మంగళవారం, మార్చి 24, 2009

గడిచిపోయిన వసంతం

అసలు అందరూ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు 'ఉగాది' జరుపుకుంటారు కానీ, మా ఊరికి ఉగాది కళ ఓ నాలుగు రోజులు ముందుగా వచ్చి రెండు వారాలు కొనసాగేది. ఉగాదికి రెండు రోజుల ముందు మా గ్రామ దేవత గుళ్ళో జాతర. చాలా వైభవంగా జరిగేది మా చిన్నప్పుడు. పెద్ద పెద్ద కళ్ళతో ఉండే అమ్మవారి విగ్రహం చూసి భయం అనిపించినా జరిగే సంబరాలు చాలా సరదాగా ఉండేవి. గరగ నృత్యాలు పోటాపోటీ గా జరిగేవి. వాటితో పోలిస్తే ఇప్పటి శిల్పారామం గరగ నృత్యాలు జస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ అంతే. ఇవి కాకుండా లొట్టిపిట్టలు, పులి వేషాలు భలే గమ్మత్తుగా ఉండేవి. నిద్ర ఆపుకుని, రెప్పవెయ్యకుండా చూసేవాళ్ళం. అర్ధరాత్రి వరకు గుడి దగ్గర డ్యాన్సు లు చేసి అప్పుడు ఊళ్లోకి బయలుదేరే వాళ్ళు. జంతు బలి ఉండేది కాని, పిల్లల్ని చూడనిచ్చేవాళ్ళు కాదు.

జాతర మర్నాడు శుబ్బరంగా నిద్రపోయే వాళ్ళం. ముందు రోజు రాత్రంతా మేలుకొని ఉండే వాళ్ళం కాబట్టి, ఇంట్లో ఏమి అనేవాళ్ళు కాదు. టైలర్ ని వేధించి బట్టలు కుట్టించి తెచ్చుకోవడం లాంటి చిన్న చిన్న పనులు మాత్రం ఉండేవి. పచ్చడి కోసం వేప పువ్వు కోయాలని సరదా ఉండేది కాని, పిల్లలు కోయ కూడదు అనే వాళ్ళు. పగలంతా పడుకున్నా, రాత్రి త్వరగా నిద్రపోయేవాళ్ళం. మర్నాడు ఉదయమే లేవాలి కదా.. తలంటి స్నానానికి. ఉగాది పచ్చడి తినేసి, కొత్త బట్టలేసుకుని ఊరి మీద షికారుకి. 'పండగ పూటా పిల్లల్ని ఏమి అనకూడదు' అనే నియమం ఉండేది కాబట్టి బోలెడంత స్వేచ్చ. ఊరిమీద తిరగడానికి ఎంత టైమూ సరిపోయేది కాదు.

మద్యాహ్నం నుంచి అమ్మవారి గుడి దగ్గర తీర్ధం. వ్యాపారులు షాపులు పెట్టుకుంటుండగా వెళ్లి సర్వే చేసి వచ్చేవాళ్ళం. మొత్తం ఎన్ని షాపులు, కొత్త వస్తువులు ఏమిటి, ఏమేం కొనుక్కోవాలి, ఇంట్లో ఎన్ని డబ్బులు అడగాలి.. ఇత్యాదులన్నీ తెలుసుకోడానికి. సినిమా పాటల పుస్తకాల మొదలు, రైలు, కారు బొమ్మల వరకు చాలా ఉండేవి, మమ్మల్ని కన్ఫ్యుస్ చేయడానికి. నాకైతే హైదరాబాద్ నుంచి బొమ్మలు వచ్చేవి కాబట్టి వాటి మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. తీర్ధంలో సాయంత్రం 'సిరిబొమ్మ' వేడుక. చెక్కతో చేసిన సిరిబొమ్మ అమ్మవారి కావలి దారు. ఓ తాడు తో కట్టి గాలిలో గిరగిరా తిప్పుతుంటే అందరూ ఆ బొమ్మని అరటిపళ్ళ తో కొడతారు. మేము కొడితే అటువైపు ఉన్నవాళ్ళకి తగిలేది. గబుక్కున పక్కకి తప్పుకునే వాళ్ళం, దెబ్బ తిన్న వాళ్ళు మమ్మల్ని చూడకుండా.

చైత్ర శుద్ధ విదియ మా ఊళ్ళో శివుడి కళ్యాణం. ఐదు రోజుల వేడుక. తిధి ద్వయం వస్తే ఉగాది రోజు రాత్రే కళ్యాణం. అక్కడ మన హాజరు తప్పనిసరి. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అని ఊరికే అన్నారా? గుడి ముందు పెద్ద పందిరి. లైటింగ్, మైక్ ఉండేవి. మైకతన్ని బతిమాలి మనకి కావాల్సిన పాటలు వేయించు కోవడం. సాయంత్రం దేవుడి ఊరేగింపు.. ఆ తర్వాత కళ్యాణం. ప్రసాదాలు తీసుకుని ఇల్లు చేరేసరికి అర్ధ రాత్రి దాటేది. మర్నాటి నుంచి రోజూ సాంస్కృతిక ప్రదర్శనలు. నాటకాలు, రికార్డింగ్ డాన్సులు, వీధిలో తెర కట్టి సినిమాలు.. రంగాప్రసాద్ బజ్జీల షాప్ ఉండేది ప్రతి రోజూ. ఇది కాకుండా సోడాలు, చిరుతిళ్ళు అమ్మే షాపులు వెలిసేవి, ప్రోగ్రాం ని బట్టి.. చుట్టుపక్కల ఊళ్ళనుంచి కూడా జనం వచ్చే వాళ్ళు. చివరి రోజు అన్న సంతర్పణ. దగ్గర ఉండి వంటలు చేయించడం, వడ్డించడం. మనకి మంచినీళ్ళు పోసే ఛాన్స్ మాత్రమే దొరికేది. అయినా అది మాత్రం వడ్డించడం కాదూ..?

శివుడి గుడిముందు పందిరి తీయగానే, ఇటు పక్క ఉన్న రాముడి గుడి ముందు పందిరి వెలిసేది. శ్రీరామ నవమి హడావిడి. రాముడి గుడి ఓ కుటుంబానిది. నవమి వేడుక వాళ్ళే చేసేవాళ్ళు. పెద్దయ్యాక హైదరాబాద్ లో బిర్లా టెంపుల్ చూసి, మనూళ్ళో ఫలానా వాళ్ళు రాముడి గుడి కట్టించినట్టుగానే ఇక్కడ బిర్లా వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాడు అన్నమాట అనుకున్నాను. రాముడి గుడి వాళ్ళు కొందరిని మాత్రమే పిలిచేవాళ్ళు. మాకు వాళ్ళతో దూరపు బంధుత్వం కూడా ఉండడంతో తప్పక పిలుపు వచ్చేది. ఓ సారి రాముడి కళ్యాణం కోసమని తీర్ధం లో గోళ్ళ రంగు కొనుక్కుని నేనే వేసుకున్నా. అది చూసి అందరూ నవ్వడమే. గోరింటాకులా వేలికి సగం వరకు పూసుకుంటే చూసే వాళ్లకి నవ్వు రావడం సహజమే కదా..

రాముడి గుడిలో వడపప్పు, పానకం తో పాటు, మద్యాహ్నం గుడిలోనే భోజనాలు ఉండేవి. ఈ గుడి వాళ్లకి కొంచం భక్తి భావాలు ఎక్కువ. బుర్రకథ, హరికథ లాంటి ప్రోగ్రాములు పెట్టేవాళ్ళు. ఆ కథలు చెప్పే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళం.. వచ్చింది మొదలు, వెళ్ళే వరకు వాళ్ళని రెప్ప వేయకుండా చూడడం అన్నమాట. ఆ ఇంటి తర్వాతి తరానికి భక్తి అంతగా లేకపోవడం తో గుడి పాడు బడింది. ఓ గాలివానకి కూలిపోయింది. అలా నవమి వేడుకలు కళ్ళముందే మాయమయ్యాయి. జాతర, కళ్యాణం సందర్భంగా వేసే కార్యక్రమాల్లోనూ చాలా మార్పులు వచ్చేశాయి.

చాలా ఏళ్ళ తర్వాత పండక్కి ఊరికి వెళ్తున్నా.. జాతర, తీర్ధం, కళ్యాణం చూసి రావడానికి. జాతర చూసైతే చాలా సంవత్సరాలు అయ్యింది. 'మన చిన్నప్పటిలా లేదు..' అని స్కూల్ ఫ్రెండ్స్ చెబుతున్నారు. 'మనం కూడా మన చిన్నప్పటిలా లేము కదా..' అంటూ ఉంటాను నేను. వచ్చాక ఆ వివరాలతో మరో టపా రాస్తాను. అందరికి ఉగాది శుభాకాంక్షలు.

8 కామెంట్‌లు:

  1. మన బ్లాగ్ మిత్రులందరి తరుపునా మీ రాములోరిని ఆయన బ్యాచ్ అంతటిని ఇంకా మీ గ్రామ దేవత అండ్ బ్యాచ్ కి అందరికి శత కోటి దండాలు చెప్పండి. :-)

    రిప్లయితొలగించండి
  2. గరగ , సిరిబొమ్మ....
    ఒకే రాష్త్రం, ఒకే భాష మాట్లాడే వాళ్ళమయినా ఎంత భిన్నత్వం? ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆచారం..

    సరే, ఆ ఉత్సవాల టపా కోసం ఎదురుచూస్తా..మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  3. >>ఓ సారి రాముడి కళ్యాణం కోసమని తీర్ధం లో గోళ్ళ రంగు కొనుక్కుని నేనే వేసుకున్నా...

    బాగుంది మీ చమత్కారం. చిన్నప్పుడు నేను రామాయణం కథలు విని రాముడిలాగా వుండాలని పొయిలో బూడిద తీసుకొని మొఖమంతా రాసుకున్నట్టు. బాగా గుర్తు చేశారు.

    రిప్లయితొలగించండి
  4. "సినిమా పాటల పుస్తకాల మొదలు, రైలు, కారు బొమ్మల వరకు చాలా ఉండేవి, మమ్మల్ని కన్ఫ్యుస్ చేయడానికి. "

    మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కుడా జరిగేది 'తీర్ధం'... దాన్ని అక్కడ 'తిరుణాల' అంటారు. ఏ పండగకి పెట్టేవారో గుర్తులేదు.

    చిన్నప్పుడు ఆ తిరుణాల లో నేను ఎన్ని పాటల పుస్తకాలు కొన్నానో లెక్కే లేదు. అంత పిచ్చి అప్పటి నుండే పాటలంటే!
    పుస్తకాలూ కొనటం... అందులో చూసి పాటలు పాడుకోవటం... ఇదే పని.
    ఇంకా... రాత్రి పూట టీవీ, vcr పెట్టి అందులో ఏదో ఒక సినిమా వేసేవారు... అది చూడటానికి కుడా ఎగబడిపోయేవాళ్ళం.

    ఆ రోజులన్నీ మళ్లీ కళ్ళముందుకు తెచ్చారు.... మీకు బోలెడు థాంక్స్!

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు , మీరన్నట్టే మీ బ్లాగ్ లోకి కూడా ముందే వచ్చేసింది ఉగాది .ఇంతకూ మీదేవూరో చెప్పనేలేదు .మా వైపు కూడా ఉగాదికి అమ్మవారి జాతరలు చేస్తారు .ముఖ్యంగా నూకాలమ్మకు ...అప్పుడే నవమి వేడుకలు కూడా చూపించేశారు .(మీ బ్లాగ్ చదువుతుంటే చూసినట్టే ఉంటుందండీ ) మీకూ ..మీ కుటుంబానికీ హృదయ పూర్వక ఉగాది శుభాకాంక్షలు .
    అన్నట్టు ఊరిలో పండక్కి పులిహోర మాత్రం ట్రై చేయకండే0 .... :) :)

    రిప్లయితొలగించండి
  6. కళ్ళకు కట్టినట్లు రాసారు .. చాలా బాగుంది.. నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం.. మరెందుకు వాటి మీద అన్ని కార్టున్లు వేస్తారో నాకు అర్దం కాని పజిల్ మరి

    రిప్లయితొలగించండి
  7. మురళీ గారు,
    మీకు, మీ ఇంటిల్లపాదికీ నూతన వత్స్రర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. @భావన: చెప్పేసి వచ్చానండి..ధన్యవాదాలు..
    @ఉమాశంకర్: కాసుకోండి మరి.. ధన్యవాదాలు
    @భాస్కర రామిరెడ్డి: అలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి.. ధన్యవాదాలు.
    @చైతన్య: మా చిన్నప్పుడు వీధిలో తెర కట్టి సినిమాలు ప్రదర్శించేవారు. పాటలన్నీ వన్స్ మోర్లు, ప్రొజెక్టర్ ఆపి, వెనక్కి తిప్పి మళ్ళీ వేసేవాళ్ళు. ధన్యవాదాలు
    @పరిమళం: కోనసీమలో గోదారొడ్డున ఉన్న అందమైన పల్లెటూళ్ళలో ఒకటి అండి. ఎవ్వరూ ఆ ఊరిని విడిచి పెట్టలేరు.. ఎక్కడో నా లాంటి రాతి గుండె మనుషులు తప్ప.. పులిహోర చేయలేదు లెండి. ధన్యవాదాలు.
    @నేస్తం: నిజమేనండి.. పచ్చడి చాలా బాగుంటుంది. పండుగ ప్రత్యేక సంచిక కి కార్టూన్లు కావాలి కాబట్టి అలా వేస్తారేమో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి