శుక్రవారం, సెప్టెంబర్ 03, 2010

అమ్మకి జేజే!

'తొలి గురువు' అనే మాటకి పర్యాయపదం అమ్మ. తల్లిదండ్రుల దగ్గర బాల్యాన్ని గడిపిన వారిలో ఏ ఒక్కరూ కూడా "నా మీద అమ్మ ప్రభావం లేదు" అని చెప్పలేరు. అదీ అమ్మ గొప్పదనం. సామాన్యులు మాత్రమే కాదు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అమ్మ ప్రభావంతో పెరిగిన వాళ్ళే. 'ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే' అన్న సామెత ఊరికే పుట్టిందా మరి. అలా కొందరు గొప్పవాళ్ళు తమ తల్లుల గురించీ, తమ మీద వాళ్ళ ప్రభావం గురించీ చెబుతూ రాసిన వ్యాసాల సంకలనమే 'అమ్మకి జేజే!'

తెలుగు సాహిత్యంలో 'మిట్టూరోడు' గా ప్రసిద్ధుడైన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు సంకలనం చేసిన ఈ పుస్తకం లో ముళ్ళపూడి వెంకటరమణ మొదలు హెచ్. జే. దొర వరకూ వివిధ రంగాలకి చెందిన పదిహేడు మంది పెద్దలు తమ తమ మాతృమూర్తులని స్మరించుకున్నారు. వీరిలో చాలా మంది పెద్దవాళ్ళై ఆయా రంగాల్లో పేరు తెచ్చుకోడానికి బీజం పడింది బాల్యంలోనే అనీ, అందుకు కారకురాలు కన్న తల్లేననీ అర్ధమవుతుంది వారి వారి వ్యాసాల ద్వారా.

కష్టపడి పనిచేయడం నేర్పిన తన తల్లి అమ్మణ్ణమ్మని తలచుకున్నారు నారా చంద్రబాబు నాయుడు 'మా అమ్మ బలే కష్టజీవి' వ్యాసంలో. తన తల్లి చెప్పిన నక్కబావ, పందిబావ కథ పల్లెటూరి జనానికి భగవద్గీతతో సమానం అంటారాయన. ఆస్తులెన్ని సంపాదించినా సొంతూరు బుర్రుపాలెం లో పొలం ఉనాల్సిందేనని పట్టుపట్టి భూమి కొనిపించిన తన తల్లి నాగరత్నమ్మని జ్ఞాపకం చేసుకున్నారు 'సూపర్ స్టార్' కృష్ణ.

చిన్నప్పుడు అల్లరి చేస్తే తనకి తాడుకట్టి నూతిలోకి దించిన తల్లి శకుంతలమ్మ కోపాన్నీ, ఆపై ఆమె చూపిన ప్రేమనీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుర్తు చేసుకుంటే, 'ఎవరైనా నీ కొడుకు గద్దర్ అంటే, ఏం లే నాకొడుకు విఠలే' అనే తన తల్లి లచ్చుమమ్మని అపురూపంగా జ్ఞప్తికి తెచ్చుకున్నారు ప్రజా గాయకుడు గద్దర్. ఆయన రాసిన తొలిపాట 'సిరి మల్లె చెట్టుకింద లచ్చుమమ్మా..'

తను ఎన్ని విజయాలు సాధించినా వాటిని ఇంట్లో నుంచే ఆస్వాదించిన తన తల్లి విశాలాక్షిని 'నాలుగో సింహం మా అమ్మ' అంటూ తలచుకున్నారు గాయని రావు బాలసరస్వతి. 'సోగ్గాడే చిన్ని నాయనా..' కూని రాగం తీస్తే దండించిన తల్లే, ఆ తర్వాత మంగళంపల్లి బాలమురళికృష్ణ లాంటి గాయకులు తమ ఇంటికి వచ్చినప్పుడు ఎంతగానో ఆనందించడం జీవితకాలపు జ్ఞాపకం ఆవిడకి.

"మా మేనకోడలి పేరు బాపూ రమణల 'ఛీ గాన పచూనాంబ' (శ్రీ జ్ఞాన ప్రసూనాంబ). దానిని మేమంతా పాపాయి అని పిలుస్తాము. దాన్ని పేరు పెట్టి పిలిచే ధైర్యం మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. అది మా అమ్మ పేరు - అందుకని!" అని చెప్పిన మాలతీ చందూర్ ఆ ఒక్క వాక్యంలోనే తల్లి పట్ల తమ భయభక్తులని చెప్పేశారు.

తన కూతురి చేత అప్పర్ క్లాత్ ధరింపజేయాలని పట్టుబట్టడం మొదలు, సెట్లో దర్శకులకీ హీరోలకీ ఆంక్షలు పెట్టడం వరకూ తననో వెండితెర కలల రాణిగా తీర్చి దిద్దడం వెనుక తల్లి చేసిన కృషిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు జమున. తన తల్లిని 'వెలకట్టలేని నగ' గా అభివర్ణించారు చిత్రకారుడు ఎస్వీ రామారావు. 'నన్ను కనేందుకే జన్మించిన మా అమ్మ!' అని మంగళంపల్లి బాలమురళి కృష్ణ రాస్తే, 'అమ్మ-కల్పవృక్షపు కొమ్మ' అన్నారు సహస్రావధాని మేడసాని మోహన్.

