సోమవారం, నవంబర్ 14, 2011

పదనిసలు...

"పిప్పిప్పిప్పీ..డం డం..డమడం.. పీ పీ.."
"రాయిండ్రాయిండి... బార్యాగారూ అందరూ బాగున్నారా? ఒలె బుల్లే..సిన్నాన్ననోపాలి రమ్మను...బేగా..."
"ఆయ్.. పెల్లికొచ్చేరా? ఎంతైనా మీవోడింటో పెల్లి కదా.. రాకుండుంటారా?"
"ఆడెక్కడో పన్లో ఉన్నాడు బాబా.. ఒచ్చేత్తాడు.. ఈలోగల మీరు కూతంత పలారం పుచ్చుకోవాల.. ఒలె బుల్లే.. నాలుగు మిటాయుండ్లూ, సున్నుండ్లూ, కూతంత కారబ్బూందీ అట్టుకురాయే.. ఆసేత్తోనే ఆ మూల గెదిలో సెక్కరకేలి అంటిపల్లున్నాయి సూడు.. ఓ నాలుగట్రా.. ఇక్కడున్నట్టు రావాలొలే..."
"యాండిబాబా.. ఇదేనా రాటం.. నల్లపూసైపోయేరు.."
"అయ్ బాబా.. కూతంతేనండే పలారం.. తీసెయ్ కండే.. ...బుల్లే.. మంచినీల్లేయే.. పెత్తేకం సెప్పాలి కావోసు.. బేగట్టుకురా"
".........."
"ఆయ్.. ఈ పెల్లైపోతే బాబా.. మావోడు ఒడ్డెక్కేసినట్టే.. మీయందరి దయానండి.. పైన బగమంతుడున్నాడు..."
"యాండిబాబా.. ఇదేనా రాటం అంటే నవ్వేసూరుకుంటారు. మాం గురుతునేవేటండి? ..... ఉప్పుడూ, ముక్కిమంత్రీ, సెంద్రబాబూ కొల్లూటై పోయేరని సాచ్చోడు సెప్తున్నాడు. నిజవేనంటారా?"
"ఎహే.. ఉప్పుడా గొడవెందుకు? సెంద్రబాబు ఇయ్యాలో రేపో ముచ్చమంత్రై పోతాడని ఈనాడోడు ఏడు సమ్మచ్చారాల్నుంచి సెప్తానే ఉన్నాడు.. అయ్యేడేటి? ...ఈ రాసికీయం కాదు కానండే.. తెలంగాన ఏటవ్వుద్ది? మీకాడేవనుకుంటన్నారు, సెప్పండి ముందు?"
"ఏటైతే మనకేటేహే"
"నువ్వాగరొరే... ఈ గొడవొచ్చినకాన్నించీ ఐద్రాబాదులో తిర పడిపోయినోల్లంతా వొచ్చి మనకాడ బూవులు బేరం సేత్తన్నారా లేదా? మరి మనకేటంటావేటి.. బుద్ది గీని లేదేటి?"
"ఆర్ని పలారం పుచ్చుకోనివ్వండ్రా బాబా... తవరు కూతంత కాపీ కూడా పుచ్చుకోవాల.. ఒలె బుల్లే....."
"ఏటండీ? తీరామోసి మూర్తానికుండ్రా... ఇదేటండిలాగ సేస్సేరు?"
"ఆరుజ్జోగం.. ఆరి గొడవలూ ఆరియ్యిరా.. ఒచ్చేరా నేదా.. నాలుగచ్చింతలేసేరా నేదా..బాబా... ఒచ్చేరు సంతోసం.. తవరింట్లో పప్పన్నానికి పిలాల మమ్మల్ని.. ఇక్కడెట్టుకుంటారో, ఎట్టుకోరో.."
"ఆరీ ఊరొదల్రు లేయే.."
"పిప్పిప్పిప్పీ..డం డం..డమడం.. పీ పీ.."

* * *

"నాలుక్కమ్లాల్ పద్రూపాల్.. నాలుక్కమ్లాల్ పద్రూపాల్.."
"అమ్లాపురం.. అమ్లాపురం.."
"రాజిమండ్రి బస్సెప్పుడొత్తాది బాబా...."
"పెల్లి మూర్తాల్రా బాబు.. ఒక్కబస్సా కాలీ లేదు..."
"పెబువు సల్లగా సూత్తాడయ్యా.. దరమం సెయ్యండి బాబా.."
"ఆటో ఒద్దుగానొరే.. బస్సే ఎక్కుదారి.."
"మొత్తానికి సత్తిగాడికి సమ్మందం బానే కుదిర్సేసేర్రా..."
"ఇయ్యాల్టి మాటేట్రా బాబా.. ఏడాది నించీ పెయిత్నం.. ఎకరం ఊడుపుసేనూ, ఏబయ్యేలు రొక్కానికి కాయం సేసేం.. పిల్లకి తల్లి బంగారంలో ఓటా ఒత్తాదనుకో..."
"ఎకరం ఊడుపు సేనంటే పదిలచ్చలు పైమాటే?"
"యే.. మనోడు నెలకి పదేలు తెచ్చుకోట్లేదేటి? అమ్మాబాబుకీ ఒక్కడే.. ఆత్తంతా ఈడిదే కదేటి.. సవకబేరం కిందే లెక్క..."
"పిల్ల మాంచి రంగే కామాల..ప్లెక్సీ లో పోటో సూసేను.."
"సేమన సాయ.. ప్లెక్సీల్దేవుందిలెహే.. మనంజమ్మ కూతురు ఆదిలచ్మిని కూడా ఐస్వరియా రాయిలాగా సూపింతారు..."
"పోనేహే.. ఆడపిల్లల్లేరని గోలెట్టేత్తన్నారు కదా .. ఏదోపిల్ల దొరికింది సాలు..."
"లేకెక్కడికి పోతారెహే.. కాపోతే ఆల్ల కోరికలకి అంతూ దరీ నేదనుకో..."
"నాలుక్కమ్లాల్ పద్రూపాల్.. నాలుక్కమ్లాల్ పద్రూపాల్.."
"రాజిమండ్రి బస్సెప్పుడొత్తాది బాబా...."

20 కామెంట్‌లు:

  1. ఓలమ్మోలమ్మోలమ్మో! మా రాజమండ్రీకి మీరందరూ ఒచ్చి ఏటి సేత్తారేటి? లగెత్తుకొచ్చేసినారు?

    రిప్లయితొలగించండి
  2. పెళ్ళికి ఏ ఊరు వెళ్లి వచ్చారండి?:)

    రిప్లయితొలగించండి
  3. నా పక్కనెవరో కూర్చొని మాట్లాడుకుంటున్నట్టే ఉంది.

    ముఖ్యంగా ఒలె బుల్లే... చదవగానే అసంకల్పితంగా విచ్చుకున్నాయి పెదవులు.

    చాలా చాలా బాగుంది.

    కానీ.. సమయం, సందర్భం, ఎవర్ని, ఎక్కడ, ఏమీ చెప్పకుండా ఈ పోస్టేంటండీ...? ఒకవేళ మా బుర్రలకి పరీక్షలేమన్నా పెడుతున్నారా...!!

    రిప్లయితొలగించండి
  4. నెవలికన్ను బాబా ఏటయి పోనాద౦డీ. తవరేటేటో మాటాడేత్తన్నారు. మనసులో మాట సెప్పీసుకోవాల. ఆయ్..బాగుల్లో బావుని జూసుకోనేదని ఆనక మామీదడి పోగల్రు..బగమంతుడున్నాడు బాబా..ఉప్పుడా ఊసు ఒగ్గీండి. మీ బాస జూసి ఉండబట్లేక రాసేసినా బాబా..యామనుబాక౦డా..దండాలు

    రిప్లయితొలగించండి
  5. చూడు చూడు తమాషా....తర్వాతే వస్తారనుకున్నాను:)

    రిప్లయితొలగించండి
  6. eamayyaru?ekkaDaamjaadae laedu? pelhlhiki mee oorelhlhivachchaaraa?

    రిప్లయితొలగించండి
  7. తెలుగు నిక్షేపం లాగా ఉందండి.ఇల్లాగే ఇంకో పdi కాలాల పాటు ఉంటుంది. నాకు అనుమానం లేదు. మధ్యలో ఫ్లెక్సీలు గట్రా వచ్చాయా. ఆ మాత్రం ఫరవా లేదు.

    ఇంతకీ ఎక్కడికెళ్లారు స్వామి మీరు. మిఠాయుండలు సున్నుండలు అక్కడే అవగొట్టేశారా మా కేమైనా తెచ్చారా?

    రిప్లయితొలగించండి
  8. :)
    భలే రాసారు. 'ఒలే బుల్లే..' మాట చదవుతుంటే ఎంత వినసొంపుగా ఉందో!..

    రిప్లయితొలగించండి
  9. నేను మీరు పోస్టేసిన వెంటనే చదివేసాను ఇది(దుర్మార్గం ఏంటంటే నేను కామెంటలేదు అంతే)కానీ కామేంటేమని రాయాలో అర్ధం కాలేదు నాకు ఒక్కసారి,మళ్ళీ మనూళ్ళోనూ బస్ స్టాండ్ దగ్గరా నిలబెట్టేసారు నన్ను అంతే.

    రిప్లయితొలగించండి
  10. యాస ను కసా బిసా వాడేసి చాలా మంచి టపా రాసేసారండి మురళి గారు... సూపరో సూపరు

    రిప్లయితొలగించండి
  11. ఏం చెప్పమంటారు!! పప్పు శ్రీనివాస్ గారు చేసిన దుర్మార్గమే నేనూ చేసాననీ, మురారి గారికి నచ్చినదే నాకు నచ్చిందనీ, బులుసు సుబ్రహ్మణ్యం గారు అనుకున్నట్టే నేనూ అనుకున్నాననీ..

    మీ నుంచి ఇంకా ఎక్కువ రాబట్టే పధ్ధతి ఏదైనా తెలిస్తే బాగుండును. మాండలీకం మీద పట్టున్న వారూ, పదాలను మహ పొదుపుగా వాడే వారూ,ఓ చిన్న టపాలో బోలెడు విషయాలూ, కోణాలూ అలవోకగా చొప్పించగల నేర్పున్న వారూ, ఊరినీ, అక్కడి మనుషుల ఆప్యాయతలనూ, అలవాట్లనూ ప్రేమించే వారూ మాత్రమే ఇలాంటి టపా రాయగలరు.

    "రాజిమండ్రి.." :) One of your best posts!!

    రిప్లయితొలగించండి
  12. "నాలుక్కమ్లాల్ పద్రూపాల్.. నాలుక్కమ్లాల్ పద్రూపాల్.."">>
    ఏం బాబా ..తేగల కట్టా, తంపటేడుసెనక్కాయల బుట్టా ఆపళ్ళేదేటండీ తవరికి :))
    పత్రికలవాళ్ళు ముందే షరతు పెడుతున్నారండీ . సంబాషణల పరంగా కొద్దో గొప్పో పర్వాలేదుకానీ, పూర్తి మాండలీకంలో రచనలు ఉండకూడదని . కారణం ఏవిటంటే పత్రికలు అన్ని ప్రాంతాలవాళ్ళూ చదువుతారుకదా మరి వాళ్ళందరికీ చవదటం కష్టం కదా అని వారి అభిప్రాయం .
    నేను దీనితో అస్సలు ఏకీభవించను . వంశీ చెపినట్టూ , ఈ కాలం లో అంతా మాడ్రన్ అయిపోయేరు . భాష యాస అంతా మారిపోయింది. ప్రాంతీయ యాస తెలిసినవారు దానిని ఇంకా తమ జ్ఞాపకాల్లో నిక్షిప్తం చేసుకుని అపురూపంగా దాచుకున్నవారు అరుదుగా వున్నారు. అటువంటి యాసలో కథలు, రచనలు విరివిగా వస్తే , బ్రతుకు తెరువుకోసం ఎక్కెడెక్కడో స్తిరపడిపోయినవారు తమ ప్రాంతపు యాసను భాషను చదువుకునయినా తృప్తిపడతారుకదా ! ఈ కోణంలో పత్రికలవాళ్ళు ఎందుకు ఆలోచించరు ?
    మాండలీకలో రచనలు చేస్తూ తమ యాసను బ్రతికించుకోవటంలో రాయలసీమవారు అందరికన్నా ముందున్నారని నా అభిప్రాయం మీరేవంటారు . ( నాతో పోట్లాడటానికి బజ్ లేదుకదా :)) )

    రిప్లయితొలగించండి
  13. ఇంక నానేటి రాసేది బాబయ్యా:):)

    రిప్లయితొలగించండి
  14. @రసజ్ఞ: అయ్ బాబో.. తవరిది కూడా రాజిమండ్రేనేటండీ? పెల్లికి పిలిత్తేనీ, ఎల్లోచ్చేనండి.. ఆయ్.. :-) ధన్యవాదాలండీ..
    @శ్రావ్య వట్టికూటి: మా ఊరండీ :-) :-) ధన్యవాదాలు.
    @గీతిక. బి: ఏమీ లేదండీ.. ఓ పెళ్లికి వెళ్లోచ్చి రాశాను.. అంతే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @జ్యోతిర్మయి: అయ్ బాబా.. దండాలండే :-)
    @శిశిర: అవునండీ, వెళ్లి వచ్చాను :-) ధన్యవాదాలు.
    @జయ: చూడలేక పోయానండీ తమాషా.. ప్చ్.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @సునీత: అవునండీ.. ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం: అలా ఇంటికి తెచ్చుకోనివ్వరండీ.. పెట్టినవి అక్కడే తినేసి రావాలి :-) ...భాష విషయంలో మీతో కొంత వరకూ ఏకీభవిస్తున్నా.. ఇప్పటి జెనరేషన్ మీద టీవీల ప్రభావం బాగానే కనిపిస్తోంది మరి.. ధన్యవాదాలు.
    @మురారి: వినగానే నాకూ భలే నచ్చేసిందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @శ్రీనివాస్ పప్పు: అయ్ బాబోయ్.. :) ధన్యవాదాలండీ..
    @వేణూ శ్రీకాంత్: !!! ..ధన్యవాదాలండీ..
    @చైతన్య దీపిక: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  18. @కొత్తావకాయ: అయ్యబాబోయ్.. అదేమీలేదండీ.. విన్నవి విన్నట్టు రాశానంతే.. ధన్యవాదాలు.
    @లలిత: బలమైన గొంతున్న కథకులు అక్కడినుంచి రావడం, వారంతా మాండలీకం లోనే రాయడం వల్ల అయి ఉండొచ్చు కదండీ.. పత్రికల షరతు అర్ధం లేనిదిగా అనిపిస్తోందండీ నాకు. చదివితే కదా అర్ధమయ్యేది.. చదివి అర్ధం చేసుకోలేని వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు?? ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన పదాలు వాడేటప్పుడు ఎలాగూ బ్రాకెట్లోనో, ఫుట్ నోట్స్ లోనో అర్ధాలు ఇస్తారు కదా.. ఇది నా అభిప్రాయం.. ...ధన్యవాదాలండీ..
    @పద్మార్పిత: :-) :-) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి