గురువారం, ఫిబ్రవరి 11, 2010

రాతిపూలు

చూడడానికి చాలా అందంగా ఉంటాయి.. సున్నితంగా కనిపిస్తాయి.. ఎప్పటికీ వాడిపోవు.. అచ్చంగా పూలలాగే ఉంటాయి కానీ ఎలాంటి వాసనా వెదజల్లవు.. ఎందుకంటే అవి 'రాతిపూలు.' కార్పొరేట్ సంస్కృతిలో మారుతున్న కాలానికి అనుగుణంగా అందరితోనూ పోటీ పడుతూనే తాము కోల్పోతున్న వాటిని గురించి మధ్యతరగతి అమ్మాయిలు పడే ఆవేదనని ఇతివృత్తంగా తీసుకుని సి. సుజాత రాసిన నవల పేరు కూడా ఇదే. టైటిల్ ని ఎంచుకోడం లోనే సగం విజయం సాధించారు సుజాత.

మహిళా సమస్యలని తనదైన దృష్టి కోణం నుంచి చూడడం లోనూ, వాటికి అక్షర రూపం ఇవ్వడం లోనూ తన తొలి రచన 'సుప్త భుజంగాలు' నుంచీ ఒక ప్రత్యేక మార్గంలో వెళ్తున్న సుజాత, తన తాజా నవలకి వేదికగా కార్పొరేట్ ప్రపంచాన్ని, రంగుల సిని పరిశ్రమనీ ఎంచుకున్నారు. 'రాతిపూలు' నవలలో ప్రధాన (స్త్రీ) పాత్రలు మూడు. వీళ్ళు ముగ్గురూ మధ్య తరగతి నేపధ్యం నుంచి వచ్చిన వాళ్ళే. ఆర్ధికంగా ఎదగాలన్న తపన, ఎదగాల్సిన అవసరం ఉన్న వాళ్ళే. ఎదిగే క్రమంలో వాళ్ళు అనుభవించే మానసిక సంఘర్షణే ఈ నవల.



జీవితాన్ని పక్కాగా ప్లాన్ చేసుకోవాలనీ, డబ్బు ద్వారా వచ్చే సౌఖ్యాలని అనుభవించాలనీ తపన పడే భర్త సూచనల మేరకు, తన పసిగుడ్డుని అత్తగారి సంరక్షణలో వదిలి కార్పొరేట్ ఉద్యోగానికి వచ్చిన వనిత శమంత. నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తూ, భర్త తనకి పాకెట్ మనీ గా కేటాయించిన పది వేలలోనే ఖర్చులు కుదించుకోలేని తత్వం ఆమెది. శమంత స్నేహితురాలు, సినిమాలకి, సీరియళ్ళకీ డబ్బిగ్ చెప్పే జమున కి భర్తే సమస్య. తన సంపాదనని అతను మంచి నీళ్ళలా ఖర్చు చేసేస్తుంటే, భరించలేక విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది.

చిన్నప్పుడు నేర్చుకున్న డేన్స్, తర్వాత చేసిన ప్రయత్నాలు ఉపయోగ పడి టీవీ యాంకర్ నుంచి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ వరకూ ఎదిగి, మెయిన్ హీరోయిన్ కావాలని కలలు కనే కిన్నెరకీ భర్తతోనే సమస్య. అతని ఖర్చులు మాత్రమే కాదు, అనుమాలనీ భరించాలి ఆమె. భరిస్తూనే కెరీర్లో ఎదగాలి. వీళ్ళ ముగ్గురినీ ఒక చోటికి చేర్చిన సూత్రధారి సురేంద్ర. శమంత పని చేసే కంపెనీ యజమాని. సినిమా ఫైనాన్షియర్. కోటీశ్వరుడైన సురేంద్ర కి అందగత్తె కాని భార్యా, ఇద్దరు పిల్లలతో పాటు అందమైన అమ్మాయిల మీద విపరీతమైన వ్యామోహం.

మొదట ఉద్యోగం కోసం, ఆ తర్వాత ప్రమోషన్ల కోసం సురేంద్ర కి దగ్గరవుతుంది హైదరాబాద్ లో ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న శమంత. భర్తా, ఆమె కలిసి గడిపేది ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే. ఇక జమున, కిన్నెరలకీ సురేంద్ర తో అవసరాలు. ముగ్గురు స్త్రీలకీ కెరీర్లలో పైకి ఎదగాలన్న కోరికతో పాటు, ఎదగాల్సిన అవసరాలూ తరుముకుని వస్తుండగా, గడుపుతున్న జీవితంలో అప్పటివరకూ తాము విలువలుగా నమ్మిన వాటిని ఆచరించాలో, విడిచిపెట్టాలో తెలియని సందిగ్ధత.

శమంత-సురేంద్ర ల విషయం తెలిసి శమంత భర్త ఎలా స్పందించాడు? భర్త, కూతురి గురించి శమంత తీసుకున్న నిర్ణయం ఏమిటి? జమున తన భర్తకి విడాకులు ఇచ్చిందా? కిన్నెర హీరోయిన్ కాగలిగిందా? తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానాల్ని నవలలో చదవడమే బాగుంటుంది. నిజానికి సమాధానాల కన్నా సంఘర్షణ ని రచయిత్రి వర్ణించిన తీరు ఈ నవలని విడవకుండా చదివేలా చేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రచయిత్రి శైలి, ఎక్కడా పట్టు సడలకుండా కథని నడిపించిన తీరు. 'నవ్య' వారపత్రికలో సీరియల్ గా వచ్చిన 'రాతిపూలు' నవలని శివసాయి శరత్ పబ్లికేషన్స్ సంస్థ ప్రచురించింది. పేజీలు 143, వెల రూ. 60, (అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

16 కామెంట్‌లు:

  1. పరిచయం ఆసక్తి గొలుపుతుంది. చదవడానికి వీలవుతుందేమో చూడాలి.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు,
    అన్యాయమండీ. నేను తాబేలు లాగా నెమ్మదిగా రాస్తూ వుంటే మీరు నాకన్నా ముందు రాసేస్తారా? జస్ట్ కిడ్డింగ్..బాగా రాశారు. నాకు కూడా బాగా నచ్చింది ఈ నవల. నా బ్లాగ్ లో త్వరలో రాస్తాను. మీరు ముందుగా రాసేసి ఫస్ట్ మార్క్ కొట్టేశారు.
    కల్పన

    రిప్లయితొలగించండి
  3. "ఆయన ఎన్ని చేతులతో ఎన్ని కీబోర్డులతో రాస్తారో" అని సిరిసిరిమువ్వ గారు అన్నట్టు.. ఓ వంద కళ్ళు, ఓ వంద చేతులు ఏ పెట్టెలోనైనా దాచుకుని పుస్తకాలు చదివేటప్పుడు, టపాలు రాసేటప్పుడు వాడుకుంటున్నారా ఏంటండీ ?

    అసలే కొండవీటి చేంతాడంత వున్నలిస్టు లోంచి ఒక పుస్తకం చదివి హమ్మయ్య ఒక నంబర్ తగ్గింది.. అని అనుకుంటుండగానే మళ్ళీ ఇంకో పుస్తకం చేర్చేశారు నా లిస్టు లోకి.

    ఇహ లాభం లేదు... భావన గారన్నట్టు ఇద్దర్నో ముగ్గుర్నో(ఒక్కరే ఐతే మోయ్యలేరని ) గజ దొంగల్ని పంపాల్సిందే మీ గ్రంధాలయాన్ని కొల్లగొట్టడానికి.

    చాలా బాగుందండీ..ఎప్పటిలాగే ఆసక్తికరంగా..!

    రిప్లయితొలగించండి
  4. టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది .....మీరన్నట్టు రచయిత్రి సగం విజయం సాధించినట్టే ...మీరు పరిచయం చేస్తే ఏ పుస్తకం పట్లైనా ఆసక్తి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందండీ :)

    రిప్లయితొలగించండి
  5. కొత్త టెంప్లెట్ బాగుంది సోదరా!!
    మహాశివరాత్రి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  6. non stop vidudala ayyi inni rojulayyindhi. inka mee review lo raledu emiti chepma?????

    రిప్లయితొలగించండి
  7. బాగుందండి పరిచయం యధా విధి గా. నాకేమో తట్టుకోలేని కుళ్ళొచ్చేస్తోంది, పుస్తకాలు చదవటం వాటి మీద వూ...రికే తెగ అధ్బుతమైన పరిచయాలు రాయటం. హ్మ్.. :-) ఈ నవల లోని మొదటి భాగం తో అంటే ముగ్గురు అమ్మాయిలు కష్టాలు తో ఏదో సినిమా కూడా వచ్చింది కదా (రేవతి, కమలాహసన్ చిన్న పాత్ర)..

    రిప్లయితొలగించండి
  8. లోకంలో ఉన్న ఆడవాళ్ళ సమస్యలన్నీ ఈ గ్రంధం లో కనిపిస్తున్నాయి. ఇది ఒక నవల గా నాకనిపించటం లేదు. ప్రపంచమే నా కళ్ళముందు కనిపిస్తోంది.పెరుగుతున్న ఆధునికత స్త్రీల బాధ్యతలను, సమస్యలను ఇంకా పెంచుకుంటూపోతూనే ఉంది. గతకాలం మేలు ఒచ్చు కాలం కంటే అనిపిస్తోంది. చాలా బాగా వివరించారు.

    రిప్లయితొలగించండి
  9. రచయితలూ ఆడవారి బాధలు గురించే రాస్తారు. రచయిత్రిలూ ఎలాగూ ఆడవారి బాధల గురించే రాస్తారు. ఏం మగవాళ్ళకి బాధలు లేవా (చెప్పుకోక పొతే మాత్రం) లేక రాసేంత బాధలు లేవా.. ఎవరూ పట్టించుకోరే. ఎప్పుడూ ఆడవారి దృక్కోణం లోంచే చూస్తారేంటి చెప్మా లోకాన్ని.. :) మురళి గారు మీరు మన బాధల గురించి రాయకూడదూ ?? మంచి కథో నవలో అవుతుంది.. ఈ మధ్య వచ్చిన మేల్ కొలుపు తరహాలో .

    అనట్టు మీ టపాని బట్టి పుస్తకం లో ఉన్న నలుగురు మగాళ్ళని బాడ్ లైట్ లోనే చూపించారు.. కాదు కాదు .. అలాటి వాళ్ళనే ఎంచుకున్నారు రచయిత్రి. emantaaru

    రిప్లయితొలగించండి
  10. @వేణూ శ్రీకాంత్: తప్పక చదవండి.. చిన్న పుస్తకమే కూడా.. ధన్యవాదాలు.
    @కల్పన రెంటాల: తప్పకుండా రాయండి.. ఎదురు చూస్తూ ఉంటాం.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: మీరందరూ కొంచం (కొంచం కాదు లెండి బాగానే) ఎక్కువగా ఊహించుకుంటున్నారండీ, నా కలెక్షన్ గురించి :-) చదివి మీరు కూడా ఒక టపా రాయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @పరిమళం: అది ఆయా పుస్తకాల గొప్పదనం మరియూ మీకు పుస్తకాల మీద ఉన్న ఆసక్తీనండీ.. ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు: మీక్కూడా శుభాకాంక్షలండీ.. ధన్యవాదాలు.
    @మోహన వంశీ: పౌరాణికం అయితే ప్రాణాలకి తెగించైనా చూసే వాడినండీ.. ప్చ్.. కాదు కదా.. మీరు భలే గుర్తు పెట్టుకున్నారు!! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @అక్షర మోహనం: మీరు మల్లెపూల గురించి రాస్తున్నారు కదండీ.. నేనేమో 'రాతిపూల' గురించన్న మాట :):) ..ధన్యవాదాలు.
    @భావన: యెంత ప్రయత్నించినా సినిమా ఏమిటో జ్ఞాపకం రావడం లేదండీ.. మీ కృష్ణుడూ-నల్లపిల్లా రాసుకునే ఉత్తరాలు చూసి మేమెంత కుళ్ళుకోవాలో మీరే చెప్పండి. :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @జయ: పాతని పూర్తిగా వదులుకోలేక, కొత్తని పూర్తిగా అందుకోలేక సంధియుగం లో ఉన్నవాళ్ళు పడే అవస్తల కథండీ ఇది.. 'గతకాలము..' ఇది ఈనాటి మాట కాదు కదండీ.. ధన్యవాదాలు.
    @వాసు: రేవతి అనే భర్త చాటు (??) భార్య కూడా ఉందండీ ఈ నవలలో.. మగవాళ్ళ బాధలు.. నిజమేనండీ ఆలోచించాల్సిన విషయమే.. మీరింకా 'మేల్ కొలుపు' దగ్గరే ఆగిపోయారు.. పూడూరి రాజిరెడ్డి 'మధుపం' చూడలేదా ఇంకా?? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. I think that the movie name that Bhavana Garu saying might be "Aadavallaku Maatrame".

    BTW, nice intro.

    Rather than fantasy, I like the stories near to reality :)

    I thank you for your intro. about good books. I am noting down to purchase, when I go to BZA for Ugaadi.

    రిప్లయితొలగించండి