బాపూ రమణలు తమ తల్లుల గురించి రాసిన వివరాలు 'కోతి కొమ్మచ్చి' లోనూ, భానుమతీ రామకృష్ణ తల్లిగారికి సంబంధించిన సంగతులు ఆమె ఆత్మకథ 'నాలో నేను' లోనూ ప్రచురితమవ్వగా, చిరంజీవి తన తల్లిని గురించి రాసిన విశేషాలు 'ప్రజారాజ్యం పార్టీ' ప్రకటించినప్పుడు తిరుపతి సభలో అభిమానులతో పంచుకున్నవే. చదవడం పూర్తిచేశాక సంకలనాన్ని ప్రచురించిన నామినిని అభినందించకుండా ఉండలేం. ('అమ్మకి జేజే!,' టాంసాయర్ ప్రచురణలు, పేజీలు:116, వెల: రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

12 కామెంట్‌లు:

  1. చాలా బాగుందండి. మంచిపుస్తకం గుర్తు చెయ్యటమే కాక అమ్మ గొప్పతనం గుర్తు చేసి సంతోష పెట్టేరు.

    రిప్లయితొలగించండి
  2. చదివి తీరాల్సిన మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. ఎంత జన్మనిచ్చినా సరే, అమ్మలకు గల ప్రాధాన్యాన్ని మగవాళ్ళు తమ జీవితంలో ఏదో ఒక దశలో తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంటుంది. తగ్గించక తప్పదు. తగ్గించడం పాపమూ కాదు, నేరమూ కాదు, ఘోరం అంతకంటే కాదు. స్త్రీలుగా అమ్మల థింకింగ్ రేంజ్ బహుసంకుచితమైనది. సువిశాల ప్రపంచంలో తిరిగే మగవాళ్ళు వారి జడ్జిమెంట్ల మీద ఆధారపడి తమ జీవిత గమనాన్ని నిర్దేశించుకోవడం చాలా ప్రమాదకరం. అమ్మల్ని జీవితాంతం నెత్తిన పెట్టుకోవడం వల్ల చాలా సంసారాలు దుఃఖభాజనమవుతున్నాయి. చాలామంది కోడళ్ళ జీవితాలు దుర్భరమవుతున్నాయి. అమ్మలు కూడా మామూలు స్త్రీలేననీ, దేవతలు కారనీ గుర్తించాలి. వారి వయసుకు ప్రాధాన్యమిచ్చి పెద్దలుగా గౌరవిస్తూనే అదే సమయంలో కుటుంబంలో ఇతరసభ్యుల్ని కాదని అమ్మలకు పెద్దపీట వేసే అలవాటు నుంచి బయటపడాలి.

    రిప్లయితొలగించండి
  4. "మాతృదేవోభవా"అన్నారు అందుకే గురువుగా ప్రధమ తాంబూలం ఇస్తూ.మన జీవితంలో ఇద్దరి రుణమే తీర్చలేము అది ఒకరు తల్లి రెండోది భార్య అంటారు వాకాటి పాండురంగారావు గారు.అలాంటిది వీరిద్దరికీ కూడా థేంక్స్ చెప్పడమనే సంస్కృతి ఈ మధ్యన కొత్తగా వింటున్నాం జనాల్లో,థేంక్స్ చెప్పేస్తే తీరిపోయే రుణమా అది మరి ఆలోచించాల్సిన విషయమే కదూ.

    మంచి పరిచయం చేసారు ధన్యవాదాలు మురళీ.

    రిప్లయితొలగించండి
  5. బాగుందండి .కొనటానికి ట్రై చేస్తాను .నాకు ఇటువంటి పుస్తకాలు చదవడం ఇష్టం..

    రిప్లయితొలగించండి
  6. మంచి పుస్తకం అండి. నేను బ్లాగ్ మొదలెట్టిన కొత్తలో మా అమ్మ గురించి రాసిన టపాలో ఈ పుస్తకం గురించి ప్రస్తావించాను. ఇది చదివిన కొత్తల్లో మరికొన్ని కాపీలు కొని స్నేహితులకు, కొందరు బంధువులకూ బహుమతి కూడా ఇచ్చాను.

    రిప్లయితొలగించండి
  7. మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు.

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. వనవాసం లో ధర్మ రాజుని యక్షుడు అడిగిన ఒక ప్రశ్న గుర్తుకు వచ్చింది .ఈ విశ్వం లో అన్నిటికన్నా బరువైనది ఏది అంటే ధర్మరాజు చెప్పాడుట ఇలాగ,
    రక్తమాంసాలతో కూడిన ఈ దేహాన్ని నవమాసాలు మోసి కానీ పెంచి తను మరణించటానికైనా సిద్దపడి మనకు జన్మనిస్తున్న తల్లి గర్భం ఈ విశ్వం కన్నా గొప్పది, బరువైనది అన్నాడట.
    చక్కగా వ్రాసారు.

    రిప్లయితొలగించండి
  9. అమ్మ అందరికీ తొలి గురువే ఐనా ప్రముఖ వ్యక్తుల జీవితాల్లో అమ్మ పాత్ర తెలుసుకోవటం ఆసక్తి కలిగించే విషయం !

    రిప్లయితొలగించండి
  10. @భావన: ధన్యవాదాలండీ..
    @శిశిర: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @దేవనకొండ ఓబుల్ రెడ్డి: కుటుంబంలో ఎవరి స్థానం వారిదండీ.. ఎవరినీ మరొకరితో పోల్చలేం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @శ్రీనివాస్ పప్పు: ఈ థాంక్స్ సంస్కృతి నాక్కూడా అర్ధం కాదండీ.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @రాధిక (నాని): తప్పక చదవండి.. చాలా చిన్న పుస్తకమే కూడా.. ధన్యవాదాలు.
    @తృష్ణ: మీ టపా చదివిన జ్ఞాపకం అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @బోనగిరి: ధన్యవాదాలండీ..
    @వాజసనేయ: ధన్యవాదాలండీ..
    @పరిమళం: పుస్తకం ఆసాంతమూ ఆసక్తిగా చదివిస్తుందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి