ఆ హత్య జరిగి తొమ్మిదేళ్లు దాటింది. మొన్నటి వరకూ
నిందితుడిగా చెప్పబడిన వ్యక్తిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇవాళే
అతను జైలు నుంచి విడుదల అయ్యాడు? మరి అసలు నిందితుడు ఎవరు? ఏమయ్యాడు??
తొలినుంచీ, కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా సంచనలం
సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో పోలీసుల చేత నిందితుడిగా చిత్రింపబడి,
కింది కోర్టు చేత యావజ్జీవ జైలుశిక్ష విధింపబడి ఎనిమిదిన్నరేళ్ళ పాటు
జైల్లో మగ్గిన సత్యంబాబు నిర్దోషిగా విడుదలవడంతో దాదాపు దశాబ్దం కిందటి
కేసు మళ్ళీ వార్తల్లోకి రావడమే కాదు, చర్చనీయాంశం అయ్యింది.
గుంటూరు
జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన ఆయేషా మీరా అనే పందొమ్మిదేళ్ళ బీఫార్మసీ
విద్యార్థిని, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రయివేటు హాస్టల్లో
డిసెంబర్ 27, 2007 న కిరాతకంగా హత్య చేయబడింది. నిందితుడు ఆమెపై అత్యాచారం
చేసి, ఆపై హత్య చేశాడన్న పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితుడి వేట
మొదలు పెట్టిన పోలీసులు, నెల తిరిగేసరికి సత్యంబాబు అనే యువకుడిని అరెస్టు
చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఓ పక్క విచారణ జరుగుతూ ఉండగానే, సత్యం బాబు
నిందితుడు కాడనీ, అసలు నిందితుడు అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీలో
ఉన్న ఓ సీనియర్ నాయకుడి దగ్గర బంధువనీ గగ్గోలు బయలుదేరింది.
పేపర్లలోనూ,
టీవీల్లోనూ వచ్చిన ప్రత్యేక కథనాలేవీ పోలీసుల దృష్టిని మళ్లించలేదు. ఒక
దశలో పోలీసుల పనితీరు మీద కూడా తీవ్రంగా విమర్శలు రావడంతో పాటు, అప్పటి
పోలీసు కమిషనర్ కి నార్కో పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్లూ మొదలయ్యాయి.
ఆయేషా తల్లిదండ్రులు సైతం సత్యం బాబు మీద ఎలాంటి అనుమానమూ లేదనీ, అసలు
నిందితులు వేరే ఉన్నారనీ పదేపదే ప్రకటించారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు
నాయుడు అయేషా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు, చాలా రాజకీయ
సభల్లో అయేషా తల్లిచేత మాట్లాడించారు కూడా. అసలు నిందితులని
ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని పదేపదే ప్రకటించారాయన.
ఓపక్క
ఇవన్నీ జరుగుతూ ఉండగానే, మరోపక్క చట్టం తనపని తాను చేసుకుపోయింది.
పోలీసులు ప్రవేశ పెట్టిన సాక్ష్యాలతో సంతృప్తి చెందిన విజయవాడ మహిళా కోర్టు
సత్యంబాబుకి శిక్ష విధించింది. అయితే, సత్యంబాబు నిర్దోషి అని బలంగా
నమ్మిన మానవ హక్కుల వేదిక అనే సంస్థ అతనికి న్యాయ సహాయం అందించి, మహిళా
కోర్టు తీర్పుని హైకోర్టులో సవాలు చేసింది. ఎనిమిదిన్నరేళ్ళు గడిచాయి.
సత్యంబాబు జైలు జీవితం గడుపుతున్నాడు కానీ, బయట ప్రపంచంలో చాలా మార్పులే
వచ్చాయి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో
నామరూపాల్లేకుండా పోయింది. నాటి ప్రతిపక్ష నేత అధికారంలోకి వచ్చి
ముఖ్యమంత్రి అయ్యారు హైకోర్టులో కేసు గెలిచి సత్యంబాబు నిర్దోషిగా
విడుదలయ్యాడు. కోర్టు ఖర్చుల నిమిత్తం అతనికి లక్ష రూపాయలు చెల్లించమని
ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
తన ఇరవయ్యో ఏట
నిందితుడిగా ముద్ర పడి, శారీరకంగానూ, మానసికంగానూ ఎన్నో హింసలకు లోనయ్యి,
ముప్ఫయ్యో ఏట నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు కి పదేళ్ల జీవితాన్ని వెనక్కి
తెచ్చి ఇచ్చేది ఎవరు? నిర్దోషిగా గుర్తించినందుకు, న్యాయవ్యవస్థని
అభినందించాలా? లేక, 'వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ, ఒక్క
నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు' అన్న మౌలిక న్యాయసూత్రం అమలుకానందుకు
విచారించాలా? సత్యంబాబుకి నష్టపరిహారం చెల్లించాలని అయేషా మీరా తల్లి
ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. పదేళ్ల జీవితానికి, చేయని నేరానికి అనుభవించిన
శిక్షకి పరిహారం లెక్కించడం సులభమా?
ఇవన్నీ ఒకవైపైతే,
రెండోవైపు ప్రశ్నల్లో మొదటిది సత్యంబాబు నిందితుడు కానప్పుడు అసలు
నిందితుడు ఎవరు? అతన్ని ఉద్దేశపూర్వకంగా తప్పించిన వారికి శిక్ష ఉంటుందా? ఈ
శిక్ష కేవలం పోలీసులకేనా, కింది కోర్టు వారికి కూడానా? ఈకేసులో తొలినుంచీ
అనుమానితులుగా చెప్పబడుతున్న రాజకీయనాయకుల కుటుంబం ఇప్పుడు రాష్ట్రంలోని
అధికార పార్టీతో అంటకాగుతోంది అంటున్నారు. నాటి ప్రతిపక్ష నేత తన హామీని
నిలబెట్టుకుని, నిందితులకి శిక్ష పడేలా చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ
జవాబులు దొరికేసరికి ఇంకెంత కాలం పడుతుందో మరి...