కంటికి ఎదురుగా కనిపించే వాటిని అలక్ష్యం చేయడం, దొరకని వాటికోసం వెతుకులాడడం ఈరెండూ కూడా మానవ సహజ గుణాలే అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడూ ఎదురయ్యే అనుభవాలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో ఏళ్ళుగా రాహుల్ సాంకృత్యాయన్ రాసిన 'ఓల్గా నుంచి గంగకు' పుస్తకాల షాపుల్లో డిస్ప్లే లో చూస్తూనే ఉన్నాను. ఎందుకో తెలీదు కానీ, ఎప్పుడూ చదవాలని అనిపించలేదు. కనీసం పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని, పేజీలు తిప్పిన పాపాన పోలేదు.
ఆమధ్యన ఆచార్య తిరుమల రామచంద్ర ఆత్మకథ 'హంపీనుంచి హరప్పాదాక' చదువుతుండగా, అందులో రాహుల్జీ ప్రస్తావనా, 'ఓల్గా నుంచి గంగకు' ప్రస్తావనా కొన్ని చోట్ల కనిపించింది. రాహుల్ గొప్ప పండితుడనీ, 'ఓల్గా నుంచి..' తప్పక చదవాల్సిన పుస్తకమనీ రామచంద్ర రాసింది చదివాక, మొదటిసారిగా ఈ పుస్తకం చదవాలని అనిపించింది. సరిగ్గా అప్పుడే పుస్తకం ప్రింట్ అయిపోయింది! మొన్న మొన్నే కొత్త ప్రింట్ రావడంతో నాకు ఈ రచనని చదివే అవకాశం దొరికింది.
క్రీస్తు పూర్వం ఆరువేల సంవత్సరాల కాలం నుంచి, క్రీస్తుశకం 1942 వరకూ జరిగిన కాలంలో ఇండో యూరోపియన్ జాతి మానవ సమాజ వికాసాన్ని ఇరవై విడి కథల ద్వారా నిశితంగా చిత్రించారు పాళీ, సంస్కృత భాషల్లో పండితుడూ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన చరిత్రకారుడూ అయిన రాహుల్ సాంకృత్యాయన్. వోల్గా తీరపు మంచు ఎడారి నేపధ్యంగా తీసుకుని రాసిన తొలి కథ 'నిశ' తో మొదలు పెట్టి సోవియట్ ని కాపాడడం కోసం యుద్ధంలో చేరిన 'సుమేరుడు' కథ వరకూ కథలన్నీ ఊపిరి బిగపట్టి చదివించేవే.
తొలి కథల్లో ఆర్యుల సంస్కృతిని కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారు రాహుల్. స్త్రీ కుటుంబ పెద్దగా ఉండడం, ఆమె సారధ్యంలో కుటుంబం యావత్తూ వేటకి వెళ్ళడం, ఆమె తనకి ఇష్టమైన పురుషుడితో -సోదరుడు, కుమారుడు ఇలా చుట్టూ ఉన్న అందరూ - కూడి సంతానాన్ని వృద్ధి చేయడంతో మొదలుపెట్టి, కుటుంబంలో వచ్చిన చీలికలు, సమూహాలు, వాటి మధ్యన ఆధిపత్యపు పోరు, జీవికని వెతుక్కుంటూ సమూహాలు చేసే మజిలీలు, నెమ్మది నెమ్మదిగా సంస్కృతిలో మార్పులు వచ్చి పురుషుడు కుటుంబ పెద్ద అవ్వడం, వివాహ వ్యవస్థ, స్త్రీ స్థానం తగ్గుతూ పోవడం ఇవన్నీ మొదటి ఆరు కథల్లోనూ చిత్రించారు.
ఒకరి చేత పాలింపబడడం అనేది ఆర్యులకి ఏమాత్రమూ నచ్చని విషయం. కానీ, అనార్యులకి పాలనా వ్యవస్థ ఉంది. ఈ రెండు వర్గాల మధ్యనా యుద్ధాలు జరగడం, ఆర్యులు బలహీన పడడం కాలక్రమంలో జరిగింది. ఇంతలోనే రాజుని తమ చెప్పు చేతల్లో పెట్టుకునే పురోహిత వర్గం బలపడడం, వేదాలు అందుకు దోహదం చేయడం జరిగిందంటారు రాహుల్. సమాజంలో అసమానతలకి మతమే ప్రధాన కారణమనీ, రాజులూ, పురోహితులూ కలిసి ఈ మతాన్ని ప్రజలపై రుద్ది వారిని బానిసలుగా మార్చారని చాలా గట్టిగా చెప్పారు.
రాజు-పురోహితుడు-మతం ఈ మూడూ కలిసి సమాజ వికాసాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని చెబుతూ, రాజ్యాల మధ్య జరిగిన యుద్దాలనీ, వాటిమీద మతం ప్రభావాన్నీ ఉదాహరణలుగా చూపించారు. బౌద్ధం స్థాపన, విస్తరణ, క్షీణత, దేశం మీద జరిగిన దండయాత్రలు, ఇస్లాం స్థాపన, విస్తరణ, కంపెనీ పాలనలో భారత దేశం, ఆసమయంలో క్రైస్తవం ప్రభావం ఇవన్నీ కథల్లో అంతర్భాగాలుగా ఉంటూనే, మతం పరిణామ క్రమాన్ని సులువుగా అర్ధం చేసుకోడానికి సాయపడతాయి పాఠకులకి.
ఈస్టిండియా కంపెనీ కాలంలో జమీందారీలని ఏర్పరచడం వల్ల రైతులకి ఎదురైన ఇబ్బందులు, సామంత రాజుల బలహీనతల్ని ఆంగ్లేయులు సొమ్ము చేసుకోవడం, సిపాయిల తిరుగుబాటు, మంగళ్ పాండే తదితరుల పాత్ర, తిరుగుబాటు వైఫల్యం మొదలు, గాంధీజీ మొదలు పెట్టిన ఉద్యమం-దానిని వ్యతిరేకించే వర్గం అభిప్రాయాల వరకూ ఏకబిగిన సాగి, సామ్యవాదం మాత్రమే సమాజాన్ని బాగు పరచగలదనే బలమైన అభిప్రాయంతో ముగుస్తుందీ రచన. ఒక్క మాటలో చెప్పాలంటే, వేల ఏళ్ళ దేశ చరిత్రని కేవలం మూడొందల పైచిలుకు పేజీల్లోనే కళ్ళకి కట్టడం ద్వారా కొండని అద్దంలో చూపారు రచయిత.
పుస్తకాన్ని గురించి మొదట చెప్పుకోవాల్సింది చదివించే గుణం. ఒకసారి చదవడం మొదలు పెట్టాక ఎక్కడా కూడా పక్కన పెట్టాలనిపించదు. రచయిత అభిప్రాయాలతో ఏకాభిప్రాయం కుదిరినప్పుడూ, కుదరనప్పుడూ కూడా ఒకే వేగంతో చదివిస్తుందీ పుస్తకం. ఉత్తరాంధ్ర నుడికారం కనిపించినప్పుడు, అనువాదం ఎవరు చేశారా? అన్న సందేహం కలిగి పేరు చూశాను. విఖ్యాత కథకుడు చాసో కుమార్తె, రచయిత్రీ చాగంటి తులసి ఎంతో సరళంగా తెనిగించారీ పుస్తకాన్ని. ఎక్కడో తప్ప అనువాదమన్న భావన కలగదు. వేటాడి పచ్చి మాంసాన్ని భుజించడం మొదలు, తెల్లవాడిపై తుపాకీ ఎత్తడం వరకూ జరిగిన మన పూర్వుల వికాసాన్నీ, పరిణామ క్రమాన్నీ చూపించే పుస్తకమిది. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 160).
