శుక్రవారం, ఆగస్టు 12, 2011

శంకరాభరణానికి 'వావ్'

ఈటీవీలో వచ్చే కార్యక్రమాలలో కొంచం వైవిధ్యంగా ఉండి కనీసం అప్పుడప్పుడూ అయినా చూసే కార్యక్రమాలలో ఒకటి 'వావ్.' సీనియర్ నటుడు సాయికుమార్ వ్యాఖ్యానం ఈ కార్యక్రమానికి పెద్ద అసెట్. వినోదాన్నీ, విజ్ఞానాన్నీ మేళవించి, ప్రశ్నలు సంధించి, విజేతలకి నగదు బహుమతి అందించే ఈ కార్యక్రమానికి అతిధుల ఎంపిక కూడా వైవిధ్య భరితంగానే సాగుతోంది. సిని నటుల్ని, ముఖ్యంతా కొత్తగా విడుదలవుతున్న సినిమాల టీములని పిలవడం ద్వారా, ఆయా సినిమాలనీ ప్రమోట్ చేస్తూ, ఉభయతారకంగా మలుస్తున్నారు ఈమధ్యన.

ఈ కొత్త సినిమాల ట్రెండ్ కి భిన్నంగా, ముప్ఫయ్యేళ్ళ క్రితం విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న కె. విశ్వనాథ్ అపూర్వ సృష్టి 'శంకరాభరణం' లో నటించిన నటీనటుల్ని అతిధులుగా ఆహ్వానించి ఇవాళ ప్రసారం చేసిన ఎపిసోడ్ ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, మంజుభార్గవి, తులసిలని కార్యక్రమంలో పాల్గొనడానికీ, కళాతపస్వి విశ్వనాథ్ ని ప్రత్యేక అతిధిగానూ ఆహ్వానించిన ఈ ఎపిసోడ్ లో 'శంకరాభరణం' సినిమాకి సంబంధించిన ఎన్నో విశేషాలని గుర్తు చేసుకుందీ బృందం. కొన్ని తెలియనివీ, మరికొన్ని తెలిసినా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవీ..

కె. విశ్వనాథ్ తనకి స్వయానా పెదనాన్న కొడుకన్న సంగతిని చంద్రమోహన్ అధికారికంగా చెప్పిన తొలి సందర్భం బహుశా ఇదే. అలాగే, గాయకుడు బాలూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాడేలా చూడమని తను బాలూ తండ్రి సాంబమూర్తిని అడిగాననీ, బాలూ చూపిన ప్రత్యేక శ్రద్ధ కారణంగానే టైటిల్స్ లో ప్రత్యేకమైన కార్డ్ ఇవ్వడం జరిగిందనీ చెప్పారు విశ్వనాథ్. విమర్శకులు మెచ్చిన కొన్ని సన్నివేశాల్నీ, వాటి వెనుక జరిగిన సంఘటనలనీ సరదాగా చెప్పారు. "మజుభార్గవి పాత్రకి ఒకే ఒక్క డైలాగుంది.. ఆ ఒక్కటీ పెట్టకపోతే ఇంకా బాగుండేది కదా అనుకున్నాను చాలాసార్లు" అన్నారు.

మంజుభార్గవినీ, తులసి నీ పక్కపక్కన చూసినప్పుడు "తల్లీ కొడుకులుగా చేసింది వీళ్ళిద్దరేనా!" అని ఆశ్చర్యం కలిగింది. కేరళ జడ్జి, తులసిని చూసి శంకరం వేషం వేసింది ఈమెనంటే నమ్మకపోవడాన్ని విశ్వనాథ్ చెబుతుండగా, తులసి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ గమ్మత్తుగా అనిపించింది. అన్నింటికీ మించి, విశ్వనాథ్ సమక్షంలో జరిగిన మొదటి రౌండ్లో - ఒక్కొక్కరికీ ఒక్కో సినిమా కథ చెప్పి ఆ సినిమా గురించి ప్రశ్నలు అడిగే రౌండ్ - సాయికుమార్ విశ్వనాథ్ సినిమాల గురించే అడుగుతుంటే, నటీనటులు నలుగురూ తెలిసిన విషయాలే చెప్పడానికి తడబడడం, మరీ ముఖ్యంగా మంజుభార్గవి 'సిరిసిరిమువ్వ' సినిమాకి దర్శకుడు ఏడిద నాగేశ్వర రావు అని టక్కున చెప్పినప్పుడు విశ్వనాథ్ ముఖంలో ఎక్స్ ప్రెషన్ ఇవన్నీ సరదాగా ఉన్నాయి.

రెండుగంటల పాటు సాగిన ఎపిసోడ్ ఎక్కడా బోర్ కొట్టలేదు. మరీ ముఖ్యంగా 'శంకరాభరణం' ఫీల్ ని ఆసాంతమూ కొనసాగించడం బాగుంది. చంద్రమోహన్ కొంచం అనారోగ్యంగా ఉన్నట్టు కనిపించాడు. మొత్తం అరవై ఒక్క మంది హీరోయిన్లు తనతో నటించారని కొంచం గర్వంగా చెప్పినప్పుడు -- చెప్పొద్దూ కొంచం అసూయలాంటిది కలిగింది. పెద్ద పెద్ద హీరోలక్కూడా ఇంత పెద్ద అవకాశం వచ్చి ఉండదు. మంజుభార్గవి "ఈ ఒక్క సినిమా చాలు" అని కొంచం ఉద్వేగంగా చెప్పింది. రాజ్యలక్ష్మి తన తొలి సినిమా 'శంకరాభరణం' అనీ, అదే తన ఇంటి పేరుగా మారిపోయిందనీ జ్ఞాపకం చేసుకుంది. ఇక తులసి చేసిన అల్లరి చూస్తే ఆమె ఇంకా 'శంకరం' గానే ఉండిపోయిందేమో అనిపించింది.

సాయికుమార్ తో సహా మొత్తం ఐదుగురూ విశ్వనాథ్ ని సన్మానించారు. 'శంకరాభరణం' ని మళ్ళీ తీసే అవకాశం ఉందా? అని సాయికుమార్ అడిగితే, వీలుపడదని చెప్పేశారు విశ్వనాథ్. "ఓ మాయాబజార్, ఓ మల్లీశ్వరి, ఓ శంకరాభరణం.. వీటిని మళ్ళీ తీయలేం" అంటూనే "మరో సినిమా గురించి ఇప్పుడు కమిట్ చేయించొద్దు" అంటూ తప్పించేసుకున్నారు. మొత్తం ఐదు రౌండ్ల గేం షో లో చంద్రమోహన్ విజేతగా నిలిచాడు. 'శంకరాభరణం' గొప్పదనాన్ని గురించిన ముగింపు వాక్యాలు చెబుతూ, సాయికుమార్ "కొత్తని స్వాగతించాలి. అదే సమయంలో మనదైన సంస్కృతిని భద్ర పరుచుకోవాలి. మన సంస్కృతిలో ఒక భాగం ఈ శంకరాభరణం" అనడం నచ్చింది నాకు.