మంగళవారం, మార్చి 10, 2009

గుడ్డివాడి వర్ణచిత్రాలు

ప్రగతిశీల ఉద్యమాల నేపధ్యం నుంచి వచ్చిన కె.వి. కూర్మనాధ్ రాసే కథల్లో ఆ ఉద్యమాల ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఆయన రాసిన కథల్లో ఒకటి 'గుడ్డివాడి వర్ణచిత్రాలు.' నాలుగేళ్ల క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురితం అయ్యింది. 'ప్రస్తుత ప్రజాస్వామ్యం' అనే అంశాన్ని కథగా మలచిన కూర్మనాధ్ చివరి పేరాలో మాత్రమే 'అసలు కథ' చెప్పారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద బొమ్మలు గీసుకునే ఒక ఆర్టిస్టు కథ ఇది. బొమ్మలు గీసే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ, ఇతని ప్రత్యేకత ఏమిటంటే కళ్ళకు గంతలు కట్టుకుని, తన చేత బొమ్మలు గీయించుకోవడం కోసం వచ్చేవాళ్ళు చెప్పేది శ్రద్ధగా విని ఆ వ్యక్తి ని/వస్తువుని/ దృశ్యాన్ని పెయింట్ చేసి, టైటిల్ రాసి ఇవ్వడం.

తప్పిపోయిన పెంపుడు కుక్కపిల్ల మొదలు, మరణించిన తండ్రి, తాత, కలలోకి వచ్చే ప్రేయసి.. ఇలా ఏ అంశాన్నైనా బొమ్మగా మలచగలడు అతను. బొమ్మ కోసం వచ్చిన వాళ్ళు చేసే వర్ణనను బట్టి బొమ్మ ఉంటుంది. వర్ణన ఎంత బాగుంటే బొమ్మ అంత బాగుంటుంది. వర్ణన సరిగా లేకపోతె బొమ్మ అంత బాగా రాదు. బొమ్మ పూర్తయ్యాక వచ్చిన వాళ్ళనే అడిగి బొమ్మకి పేరు పెడతాడు అతను. బొమ్మ గీయించుకున్న వాళ్ళు యెంత ఇస్తే అంత తీసుకుంటాడు అతను. ఇలా తన పాటికి తను బొమ్మలు గీసుకుంటున్న ఆ ఆర్టిస్టు ఒకరోజు ఓ టీవీ చానల్ వాళ్ళ కళ్ళలో పడతాడు. తానెవరో చెప్పకుండా ఆ చానల్ ప్రతినిధి తన కూతురి బొమ్మ గీయించుకుంటాడు. ఆ బొమ్మ నచ్చడంతో ఆర్టిస్టు ని ఇంటర్వ్యూ చేస్తాడు.

తను మామూలు ఆర్టిస్టుననీ, వచ్చిన వాళ్ళు ఇచ్చిన వర్ణన ఆధారంగా బొమ్మ గీస్తాననీ, వర్ణన శ్రద్ధగా వినడం కోసమే కళ్ళకు గంతలు కట్టుకున్నాననీ చెబుతాడతను. టీవీ లో కథనం రావడం తో అతని పేరు మారుమోగుతుంది. అన్ని చానళ్ళ వాళ్ళూ, పేపర్ల వాళ్ళూ పోటీ పడి కథనాలు ఇస్తారు. కథనం మిస్సైన చానళ్ళ వాళ్ళు అతనికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అనే అంశం మీద చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. అతను మాత్రం తన పని తాను చేసుకు పోతూ ఉంటాడు. జనం విపరీతంగా వస్తున్నా, వాళ్ళు ఇచ్చింది మాత్రమే తీసుకుంటా ఉంటాడు.

ఒక రోజు ఒక యునివర్సిటీ వాళ్ళు ఆర్టిస్టు ని ఆహ్వానిస్తారు. ముందుగా వాళ్ళను ఉద్దేశించి ప్రసంగించి, తర్వాత ఒక్కొక్కరికీ బొమ్మలు వేయడం మొదలు పెడతాడు. చాలా మంది పోటీ పడడంతో, విద్యార్ధులు, ప్రొఫెసర్లు కలిసి ఓ నిర్ణయానికి వస్తారు. అందరూ కలిసి ఒక అంశం అనుకుని, అతనికి వర్ణించి చెప్పి బొమ్మ గీయించుకోవాలని. అతన్ని పక్క గదిలోకి పంపి ఏ అంశం మీద బొమ్మ గీయించాలో నిర్ణయించుకుని అతన్ని పిలుస్తారు. కళ్ళకి గంతలు కట్టుకున్న అతను, వాళ్ళు చెప్పే వర్ణనలన్నీ వింటాడు. అతను ఏం గీయాలన్నది నిర్ణయించుకోలేక పోతాడు. ఇలాకాదని, వాళ్ళంతా కలిసి టీవీ పట్టుకొచ్చి అసెంబ్లీ సమావేశాలు వినిపిస్తారు. అరగంటైనా కాక ముందే అతను 'ఆపండి' అని అరిచి, పది నిమిషాల్లో బొమ్మ పూర్తి చేస్తాడు. ఆడిటోరియంలో ఉన్నవాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన టైటిల్ 'నేటి ప్రజాస్వామ్యం' అని రాస్తాడు.

