శుక్రవారం, అక్టోబర్ 07, 2011

రోటి పచ్చడి

మధ్యాహ్నం బడిలోనుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ డబ్బాలో అప్పచ్చులు చిన్న పళ్ళెంలో పెట్టి సిద్ధంగా ఉంచుతుంది కదా. కాళ్ళూ, చేతులూ, ముఖం కడిగేసుకుని, తల దువ్వించేసుకుని, ఆ అప్పచ్చుల పని పట్టగానే ఓ గ్లాసుడు పాలిచ్చేస్తుంది. అవి తాగేసి, బళ్ళో చెప్పిన పాఠాలు కాసేపు చదివేసుకుని, పలక మీద రాయాల్సిన పాఠం ఏవన్నా ఉంటే రాసేసి ఆ పలకని జాగ్రత్తగా ఓమూల పెట్టేస్తే చదువైపోయినట్టే. ఇంక ఆటలకి వెళ్లిపోవచ్చు.

రామాలయం దగ్గరో, కాంగ్రెస్ అరుగు దగ్గరో అప్పటికే ఫ్రెండ్సులంతా వచ్చేసి ఉంటారు కదా.. పంటలేసుకునే లోగా వెళ్ళామంటే సరే. లేకపొతే వాళ్ళ ఆట చూస్తూ కూర్చోవాలి. ఎలాగూ మళ్ళీ నాన్న ఇంటికి వచ్చేలోగానే తిరిగి వచ్చెయ్యాలి కాబట్టి ఎక్కువసేపు ఆడుకోడానికి ఉండదు. గూటీబిళ్లో, ఏడు పెంకులాటో అయితే కనీసం ఒక్క ఆటా అవ్వదు. గుడి మీద మైకులో పాట వినిపించిందంటే ఇంక ఇంటికి వెళ్ళాల్సిందే. అప్పటికి అమ్మ పెరట్లో రోటిదగ్గర ఉంటుంది.

మందార చెట్టుకింద ఉండే ఆ రోలు ఎంత పెద్దదంటే, కడగాలంటేనే ఓ బిందెడు నీళ్ళు పడతాయి. ఆ రోట్లో ముందర పిండి రుబ్బేసుకుని, సుబ్బరంగా కడిగేసి, తుడిచేసి అప్పుడు మొదలు పెడుతుంది అమ్మ పచ్చడి రుబ్బడం. ఎక్కువగా కొబ్బరి పచ్చడి.. తప్పితే కంది పచ్చడో, పెసర పచ్చడో.. ఇంకా ఒక్కోసారి వెలక్కాయ పచ్చడి, వంకాయ రోటి పచ్చడి లాంటివి కూడా చేస్తుందనుకో. కానీ ఒక్క కొబ్బరి పచ్చడినే ఒక్కోరోజు ఒక్కోలా చెయ్యగలదు, రోజూ తిన్నా విసుగు రాకుండా.

రోలుకి ఎదురుకుండా పీటేసుకుని కూర్చున్నామంటే అమ్మ పచ్చడి చెయ్యడం చూడొచ్చు. ఎందుకూ చూడడం? అంటే చూడ్డానికి బాగుంటుంది కాబట్టి. తుడిచిన రోట్లో, ఇంట్లోనుంచి తెచ్చుకున్న వేడి వేడి పోపు దింపి రోకలి బండతో కొంచం దంపి అందులో కొబ్బరి కోరు వేస్తుందా, ఇంకో రెండు దంపులు దంపగానే రుబ్బురోలు పొత్రం జాగ్రత్తగా రోట్లోకి దించుతుంది. మనమేమో రోలు మీద చేతులు వెయ్యకుండా చూడాలన్న మాట. వేస్తే ఇంకేమన్నా ఉందీ, పొత్రం కింద వేళ్ళు కానీ పడ్డాయంటే ఇంక పలక మీద ఏమీ రాయలేం.

ఓ చేత్తో పొత్రం తిప్పుతూ, రెండో చేత్తో పచ్చడి రోట్లోకి తోస్తో భలేగా రుబ్బేస్తుంది అమ్మ. పచ్చడి అన్నంలోకి అయితే ఒకలాగా, ఇడ్డెన్ల లోకి ఇంకోలాగా రుబ్బుతుందా..అదే ఏ గారెల్లోకో అయితే పచ్చడి వేరేగా ఉంటుంది. అసలు అమ్మ రుబ్బే పచ్చడి చూసి అది ఎందులోకో చెప్పేయొచ్చు. శనివారం సాయంత్రం అల్లప్పచ్చడి కానీ రుబ్బుతోందంటే ఆవేళ రాత్రికి ఉప్మా పెసరట్టని అర్ధం. పెసర పచ్చడి బోల్డు బోల్డు రుబ్బుతోందంటే పుణుకులేసి, పులుసెడుతుందని తెలిసిపోయేది. వంకాయ పచ్చడి రాచ్చిప్పలోకి తీస్తోందంటే ఉప్పుడుపిండి తినబోతున్నామని ఇంకెవరూ వేరే చెప్పక్కర్లా.

రోట్లో పిండి రుబ్బుతోన్నా, పచ్చడి రుబ్బుతోన్నా పొత్రం భలేగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఉన్నట్టుండి కర్ర బురుజు ఊడిపోతుందా.. దాంతో రుబ్బడం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఒక్కోసారి ఆ విసురుకి అమ్మ చెయ్యి రోటికి తగిలి ఒహటో రెండో గాజులు చెల్లిపోతాయి కూడాను. బురుజు ఊడిపోయినప్పుడు అమ్మకి మనం బోల్డంత సాయం చెయ్యొచ్చు. పొత్రం పైకి తీసి ఓ చేత్తో పట్టుకుని, రెండో చేత్తో బురుజు అమరుస్తుందా, మనమేమో రోకలి బండ తీసుకుని ఆ బురుజు మీద చిన్న చిన్న దెబ్బలు జాగ్రత్తగా వేశామంటే అదికాస్తా అమిరిపోతుంది. మనం ఏమరుపాటుగా గానీ ఉన్నామంటే మాత్రం ముందు అమ్మ చేతికి దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత మన వీప్పగులుతుంది.

పచ్చడి రుబ్బడం అవుతోందనగా, వంటింట్లోకి పరిగెత్తుకెళ్ళి ఉప్పు రాచ్చిప్పలోనుంచి ఓ గుప్పెడు ఉప్పు గానీ పట్టుకొచ్చామంటే అమ్మ ఎంత సంతోషిస్తుందో చెప్పలేను. ఆ ఉప్పుని రోలు మీద వేసి, అమ్మ పచ్చట్లోకి కావాల్సింది తీసుకున్నాక ఎక్కువ మిగిలితే మళ్ళీ రాచ్చిప్పలో వేసేయడం.. కాసిన్ని రాళ్ళే అయితే నోట్లో వేసేసుకోవడం. అదికూడా అమ్మకి పచ్చడి రుచి ఎలా ఉందో చెప్పాకే. రుచి కోసం పచ్చడి అరచేతిలో వేయించుకోకూడదు. గుప్పిడు బిగించి చేయి చాపితే మణికట్టుకీ వేళ్లకీ మధ్యలో కొంచం పచ్చడి వేస్తుంది అమ్మ. దాన్ని నాలుకతో అందుకుని ఒక్కసారి కళ్ళు మూసుకున్నామంటే రుచి చెప్పేయొచ్చు.

పచ్చడి రుబ్బేటప్పుడు ఊరికే పోచికోలు కబుర్లు కాకుండా (అంటే ఏవిటో తెలీదు.. అమ్మ అలాగే అనేది) రోజూ పద్యాలు నేర్పేది అమ్మ. 'కూజింతం రామ రామేతి...' తో మొదలు పెడితే ఎన్నెన్ని పద్యాలో. విడి పద్యాలు అవ్వగానే అష్టకాలు అందుకుంది. 'వసుదేవ సుతందేవం...' తో మొదలు పెట్టి కృష్ణాష్టకం ఓ వారం రోజులు, అదయ్యాక 'గంగాతరంగ రమణీయ జటా కలాపం...' అంటూ విశ్వనాథాష్టకం మరో వారం.. ఇలా సాగేది చదువు. పచ్చడి రుబ్బుతున్నంత సేపూ ముందటి పద్యం అప్పగించడం, కొత్త పద్యం నేర్చుకోవడం.. ఇదంతా కూడా రుబ్బడాన్ని రెప్ప వెయ్యకుండా చూస్తూనే.

చూస్తుండగానే అన్నిచోట్లా వచ్చి పడిపోయిన మార్పు వంటగదిలోకీ చొచ్చుకుని వచ్చేసింది. అమ్మ స్థానంలో ఆలి ప్రవేశించింది. రోటి గలగలల స్థానాన్ని మిక్సీ గురుగుర్రులు ఆక్రమించేశాయి. నాలుగు ఆవాలు పొడి కొట్టాలన్నా, రెండు మిరపకాయలు నలపాలన్నా కూడా మిక్సీనే శరణ్యం ఇప్పుడు. "ఏవి తల్లీ నిరుడు రుబ్బిన రోటి పచ్చళ్ళు.." అని మూగగా పాడుకుంటూ కాలం గడుపుతుండగా, ఊహించని విధంగా మూలపడ్డ రోటికి పూర్వ వైభవం వచ్చేసింది. కరెంటు కోత పుణ్యమాని మిక్సీ మూగబోవడంతో అన్నపూర్ణ లాంటి రుబ్బురోలు రుచికరమైన పచ్చళ్ళని అందిస్తోందిప్పుడు. 'మరక మంచిదే' అని ఊరికే అన్నారా డిటర్జంట్ కంపెనీ వాళ్ళు?

40 కామెంట్‌లు:

  1. భలేగా నచ్చేసింది. ఎంత అంటే వెంటనే టపా రాయాలన్నంత. మా అమ్మమ్మని, అయినాపురం ని గుర్తు చేశారు.
    రోట్లో పచ్చడి రుచే వేరు.
    మిక్సీ వచ్చినా సరే ఊరెళ్తే నేను పచ్చడి మాత్రం రోట్లో నే చెయ్యమంటా. అమ్మమ్మ చేసిపెడుతుంది.
    మీరన్నట్టు కొబ్బరి పచ్చడి రోజూ తిన్నా బోర్ కొట్టదు.
    గుత్తి వంకాయ - మావిడికాయ పప్పు - కొబ్బరి పచ్చడి - ముక్కల పులుసు - ఊరగాయ - చారు : ఈ ఆరు ఉండాల్సిందే వారానికి మూడు రోజులైనా అక్కడి కెళ్తే.
    నోరూరి ఆకలేస్తోంది మురళి గారు.

    రిప్లయితొలగించండి
  2. చంపేసారు!! ఇప్పటికిప్పుడు రోటి పచ్చడి అంటే మా బుజ్జి మెక్సికన్ రోలు వల్ల కాదే! ఏమిటి శరణ్యం?? దోసకాయ పచ్చడి తో సరిపెట్టుకుంటాను. ప్చ్..

    టపా రోట్లో రుబ్బిన కంది పచ్చడంత కమ్మహా ఉంది. :)

    రిప్లయితొలగించండి
  3. roti pacchadi kavitwapu oravadi.. wow..yemi polika MuraLee gaaru. yenni pacchaLLu tinipinchaaru. maa vooriki parugettukeLLi roti pacchadi ruchi choodaalanipisthundi.. mee post..chaalaa baagundi..nOrooristhoo..

    రిప్లయితొలగించండి
  4. ippudu kuda electric rolu dorukutundi kada three stones ani five stones ani

    రిప్లయితొలగించండి
  5. మరక మన్చిదె...హ..హ...కాని మగవాళ్ళు
    రొటి పచ్చడి బాగుంటుంది అని చెప్పటం కాదు...
    అమ్మకి చెసినట్లు సాయం చెయాలి మరి...ఆడుతు
    పాడుతు...రుబ్బుతు ఉన్టె అలుపు సొలుపెమున్నది?

    రిప్లయితొలగించండి
  6. రోటి పచ్చడంత కమ్మగా రాసారండీ మురళి గారు .

    రిప్లయితొలగించండి
  7. Ahaa! ఏమి రుచులు గుర్తు చేసారండి. వంకాయ పచ్చడి ఉప్పిడి పిండి, పెసరట్టు ఉప్మాకి అల్లం పచ్చడి OK కానీ పుల్ల మజ్జిగ కలిపిన కొబ్బరి పచ్చడి ఓహ్.

    అవునూ, కరెంటు పోయినప్పుడు రోటి దగ్గర రెండు కాళ్ళు రుబ్బురోలు కి చెరో వైపు వేసి రెండు చేతులతోటి తిరగేసి గద పట్టుకున్న (అదే పొత్రం) మురళీ మోహనుడే కనిపిస్తున్నా డేమిటి? .... దహా

    రిప్లయితొలగించండి
  8. భలే వ్రాసారండి.
    రోటి పచ్చడి ఉన్నంత రుచిగా మిక్సీ పచ్చడి ఉండదు కాక ఉండదు.
    రోటి పచ్చడి అనగానే నాకు "మిథునం" కథ గుర్తొస్తుంది.

    రిప్లయితొలగించండి
  9. intha baga ella rastaru meeru. mee e post matram challa bagundandi. ippatiki ekkadiki hotel velte, adurustam bagundi akkada vadu roti pachadi chesthe. appudu choodandi motham meal danitone.

    రిప్లయితొలగించండి
  10. chaalaa baagundi. Malli naa chinnathanam gurthu chesaru. Inkaa ituvanti thiyyati (kaaram ayina pharavaa ldu, roti pachchadi laagaa)sangathulu raayandi.

    Satyanarayana

    రిప్లయితొలగించండి
  11. నా దగ్గిర ఓ బుజ్జి రోలూ రోకలీ ఉందండోయ్. అది మా అత్తగారు నాకిచ్చేసిన వాళ్ళ పుట్టింటి ఆస్థి. ఆవిడకి అదంటే చాలా ఇష్టం. అందుకే నేను కూడా చాలా... ఎంత అంటే...ఇప్పటి బంగారం ధరంత...జాగ్రత్తగా కాపాడుతుంటాను. ఆవిడ, అప్పుడప్పుడూ దాన్ని చెక్ చేస్తూ ఉంటారుకూడా. ఆ బుజ్జి రోకలి అంటే నాకూ ముద్దే:)
    మీరు మాట తప్పారు మురళి గారు, ఏడుపెంకులాట చెప్తానన్నారు.

    రిప్లయితొలగించండి
  12. పోస్టు సూపర్ అండి, బులుసు మాస్టారి ఊహ ఇంకా సూపర్ :)))

    రిప్లయితొలగించండి
  13. టపా రోటి పచ్చడంత కమ్మగా ఉంది.

    బులుసు గారూ..మీ ఊహ బాగుంది కానీ ఆ పనులు మురళి గారు చేస్తారా..ఏమో నాకు అనుమానమే!

    అమ్మ స్థానంలో ఆలి ప్రవేశించింది.రోటి గలగలల స్థానాన్ని మిక్సీ గురుగుర్రులు ఆక్రమించేశాయి....అంటే ఏంటంటా మీ ఉద్దేశ్యం..అమ్మేమో రోలు..ఆలేమో మిక్సీ అనా!

    రిప్లయితొలగించండి
  14. మీ 'రోటి పచ్చళ్ళూ' బావున్నాయి మీ అమ్మగారు నేర్పిన పద్యాలు బావున్నాయి..మీరిద్దరూ గడిపిన ఆ సమయమూ బావుంది. కాలక్రమేణా ఆ 'రోటి పచ్చళ్ళు' మరుగున పడ్డాయి కానీ ఆ పచ్చడి రుచి మాత్రం మీ టపా లో నిత్యనూతనంగా మధురంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  15. Adbhutam !! Awesome..
    nannu naa chinnappati rojulloki laakkelaaru. Nice post.

    రిప్లయితొలగించండి
  16. entha bagaubdhi ante .. cheppalenantha.. naa chinaaappte memeories anni taaza chesaru.. thank u very much

    రిప్లయితొలగించండి
  17. టపా సూపరండీ! కాల్చిన వంకాయ పచ్చడి, టమేటా కొత్తిమీర పచ్చడి నా ఫేవరెట్స్...

    రిప్లయితొలగించండి
  18. అహా గురువు గారు రుబ్బు రోలు గురించి బాగా గుర్తు చేసారు.. రుబ్బుతూ ఉన్నప్పుడు రోలు పిడీప్పుడప్పుడు ఊడటం..దానికి జాగర్తగా చివర ఒక గుడ్డ పీలిక కట్టీ మళ్ళీ బిగించటం..మసక మసకగా ఉన్న ఙ్ఞాపకాల దొంతరలను బాగా గుర్తు చేసారు..

    రిప్లయితొలగించండి
  19. టపా అంతా కమ్మని రోటిపచ్చడి లా వుంది కానండి , ఆ చివరి పేరా మాత్రం పంటికింద మెంతి గింజ పడ్డట్టూ ఉందండి. ఆయ్....మరంత తీరిగ్గా పచ్చళ్ళు రుబ్బుకు తినే రోజులాండీ ఇవి . ఎవరిని చూసినా పరుగో పరుగు అనంటుంటేనూ

    రిప్లయితొలగించండి
  20. మొత్తానికి కరెంటుకోతతో అక్కడ(పాకవేదం), ఇక్కడా రోళ్ళ దంపుళ్ళు మొదలయ్యాయన్నమాట.
    పిడచకట్టిన నాలుకకు,రోటి పచ్చళ్ళ రుచులతో పూర్వవైభవం రాబోతుంది. :-)

    రిప్లయితొలగించండి
  21. @వాసు: రాసేయండి.. మీ తాజా టపా చదివి వ్యాఖ్య రాయబోతుండగా పవర్ కట్ :)) మళ్ళీ వస్తాను.. ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: మీ వ్యాఖ్యేమో ఆ కండి పచ్చడిలో ఉల్లిపాయ ముక్క నంజుకున్నట్టు ఉంది సుమండీ :)) ధన్యవాదాలు.
    @వనజ వనమాలి: నిజమేనండీ.. అసలైన రోటి పచ్చడి తినాలంటే ఊరెళ్ళాల్సిందే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @ఓం ప్రకాష్: ధన్యవాదాలండీ..
    @dnc :అనుకోండి.. కానీ రోటి రుచి వేరు అనిపిస్తూ ఉంటుంది.. ధన్యవాదాలు.
    @శశికళ: అమ్మ పని చేయించుకున్నట్టుగా మంచిమాటాడి పని చేయించుకోవడం ఆలికి తెలియాలి కానీ అదేంట పని చెప్పండి? :)) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @మాలాకుమార్: ధన్యవాదాలండీ..
    @బులుసు సుబ్రహ్మణ్యం: జన్మ ధన్యమయ్యిందండీ మీ ఊహకి :-) :-) ధన్యవాదాలు.
    @బోనగిరి: కొబ్బరి పచ్చడి గురించి రాస్తూ నేనూ అప్పదాసు-బుచ్చిలక్ష్మి లని తల్చుకున్నానండీ.. కథనోసారి చదువుకున్నాను కూడా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @సంజయ్: ఓసారలా గతంలోకి వెళ్ళిపోతే చాలండీ.. పెద్దగా ప్రయత్నం ఏమీ ఉండదు.. తల్చుకుని రాసేయడమే.. ధన్యవాదాలు.
    @సత్యనారాయణ: తప్పకుండానండీ.. ధన్యవాదాలు.
    @జయ: అబ్బే.. లేదండీ.. శేఖర్ గారు టపా రాస్తానని అన్నారు కదా.. నేనూ ఎదురు చూస్తున్నా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @శ్రావ్య వట్టికూటి: :-) ధన్యవాదాలండీ..
    @సిరిసిరిమువ్వ: అమ్మేమో రోలు.. ఆలేమో మిక్సీ.. నేనిలా నేరుగా అనలేదండీ.. మీకలా స్ఫురించిందా? :-) :-) ధన్యవాదాలు..
    @జ్యోతిర్మయి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  26. @సునీత; థాంకులండీ..
    @చిత్తరంజన్: ధన్యవాదాలండీ..
    @గోదావరి: నిజం!! ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  27. @Tollywood Spice: కాల్చిన వంకాయ పచ్చడినే వంకాయ బజ్జి పచ్చడి అని కూడా అంటారండోయ్.. ధన్యవాదాలు.
    @నైమిష్: గుడ్డపీలిక కట్టడం.. మా బామ్మ కట్టేది కానీ, అమ్మకి పెద్దగా ఇష్టం ఉండేది కాదండీ.. కానీ కట్టకపోతే పొత్రం వినేది కాదు.. ఎంతన్నా బామ్మ ట్రైనింగ్ కదా మరి :)) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. @లలిత: ఇప్పటికిప్పుడు రుబ్బి పెట్టమనడం లేదు కదండీ.. కరెంటు కట్ పుణ్యమా అని తినగలుగుతున్నాం అని మాత్రం అన్నాను అంతే.. :)) ధన్యవాదాలు.

    @పానీపూరీ: చూడాలండీ, ఈ వైభవం ఎన్నాళ్ళో :)) ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  29. చాలా బాగుందండి. మా అత్తగారు వాళ్ళు మాతో ఉంటారు కాబట్టి మేము ఇప్పటికీ రోటి పచ్చడే. నా కొడుకు మీలాగానే అమ్మ వెంటే, పచ్చడి నాకుతూ పచ్చి చపాతీ పిండి తింటూ. కానీ నన్ను మభ్య పెట్టి పోచుకోలు చెప్తాడు పద్యాలు తక్కువ. :)

    అత్తగారు నేను చెరో పనీ చేసుకొంటాం కనుక వీలవుతుంది, లేకపోతే టైమ్ ఎక్కడ సరిపోతుందండి ఇలాంటి వాటికి. మిక్సీ వీలు దానిదే దాన్ని చులకన చేయకండి. ఆడాళ్ళ స్నేహితులండీ ఇవన్నీ. రోట్లో నూరుతూ ఏమిటో ఈవిడ చాదస్తం అనుకొనేదాన్ని, దీంట్లో ఇంత కధ ఉందా? అయినా ఒక్క రోటి పచ్చడని కాదు లేండి, అమ్మ ఏమి చేసునా నచ్చుతుంది మనకు.

    రిప్లయితొలగించండి
  30. ఆఖరి పారా అద్భుతం. ఒకటికి రెండు సార్లు చదువుకున్నాను.

    కాకపొతే.. లలిత గారన్నట్టు, కనీసం మిక్సీ లో (కరెంట్ ఉన్నప్పుడు)వేసుకొనగల్గితే అదే గొప్ప లా ఉంది మెట్రో నగరాల్లో భార్యా భర్తలు ఉభయులూ ఉద్యోగాస్తులైతే ఉన్న పరిస్థితి.

    ముఖ్యం గా సాఫ్ట్ వేర్ వారిలో సెమీ కుక్క్ద్ పాకేడ్ ఫుడ్స్,కాఫెటేరియాలు, హోటళ్లు, కర్రీ పాయింట్ల మధ్య ఊగిసలాడుతున్న జీవితాలు :)బోల్డు..

    రిప్లయితొలగించండి
  31. @మైత్రేయి: పద్యాలు మీరు శ్రద్ధ పట్టి నేర్పించండి.. నేనూ కబుర్లమీదే శ్రద్ధ పెట్టేవాడిని :-) :-) ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ: నిజమేనండీ.. ఇవన్నీ అప్పుడప్పుడూ గుర్తు చేసుకోడానికే.. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. ఇది చదువుతుంటే నోటిలో నీళ్ళు కళ్ళ లో నీళ్ళు.
    అమ్మలు అందుకనే కమ్మని వాళ్ళు

    రవీంద్రనాథ్
    హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  33. @రవీంద్రనాథ్: నిజం చెప్పారు!! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. భలే రాసారండీ మురళి గారూ...ఎలా miss అయ్యానబ్బా ఈ టపా.. పోన్లెండి ఇప్పటికైనా చూశాను...రొట్లో రుబ్బిన కొబ్బరి పచ్చడి తిన్నంత తృప్తి...పైన చెప్పిన సాఫ్టువేరు బాధితులదే నా మాటా...మిక్సీ పచ్చడి కూడా మహ్ద్భాగ్యమే మాకు...

    రిప్లయితొలగించండి
  35. పక్కింటి అబ్బాయి చెప్పింది అతిశయోక్తి కానేకాదు.....రోటి పచ్చడికీ జిందాబాద్ ..అమ్మ చేతికీ జిందాబాద్ ..ఇక నెమలికన్నుకూ అని వేరే చెప్పాలా :) :)

    రిప్లయితొలగించండి
  36. @పరిమళం: ఎన్నాళ్ళకెన్నాళ్ళకు? కుశలమేనా అండీ?? ... ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  37. మీ బ్లాగ్ ని ఈ తరం లో ఆర్టికల్ వచ్చినప్పటి నుండి అనుసరిస్తున్నాను. మధ్య లో కొద్దిగా ఫాలో అవలేక పోయాను....మొత్తం మీ పాత బ్లాగ్లు అన్ని చదివే పని పెట్టాను. మనసు బాగోలేనపుడు మీ బ్లాగ్ నే నాకు మంచి మూడ్ లిఫ్టర్. థాంక్స్ అండీ .బయ్ ది వే , నేను కూడా గోదావరి జిల్లా నుండే నండీ. దాలి పప్పు వండడం , సంది కాలు వాడకం లాంటి జ్ఞాపకాలు ఉన్నాయా మీకు? దాలి పప్పు భలే కమ్మ గా వుంటుంది అండీ.

    రిప్లయితొలగించండి