూ స్పందన ఏమిటి? తను చేసిన పని మంచిదనే అతను అనుకుంటున్నాడు. కానీ, ఆ పని మనస్పూర్తిగా చేశాడా? మాధవిని వదులుకోడానికి అతను సిద్ధంగానే ఉన్నాడా? ఆ క్షణంలో బాలూని చూసిన ప్రేక్షకులకి అతని మీద జాలీ, బాధా, కోపమూ ఏకకాలంలో కలుగుతాయి. రైల్లో వెళ్ళిపోయిన మాధవి, స్టేషన్లో మిగిలిపోయిన బాలూ చెరగని ముద్ర వేసేస్తారు ప్రేక్షకుల మనసుల్లో.
ఈ రెండు సన్నివేశాల్నీ తెరకెక్కించిన విశ్వనాథ్ ని మాత్రమే కాదు, రెండు సినిమాలకీ సంభాషణలు అందించిన జంధ్యాలనీ అభినందించి తీరాలి. ప్రత్యేకించి ఈ రెండు సన్నివేశాలకీ ఎలాంటి సంభాషణలూ రాయనందుకు.. మాటల కన్నా, మౌనమే శక్తివంతంగా పని చేసే సందర్భాల్ని గుర్తించినందుకు...
(టపా ఆలోచనని ప్రోత్సహించి, ఫోటోలు సమకూర్చిన బ్లాగ్మిత్రులు కొత్తావకాయ గారికి
కృతజ్ఞతలు...)