మంగళవారం, నవంబర్ 22, 2011

శ్రీ'బాపు'రాజ్యం

'జగదానంద కారకా.. జయ జానకీ ప్రాణ నాయకా.. శుభ స్వాగతం..' పాట చెవుల్లో మారుమోగుతోంది. అణువణువునా భారీతనం ఉట్టిపడే అందమైన వర్ణ చిత్రాలు కన్ను మూసినా, తెరిచినా కట్టెదుట ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. నార చీరెలు ధరించిన నయనతార సీత రూపంలో పదే పదే గుర్తుకొస్తోంది. మూడుగంటల పాటు ఏకాగ్రచిత్తంతో 'శ్రీరామరాజ్యం' సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చాక నా పరిస్థితి ఇది.

చాలామంది లాగానే నేను కూడా ఈ సినిమాని గురించి ఎలాంటి అంచనాలూ పెట్టుకోలేదు. ఎందుకంటే, రౌద్ర రసాభినయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న బాలకృష్ణ శ్రీరాముడుగా, నయనతారగా మారిన డయానా మరియం కురియన్ సీతా మహాసాధ్విగానూ కనిపించబోతూ, 'రాధాగోపాళం' 'సుందరకాండ' అనే రెండు నిరాశాపూరిత సినిమాల తర్వాత బాపూ-రమణలు తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు అవ్వడం వల్ల కావొచ్చు నేనీ సినిమా కోసం ఎదురు చూడలేదు. కానైతే విడుదలైన తొలిరోజున వినిపించిన 'హిట్' టాక్ విని మాత్రం చాలా సంతోష పడ్డాను.

అందరికీ తెలిసిన కథే అయినా చెప్పిన విధానం బాగుంది. మూడు గంటల సినిమాలో 'తరువాతి సన్నివేశం ఏమిటో' అనే కుతూహలం ఎక్కడా కలగకపోయినా, 'ఆ రాబోయే సన్నివేశం ఏవిధంగా తెరమీద కనిపిస్తుందో' అన్న ఆసక్తి ఏమాత్రమూ సడలలేదు. బహుశా, ఇదే ఈ సినిమా విజయ రహస్యం కావొచ్చు. అలనాటి 'లవకుశ' అడుగడుగునా గుర్తొస్తూనే ఉంది. గుర్తు రాకుండా చేయాలనే ప్రయత్నం ఏమాత్రమూ చేయకపోవడం బాగా నచ్చింది.

రావణ సంహారం పూర్తిచేసి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహితుడై అయోధ్యకి తిరిగి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడు కావడంతో సినిమా మొదలై, కుశలవుల పట్టాభిషేకంతో సమాప్తమయ్యింది. నిర్మాణ వ్యయానికి వెరవకుండా (సుమారు ఇరవై ఏడు కోట్లని వినికిడి) అత్యంత భారీగా నిర్మించిన ఈ సినిమాలో ఆ భారీ తనం ప్రతి ఫ్రేములోనూ కనిపించింది. సెట్టింగుల మొదలు, గ్రాఫిక్స్ వరకూ అన్నీ కథలో దాదాపుగా ఇమిడిపోయాయి.

దర్శక రచయితలు బాపూ-రమణలకి శ్రీరాముడి మీద ఉన్న భక్తి, ప్రేమల గురించి ఇవాళ కొత్తగా చెప్పుకోనక్కరలేదు. ఆ భక్తీ, ప్రేమా సినిమా అంతటా కనిపించాయి. సన్నివేశాల కూర్పు మొదలు, సంభాషణల వరకూ ఎక్కడా - సాధారణంగా బాపూ రమణల సినిమాల్లో ఎక్కడో అక్కడ కనిపించే - నాటకీయత లేదా 'అతి' కనిపించలేదు. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు మనసుని తాకిన ఆర్ధ్రత కళ్ళని పలకరించింది.

చిత్రీకరణలో బాపూ మార్కు ఆసాంతమూ కనిపించిన ఈ సినిమాలో నటీనటుల ప్రస్తావన వచ్చినప్పుడు మొదట చెప్పాల్సింది నయనతార గురించే. ఈమెని వెండితెర మీద చూడడం ఇదే మొదటిసారి నాకు. 'అంజలీదేవి, జయప్రదా మెప్పించిన సీత పాత్రలో నయనతార?' అన్న భావన సినిమా చూడని క్రితం వరకూ గుచ్చిన మాట నిజమే కానీ, చూసిన తర్వాత మటుమాయమయ్యింది. సీత పాత్రని మలిచిన తీరుని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆమె ఆత్మాభిమానాన్ని చిత్రించిన తీరు గుర్తుండి పోతుంది.

శ్రీరాముడి పాత్రని పూర్తి స్థాయిలో మెప్పించడానికి బాలకృష్ణకి వయసు సహకరించలేదన్న వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, ఈ సినిమాలో రాముడు కళ్యాణ రాముడు కాదు. పట్టాభిషిక్తుడైన చక్రవర్తి. ఊహించినంత ఇబ్బంది ఎదురవ్వలేదు కానీ, శరీరాకృతిని తగుమాత్రంగా మార్చుకుని ఉంటే పాత్రకి నిండుదనం వచ్చేది కదా అనిపించింది. నటనతో పాటు సంభాషణలు పలికిన తీరు కూడా ప్రత్యేకంగా అనిపించింది. 'లవకుశ' ని చాలాసార్లే గుర్తు చేసింది.

మరో ముఖ్యమైన, కథకి మూలస్థంభమైన పాత్ర వాల్మీకి. అక్కినేని పోషించిన ఈ పాత్రలో సాత్వికత కనిపించలేదు ఎందుకో. దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ వాల్మీకి ప్రశాంతంగా కాక అసహనంగానే కనిపించాడు. సంభాషణలు పలికిన తీరూ అలాగే ఉంది. కుశలవుల నుంచి కూడా నేను కొంచం ఎక్కువే ఆశించినట్టు ఉన్నాను. అయితే, లక్ష్మణుడిగా శ్రీకాంత్ మెప్పించాడు. కే.ఆర్. విజయ మొదలు రోజా వరకూ ఎందరూ నటులు సహాయ పాత్రల్లో మెరిశారు.


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, గ్రాఫిక్స్ ని బాపూ ఉపయోగించుకున్న తీరు అబ్బుర పరిచింది. మహళ్ళూ, రాచ వీధులే కాదు అడవులూ, పశు పక్ష్యాదులని సైతం గ్రాఫిక్స్ లో సృష్టించారు. అయితే ఎక్కడా కూడా ఈ గ్రాఫిక్స్ నటీనటుల్ని తోసిరాజనకపోవడం వెనుక ఉన్నది మాత్రం దర్శకుడి కృషే. చాలా వరకూ కంటికింపు గానే ఉన్నప్పటికీ, అక్కడక్కడా ఈ రంగుల కలగలపు కళ్ళని కూసింత ఇబ్బంది పెట్టింది.

నేను మరికొంచం ఎక్కువ ఆశించిన మరో విభాగం సంగీతం. బాలేదని అనలేను కానీ, మరింత బాగుండ వచ్చు అనిపించిందని చెప్పకుండా ఉండలేను. ఒక్క పద్యమూ లేకపోవడం నిరాశ పరిచింది. మరీ సమాస పూరితాలు కాకపోయినా, సంభాషణల్లాగే సరళమైన పదాల కూర్పుతో కాసిన్ని పద్యాలు ఉంటే నిండుదనం వచ్చేది అనిపించింది.

మొత్తంగా చూసినప్పుడు మాత్రం మెచ్చి తీరాల్సిన ప్రయత్నం. తెలుగు సినిమా దారీ తెన్నూ తెలియకుండా సాగుతున్న తరుణంలో రాముడి కథని ఎంచుకుని, కన్నుల పండువైన సినిమాని అందించిన నిర్మాత యలమంచిలి సాయిబాబుని ప్రత్యేకంగా అభినందించాలి. చెప్పాల్సిన విధంగా చెబితే ఎంత పాత కథతో సినిమా తీసినా జనం ఆదరిస్తారని మరోమారు నిరూపించిన సినిమా 'శ్రీరామరాజ్యం.' థియేటర్లో మరోసారన్నా చూడాలి

సోమవారం, నవంబర్ 14, 2011

పదనిసలు...

"పిప్పిప్పిప్పీ..డం డం..డమడం.. పీ పీ.."
"రాయిండ్రాయిండి... బార్యాగారూ అందరూ బాగున్నారా? ఒలె బుల్లే..సిన్నాన్ననోపాలి రమ్మను...బేగా..."
"ఆయ్.. పెల్లికొచ్చేరా? ఎంతైనా మీవోడింటో పెల్లి కదా.. రాకుండుంటారా?"
"ఆడెక్కడో పన్లో ఉన్నాడు బాబా.. ఒచ్చేత్తాడు.. ఈలోగల మీరు కూతంత పలారం పుచ్చుకోవాల.. ఒలె బుల్లే.. నాలుగు మిటాయుండ్లూ, సున్నుండ్లూ, కూతంత కారబ్బూందీ అట్టుకురాయే.. ఆసేత్తోనే ఆ మూల గెదిలో సెక్కరకేలి అంటిపల్లున్నాయి సూడు.. ఓ నాలుగట్రా.. ఇక్కడున్నట్టు రావాలొలే..."
"యాండిబాబా.. ఇదేనా రాటం.. నల్లపూసైపోయేరు.."
"అయ్ బాబా.. కూతంతేనండే పలారం.. తీసెయ్ కండే.. ...బుల్లే.. మంచినీల్లేయే.. పెత్తేకం సెప్పాలి కావోసు.. బేగట్టుకురా"
".........."
"ఆయ్.. ఈ పెల్లైపోతే బాబా.. మావోడు ఒడ్డెక్కేసినట్టే.. మీయందరి దయానండి.. పైన బగమంతుడున్నాడు..."
"యాండిబాబా.. ఇదేనా రాటం అంటే నవ్వేసూరుకుంటారు. మాం గురుతునేవేటండి? ..... ఉప్పుడూ, ముక్కిమంత్రీ, సెంద్రబాబూ కొల్లూటై పోయేరని సాచ్చోడు సెప్తున్నాడు. నిజవేనంటారా?"
"ఎహే.. ఉప్పుడా గొడవెందుకు? సెంద్రబాబు ఇయ్యాలో రేపో ముచ్చమంత్రై పోతాడని ఈనాడోడు ఏడు సమ్మచ్చారాల్నుంచి సెప్తానే ఉన్నాడు.. అయ్యేడేటి? ...ఈ రాసికీయం కాదు కానండే.. తెలంగాన ఏటవ్వుద్ది? మీకాడేవనుకుంటన్నారు, సెప్పండి ముందు?"
"ఏటైతే మనకేటేహే"
"నువ్వాగరొరే... ఈ గొడవొచ్చినకాన్నించీ ఐద్రాబాదులో తిర పడిపోయినోల్లంతా వొచ్చి మనకాడ బూవులు బేరం సేత్తన్నారా లేదా? మరి మనకేటంటావేటి.. బుద్ది గీని లేదేటి?"
"ఆర్ని పలారం పుచ్చుకోనివ్వండ్రా బాబా... తవరు కూతంత కాపీ కూడా పుచ్చుకోవాల.. ఒలె బుల్లే....."
"ఏటండీ? తీరామోసి మూర్తానికుండ్రా... ఇదేటండిలాగ సేస్సేరు?"
"ఆరుజ్జోగం.. ఆరి గొడవలూ ఆరియ్యిరా.. ఒచ్చేరా నేదా.. నాలుగచ్చింతలేసేరా నేదా..బాబా... ఒచ్చేరు సంతోసం.. తవరింట్లో పప్పన్నానికి పిలాల మమ్మల్ని.. ఇక్కడెట్టుకుంటారో, ఎట్టుకోరో.."
"ఆరీ ఊరొదల్రు లేయే.."
"పిప్పిప్పిప్పీ..డం డం..డమడం.. పీ పీ.."

* * *

"నాలుక్కమ్లాల్ పద్రూపాల్.. నాలుక్కమ్లాల్ పద్రూపాల్.."
"అమ్లాపురం.. అమ్లాపురం.."
"రాజిమండ్రి బస్సెప్పుడొత్తాది బాబా...."
"పెల్లి మూర్తాల్రా బాబు.. ఒక్కబస్సా కాలీ లేదు..."
"పెబువు సల్లగా సూత్తాడయ్యా.. దరమం సెయ్యండి బాబా.."
"ఆటో ఒద్దుగానొరే.. బస్సే ఎక్కుదారి.."
"మొత్తానికి సత్తిగాడికి సమ్మందం బానే కుదిర్సేసేర్రా..."
"ఇయ్యాల్టి మాటేట్రా బాబా.. ఏడాది నించీ పెయిత్నం.. ఎకరం ఊడుపుసేనూ, ఏబయ్యేలు రొక్కానికి కాయం సేసేం.. పిల్లకి తల్లి బంగారంలో ఓటా ఒత్తాదనుకో..."
"ఎకరం ఊడుపు సేనంటే పదిలచ్చలు పైమాటే?"
"యే.. మనోడు నెలకి పదేలు తెచ్చుకోట్లేదేటి? అమ్మాబాబుకీ ఒక్కడే.. ఆత్తంతా ఈడిదే కదేటి.. సవకబేరం కిందే లెక్క..."
"పిల్ల మాంచి రంగే కామాల..ప్లెక్సీ లో పోటో సూసేను.."
"సేమన సాయ.. ప్లెక్సీల్దేవుందిలెహే.. మనంజమ్మ కూతురు ఆదిలచ్మిని కూడా ఐస్వరియా రాయిలాగా సూపింతారు..."
"పోనేహే.. ఆడపిల్లల్లేరని గోలెట్టేత్తన్నారు కదా .. ఏదోపిల్ల దొరికింది సాలు..."
"లేకెక్కడికి పోతారెహే.. కాపోతే ఆల్ల కోరికలకి అంతూ దరీ నేదనుకో..."
"నాలుక్కమ్లాల్ పద్రూపాల్.. నాలుక్కమ్లాల్ పద్రూపాల్.."
"రాజిమండ్రి బస్సెప్పుడొత్తాది బాబా...."

సోమవారం, నవంబర్ 07, 2011

హేమపాత్ర-అశోకవర్దనుడు

తెలుగు సాహిత్యంలో 'విశాలనేత్రాలు' వంటి నిరుపమాన నవలల సృష్టికర్త పిలకా గణపతి శాస్త్రి రాసిన నవలికల జంట 'హేమపాత్ర' 'అశోకవర్ధనుడు.' వీటిలో మొదటి నవలిక కథా స్థలం దక్షిణ భారతదేశమైతే, రెండోది ఉత్తరభారత దేశంలో జరిగిన కథ. రెండూ కూడా అందరికీ తెలిసిన కథలే. అయినప్పటికీ ఆసాంతమూ చదివించేది పిలకా వారి శైలి. కథా స్థలంలో పాటుగా పాత్రల స్వభావాలనీ కళ్ళకి కట్టే వర్ణనా వైచిత్రి కారణంగా, కథ కేవలం చదువుతున్నట్టుగా కాక కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.

'హేమపాత్ర' విప్రనారాయణుడి కథ. శ్రీరంగశాయి మీద భక్తితో సర్వ సుఖాలనీ త్యజించి, చిన్ననాడే ఇల్లు విడిచి శ్రీరంగం చేరిన నారాయణ దేవర కథ. లక్ష్మీదేవి, నారాయణావధాని దంపతులకి లేక లేక కలిగిన ఏకైక సంతానం దేవర. అతడు బాల్యం వీడి యవ్వనంలోకి ప్రవేశించగానే వివాహ ప్రయత్నాలు ఆరంభిస్తారు తల్లిదండ్రులు. అయితే దేవర ధోరణి వేరు. పరంపరాగతంగా వచ్చిన స్వామిపూజలో అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించే దేవర, శ్రీరంగేశుని సేవలో జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంటాడు.

పెళ్ళి చేసుకోమని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో, ఇల్లు విడిచి శ్రీరంగం చేరుకొని అనునిత్యం శాయికి పూలమాలలు సమర్పించడం ఆరంభిస్తాడు. పూవుల నిమిత్తం ఓ పూలతోటని దానితో పాటుగా ఓ కుటీరాన్ని నిర్మించుకుంటాడు. ప్రశాంతంగా సాగిపోతున్న నారాయణ దేవర జీవితంలో తలవని తలంపుగా ప్రవేశిస్తుంది యవ్వనవతి నీలవేణి. గణిక వృత్తి పట్ల విరక్తి చెంది, స్వామి సేవకి జీవితాన్ని అంకితం చేయ నిశ్చయించుకుని ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చానని నమ్మబలుకుతుంది. ఆశ్రయం ఇచ్చిన దేవరని లోబరుచుకుంటుంది.

నీలవేణి (అసలు పేరు దేవదేవి)ని విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాక గాని దేవరకి తెలియదు, తను ఎంతటి ఉచ్చులో చిక్కుకున్నాడో. సాక్షాత్తూ శ్రీరంగ శాయే దేవరకి సాయపడేందుకు రావడంతో కథ ముగింపుకి వస్తుంది. శ్రీరంగం నేపధ్యంగా సాగడం వల్ల, 'విశాల నేత్రాలు' పదే పదే జ్ఞాపకం వచ్చింది. అంతేనా? 'విప్రనారాయణ' కోసం భానుమతి పాడిన 'ఎందుకోయీ.. తోటమాలీ.. అంతులేనీ యాతనా..' పాట చెవుల్లో గింగురుమంటూనే ఉంది. గణికల స్వభావంతో పాటు, ఆనాటి పాలనా వ్యవస్థనీ సునిశితంగా చిత్రించారు రచయిత.

పాటలీపుత్ర పాలకుడు అశోకుడి కథ 'అశోకవర్ధనుడు.' అసలు అశోకుడు అనగానే మొదట గుర్తొచ్చే వాక్యం 'అశోకుడు చెట్లు నాటించెను.' అతగాడు నాటించిన మొక్కలు పెరిగి చెట్లయ్యాయి కానీ మనం మాత్రం చెట్లు నాటించెను అనే అంటాం! కళింగ యుద్ధం అనంతరం, అశోకుడు యుద్ధాల పట్ల విముఖుడై, బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడని చెబుతారు చరిత్రకారులు. ఆ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, అప్పటి అశోకుడి మనఃస్థితి
లాంటి విషయాలని విపులంగా విశదీకరించిన నవలిక 'అశోక వర్ధనుడు.'

మహానది ఒడ్డున ఉన్న తోసలీనగరం ఓ చిన్న సామంత రాజ్యం. ఆ రాజ్య పాలకుడు మహేంద్ర కేసరి పెద్ద కుమార్తె నాగావళి. మహేంద్ర కేసరికి కళింగ రాజ్యపు రాజు కళింగ మల్లుడు పక్కలో బల్లెం. ఎప్పుడెప్పుడు తోసలిని ఆక్రమిద్దామా అని ఎదురు చూసే కళింగ మల్లుడికి అశోకుడి దండయాత్ర పెద్ద అవకాశంగా కనిపిస్తుంది. చిన్న చిన్న సామంత రాజ్యాలన్నీ కలిసి అశోకుడిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని వేగులు పంపుతూనే, మహేంద్ర కేసరి కి నాగావళిని తను వివాహం చేసుకుంటానంటూ రాయబారం పంపుతాడు.

వృద్ధుడైన కళింగ మల్లుడికి నాగావళిని ఇచ్చి వివాహం చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు మహేంద్ర కేసరికి. అంతకన్నా, అశోక చక్రవర్తి సహాయం ఆర్ధించి అతడికే నాగావళిని ఇచ్చి వివాహం చేయడం ఉత్తమం అన్న అభిప్రాయంలో ఉంటాడు. తనపై యుద్ధం ప్రకటించిన కళింగ మల్లుడిని ఎదుర్కొనేందుకు అశోకుడి సాయం కోరతాడు. వివాహ ప్రతిపాదననీ చక్రవర్తి ముందు ఉంచుతాడు. అశోకుడిపట్ల ఇష్టం పెంచుకున్న నాగావళి, కేవలం తన కారణంగా రాజ్యంలో ప్రజలందరూ కళింగ మల్లుడి వల్ల బాధలు పడడం భరించలేని ఆ యువతి మల్లుడిని వివాహం చేసుకోడానికి అంగీకారం తెలుపుతుంది.

అయితే కూతురి ప్రతిపాదనని ఏమాత్రం అంగీకరించడు మహేంద్ర కేసరి. అటు కళింగ బలగాలకీ, ఇటు పాటలీ పుత్ర సైన్యాలకీ మధ్య భీభత్సమైన యుద్ధం జరగడంతో కథ ముగింపుకి వస్తుంది. యుద్ధ తంత్రాన్ని అత్యంత శ్రద్ధగా చిత్రించారు రచయిత. అలాగే అశోకుడికి బౌద్ధం పట్ల సానుకూల ధోరణి ఏర్పడడానికీ, యుద్ధాల పట్ల విరక్తి ఏర్పడడానికీ దారితీసిన పరిస్థితులని క్లుప్తంగా చెప్పారు. చరిత్ర మీద మక్కువ ఉన్నవాళ్ళు తప్పక చదవాల్సిన రచన. రెండు నవలికలనీ ఒకే సంకలనంగా తీసుకొచ్చింది ఎమెస్కో. పేజీలు 168, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఏవీకెఎఫ్ లోనూ లభ్యం.

మంగళవారం, నవంబర్ 01, 2011

ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం

చాన్నాళ్ళ తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పుస్తకం చదివాను. అది కూడా పుస్తకం మార్కెట్లోకి విడుదలైన మూడేళ్ళ తర్వాత. 'అంతర్ముఖం' తర్వాత యండమూరి పుస్తకాలేవీ చదవలేదు నేను. తను కూడా నవలలకి స్వస్తి చెప్పి విజయానికి మెట్లు కట్టే పనిలో బిజీ అవ్వడం, ఆ మెట్ల మీద నాకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో తనతో బాగా గ్యాప్ వచ్చేసింది. విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథ 'ఇడ్లి, ఆర్కిడ్ అండ్ విల్ పవర్' కి యండమూరి స్వేచ్ఛానువాదం 'ఇడ్లి-వడ- ఆకాశం' పేరుతో విడుదలయ్యింది. మలి ముద్రణలో అదే పుస్తకం పేరుని 'ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం' గా మార్చారు, కామత్ కట్టిన ప్రముఖ ఐదు నక్షత్రాల హోటల్ 'ఆర్కిడ్' పేరు కలిసొచ్చేలాగా.

మహానగరాల్లో ఉండేవాళ్ళకి మాత్రమే కాదు, చుట్టం చూపుగా ఆ నగరాలని చూసొచ్చిన వాళ్లకి కూడా కామత్ హోటళ్ళని ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. పొగలు కక్కే ఇడ్డెన్లు, క్రిస్పీగా కనిపించే దోశలు, వీటితో పాటు కేవలం వాసన తోనే నోరూరించే సాంబార్ ఈ దక్షిణాది ఫలహార శాలల ప్రత్యేకత. ఈ హోటళ్ళని నిర్వహించేది కర్ణాటక లోని కార్వార్ ప్రాంతానికి చెందిన కామత్ కుటుంబం వారు. 'ఇడ్లీ-వడ-సాంబార్' అన్నది వీళ్ళ ముద్దుపేరు. రుచికరమైన ఫలహారాలని తాజాగానూ, అందరికీ అందుబాటు ధరల్లోనూ అందించడం కామత్ హోటళ్ళ విజయ రహస్యం. అలాంటి కామత్ కుటుంబంలో, ఆరుగురు పిల్లల తండ్రి వెంకటేష్ కామత్ రెండో కొడుకు విఠల్ వెంకటేష్ కామత్.

తండ్రి చిన్న చిన్న హోటళ్ళని నిర్వహించడాన్ని చూస్తూ పెరిగిన విఠల్ ఏనాడూ కూడా హోటల్ రంగంలో అడుగుపెట్టాలని అనుకోలేదు. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేశాక అనుకోకుండా హోటల్ రంగంలోకి వచ్చి దానినే వృత్తిగా స్వీకరించాల్సి వచ్చింది. పెరిగిన వాతావరణం కారణంగా, హోటల్ నిర్వహణ కోసం ప్రత్యేకించి ఎలాంటి శిక్షణా తీసుకోవాల్సిన అవసరం రాలేదు అతనికి. నిజానికి, పెరిగిన వాతావరణం ఒక వ్యక్తి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనడానికి విఠల్ జీవితం ఓ మంచి ఉదాహరణ. హిట్లర్ లాంటి తండ్రి, ప్రేమించే తల్లి, వీటిని మించి తమలో కలుపుకున్న ఇరుగూ-పొరుగూ, శ్రద్ధగా చదువు చెప్పిన గురువులు వీళ్ళంతా తన వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేసిందీ ప్రారంభ అధ్యాయాల్లో విపులంగా చెప్పారు విఠల్. వీళ్ళందరి సాహచర్యం అతనిలో కష్టపడే తత్వాన్నీ, నేర్చుకోవాలనే ఆసక్తినీ పెంచింది.

వ్యాపారంలో ప్రవేశించాక, విదేశాలు తిరిగి వృత్తికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు విఠల్ తన తండ్రిని అడిగింది ఒక్కటే. "లండన్ కి టిక్కట్ కొనివ్వండి చాలు. అక్కడినుంచి నేను చూసుకుంటాను." అది అహంభావం కాదు, ఆత్మవిశ్వాసం. ఆ తండ్రికి కొడుకు మీద ఉన్న నమ్మకం ఎంతటిదంటే కేవలం ప్రయాణపు టిక్కట్ మాత్రమే కొనిచ్చాడాయన. భారతీయ భోజనశాలల్లో పనిచేస్తూ, కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు డబ్బునీ సంపాదిస్తూ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బొంబాయికి తిరిగి వచ్చాడు విఠల్. రాత్రికి రాత్రి ఓ సర్దార్జీకి లడ్డూలు చుట్టి ఇచ్చినా, విదేశీ టూరిస్టులకి పుచ్చకాయ ముక్కలూ, పానీయాలూ అందించినా వాటి వెనుక ఉన్న లక్ష్యాలు రెండే.. నేర్చుకోవడం, సంపాదించడం.

చేసే పనిని విపరీతంగా ప్రేమించే విఠల్ కేవలం పని రాక్షసుడు కాదు. ఓ మామూలు మనిషి. అందుకే హోటల్ పనితో విసుగు చెంది, ఓ మధ్యాహ్నం తండ్రికి అబద్ధం చెప్పి సినిమాకి వెళ్ళాడు. తన రెస్టారెంట్ కి క్రమం తప్పకుండా వచ్చే ఓ అందమైన అమ్మాయిని మనస్పూర్తిగా ప్రేమించాడు. ఆ ప్రేమని పైకి ప్రకటించక పోయినా ఆమెకి మంచే చేశాడు. తనకో జీవిత భాగస్వామిని వెతికే బాధ్యతని మాత్రం తల్లిదండ్రులకే అప్పగించాడు. వివాహానికి ముందే కాబోయే భాగస్వామి విద్యతో వృత్తిపట్ల తన కమిట్మెంట్నీ, తన షార్ట్ టెంపర్నీ ఏమాత్రం దాచకుండా చెప్పేశాడు. తన తల్లిలాగే భార్యదీ
కష్టపడే తత్వమనీ, నలుగురిలోనూ కలిసిపోయే స్వభావమనీ తొందరలోనే గ్రహించాడు.

తండ్రికి చెప్పకుండా బొంబాయి ఏర్పోర్ట్ సమీపంలో త్రీ స్టార్ హోటల్ కొన్నా, అత్యంత వ్యయప్రయాసలకోర్చి 'ఆర్కిడ్' ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నా అవన్నీ తన మీద తనకున్న నమ్మకంతోనే. త్రీ స్టార్ హోటల్ ఎంతగా విజయవంతం అయ్యిందో, ఫైవ్ స్టార్ హోటల్ అంతగానూ ఇబ్బందులు పెట్టింది. కుటుంబంలో చీలిక రావడం, విఠల్ వాటాకి అప్పుడే పునాదులు తీసిన ఆర్కిడ్ తో పాటు తలకి మించిన అప్పులు మాత్రమే రావడం బాగా కుంగదీసింది అతన్ని. డబ్బు ఉండడానికీ, లేకపోవడానికీ తేడా అతి కొద్ది రోజుల్లోనే అర్ధమైనా తన సహజ లక్షణమైన నిజాయితీని ఏనాడూ విడిచిపెట్టలేదు. ఈ కారణంగా మనుషుల మనస్తత్వాలని మరింత బాగా తెలుసుకోవడం సులువయ్యింది. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుని, అమలు పరిచే చివరి నిమిషంలో దానిని విరమించుకోవడం విఠల్ జీవితంలో ఓ పెద్ద మలుపు. నిజానికి పునర్జన్మ అనాలి.

కష్టాలు చుట్టుముట్టినప్పుడు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, భార్య అందించిన సహకారం ఇవన్నీ తన అదృష్టాలుగా చెప్పుకున్నారు విఠల్. తన తండ్రి హోటల్లో బల్లలు తుడిచే పనితో జీవితాన్ని మొదలు పెట్టిన బొంబాయి నగరంలో, ఆయనే చైర్మన్ గా నిర్మించిన ఆర్కిడ్ హోటల్ని ఆయనే చేతుల మీదుగానే ప్రారంభించాలన్న తన కలని, ఎన్నో కష్టనష్టాలకోర్చి విఠల్ నిజం చేసుకున్న క్షణాలని మనమూ మర్చిపోలేం. ఆద్యంతమూ ఆసక్తిగా చదివించిన కథనం. యండమూరి కేవలం మూల రచనని అనువదించి ఊరుకోకుండా తనదైన శైలిలో మార్పులూ, చేర్పులూ చేసినట్టుగా అనిపించింది. చివర్లో చదివిన ముందుమాటలో ఇదే మాట కనిపించింది. స్పూర్తివంతమైన రచన. (నవసాహితి ప్రచురణ, పేజీలు 176, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). ఈ పుస్తకాన్ని చదవమని సూచించిన బ్లాగ్మిత్రులందరికీ కృతజ్ఞతలు.