మంగళవారం, మార్చి 31, 2009

దేవుడి పెళ్లి

ఉగాది మర్నాడు మా శివుడి కళ్యాణం. ఉదయాన్నే లౌడ్ స్పీకర్లో భక్తి పాటలు నిద్ర లేపాయి. ఓ గంట సేపు బాగానే ఉంది కాని, తరువాత మొదలయ్యాయి తిప్పలు. సినిమా పాటలు మొదలు పెట్టి ఇక ఆపరే.. పోనీ అవైనా వినసొంపుగా ఉన్నాయా అంటే అదీ లేదు. గుడి మా ఇంటికి మరీ దగ్గర కావడంతో మైక్ బాధ తప్పలేదు. కొబ్బరాకుల పందిరి స్థానం లో షామియానా వచ్చింది. సీరియల్ బల్బులతో మల్లె పందిరీ అవీ అల్లలేదు కానీ లైటింగ్ బాగానే ఏర్పాటు చేశారు. గణపతి పూజ అవీ మధ్యాహ్నమే కానిచ్చేశారు. సాయంత్రం పల్లకిలో ఊరేగింపు. బ్యాండ్ మేళం తో..

ఊరేగింపు పూర్తయ్యాక రాత్రి పదింటికి కళ్యాణం మొదలైంది. కిందటి సంవత్సరం కళ్యాణం చూడడం కుదరలేదు. ఈ యేడాది వచ్చిన మార్పు ఏమిటంటే ఎప్పుడూ కళ్యాణం చేయించే పెద్దాయన స్థానం లో, వయసులో ఆయన కన్నా చిన్న వాడైన మరో పంతులు గారు వచ్చారు. కళ్యాణం వేళకి బ్యాండు వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఈ సంవత్సరం వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనా.. బాణాసంచా కూడా బాగా కాల్చారు. ఇన్ని మార్పులు ఏమిటా అని ఎంక్వయిరీ చేస్తే తెలిసిందేమిటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మారారని.. కొత్తగా వచ్చినాయన అన్నీ దగ్గరుండి శ్రద్ధగా చేయిస్తున్నారని.

చాలా సంతోషంగా అనిపించింది ఏర్పాట్లు చూసి. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. ఎక్కువమంది కొత్తగా ఎన్నికైన కమిటి చైర్మన్ బంధువులు, మిత్రులు. ఈవో కూడా భక్తుల్లో కూర్చున్నారు. దానితో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులు దగ్గర ఉండి ఏర్పాట్లన్నీ శ్రద్ధగా చేశారు. మా చిన్నప్పుడు ఓ రెండు మూడు కుటుంబాల వాళ్ళం మాత్రమే కళ్యాణం టైం కి వెళ్ళేవాళ్ళం. పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో, వీరణాల వాయిద్య నేపధ్యంలో కళ్యాణం జరిగేది. గణపతి పూజ నుంచి మొదలు పెట్టేవారేమో, మొత్తం తంతు పూర్తయ్యేసరికి తెల్లవారిపోయేది. ఆ వంకతో మేము మర్నాడు బడి యెగ్గొట్టేసే వాళ్ళం.

పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పట్టు బట్టల్లో మెరిసిపోతున్నారు. మండపం నిండుగా జనం ఉన్నా అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. పంతులుగారికి కూడా ఉత్సాహం వచ్చినట్టు ఉంది. మంత్రాలకి అర్ధం చెబుతూ, జరుగుతున్న తంతు ఎందుకో వివరిస్తూ చాలా ఓపికగా జరిపించారు. పాదుకలని ఇత్తడి పళ్ళెంలో పెట్టి నీళ్ళతో కడిగారు.. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అన్నమాట. ఆ తర్వాత జీలకర్ర-బెల్లం. పంతులు గారు, మా పూజారి గారు పార్వతి పరమేశ్వరుల తలలపై వాటిని ఉంచారు.

వధూవరుల తాత , తండ్రుల వివరాలు, వారి గోత్రాలు, ఋషులు అన్నీ ప్రవర రూపంలో చదివారు. 'నిర్గుణ నిరాకార..' అంటూ చదువుతుంటే వినడానికి భలే ముచ్చటగా అనిపించింది. పార్వతీ దేవికి మూడు మంగళ సూత్రాలు. మనుషులకైతే రెండే కాని, దేవతలకి మూడు సూత్రాలు ఉండాలట. తలంబ్రాలు పోస్తుంటే వీరణాల వాళ్ళు, బ్యాండు వాళ్ళు పోటీ పడ్డారు. 'పందిట్లో పెళ్లవుతున్నాదీ ..' లాంటి పాటలన్నీ వాయించేశారు బ్యాండ్ వాళ్ళు. మరో పక్క బాణాసంచా. ఆ హడావిడి చూసి 'జరుగుతున్నది మన దేవుడి పెళ్లేనా' అని సందేహం వచ్చింది.

భక్తులు తెచ్చిన మల్లె దండలూ, గులాబి మాలలూ అలంకరించేయడంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురూ మిలమిలా మెరిసిపోయారు. తలంబ్రాల బియ్యం కోసం భక్తులు పోటీ పడ్డారు. అరటి పళ్ళతో పాటు, పులిహోర ప్రసాదాన్ని అందరికీ పంచారు పూజారి గారు. ఈవో, ఆయన స్టాఫ్ వచ్చిన భక్తులందరికీ వీడ్కోలు ఇచ్చారు. మా దేవుడికి చాలా ఆదాయం ఉన్నా ఆయన కళ్యాణం ఇంత వైభవంగా ఎప్పుడూ జరగలేదు. ఓ అధికారి తన విధి నిర్వహణలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఏటా జరిగే వేడుకకే కొత్త కళ వచ్చింది.

7 కామెంట్‌లు:

  1. కళ్ళకు కట్టినట్లు భలే రాశారండీ..

    రిప్లయితొలగించండి
  2. ఆహా.. కళ్ళకి కట్టినట్టుగా చూపించారు.. దేవుడి కళ్యాణ మహోత్సవాన్ని..
    భలే ఓపికగా రాస్తారండీ పోస్టులన్నీ..మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేము ;)

    రిప్లయితొలగించండి
  3. Really Excellent narration.while reading i felt like i was there.Thanks for giving such a wonderful experience.Keep posting Good blogs

    రిప్లయితొలగించండి
  4. చాల బాగుందండి పెళ్లి వచ్చే యేడాది మమ్మల్ని తీసికేల్లరు?

    రిప్లయితొలగించండి
  5. ప్రభుత్వ ఆధికారులు శ్రధ్ధ తీసికొంటే ఏ పని అయినా విజయవంతంగా చేస్తారు. మీరు దేముడి పెళ్ళి వివరించిన పద్ధతి చాలా బాగుంది.

    ఫణిబాబు

    రిప్లయితొలగించండి
  6. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కళ్ళముందే జరిగినట్టుందండీ !

    రిప్లయితొలగించండి
  7. @ఉమాశంకర్, మధురవాణి, పరిమళం: ధన్యవాదాలు
    @చిన్ని: తప్పకుండా.. ధన్యవాదాలు
    @రవీంద్ర, ఫణిబాబు: ధన్యవాదాలు. తెలుగు లో రాయడానికి ప్రయత్నించండి. ఈ లింక్ మీకు సహాయ పడుతుంది. http://www.google.co.in/transliterate/indic/telugu

    రిప్లయితొలగించండి