ఆ బొమ్మ ఎలా ఉన్నదన్నది రచయిత మాటల్లోనే: "ఎడమ వైపు కూర్చున్న వాళ్లకి ఆ బొమ్మ గాడిద బొమ్మలా కనిపించింది. కానీ తోక నక్కదిలా ఉన్నది. అక్కడక్కడ చర్మం పెళుసుబారి, గజ్జి పట్టి ఉంది. కుడివైపు కూర్చున్న వాళ్ళకది పిల్లలనెత్తుకు పోతున్న గద్ద లా కనిపించింది. మరికొందరికి నక్క కళ్ళున్న డ్రాగన్ తలలా, ఇంకొందరికి రెండు తలల జెర్రి గొడ్డు లా కనిపించింది. కొందరికది దాహంతో ఎండిపోయిన నేలవలె తోచింది. కన్న బిడ్డల్ని కాటేస్తున్న వికృత జంతువు వలె ఉంది."

ఈ వారం సాక్షి 'ఫన్ డే' లో మహమ్మద్ ఖదీర్ బాబు కథ 'ఒకవంతు' బాగుంది. పాత్రల అంతర్మధనం చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది.

6 కామెంట్‌లు:

  1. ఆ కథ నేను చదివాను ,నా దగ్గర వున్నట్లుంది మళ్ళాచదవాలి .
    ఈ వారం సాక్షి లో కథ చదవగానే ,"కొంచెం ఇష్టం కొంచెం కష్టం " సినిమా గుర్తొచ్చిందండీ .దానికి చాల దగ్గరగా వుంది. నాకు ఖదీర్ అనగానే అతని "దర్గామిట్ట కథలు " గుర్తుచేసుకోకుండా వుండలేను .ముఖ్యమ్గా వాళ్ళ "జారినాఆంటీ పెళ్లి " .

    రిప్లయితొలగించండి
  2. కూర్మనాథ్ గారి కథలు నేను చదివినంతలో .. నాక్కూడా చాలా నచ్చాయి. ఖదీర్ కథ ఈ మాసం (మార్చి) తెలుగు నాడిలో కూడా ప్రచురితమైంది. కథాంశం బాగుంది కానీ, కథని మలచడంలో మరీ లెక్చర్లిచ్చారు (తండ్రి పాత్రతో ఇప్పించారు) అనిపించింది. "ముప్ఫై ఏళ్ళకే కారు" అని మొదలయ్యే డయలాగు, "నిజానికి మీ అమ్మ ఎంతో మంచిది" అని మొదలయ్యే డయలాగు .. మామూలు మనుషులెవరూ ఇలా మాట్లాడరు. ఏదో సిద్ధాంతాన్ని విశదీకరిస్తున్నట్టుంది గానీ ఒక తండ్రి కూతురితో మాట్లాడుతున్నట్టు లేదు.
    ఏదేమైనా మంచి వర్తమాన సాహిత్యం గురించి పట్టించుకుంటూ ఇక్కడ చక్కగా రాస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. బావుందండీ ! వసంతోత్సవ శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  4. @చిన్ని: దర్గామిట్ట కతల్లో కొన్ని మా ఇంట్లో జరిగినట్టు ఉంటాయండి.. మీ కామెంట్ చూడగానే జరీనాంటీ పెళ్లి కళ్ళ ముందు కదిలింది. ఆ సినిమా నేను చూడలేదండి.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: ధన్యవాదాలు
    @పరిమళం: మీక్కూడా శుభాకాంక్షలండి.. ధన్యవాదాలు
    @padmarpita: ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  5. కధ చదివి కమెంటు రాద్దామని ఆగాను.

    కధ చాలా బాగుంది. చివరివరకూ ఆగకుండా ఏకబిగిన చదివించింది..

    Thank you.

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు, నా కథని పట్టించుకుని, ప్రస్తావించినందుకు థాంక్స్. ఇన్ని రోజులకు అనుకోకుండా ఇది చూసాను.

    రిప్లయితొలగించండి