ఆదివారం, ఏప్రిల్ 02, 2017

ఓ హత్యకేసు

ఆ హత్య జరిగి తొమ్మిదేళ్లు దాటింది. మొన్నటి వరకూ నిందితుడిగా చెప్పబడిన వ్యక్తిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇవాళే అతను జైలు నుంచి విడుదల అయ్యాడు? మరి అసలు నిందితుడు ఎవరు? ఏమయ్యాడు?? తొలినుంచీ, కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో పోలీసుల చేత నిందితుడిగా చిత్రింపబడి, కింది కోర్టు చేత యావజ్జీవ జైలుశిక్ష విధింపబడి ఎనిమిదిన్నరేళ్ళ పాటు జైల్లో మగ్గిన సత్యంబాబు నిర్దోషిగా విడుదలవడంతో దాదాపు దశాబ్దం కిందటి కేసు మళ్ళీ వార్తల్లోకి రావడమే కాదు, చర్చనీయాంశం అయ్యింది.

గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన ఆయేషా మీరా అనే పందొమ్మిదేళ్ళ బీఫార్మసీ విద్యార్థిని, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రయివేటు హాస్టల్లో డిసెంబర్ 27, 2007 న కిరాతకంగా హత్య చేయబడింది. నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడన్న పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితుడి వేట మొదలు పెట్టిన పోలీసులు, నెల తిరిగేసరికి సత్యంబాబు అనే యువకుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఓ పక్క విచారణ జరుగుతూ ఉండగానే, సత్యం బాబు నిందితుడు కాడనీ, అసలు నిందితుడు అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ సీనియర్ నాయకుడి దగ్గర బంధువనీ గగ్గోలు బయలుదేరింది.

పేపర్లలోనూ, టీవీల్లోనూ వచ్చిన ప్రత్యేక కథనాలేవీ పోలీసుల దృష్టిని మళ్లించలేదు. ఒక దశలో పోలీసుల పనితీరు మీద కూడా తీవ్రంగా విమర్శలు రావడంతో పాటు, అప్పటి పోలీసు కమిషనర్ కి నార్కో పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్లూ మొదలయ్యాయి. ఆయేషా తల్లిదండ్రులు సైతం సత్యం బాబు మీద ఎలాంటి అనుమానమూ లేదనీ, అసలు నిందితులు వేరే ఉన్నారనీ పదేపదే ప్రకటించారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అయేషా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు, చాలా రాజకీయ సభల్లో అయేషా తల్లిచేత మాట్లాడించారు కూడా. అసలు నిందితులని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని పదేపదే ప్రకటించారాయన.

ఓపక్క ఇవన్నీ జరుగుతూ ఉండగానే, మరోపక్క చట్టం తనపని తాను చేసుకుపోయింది. పోలీసులు ప్రవేశ పెట్టిన సాక్ష్యాలతో సంతృప్తి చెందిన విజయవాడ మహిళా కోర్టు సత్యంబాబుకి శిక్ష విధించింది. అయితే, సత్యంబాబు నిర్దోషి అని బలంగా నమ్మిన మానవ హక్కుల వేదిక అనే సంస్థ అతనికి న్యాయ సహాయం అందించి, మహిళా కోర్టు తీర్పుని హైకోర్టులో సవాలు చేసింది. ఎనిమిదిన్నరేళ్ళు గడిచాయి. సత్యంబాబు జైలు జీవితం గడుపుతున్నాడు కానీ, బయట ప్రపంచంలో చాలా మార్పులే వచ్చాయి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోయింది. నాటి ప్రతిపక్ష నేత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు హైకోర్టులో కేసు గెలిచి సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. కోర్టు ఖర్చుల నిమిత్తం అతనికి లక్ష రూపాయలు చెల్లించమని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

తన ఇరవయ్యో ఏట నిందితుడిగా ముద్ర పడి, శారీరకంగానూ, మానసికంగానూ ఎన్నో హింసలకు లోనయ్యి, ముప్ఫయ్యో ఏట నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు కి పదేళ్ల జీవితాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చేది ఎవరు? నిర్దోషిగా గుర్తించినందుకు, న్యాయవ్యవస్థని అభినందించాలా? లేక, 'వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ, ఒక్క నిర్దోషి  కూడా శిక్షింపబడకూడదు' అన్న మౌలిక న్యాయసూత్రం అమలుకానందుకు విచారించాలా? సత్యంబాబుకి నష్టపరిహారం చెల్లించాలని అయేషా మీరా తల్లి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. పదేళ్ల జీవితానికి, చేయని నేరానికి అనుభవించిన శిక్షకి పరిహారం లెక్కించడం సులభమా?

ఇవన్నీ ఒకవైపైతే, రెండోవైపు ప్రశ్నల్లో మొదటిది సత్యంబాబు నిందితుడు కానప్పుడు అసలు నిందితుడు ఎవరు? అతన్ని ఉద్దేశపూర్వకంగా తప్పించిన వారికి శిక్ష ఉంటుందా? ఈ శిక్ష కేవలం పోలీసులకేనా, కింది కోర్టు వారికి కూడానా? ఈకేసులో తొలినుంచీ అనుమానితులుగా చెప్పబడుతున్న రాజకీయనాయకుల కుటుంబం ఇప్పుడు రాష్ట్రంలోని అధికార పార్టీతో అంటకాగుతోంది అంటున్నారు. నాటి ప్రతిపక్ష నేత తన హామీని నిలబెట్టుకుని, నిందితులకి శిక్ష పడేలా చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరికేసరికి ఇంకెంత కాలం పడుతుందో మరి...

9 వ్యాఖ్యలు:

 1. బాలేదండి ఈ సత్యమైన సత్యంబాబు కథ (మీర్రాయడం కాదు - అసలలా జరగడం) :( ఎలాగైనా ఆ అబ్బాయి కథ పదేళ్లు వెనక్కి వెళ్లి రీ-ప్లే అయితే బావుండును.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. last sentence you are asking will the current CM bring the real culprits to justice? and how long it will take before we come to know the answer to this question - I would say - we already know the answer - look at what happened in call money sex rocket, look at what happened in the case of a architecture girl's suicide in nagarjuna univerisity - now you can understand answer to your questions - no need to wait

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఎప్పటికీ న్యాయం జరగదనే అనిపిస్తుంది. సినీనటి ప్రత్యూష, ఆయేషా, రిషితేశ్వరి ఇలా ఏ కేసులోనూ ఈ దేశంలో న్యాయం జరిగిన దాఖలాలు లేవు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @లలిత టీఎస్: రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉందిటండీ.. నిజానిజాలు తెలియవింకా.. ధన్యవాదాలు
  @జేమ్స్ బాండ్: ఆలస్యంగానైనా హైకోర్టు స్పందించేసరికి కొంచం ఆశ కలిగిందండీ.. నిజమే, మీరు ఉదహరించిన కేసులన్నీ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.. ధన్యవాదాలు
  @మురళీధర్ నామాల: అన్నీ హై ప్రొఫైల్ కేసులేనండీ, వేర్వేరు కారణాలకి.. ...ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రంగనాథ్ గారని పెద్దపోలీసాఫీసరు గారు ఇంచుమించు హైకోర్టు తీర్పును తప్పుబట్టటం‌ లేదూ‌ అంటూనే బాగానే తప్పుబట్టారు. ఆయన ఉదహరించిన వాదనలను పోలీసులు హైకోర్టులో వినిపించలేదని అనుకోవటం‌ కష్టం.

  కాలం‌గడిచినకొద్దీ కేసుల్లో సాక్ష్యాలు అలభ్యం‌ అవుతాయి. చివరికి వందేళ్ళ తరువాత ఏతీర్పు వచ్చీ ఏమి లాభం? ఎవరికి లాభం?

  అన్నట్లు నామాలవారి లిష్టుకు మరొక పేరు జతచేయాలా వద్దా - విజయవాడ నాగవైష్ణవి కేసు తేలిందా ఎటైనా? అందులో ఎవరికైనా శిక్షపడిందా?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఏది ఏమయినా నిజానిజాలు తేలాల్సింది న్యాయాస్థానాలలోనే, మీడియాలో/బ్లాగులలో కాదు. టీవీ చానెళ్లు పుట్టగొడుగులలా పుట్టుకొచ్చిన దరిమిలా trial by media పెరగడం దురదృష్టం.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @శ్యామలీయం: నిజమేనండీ.. కేసుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది.. సాక్షాత్తూ దేశ ప్రధాని హత్యకేసులో నిందితులని శిక్షించడానికి ఏళ్లతరబడి సమయం తీసుకున్న వ్యవస్థ కదా.. నాగవైష్ణవి కేసులో దగ్గరి బంధువులే నిందితులని తేలిందండీ అప్పట్లో.. శిక్ష సంగతి ఏమీ తెలియలేదు.. ధన్యవాదాలు..
  @జై గొట్టిముక్కల: వాక్ స్వాతంత్రం అనేదాన్ని నిర్మూలించే వరకూ ఇవన్నీ తప్పవండీ మరి.. ..ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. జాతీయ మీడియాలో మెట్రో నగరాలలో జరిగే అత్యాచారాలు, పేజ్3 వ్యక్తులపై జరిగే అత్యాచారాలు ప్రస్తావిస్తున్నారే తప్ప పట్టణాల్లో జరిగే తీవ్రమైన నేరాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. వాళ్ళకి గ్లామర్, TRP ముఖ్యం మరి!

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @బోనగిరి: ఆమధ్య ఎక్కడో ఓ విశ్లేషణ చదివానండీ.. మధ్యతరగతికి చెందిన అందమైన అమ్మాయిలు హత్యకి గురైన సందర్భాల్లోనే జాతీయ మీడియా విశేషంగా స్పందిస్తోందనీ, మిగిలిన కేసుల్ని చూసీ చూడనట్టు వదిలేస్తోందనీను.. ..ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు